శ్రీకృష్ణుడు చూపిన మార్గము/అధ్యాయము 5

వికీసోర్స్ నుండి

(5)

విచారక్రమము.

విజ్ఞాన పరిశోధనమున అన్ని విషయములందునొక హద్దు కాన్పించును. ఏవిషయము నెత్తుకొని శోధించినను నొక మితికి మించి దానితత్త్వమును దెలియ సాధ్యముకాదు. త్రవ్వుచున్న నూతిలో బండ కనబడినయెడల త్రవ్వుటను నిలుపవలసివచ్చినట్లు, ఎట్టి పరిశోధనమందును, ఒక మితినిమీరి మనుష్యునిబుద్దికతీతమయిన విషయముపై పోజూలదు. ఆదియే పరిశోధనకు సరిహద్దు. వేదాంతమునందు మాత్రమే కాదు. పదార్థశాస్త్ర పరిశోధనమందును గణితశాస్త్రమందును ఈ హద్దు అక్కడక్కడ నేర్పడినది. మనము కనుగొనినదానికిని, కనుగొన వీలగుదానికిని పాలమీది మీగడకును పాలకును గల యంతరమున్నది. మీగడక్రిందనున్న పాలలో తెలియరాని రహస్యమున్నది. ఇట్లు సాధారణవ్యవచ్ఛేద, పరిచ్ఛేదశోధనల కగ్గముకాని రహస్యమును, వేదము ఉపనిషత్తులు గీత మొదలయిన గ్రంథములును, ధర్మసూత్రములును, ముని వరుల వచనములును, జీవనచరిత్రములును వివరించుచున్నవి. పంచేంద్రియములను మూలముగా గొని, పంచేంద్రియవిష యములమూలమున తెలిసికొనిన తత్త్వములనే ప్రమాణము గా చేసికొని, వాని ననుసరించి యూహచేసి తెలిసికొనదగిన వస్తువులు భౌతికశాస్త్రవిషయములు. వీనికి మించిన విషయ ముల నెట్లుకాననగును, ఎట్లుకాన్పింపనగును, అనునదే లోక మున ననేకదేశములలోనున్న మతములయాశయమును ప్రయ త్నమును నగుచున్నది. అందుచేతనే మతగ్రంథములందు చెప్ప బడు విషయములు భౌతికశాస్త్రములలో చెప్పబడు స్పష్ట ములైన హేతువులవలెను పరిశోధనలవలెను నుండవు. కేవలము ప్రత్యక్షప్రమాణముచేతనో, యుక్తిబుద్ధిచేతనో తెలియ వీలులేని యీవిషయమును పరిశోధన చేయుటకు భక్తి కావలెను, ధ్యానము కావలెను, శాంతి కావలెను, నియమము కావలెను, తపస్సుకావలెను, అనియిట్లు వేదమునందును, తక్కిన ధర్మసూత్రములందును చెప్పబడియున్నది. ప్రక్కనున్నయూరికి కాలినడకను పోయి చేరగలము. దూరముననున్న యూరికి బండియు నెద్దును కట్టుకొని చేరవచ్చును. చెట్టుపై కెక్కుట వేరు, నూతిలోనికి దిగుట వేరు. పుష్పమును చెవిలో పెట్టిన యెడల వాసన దెలియదు. అందమైనపటమును ముక్కులో నుంచిన అందము తెలియదు. ఇంద్రియములకు లోబడని యొకవస్తువును మనసులో కనబడ జేయుట ఇంద్రియాను భవముపై నిలిచిన పరిశోధనలమూలమునను ప్రమాణ ముల మూలమునను సాధ్యముకాని కార్యము. అందుచేత పారమార్థికవిషయములను పరిశోధించి చేయుటకు భక్తియు, నియమమును, మనశ్శుద్ధియు, ధ్యానమును, భగవద్వందన మును, తపస్సును కావలెను. తపస్సనగా బాహ్యకరణములను, నంతఃకరణములను స్వాధీనముచేసి మనస్సు నేకాగ్రముగ నిలుపుట. శరీరమును కష్టపెట్టుట కాదు.

(6)

ఏల గమనింపవలెను ?

“అంతయు సరియే కాని బుద్ధికగోచరమయిన యిట్టి తత్త్వమును మానవు డేల గమనింపవలెను? తెలియరాని విషయమును గూర్చి చింతించియు పరిశోధించియు నేమి ఫలము?” అను ప్రశ్న యుదయించును. దీనికి సమాధాన మేమనగా :- భౌతికశాస్త్రవిచారమునకు గురికానిదయి నంతమాత్రమున, నుండవలసినవన్తు వుండకపోదు. మనము తాకి, కని, మూచూచి, విని, ఆలోచించి, గ్రహించిన విష ములకు పైగా నంతటికి నాధారమైన మొదలికారణము ఒకటున్నదనుట నిశ్చయము. దానిని తాక వీలులేదు; దాని రూపమును తెలియ వీలులేదు; దాని గుణములు బుద్ధికి గురికావు. అయినను నది యెల్లెడల అన్ని విష యములందును కలిసి నిలిచియుండును. సకలపదార్థములను సకలశక్తులును మనుష్యుని స్వరూపమునందుండు అంతయు నీయరయరాని వస్తువుచే నావరింపబడియుండుట నిజము.