Jump to content

శ్రీకృష్ణుడు చూపిన మార్గము/అధ్యాయము 1

వికీసోర్స్ నుండి

(1)

భారతకథ, గీత.

భగవద్గీత మహాభారతములో నొకభాగము. యుద్ధమారంభింపబోవు సమయమున నిరుపక్షములందును పోరికి సన్నద్ధులై నిలిచిన సేనలను చూతమని, తన రధమును సేనల మధ్యకు కొనిపొమ్మని యర్జునుడు సారథియైన శ్రీకృష్ణునితో చెప్పెను. అప్పుడు బంధువులును, స్నేహితులును నొకరినొకరు చంప నాయుధపాణులై నిలుచుటజూచి యతడు మనసున కలగి “ఇదేమిపని? రాజ్య మేల? పగ యేల? చుట్టములను చంపి సంపాదించు రాజ్యాధికారభోగమువలన నేమిసుఖము?” అని పలికి, వింటిని క్రిందికి విడిచి. చదికిలబడి కూర్చుండెను. ఈసందర్భమున నతనికి సారథియై యుండిన కృష్ణభగవానుడు గురువై నిలిచి యుపదేశించిన మాటలే భగవద్గీత‌ యనునది.

ఇట్లర్జునుడు, "యుద్ధమెందుకు? నేను యుద్ధము చేయను” అని చెప్పినప్పుడు “యుద్ధముచేయుటయే నీవిధి" అని యుపదేశము చేయుచు వివరించిన యీ మార్గమునెల్ల హిందువులును సంప్రదాయవ్యత్యాసము లేక వేదమువలెను, ఉపనిషత్తుల వలెను, నొప్పుకొను నొకశాస్త్రమై యనేక సహస్రవర్షములనుండియు నంగీకరింపబడి వచ్చుచున్నది. మహాభారతకథలో ఒక భాగమై, యమరియున్నను, భగవద్గీత ప్రత్యేకశ్రేష్ఠతను బొందిన యోగశాస్త్రమై యొప్పి వెలుగుచున్నది. ఉపనిషత్తులతో నిదియునొక యుపని షత్తుగా మతాచార్యులచేత తలంపబడుచు వచ్చుచున్నది. గీతాశాస్త్రములోని యుపోద్ఘాతమే ముఖ్యమని యెంచి దానిననుసరించియె తరువాతి యుపదేశములు చేయబడిన వని తలచుట సరికాదు. యుద్ధము ఆగిపోకుండ తుదవరకు సాగింపవలెనను తలపుతో గీతీయందలి ఉపదేశములు చేయ బడినవని అనుకొన్నపక్షమున దాని తత్త్వము మనకు సరిగా బోధపడదు.

గీతను చదువబోవుచు ప్రస్తావనను మరచి విడుచుట యే మంచిదని నాయభిప్రాయము. గీతలో చెప్పబడిన తత్త్వములును, ఉపదేశములును యేకాలమునకైనను యే సందర్భమునకైనను తగి యుండును. అయినను దృష్టాంత ముగా తీసికొనిన యొక సందర్భములోని విషయములనే ప్రమా ణముగా చేసి సామాన్యమగు ధర్మశాస్త్రమును ప్రతిపాదిం చుట క్రమమైనది కాదు. యుద్ధములో అర్జునున కేర్పడిన మనసు కలతకును, సందేహములకును తగిన మందు గీతా వాక్యములందు కనబడుననుటలో సందేహము లేదు. అయినను ఏదో అభిప్రాయము మనస్సులో పెట్టుకొని గీత ప్రసిద్ధికెక్కిన ధర్మశాస్త్రము కాదనుట యుక్తముకాదు.