శృంగారనైషధము/పీఠిక
పీఠిక
శ్రీనాథుఁడు
ఆంధ్రవాఙ్మయమునఁ దిక్కనతరువాత నింతపండితుఁడు మఱొకఁడులేఁడు. తిక్కనవలెనే యీతఁడును గురుపీఠమలంకరించిన మహామూర్తి. సోమయాజివలెనే యీకవిసార్వభౌముఁడును రాజభోగములన్నిటిని ననుభవించిన పుణ్యశాలి. ఇతఁడు తనసమకాలముననేగాక మొన్నమొన్నటివఱకును గూడ, నీభాషపయిఁ దనప్రభావము నెఱపిన శక్తిమంతుఁడు; విపులకావ్యేతిహాసములనుండి యాంధ్రరసికులదృష్టిని బ్రబంధములవైపు మరలించిన రసికావతంసుఁడు.
శ్రీనాథునిఁగూర్చి యెఱిఁగినంతపూర్ణముగ మనకితరకవులఁ గూర్చి తెలియదు. శ్రీనాథుఁడు చిన్నతనముననే సమస్తవేదవేదాంగపాండిత్యమును సంపాదించెను; సాంఖ్యాదిసిద్దాంతములను, శైవవైష్ణవాగమములను, పాతంజలాదియోగసూత్రములను, న్యాయవైశేషికాదిదర్శనములను గబళించెను. ఈసమస్తవిద్యాపరిశ్రమ మాతనిగ్రంథములయందుఁ గానవచ్చును. సంస్కృతకవిప్రపంచమునఁ గాళిదాసభారవిమురారిశ్రీహర్షు లతనికి గురుస్థానము. ఆంధ్రకవులందుఁ గవిత్రయమువారియెడను భీమకవియెడను నీతనిది కేవలము శిష్యభావము. (చూ. వచియింతు వేములవాడభీమనభంగీత్యాది.) పాల్కురికి సోమనయెడసైతమీతనికి గౌరవములేకపోలేదు. ఏలన నితఁడతని ద్విపదకావ్యమైన పండితారాధ్యచరిత్రమును బద్యకావ్యముగ సంతరించి మామిడిప్రెగ్గడయ్యకుఁ గృతి నొసంగెను. సోమనాథునికావ్యమును గేవలము చదివి పరి వర్తనమొనర్చుటయేగాక తఱచుగా నందలిద్విపదలనే తనపద్యముల నెక్కించె నని పిడుపర్తిసోమన వచించియున్నవాఁడు.
కాశీఖండమున వేమభూపాలుఁడు త న్నుద్దేశించి చెప్పినట్టు లీతఁడురచించిన “ఈక్షోణిన్ నినుఁ బోలుసత్కవులు లేరీనాఁటికాలంబునన్.” అనుపద్యార్థమెంతేని నిజము. అట్టికవి యానాఁడు లేఁడు. శ్రీనాథుఁడు కొండవీటిరాజులలోఁ బెదకోమటియాస్థానకవి. అంతేగాదు. తత్ సంస్థానవిద్యాశాఖాధికారిగసహిత ముండెను. వేమారెడ్డియాస్థానమున దిగ్దంతివంటి సంస్కృతకవి వామనభట్టబాణుఁడను వాఁడొకఁడుండెను. ఇతఁడు విద్యారణ్యులవారిశిష్యుడు. వామనభట్టబాణుఁడు సంస్కృతమున వ్రాసిన గ్రంథములలో నలాభ్యుదయ మొకటి. అది నలునిచరిత్రలోఁ బూర్వభాగము. ఈరచనయే శ్రీనాథుని హర్షనైషథాంధ్రీకరణమునకుఁ బ్రేరకమయియుండును. మైత్రికి భంగమురానివిద్యాస్పర్ధచే శ్రీనాథుఁడాకృతిఁ దలపెట్టియుండును. ఇది క్రీ. శ 1415 ప్రాంతమున రచియింపఁబడియుండునని యూహ.
"చిన్నారిపొన్నారి చిఱుతకూఁకటినాఁడు రచియించితి మరుత్తరాట్చరిత్ర” ఇత్యాదిపద్యములవల్ల శ్రీనాథుఁడు బహుగ్రంథకర్తయని స్పష్టమగుచున్నది; కాని వాన నుపలభ్యమానములు నైషధము (1415), హరవిలాసము (1425), భీమఖండము (1430), కాశీఖండము (1445), శివరాత్రిమాహాత్మ్యము, క్రీడాభిరామము (వీథినాటకము), పల్నాటివీరచరిత్రము ననుగ్రంథములే.
శృంగారనైషధము
సంస్కృతవాఙ్మయమాంధ్రపరివర్తనముఁ బొందినచరిత్రములో మూఁడవస్థాభేదములు గలవు. మొదటిది కవిత్రయమువారు ప్రారంభించిన పురాణేతిహాసపరివర్తనపద్ధతి. నామమాత్రమున నివి పరివర్తనములు, గాని మూలకథ నాధారముగాఁ గొని వారు గావించిన స్వతంత్రరచనలు మూలముతోపాటు సమానకార్యములుగ నొప్పినవి. కొన్నిఘట్టములందు వారు మూలమునకు వన్నెచిన్నెలు దిద్దిరి. కావ్యకళాదృష్టిచే మూలమును దాఱుమాఱు చేసిరి. ఈస్వతంత్రపద్దతి మొదటిది. ఈ చరిత్రలోని రెండవయవస్థకు నైషధము తార్కాణము. ఇందు మూలానుసరణము తప్పలేదు. ముక్కకు ముక్కగాఁ దెలిఁగింపను లేదు. అనఁగా మూలవిధేయతయు స్వతంత్రతయు నను రెండుగుణములును గలిసినసంధి. ఈప్రక్రియకు నైషధమే మొదలు. మూఁడవపద్ధతి సంస్కృతనాటకములకు నేఁటితెలుఁగుసేఁత. ఇందు భాషాంతరీకర్తలు కేవలము మూలమునకు దాసులయిరి.
నైషధము సంస్కృతమున నెంతమహాకావ్యమైనను దత్కర్తయగు శ్రీహర్షుఁడు కాళిదాసాదులతోఁ బోల్పఁదగిన కవికాఁడు. అతఁడు మహాపండితుఁడు, శబ్ధార్థకల్పనాచాతురి గలవాఁడు. కాళిదాసభవభూతులకు లభించిన యుదాత్తకవితాతత్త్వ మీతనికి లేదు. శ్రీహర్షనైషధమును లోకము కొనియాడుట యిందలి పాండితీవిలసనమునకును గల్పనాచాతురికిని. ఈగ్రంథమున ననౌచిత్యదోషము దొరలినతావులును గలవు. స్త్రీవిషయమున నెట్టివర్ణనలనైనను జేయుటకు వెను దీయని శ్రీనాథుఁడు సైత మిందలి యనౌచిత్యములఁ జూచి కంటగించుకొనెను. బుద్ధిపూర్వకముగ వానిని బరిహరించితి నని తానే చెప్పుకొనెను. చూడుఁడు హర్షుని నలగుణవర్ణనము:-
శ్లో. సాపీశ్వరే శృణ్వతి తద్గుణౌఘాన్ ప్రహస్య చేతో హరతో౽ర్ధశంభుః,
అభూదవర్ణాంగుళిరుద్ధకర్ణా కదానకండూయనకైతవేన.
శ్లో. అలంసజన్ ధర్మవిధే విధాతా రుణద్ది మౌనస్యమిషేణ వాణీం,
తత్కంఠమాలింగ్య రనన్య తృప్తాం న వేద తాం వేదజడః సవక్రాం.
శ్లో. శ్రియస్తదాలింగనభూర్నభూతా వ్రతక్షతః కాపి పతివ్రతాయాః,
సమస్తభూతాత్మతయా నభూతం తద్భర్తురీర్ష్యాకలుషాణునాపి.
పైశ్లోకములలో రంభాద్యప్సరోభామినులేగాక త్రిమూర్తులభార్యలుసైతము నలునిగుణములను విని చాపలము వహించిరని యాతఁడు సూచించినాఁడు. జగన్మాతలకీదోషము నంటఁగట్టుట మిక్కిలియనుచిత మని దానిని బరిహరించి రంభావిషయమునుమాత్రము తా నిట్టులు తెలిఁగించెను.
శ్లో. అస్మత్కిలశ్రోత్రసుధాం విధాయ రంభాచిరంభామతులాం నలస్య,
తత్రానురక్తా తమనాప్య భేజే తన్నామగంధాన్నలకూబరం సా.
చం. వినుకలి ......... వాసనన్".
హంస దమయంతియొద్ద నలుని వర్ణించునపుడు
శ్లో. సువర్ణశైలా.......... కీర్ణైః
అనుశ్లోకములోని "స్మరకేళికాలే” యనునసందర్భపదప్రయోగమును శ్రీనాథుఁడు పరిహరించుట లెస్స. అతని తెనుఁగిది.
గీ. కనకశైలంబు డిగ్గి .........వైశాఖ వేళలందు.
ఔచిత్యసంపాదనముకై చేసినమార్పుల నటుండనిచ్చి మొత్తముమీఁద భాషాంతరీకరణపద్దతిఁ జూచినచో శ్రీనాథుఁ డన్నట్లు నిజముగా నిది "భావం బుపలక్షించియు, రసంబు పోషించియు, నలంకారంబు భూషించియు, నౌచిత్యంబాపాదించియు, ననౌచిత్యంబు పరిహరించియు మాతృ కానుసారంబునఁ” జెప్పఁబడినదేయని స్పష్టమగును. ఇట “భావం బుపలక్షించి” యనఁగా మూలకారునియభిప్రాయము గుఱుతించి యనియర్థము చెప్పవలసియుండును. కొన్ని చోట్ల నాతనియాశయములు స్పష్టముగా లేనప్పుడు ఆంధ్రకవి వానిని చక్కగా నుపలక్షించి స్పష్టపఱిచినాఁడు.
శ్లో. విధిం నధూసృష్టిమపృచ్ఛమేవ తద్యానయుగ్యో నలకేళియోగ్యాం,
త్వన్నామవర్ణా ఇవ కర్జసీతా మయాస్య సంక్రీడతి చక్రచక్రే.
చ. అడిగితినొక్కనాఁడు కమలాసనుతేరికి వాహనంబనై
నడుచుచు నుర్విలో నిషధనాథునకెవ్వతెయొక్కొ భార్య య
య్యెడు నని చక్రఘోషమున నించుక యించుకగాని యంత యే
ర్పడ విననైతి నీ వనుచుఁ బల్కినచందము దోఁచె మాలినీ.
ఎంత మూలము ననుసరించినను మూలమునకు నితఁడు వన్నె పెట్టుట మానలేదు.
సీ. నలినసంభవు సాహిణము వారువంబులు కులముసాములు మాకుఁగువలయాక్షి
చదలేటిబంగారు జలరుహంబులతూండ్లు భోజనంబులు మాకుఁబువ్వుఁబోఁడి
సత్యలోకముదాఁక సకలలోకంబులు నాటపట్టులు మాకు నబ్జవదన
మధురాక్షరములైనమామాటలువినంగ నమృతాంధసులె యోగ్యులనుపమాంగి
గీ. భారతీదేవి ముంజేతిపలుకుఁజిలుక, సమదగజయాన సబ్రహ్మచారి మాకు
వేదశాస్త్రపురాణాది విద్యలెల్లఁ, దరుణి నీయాన ఘంటాపథమ్ము మాకు.
అను సుప్రసిద్ధపద్యము మూలార్థమునకుఁ బ్రత్యాదేశము చేయుచున్నది.
కేవలము మూలానుసార మని తెలుపుటకుఁ గొన్నిచోటుల మూలమునందలిపదములనే పద్యమున నెక్కించవలెనని యితఁడుచేసినప్రయత్నము స్వతంత్రతాలక్షణముగాఁ దోఁచుటలేదు. అది మూలాభిమానమునకు లక్షణము. ఆ సంస్కృతపదముల నవలంబించుటలోఁ దత్ప్రయోగము ఆంధ్రభాషావిరుద్దమనియైన నాతఁడు దలఁప లేదు.
శ్లో. సరసీః పరిశీలితుం మయా గమికర్మీకృతనైకనీవృతా
అతిథిత్వమనాయి సా దృశోః సదసత్సంశయగోచరోదరీ.
పై శ్లోకమునందలి “గమికర్మీకృతనైకనీవృతా, సవసత్సంశయగోచరోదరీ” అనెడు రెం డపూర్వశబ్దకల్పనముగల ఒక్క భావమునే రెండుపద్యములలోఁ జెప్పినాడు.
మ. కమలేందీవరషండమండితలసత్కాసారసేవారతిన్
గమికర్మీకృతనైకనీవృతుఁడనై కంటిన్ విదర్భంబునన్
రమణిం బల్లవపాణిఁ బద్మనయనన్, రాకేందుబింబాననన్
సమపీనస్తని నస్తి నాస్తివిచికిత్సాహేతుశాతోదరిన్.
మ. మృదురీతిం బ్రతివాసరంబు గమికర్మీభూతనానానదీ
నదకాంతారపురీశిలోచ్చయుఁడనై నైకాద్భుతశ్రీజిత
త్రిదివంబైన విదర్భదేశమున నారీరత్నముం గాంచితిన్
సదసత్సంశయగోచరోదరి శరత్సంపూర్ణచంద్రాననన్.
మూలములోని
శ్లో. అస్తివామ్యభరమస్తి కౌతుకం సాస్తి ఘర్మజలమస్తి వేపథు,
అస్తి భీతిరతమస్తి వాంఛితం ప్రాపదస్తి సుఖమస్తి పీడనమ్.
అనుశ్లోకమునందలి "అస్తివామ్యభరా"ది సమాసములు. వ్యాకరణసాధ్యములును, వైయాకరణమనోరంజకములును, అంతేగాని పూర్వకవిప్రయోగార్హములు కావు. అయ్యును బండితుఁడయిన శ్రీహర్షుఁడు బ్రయోగించుటచేఁ దానును బ్రయోగింపకుండుట పరిహాసహేతువగునేమో యనిజంకి శ్రీనాథుఁడు వానిని యథాస్థితముగా నిట్లు వాఁడుకొనెను.
గీ. అస్తివామ్యభారమస్తికౌతూహల, మస్తిఘర్మసలిల మస్తికంప
మస్తిభీతి యస్తిహర్ష మస్తివ్యథం, బస్తవాంఛమయ్యెనపుడు రతము.
ఈయెత్తుగీతి పైనున్ననాలుగుసీసపాదములును శ్రీనాథునికల్పనమే. ఈరీతి యాసీసమునకెంతేని వన్నె పెట్టుచున్నది. సీసపద్యపు ఆనాలుగుపాదము లివి.
పతిపాణిపల్లవచ్యుతనీవిబంధనవ్యగ్రబాలాహస్తవనరుహంబు
ధవకృతాధరబింబదశనక్షతవ్యథాభుగ్నలీలావతీభ్రూలతంబు
ధరణినాయకభుజాపరిరంభమండలీగాఢపీడితవధూఘనకుచంబు
వరనఖాంకుర మృదువ్యాపారపులకిత నీరజాక్షీనితంబోరుయుగళి
గీ. అస్తివామ్యభార ..........
మూలశబ్దానుసరణము పరమావధిని బొందిన దనుటకుఁ బయి నుదాహరించిన శ్లోకములతోఁ బాటు దీనినిగూడఁ బేర్కొనఁదగును.
శ్లో. అశ్రాంతశ్రుతిపాఠపూతరసనావిర్భూతభూరిశ్రవా,
జిహ్మబ్రహ్మముఖౌఘవిఘ్నితనవస్వర్గక్రియాకేళినా...
అనుటకు
శా. వేదాభ్యాసవిశేషపూతరసనావిర్భూతభూరిశ్రవా
సాదబ్రహ్మముఖౌఘవిఘ్నితనవస్వర్గక్రియాకేళిచే.
నన్నది తెలుఁగుసేఁతయఁట.
ఇఁక నీగ్రంథముఁ గూర్చి యొకటిరెండుమాటలు. ఇది లోకులనుకొనునట్లు హర్షనైషధమునకు డుమువులు చేర్చిన యాంధ్రగ్రంథముకాదు. శ్రీనాథునిశ్లోకములలో మూలశ్లోకము లిమిడినట్లుగాఁ గనఁబడునుగాని మూలశ్లోకములలో నాతఁడిమిడినట్టు లగపడదు. చమత్కారార్థము గమికర్మీకృతాదులగు నొండురెండుశ్లోకముల తెనుఁగుసేఁతను జూచిమోపిన యీలోకనిందలో నేమాత్రమును సత్యము లేదు. మిక్కిలి ప్రౌఢసాహిత్యముగల సంస్కృతనైషధము నటుంచి శ్రీనాథుని కృతినే చదివితిమేని మూలాపేక్షలేకయే సర్వమును విశదమగును. ఇదియే దానిమూలసమప్రాధాన్యమును విశదము సేయును.
ఈకావ్యమునఁ గవితాశిల్పము చక్కగాఁ బ్రదర్శితమైనపట్టు నలదౌత్యఘట్టము. హంసదూత్యము దానితరువాతిది. అందు మొదటిదానిలో నాయికానాయకులకు జరగిన ప్రౌఢసంభాషణాక్రమము, కవికిఁగల లోకజ్ఞతకును నౌచితీపరిపాలనకును సాక్ష్యముగా నున్నది. హంసదూత్యము పింగళిసూరన శుచిముఖీదూత్యమునకు నొరవడిగా నున్నది.
శ్రీనాథునిశైలి
నన్నయ సంకల్పించి నాచనసోముఁడు కొంతవఱకుఁ గొనసాఁగించిన శయ్యాసౌభాగ్యము శ్రీనాథునివలనఁ బరిణతిఁ జెందినది. ప్రబంధకవులకును, బురాణేతిహాసకర్తలకునుగల ప్రధానమైనవాసి యీశయ్యయందే గలదు. తిక్కనాదు లర్థము నారాధించిరి గాని శయ్యను గాదు. ప్రబంధకవులు శయ్యాసంపాదనార్థమై శబ్దము నారాధించిరి. అర్థమును గౌణము చేసిరి. వారికి నీత్రోవచూపినవాఁడు శ్రీనాథుఁడు కాని, శ్రీనాథునివిషయమున మాత్రము క్వాచిత్కముగాఁ దక్క నర్థమును శబ్దమునుగూడఁ బ్రథానములే. ఇతనిశయ్యలో జిగిబిగులు రెండును గలవు. ఇతనివాక్కు మిక్కిలి భావభరితము కావుననే యితనిశైలి యుద్ధండముగా నుండును.
శ్రీనాథునిజీవితచరిత్ర వ్రాయుటనఁగా బదునేనవశతాబ్ది యాంధ్రదేశచరిత్రవ్రాయుట యని శ్రీచిలుకూరి వీరభద్రరావుగారొకచో వచించియున్నారు. ఆకాలమున నుచ్చస్థితిలో నున్న యాంధ్రకర్ణాటకరాజ్యములతో నతనికిఁగలసంబంధము, నానామంత్రులతో నతనికిఁగలమైత్రి నానాదిశల నాతఁడొనర్చిన సంచారము - ఇత్యాదు లతని నాంధ్రలోకైకకవిగాఁ జేసినవి.
ఇఁక మిగిలినదొక్కటి. చంద్రునకు నూలుపోగన్నట్టులు శ్రీనాథమహాకవిచక్రవర్తిఁగూర్చి రెండువాక్యములు వ్రాయ నాకవకాశమిప్పించిన శ్రీవావిళ్ల వేంకటేశ్వరశాస్త్రుల వారికి మిక్కిలి కృతజ్ఞుఁడను.
టీచర్స్‌కాలేజి, సైదాపేట, మద్రాసు
వృష, ఆషాఢ శు 5.
ఇట్లు,
గ. శ్రీ. న. ఆచ్వార్య