Jump to content

శ్రీకృష్ణుడు చూపిన మార్గము/అధ్యాయము 18

వికీసోర్స్ నుండి

(18)

మనోసాధన.

(గీత: అధ్యాయములు. 2, 3, 16, 18.)


ఇట్లు గీతలో చేయబడిన యుపదేశముచే లోకజీవన మునువిడువ మనస్సులేనివారి కొకవిధమగు సమాధానము గనో, యుపశమన రూపముగనో యుండవలెనని చేయబడిన యుక్తిమాటకాదు. నిజముగా నందరు పురుషులును, స్త్రీలును బాలురను తమజీవితము నీమార్గమున నడపి, యేకర్మమునైనను స్వార్థపరత్వములేక, జనసమూహము మేలుకొరకే మనస్సు స్వాధీనముచే అభ్యాసము చేసికొనుటను గూర్చి గీతయం దుపదేశము చేయబడినది. చేయగా చేయగా నేదియు నొకనికి స్వభావమై తీరును. సంగము లేక కర్మము చేయుటయు నిట్లే యభ్యాసమైనయెడల స్వభావ మగును.


చేయు కర్మమును బాగుగ కొనసాగించుటకు నిదియే మార్గమగును. సంగమును కామమును మనస్సున కళవరమును భయమును బుట్టించును. జయాపజయముల చింతచేత బుద్ధియొక్క చురుకుతనము తక్కువయగును. కావున, నిస్సంగియై స్వార్థమును విడిచి, కర్మమును చేయుటే కర్మములను బాగుగ కొనసాగించు మార్గము. నీటిలో నీదుబాతు నీటిని విడిచి వెలికిరాగానే తన రెక్కలతో సులభముగా నీటిని దులిపివేసికొన్నట్లే, కర్మము చేయునపుడు ధర్మదృష్టిని కలిగి కార్యము తీరినపిదప నభిమానమును జయాపజయముల చింతను విడువ వలెను. లోకవ్యవహారమున పనిచేయుకాలమున, గమనికయు, చురుకును, సామర్థ్యమును నితరులకుండుట సాధ్యముకాదని చూచినవారు తలచునట్లు ప్రవర్తించి శుభ్రముగను, చురుకుగను పనులను చేయవలెను. పని ముగిసిన పిదప దానిఫలమును గూర్చిన చింతనే విడువ వలయును. ఈస్థానమును బొందుటకు ప్రయత్నము కావలెను. ముఖ్యముగా మనోవేగముల నడంచు మార్గము నభ్యసింప వలెను.


మనశ్శాంతికి శత్రువులు కామము క్రోధము లోభము అనునవి. ఈ కర్మయోగమునకు కావలసిన మనశ్శుద్ధియు, నిస్సంగత్వమును పొందుట కీ శత్రువుల కెడమివ్వక యెప్పుడును జాగ్రత్తగ మనస్సును కాపాడవలెను. మనస్సును సరిగ కాపాడినయెడల తక్కినదంతయుసులభమగును. మంచిచెడ్డలు రెంటికిని మనస్సున చొచ్చుతలపులేకారణము. మనస్సు నడచియుంచక విచ్చలవిడిగపోనిచ్చినయెడల, నిశ్చ యముగ నవి పెచ్చు పెరుగును. కోరికలను కామమనె భావమును కోటలో ప్రవేశ పెట్టినయెడల నవి పిదప బాగుగ మనలను లోబరచుకొనుచు ఇంద్రియములలో నివాస మేర్పరుచు కొని, మనస్సు నావరించి, బుద్ధిని చెరిచి యాత్మను గోతిలో త్రోయును. కావున, కోటవాకిలిని బలముగ మూసి యుంచ వలెను. చెడ్డయాలోచనలను, యలక్ష్యము చేయక బయటనే యుంచవలెను.


అర్జున ఉవాచ.


అథకేన ప్రయుక్తో యం పాపం చరతి పూరుషః
అనిచ్ఛ న్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః


అర్జును డడుగుచున్నాడు: పాపముచేయు నిచ్చలేకు న్నను మనుష్యుని ప్రేరేపించి పాపమునందు చొరచేయున దేది? 3-36


శ్రీభగవానువాచ.


కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవః
మహాశనో మహాపాప్మా, విధ్యేన మిహ వైరిణం.


శ్రీభగవంతుడు చెప్పుచున్నాడు: "అది రజోగుణము నుండి పుట్టుచున్నది. అదే కామము. అదే క్రోధము. అదే సమూలము తినివేయునది. మిక్కిలిగ పాపమును గురిచేయు నది. జీవితమునకు శత్రు విదియే యని తెలిసికొనుము. 3-37


ధూమే నావ్రియతే వహ్ని ర్యథాదర్శో మలేన చ
యధోల్బే నావృతో గర్భ స్తథా తేనేదమావృతం.

అగ్ని పొగచేత చుట్టబడినట్లును, అద్దము మకిలిచేత

నావరింపబడి యున్నట్లును, గర్భము మావిచే నావరింపబడి యున్నట్లును దీనిచే జ్ఞానము నావరింప బడును. 3-38


ఆవృతం జ్ఞాన మేతేన జ్ఞానినో నిత్యవైరిణా
కామరూపేణ కౌంతేయ దుష్పూరే ణానలేనచ.


జ్ఞానికి నిత్యవైరియైన యిది యెన్నికట్టెలు వేసినను తృప్తిపొందక మరింత ప్రజ్వలించు నగ్నివలెనున్నది. ఇది జ్ఞానమును చుట్టుకొని దానిని చెరుచుచున్నది. 3-39


ఇంద్రియాణి మనో బుద్ధిరస్యాధిష్ఠాన ముచ్యతే
ఏతైర్వి మోహయ త్యేష జ్ఞాన మావృత్య దేహినం.


ఇంద్రియములును, మనస్సును, బుద్ధియు, దీని యునికిపట్లని చెప్పబడుచున్నవి. వీనినిగొని యిది జ్ఞానమును చుట్టు కొని జీవుని కేమరుపాటు కలిగించును. 3-40


తస్మా త్త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ
పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞానవిజ్ఞాననాశనం


కావున మొదటనే యింద్రియములను కాచికొని, జ్ఞానమును వివేకమును నాశనముచేయు నీక్రూర శత్రువును చంపుము. 3-41


త్రివిధం నరక స్యేదం ద్వారం నాశన మాత్మనః
కామః క్రోధస్తథాలోభస్తస్మా దేత త్త్రయంత్యజేత్.

ఆత్మనాశమునకు కారణమయిన, కామము, క్రోధము,

లోభము నయిన యీ మూడును నరకమునకు ద్వారములు. కాబట్టి యీ మూటినిగూడ విడువుము. 16-21


ఏత్వై ర్విముక్తః కౌంతేయ తమోద్వారై స్త్రిభిర్నరః
ఆచర త్యాత్మన శ్శ్రేయ స్తతో యాతి పరాంగతిం.


ఈ మూడు చీకటి ద్వారములనుండి తప్పించుకొనిన వాడు తన యాత్మశ్రేయస్సును వెదకికొనగలడు. దాని మూలమున పరగతిని బొందును. 16-22


యతతోహ్యపికౌంతేయ పురుషస్య విపశ్చితః
ఇంద్రియాణి ప్రమాథీని హరన్తి ప్రసభంమనః.


జ్ఞానమను తపశ్చర్యను గలవాని మనస్సునుగూడ ఇంద్రియములు బలవంతముగ నాకర్షించును. 2-60


తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీతమత్పరః
వశేహియస్యేన్ద్రియాణి తస్యప్రజ్ఞాప్రతిష్ఠితా.


వాని నన్నిటిని బాగుగ నడచి, యోగమున నెలకొని, మనస్సును నాయందేయుంచి, యింద్రియములను వశముచేసి కొన్నవానినే నిశ్చితమైన జ్ఞానము గలవానినిగా తలప వలెను. 2-61


ధ్యాయతో విషయాన్ వుంసస్సంగస్తేషూప జాయతే
సంగాత్సంజాయతే కామః కామాత్క్రోధో౽భిజాయతే.

మనుష్యుడు విషయములను ధ్యానించునప్పుడు వానితో

నతనికి తగులుబాటు కలుగును. ఆసంగమువలన కామమును, కామమువలన క్రోధము పుట్టును. 2-62


క్రోధాద్భవతి సమ్మోహస్స మ్మోహాత్స్మృతి విభ్రమః
స్మృతి భ్రంశా ద్బుద్ధినాశో బుద్ధినాశాత్ప్రణశ్యతి.


క్రోధమువలన మోహమును, మోహమువలన మర పును, మరపువలన బుద్ధినాశము. దానివలన మనుష్యుడు నశించును. 2-63


ఇంద్రియాణాం హి చరతాం యన్మనో౽నువిధీయతే
త దస్య హరతి ప్రజ్ఞామ్ వాయుర్నావమి వాంభసి.


ఒకని యింద్రియములు బయటికి చరించునపు డతని మనస్సును వానివెంబడినే చలించును. సముద్రములో గాలిచే తత్తరించు నోడవలె వానిమతియు సంచలించును. 2-67


మొదట ఆశయును మనస్సంతోషమును అమృతము వలె కనిపించును. పిదప విషమేయగును. ఇవి మనుష్యునికి నిజముగ సుఖమును తేజాలవు. దుఃఖముతోనే అవి సమాప్తి నొందును. ఇంద్రియములను మనస్సును నడచుట మొదట విషమువలె కనబడును. కాని ఆమందే పిదప జ్ఞానముచే గలిగిన యమృతమునుబోలిన సుఖానందమును తెచ్చును.


సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ
అభ్యాసా ద్రమతే యత్ర దుఃఖాన్తంచ నిగచ్ఛతి.


యత్తదగ్రే విషమివ పరిణామే౽మృతోపమమ్
త త్సుఖం సాత్త్వికం ప్రోక్త మాత్మబుద్ధి ప్రసాదజం.


ఏది మనుష్యుని కభ్యాసమువలన మనస్సున సుఖము నిచ్చి దేనిలో దుఃఖము నిజముగా నంతమునొందునో. 18-36


ఏది మొదట విషమునుబోలునో, తుదకు అమృతమును బోలునో, ఆసుఖమే సాత్త్వికమైనది. ఆసుఖ మాత్మ జ్ఞానమందు నెలకొనియుండుటచేత గలుగును. 18-37


(19)

ధ్యానము.

(గీత: అధ్యాయములు 2, 5, 6, 12, 14.)


తాను చేయవలసిన కర్మములలో తన యింద్రియ సుఖములను కోరక, పనిని చేయుట కలవాటు పడినపిమ్మట నొకమెట్టు పైకి పోవచ్చును. కర్మమును చేయుటయే తన పనియు నధికారమునని తెలిసి, దాని పరిణామమునుగూర్చి కళవళింపక, దాని ఫలిత మేమైనను దానికై సంతోషించుట దుఃఖించుటయు మానుటకు ప్రయత్నింపవలెను. చేసినపనిలో జయమైనను, అపజయమైనను, మనస్సున కలత నొంద గూడదు. సుఖమును, దుఃఖమును, సమముగా భావింప