శ్రీకృష్ణుడు చూపిన మార్గము/అధ్యాయము 17

వికీసోర్స్ నుండి

(17)

కర్మ యోగము, జీవనస్థితి.

(గీత: అధ్యాయము 3.)

కారణమున్నను లేకున్నను లోకసంగ్రహమునకైనను మనము కర్మమును చేసియే తీరవలెను. లోకస్థితికి కావలసిన కర్మము నెన్నడును విడువగూడదని భగవంతుడు గీతలో నిట్లొత్తి చెప్పియున్నాడు. నీవు జీవితమును విడిచినచో నితరులును నదే మార్గము ననుసరింతురు. నీవు దేనినిమంచిదని తలంచెదవొ యదియే యితరులకును ప్రమాణమగును. నీవు మట్టుకు నన్యాసివై యితరులు లోకవ్యవహారమును నడపుదురని యెదురుచూడ గూడదు. కావున లోకహితము కొరకు జ్ఞానమునొందిన వాడును కర్మములను జేయవలెననునది సిద్ధాంతము. గీతయనునది లోకవ్యవహారమును బాగుగ గమనించి చేయబడిన ధర్మోపదేశము. "చాల గొప్పజ్ఞానియైన జనకుడు మొదలగువారే కర్మమార్గము ననుష్టించియున్నారని చెప్పగా, నీకు వేరుమార్గముండునా ?" అన్నాడు భగవంతుడు.


కర్మణైవ హి సంసిద్ధి మాస్థితా జనకాదయః,
లోకసంగ్రహ మేవాపి సంపశ్యన్ కర్తు మర్హసి.

జనకుడు మొదలగువారు కర్మము నాచరించియే

సిద్ధిని పొందిరి. లోకవ్యవహారము చక్కగా జరుగుటకైనను నీవు నీకర్మము నాచరించుటయే తగినమార్గము. 3-20


యద్య దాచరతి శ్రేష్ఠ స్త త్త దేవేతరో జనః
స యత్ప్రమాణం కురుతే లోక స్త దనువర్తతే.


దేనిని శ్రేష్ఠుడైనవాడు చేయునో దానినే తక్కిన జనులు ననుసరించి చేయుదురు. అతడు దేనిని ప్రమాణముగ చేయునో దానినే లోకులనుసరింతురు. 3-21


సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత
కుర్యా ద్విద్వాంస్తథా౽సక్తశ్చికీర్షు ర్లోక సంగ్రహం.


మూఢులు ఫలము నాసించి యెట్లు సంగముతో పనిని చేయుదురో, అట్లే జ్ఞానియు నిస్సంగియై లోకపు మేలు తలంచి తన పనిని గూడ నుత్సాహముతో జేయవలెను. 3-25


న బుద్ధిభేదం జనయే దజ్ఞానాం కర్మసంగినాం
జోషయే త్సర్వకర్మాణి విద్వాన్ యుక్త స్సమాచరన్.


ఆశతోగూడి పనిచేయు అజ్ఞానులకు జ్ఞానియైన వాడు బుద్ధిభేదమును కలిగింపకూడదు. తాను యోగమార్గమున నిలిచి పనిచేయుచు నితరులు గూడ నెల్ల పనులందును

ఆసక్తితోచేయునట్లు నడువ వలెను. 3-26


ప్రకృతే ర్గుణ సమ్మూఢా స్సజ్జంతే గుణకర్మసు,
తా నకృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్.


ప్రకృతిగుణముల మాయకు లోనైనవారు గుణ కర్మములయందు తగులుకొందురు. బాగుగ దెలిసిన జ్ఞాని యల్పజ్ఞానముగల యామూఢులబుద్ధి చలించునట్లు చేయ గూడదు. 3-29