శ్రీకృష్ణుడు చూపిన మార్గము/అధ్యాయము 2

వికీసోర్స్ నుండి

(2)

గీతామహాత్మ్యము

హిందూసంఘములో చేరిన సర్వసంప్రదాయము లకు చెందినవారును శాస్త్రముగాను ప్రమాణముగాను నొప్పుకొన్న భగవద్గీతలో కొన్నిశ్లోకములయినను శ్రద్ధా భక్తులతో కూడిన చింతనచేసి పఠించినయెడల మన పురాతనులు చూచిన సత్యములను, ఋషులు స్థాపించిన హిందూధర్మము నిట్టివని తెలియగలవు. హిందూధర్మ మను పునాదిపైననే మన సకలనాగరికతయు, కళలును, లక్ష్యములును, ఇండియాలో మనము గౌరవమునభివృద్ధిచేయు ఎల్లభాగ్యములును, మేడలుగా నిలిచియున్నవి. ఆహిందూ ధర్మము తెలిసికొనుట మనకు ముఖ్యవిధియై యున్నది. కాబట్టి సనాతనమార్గాభివృద్ధికి ప్రయత్నింపగోరువారు గీతా సారాంశమును బాగుగా చదివి తెలిసికొనుటవలన మేలు చేకూరును. భగవద్గీత 18 అధ్యాయములుగా భాగింపబడిన 700 శ్లోకములు గల గ్రంథము. వీనినుండి 226 శ్లోకముల నెత్తి యర్థమును చెప్పవలెనని యుద్దేశించితిని. ఈ 226 శ్లోకముల లోని అర్థమును బాగుగా గ్రహించుకొన్న యెడల భగవద్గీత లోని సారమును సంపూర్ణముగా గ్రహించుకొన్నట్లే యెంచు కొనవచ్చును.