శృంగార మల్హణచరిత్ర/పీఠిక
పీఠిక
బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు సంపాదించి ప్రకటించిన ప్రబంధరత్నావళిని బరికింతుమేని యెన్నియేని ప్రాచీనప్రబంధరత్నములు తెలుఁగుబాసకుఁ బెట్టని తొడవులై విలసిల్లియుండెడివని తెలియవచ్చెడిని. ఆయాప్రబంధములనుండి యందుద్ధృతములైన పద్యములు వానివాని యౌత్కృష్ట్యమును, కవితామాధుర్యమును వేనోళ్లఁ జాటుచున్నని. ఆగ్రంథములు నామమాత్రావశిష్టములై యిపుడు లభింపకుండుటచే నాంధ్రవాఙ్మయమునకుఁ దీరనిలోటు వాటిల్లినది. విస్మృతప్రాయములయిన యట్టిగ్రంథరత్నములలో నొకటియగు నీమలహణచరిత్రమున కేకైకమగుమాతృక యిటీవల మన భాగ్యవశమునఁ దెలుఁగునాట లభించినది. దీనికి
కృతికర్త
ఎడపాటిఎఱ్ఱనార్యుఁడు. గ్రంథావతరణిక వలనను, ఆశ్వాసాంతగద్యములవలనను ఈతఁడు 'శివభక్తినిధి' యనియు, 'మంత్రి' (నియోగిబ్రాహ్మణుఁడు) యనియు “కవితాభిజ్ఞుఁ' డనియు, కౌండిన్యకులోద్భవుఁ" డనియు, కృతిపతికిఁ 'గడుఁగూర్చుబంధు' వనియు, 'ఎడపాటిపురాధిపుఁ' డనియు (ఎడపాటికిఁ గరణము కావచ్చును.), 'సోమయామాత్యుని పుత్త్రుఁ' డనియుఁ దెలియవచ్చుచున్నది. ప్రబంధరత్నావళియం దీతనియింటిపేరు 'పెదపాటి' వారని కలదు. “పాటిగలట్టిమేటి యెడపాటిపురాధిప యెఱ్ఱనార్య' అనునిందలిపద్యమున 'ఎడ' యనుచోట 'పెద' యున్నను పద్యము సరిపోవును. కాని ఆశ్వాసాంతగద్యములయందు సైత మిందు 'ఎడ' అనియే యున్నది. పెదపాడు[1] కృష్ణామండలమున ఏలూరునకు సమీపమున నున్నది. 'ఎడపాడు' ఎచ్చటనున్నదో! ఈ సంశయమునుదీర్ప నుపలబ్ధములగు నాధారములు చాలవు.
కృతిపతి
ఈగ్రంథమునకుఁ గృతిపతి చుండి కాళనమంత్రి. ఈతఁడు నియోగిబ్రాహ్మణుఁడు; సోమాంబారామయామాత్యుల పుత్త్రుడు; శివభక్తిపరుఁడు. ఎఱ్ఱనార్యుఁ డీతని ఘనసంపద్వైభవోపేతుఁ డనియు, నెఱదాతయనియు, బంధుప్రియుఁడనియు, కవిపండితపోషకుఁడనియు, యోధాగ్రేసరుఁడనియు, దేశాంతరాస్థానకవివరవర్ణనీయగుణగణుఁ డనియు వర్ణించినాఁడు. మఱియు నీతని 'చుండిపురపాలక', 'చుండిపురాధిప' అనియు, కొండొకచో 'చుండిస్థలగ్రామణి', 'చుండిస్థలకరణచంద్ర' అనియుఁ బేర్కొన్నాఁడు. 'చుండి' నెల్లూరుమండలమున నెల్లూరుపురమునకుఁ జెంతనున్న యొక చిన్నసంస్థానము. దీని నైదాఱుశతాబ్దములనుండి బ్రాహ్మణులు పరిపాలించినట్లు తెలియ కృతిరచనాకాలము
కవి తా నీప్రబంధమును శ్రీకృష్ణదేవరాయలకాలముననే రచియించి యాతని కేకారణముననో యంకితము సేయక యీ కాళనమంత్రికిఁ గృతి నొసంగినట్లు
"ఉ. ఇట్టి మహాప్రధానపరమేశ్వరమూర్తివి గాన నీవు చే
పట్టితి మేలు చుండిపురపాలక, కాళనమంత్రిచంద్ర, మున్
గట్టిగఁ గృష్ణరాయజనకాంతున కీయక దాఁచినట్టి యా
రట్టజియైన యెఱ్ఱకవిరాజిత మల్హణకావ్యకన్యకన్."
యని చెప్పికొన్నాఁడు. ప్రబంధరత్నావళిని సంధానించుటకు సాధనములగు రెండుగ్రంథములలో నొకటియగు ప్రబంధరత్నాకరమునఁ బెదపాటి జగన్నాథకవి యీమల్హణచరిత్రమునందలి పద్యముల నుద్ధరించియుండుటచేతను, నం దాతఁడు చేర్చిన కవులలో మాడయగారి మల్లయ, తెనాలి రామలింగయ యర్వాచీను లగుటచేతను, యెఱ్ఱనార్యుఁ డిందుఁ గృష్ణదేవరాయలకుఁ బూర్వులు, సమకాలికులు నగు కవులనే వినుతిచేసియుండుటచేతను నిది శ్రీకృష్ణదేవరాయలకాలమున (క్రీ.శ. 1500 ప్రాంతమున) రచియింపఁబడినదని తేలుచున్నది.
ఎఱ్ఱనార్యుని యితరకృతి
ప్రబంధరత్నావళియందు ‘కుమారనైషధము’ నీతనికృత్యంతరముగఁ బేర్కొని యందలిపద్యములను గొన్నిటిని జగన్నాధకవి చేర్చినాఁడు. మల్హణచరిత్రమున నెఱ్ఱన తాను ‘సరసకవితాచతురుండ’ ననిమాత్రము చెప్పికొనెను గాని యితరకృతిని రచియించినట్లు చెప్పలేదు. ‘కుమారనైషధము’ నందలి యాపద్యము లిందలి పద్యములకంటెఁ బ్రౌఢములుగఁ జూపట్టుచున్నవి. ఆకృతిని దీనికిఁ దరువాత రచియించినాఁడేమో?
మలహణచరిత్రము
ఇందలి యితివృత్తము శివభక్తిమాహాత్మ్యప్రతిపాదక మయినది. కథానాయకుఁడు సుప్రఖ్యాతసంస్కృతకవియగు మలహణుఁడు. కథానాయిక పుష్పగంధియను వేశ్య. ఈకథ పాల్కురికి సోమనాథకృత మగు పండితారాధ్యచరిత్రమునఁ గలదు. అం దీవిధముగ నున్నది:
“శివభక్తుడు, కవియు నగు మలహణుఁడనునాతఁ డొకవేశ్యను ప్రేమించి దానిని గూడియుండెను. మాయలమల్లియను సానితల్లి వారిపొందున కిచ్చగింపక యాతనిఁ బడఁదిట్టి పోఁద్రోలి కూఁతు నొకమండలాధిపతికిం గూర్చెను. మలహణుఁడు వేశ్యావియోగమును భరింపఁజాలక, దానిని మఱలఁ బొందు మార్గమునుగానక మిగుల బొక్కుచు దాని పలుకులనైన విని కొంత మనశ్శాంతిని బడయవచ్చునని తలంచి యొక చీకటిరేయిని దాని కేళీమందిరద్వారమునొద్దకుఁబోయి నిలిచియుండెను. క్రొత్తవిటకానికడఁ బొగులుచుండిన వేశ్య వెలుపలికి వచ్చి యట మలహణు నునికి యెఱుఁగక పుక్కిలించి యుమిసెను. ఆ యెంగిలినీ రక్కడ నిలిచియున్న మలహణునిపైఁ బడెను. ఇంతలో మిన్ను మెఱయ నావెలుఁగున నతనిఁ గుర్తించి యా బోగముచాన వగచి చెంతకుఁబోయి కౌఁగిలించుకొని యాతని నూఱడించెను. మరియుఁ దమ యిష్టార్థమును బడయ శివునిఁ బ్రార్థింప నాతనిఁ బురికొల్పెను. అంత వా రిరువురు శివాలయమును చేరిరి. అచట వేశ్య మలహణుని వీపునాని కౌఁగిలించి నిలిచియుండెను. అపుడు మలహణుఁడు భక్తిమీఱ 'కాంతాకచప్రచయ” అని ప్రారంభించి ముప్పదియాఱు శ్లోకములతో శివుని స్తోత్రము చేసెను. శివుఁడు మెచ్చి యాయిరువురకును, వేశ్యమాతకును శివలోకము నసుగ్రహించెను."
ఈకథనే ఎఱ్ఱన యిట్లు మార్చి పెంచి ప్రబంధముగా రచియించియుండవచ్చును. మఱియు నిందు జాతి నీతిగల వేశ్యలపొందువలన హానికలుగదనుటకు దృష్టాంతముగాఁ జెప్పిన శ్వేతునికథయుఁ బండితారాధ్యచరిత్ర (ద్వితీయప్రకరణము) యందున్నదియే. అదియు నిట గొంత మార్పును గాంచి వెలసినది.
ఇది శివభక్తిప్రధాన మగు గ్రంథ మయినను నాయికానాయకుల విప్రలంభసంభోగశృంగారము లంగములై యిం దందముగఁ బెంపొందినవి. వేశ్యలమాయలు, వలపుకత్తెలు పురుషులను దమవలలో వైచికొను నుపాయములు చమత్కారముగ వర్ణితములైనవి. ధనదత్తుని (కోమటిసెట్టి) మాటలు, చేష్టితములు నవ్వును గొల్పుచుండును. ఆయాయిపట్టుల నాయాయి విషయములంగూర్చినవర్ణనము లిందు స్వభావోచితములుగ నలరారుచున్నవి. కవితావైభవమున నీగ్రంథ మాంధ్రభోజుఁడగు కృష్ణదేవరాయలకాలమున వెలసిన యితర సరసప్రబంధములకుఁ దీసిపోవక సహృదయహృదయంగమముగ నున్నది. 'తినఁబోవుచు రుచులెన్న నేల?' సహృదయు లాస్వాదింపనున్న యీ రసవత్ ప్రబంధమాధుర్యమునుగూర్చి యిట హెచ్చుగ ముచ్చటింపఁ బని లేదు.
మాకు లభించిన మాతృక యొక్కటియే యగుట చేతను, అదియు శిథిలమై, దోషభూయిష్ట మై యుండుట చేతను ఈ గ్రంథము నింతకంటె నిర్దుష్టముగ ముద్రింపఁజాలమికి మమ్ము మన్నింపఁ బండితుల వేఁడెదము. చివికి చెదలుపాలగుచున్న ప్రాచీనప్రబంధరత్నముల నుద్ధరించి యిట్లు సుందరముగఁ బ్రకటించుటకుఁ బూనుకొన్న మా కాంధ్రలోకము సాదరభావముతోఁ బాసటయై మున్ముందు నితోధికభాషాసేవకు మమ్ముఁ బురికొల్పుఁగాక యని విశ్వసించుచున్నాము.
మాకుఁ గోరినవెంటనే తమకడనున్న మాతృకను బంపిన ఈవని గ్రామనివాసులు శ్రీ శ్రీపతి పండితారాధ్యుల శరభసాళ్వ అయ్యవార్లుంగారికిఁ గృతజ్ఞతాంజలుల నర్పించుచున్నాము.
ప్రభవ జ్యేష్ఠ శుద్ధ
పూర్ణిమా
గంటి సూర్యనారాయణశాస్త్రి,
సౌమ్యవారము
సంపాదకుడు.
ఇతర ప్రతులు
[మార్చు]This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.
- ↑ ప్రబంధరత్నావళి పీఠిక - పే. 3.