శుద్ధాంధ్ర నిరోష్ఠ్య సీతాకల్యాణము
కృత్యాది
శా. |
శ్రీరామామణిమేచకాంబుదముపైఁ జెల్వొందు విద్యుల్లతా
కారప్రక్రియ యక్కునందనర భక్తవ్రాతసస్యంబులన్
కారుణ్యాంచసుధాంబులన్ మనువుచున్ గారామునన్ బ్రోచు లీ
లారోచిష్ణుఁడు కర్పరాద్రిహరి చాలాయుక్తి మమ్మేలుతన్.
| 1
|
చ. |
ఘనఘనసారసక్రముకగంధపుపూతసహస్రపత్రమై
యొనరెడుభర్త యక్కున సముజ్జ్వలకౌస్తుభకర్ణికస్థలం
బున విలసిల్లుచున్ గడుప్రమోదముఁ జెందు రమావధూటి తా
ననిశము మాగృహంబున ప్రియం బొందవంగ వసించి గావుతన్.
| 2
|
ఉ. |
వెన్నునివేయినామములు వేడుకచే పఠియించుకోస మ
భ్యున్నతి పెక్కుమోములు సముజ్జ్వలవృత్తి ధరించి పాదుకల్
సన్నిల నాతపత్రవటశయ్యలు దానయి సేవఁ జేయు నా
పన్నగభర్త మత్కృతి శుభస్థితిచే సమకూర్పఁజేయుతన్.
| 3
|
చ. |
దనుజుల నాజిఁ గూల్చిన ప్రతాపము కీర్తియు రెక్కలందు నా
ననమున దాల్చుపద్ధతి ఘనంబగు శోణితపాండురద్యుతుల్
దనరఁగ (విష్ణుమూర్తి)కి ముదంబున వాహనమైన పక్షిరా
జనువున శరషనంబులు ప్రియంబున మాకు నొసంగుగావుతన్.
| 4
|
చ. |
నలినభవాండభాండభువనంబుల దుష్టుల శిక్ష సేయఁగా
గలుఁగు ప్రతాపరేఖ యన గాంచనవేత్రముఁ బూని జక్రి దా
పల వసియించువేలుపులు బారులు దిద్దెడు కంధిరాట్సుతుం
డలరఁగ నిట్టికావ్యము నయంబొదవ న్సమకూర్చు నెంతయున్.
| 5
|
ఉ. |
చక్రము శంఖము న్గదయు శార్ఙ్గము ఖడ్గము నాదిగా ని
ర్వక్రపరాక్రమాయుధపరంపరలవ్ మణిభూషణంబులన్
(శక్ర)మణిప్రభోపమితశ్యామలకాంతియు వైజయంతియున్
సక్రమ మొప్ప నెల్లపుడు సన్నుతిఁ జేసెద నిష్టసిద్ధికిన్.
| 6
|
ఉ. |
శ్రీకరరామభారతవిశేషకథాజలరాశిఁ ద్రావి య
స్తోకపదార్థరత్నములు తోరముగా బుధకోటి కిచ్చి సు
శ్లోకరుచుల్ దిగంతముల లోకములం బ్రసరింపఁజేయు వా
ల్మీకిఁ బరాశరాత్మజు నమేయగవీంద్రులఁ బ్రస్తుతించెదన్.
| 7
|
గీ. |
జలజలోచనపరికరాంశప్రభూతు
లైన పన్నిద్దరాళ్వార్ల నభినుతించి
వాసి డెబ్బదినాల్గుసింహాసనముల
గురువుల భజింతు శుభములు పరిఢవిల్ల.
| 8
|
ఉ. |
ఆరయ శబ్దహీనమగునట్టి పదస్థితి గల్గి పై నలం
కారములెవ్వియు న్గనక గ్రమ్మినశయ్యలసంధి దెల్పుచున్
గౌరవవృత్తి యర్థములు గానని యాకవిచోరకోటి ని
స్సారము సేయఁగాఁదగు వెసన్ ద్విజరాజకళాసమృద్ధిచేన్.
| 9
|
వ. |
అని యిట్లు నిష్టదేవతాప్రార్ధనంబును బూర్వాచార్యసంకీర్తనంబును
సుకవిభూషణంబునుగావించి మఱియు నొకనాటిరేయి నిద్రించు
సమయంబున
| 10
|
ఉ. |
నల్లనిమేనుఁ తెల్లతిరునామము ముంజి పసిండిజందెమున్
జల్లనిగన్నులున్ గరుణజల్లెడుచూపులు లేతనవ్వు భా
సిలఁగ కర్పరాద్రినరసింహుఁడు తానగు వేంకటేశ్వరుం
డల్లన బ్రహ్మచారిగతి నగ్రమహీస్థలి నిల్చి వేడుకన్.
| 11
|
గీ. |
వత్స! నీయెడ మత్కృప వనరు కతన
హెచ్చి భువిలోన నేరికి నెన్నరాని
యచ్చతెనుఁగైన పదముల నమితకృతులు
నిచ్చ రచియించి నొసఁగితౌ యెలమి మాకు.
| 12
|
వ. |
అవి యెవ్వి యనినన్ వివరించెద వినుండు.
| 13
|
సీ. |
"సిరుల తొమ్మిదియేండ్ల వరదరాజస్తుతి
శ్రీరంగశతకంబుఁ జెప్పినావు
|
|
|
పదియేండ్లనాడును బహుచమత్కృతులచే
చక్రలాంఛనవిధిఁ జెప్పినావు
యెలమితో [1][2]పదునొకండేండ్ల బాలుడవయ్యు
కవికదంబరచన గాంచినావు
వరుసతో పన్నెండువత్సరంబుల వేడ్క
శతసంహితయుఁ దెన్గు జేసినావు
రమణ పదమూడుయేండ్లను రామకృష్ణ
చరితమెల్లను [3]ద్వ్యర్థిసంశ్లేష మొదవ
నాంధ్రభాషగ విరచించితౌర భువిని
శబ్ధశాసనబిరుదాంకశాలి వగుచు.
| 14
|
గీ. |
వరుస పద్నాల్గుపదిహేనువత్సరముల
సరసకవితాష్టభాషావిశేషకృతుల
సరణు లేర్పడ నాటకశాస్త్రమెల్ల
గరిమ విరచించితివిగాదె కవుల నెంచ.
| 15
|
గీ. |
అనఘ ప్రేమాభిరామ ధనాభిరామ
కావ్యములు జాతివార్తలుఁ గడలుకొనఁగ
ద్విపదలుగఁ జేసితివి కవినృపతు లెన్న
పూని షోడశవత్సరంబుననె మొదల.
| 16
|
క. |
నలయాదవరఘుపాండవ
[4]సలలితురీయార్థకావ్యసంశ్లేషకృతుల్
యెలమి దశసప్తహాయన
మలవడుకాలంబునందు నతిమధురోక్తిన్.
| 17
|
సీ. |
ఒనర పద్దెనిమిది సంవత్సరంబులనాడు
సకల అలంకారసంగ్రహంబు
రాకాసుధాపూర్ణరసపుష్పగుచ్ఛంబు
నాంధ్రభాషాభూషణాఖ్య కృతులు
|
|
|
విరివిగా రచియించి యెలమి పందొమ్మిది
హాయనంబులనాడు నఖిలశబ్ద
కవితనేతలు శిరఃకంపంబు గావింప
ఘనశాస్త్రాదికల్పనంబు
యెలమి గావించి తిరువదియేండ్లునాడు
ఘననిరోష్ఠ్యాది వింశతికావ్యములను
విలసితప్రౌఢి నిర్మించి వెలసి తీవు
సింగరాచార్య కవిరాయ శ్రితవిధేయ.
| 18
|
ఉ. |
రాఘవపాండవీయకృతిరత్నము పింగళిసూరనార్యుఁ డే
శ్లాఘ సముద్ధరించె నది సర్వబుధప్రతతు ల్గణింప నా
హా! ఘనమయ్యె దానికెన యంధ్రనిరోష్ఠ్యమహాప్రబంధ మెం
తే ఘటియింపఁజేయ నలుదిక్కులయందుఁ బ్రసిద్ధమయ్యెడున్.
| 20
|
క. |
మున్నెవ్వడు నుడువని యీ
తెన్నెడయెడ మీరి యచ్చతెనుఁగునిరోష్ఠ్యం
బెన్నికఁ జెప్పిన ప్రోడన్
నిన్నుం బొగడంగఁగలఁడె నెలతా ల్పయినన్.
| 21
|
ఉ. |
అచ్చతెనుంగుబద్దె మొకటైనను గబ్బములోన నుండినన్
హెచ్చని యాడుకొందు రొగి నెన్నుచు (నేర్పున) గ్రంథమెల్ల ని
ట్లచ్చతెనుంగునన్ నుడువ నందలిచంద మెఱుంగువారు ని
న్మెచ్చరొ! యబ్బురం బనరొ! మే లనరో! కొనియాడరో! కడున్.
| 22
|
క. |
అను సునయోక్తుల నిటులని
మన మలరఁగ ననునయించి మత్కులపతియౌ
వనజాతనిలయనేతయు
నను ధన్యుని జేయవచ్చినాఁడని తెల్పన్.
| 23
|
వ. |
అని మేల్కాంచి పరమానందహృదయారవిందుండనై యేతత్ప్రబంధ
బంధురవ్యాజకావ్యాలాపకృతక్షణవీక్షణప్రసంగసంగ్రహనిర్వహణ
కృత్యంబున నత్యంతకృతావసరుండనైన తలంపున.
| 24
|
క. |
శ్రుతుల కసాధ్యుఁడు వెంకట
పతి నాకావ్యమున కాసబడుటల్ దెలిసెన్
క్షితిసుతుని దొట్రుపల్కుల
కతిమోదము దాల్చు తండ్రియందంబయ్యెన్.
| 25
|
క. |
అనవుఁడు భళి నాకబ్బం
బునకున్ నేఁ డబ్బె తావి పుత్తడికిం గ
ల్గినఠీవి ననుచు మదిలో
నను సంతసమంది కూర్మి నన లొత్తంగన్.
| 26
|
చ. |
తెనుఁగున గొన్నిగావ్యములు దెల్లముగా రచియింపవచ్చుఁ బే
ర్కొనఁగ నిరోష్ఠ్యకావ్యములుఁ గొన్ని యొనర్పగ వచ్చుఁ గాక చ
క్కన నివిరెండుచందములు గ్రచ్చఱ గూఱిచి నేర్పుచేత నె
వ్వనికి రచింప శక్యమగు వాంఛ యొనర్చితి దాని సేయఁగన్.
| 27
|
గీ. |
చెప్పరానట్టి కావ్యంబుఁ జెప్పబూని
నాడ, నుద్ధతగతిచేత నడచి నడవ
ములు విచారింపకయె యేఁగు జలధి దాట
చేరి సాహసిదొడ్డు కొంచెంబు లగునె.
| 28
|
క. |
తొలుతటిసుకవులు ఘనులై
యిల నాంధ్రనిరోష్ఠ్యకావ్య మేలా సేయం
దలచరొ! నాకు బ్రసిద్ధము
గలుఁగఁగ నొనరించుకొఱకు గావలె నరయన్.
| 29
|
ఆ. |
ఒకరితెరువు వోవ నొకరు నాతెరువు రా
రీప్రబంధరచన నెన్నవశమె!
వెలయ దీనిమహిమ విన్నవారలె కవుల్
గారె! విననివారు కవులు గారె.
| 30
|
చ. |
ఇల కవితాప్రయాసమగు నెన్నికమై యుభయార్థకావ్యముల్
గల విపు డిట్ల విన్నయది గద్దిక ముందర గల్గనేర్చునే
తెలుఁగు నిరోష్ఠ్యపుంగృతి యిదే మఱిదక్కఁగ నిప్పటందులన్
గలుఁగదు వింటలేదె యిక కాఁగలజాడలు నెన్న నేటికిన్.
| 31
|
క. |
తరమక ప్రతిపదములు ప
ల్మరు నరయుచు సముచితోక్తమార్గంబులనున్
బెఱఁగులఁ దెలియుచు నర్థం
బెఱఁగఁగ దగు నుభయసంధు లెనయుటకతనన్.
| 32
|
గీ. |
అరయ [5]కగచజటడతద నా యలసహ
రద్వయమె కాని యొండక్షరములు చొఱవు
మఱియు నౌత్వోత్వములు కొమ్ము మాముడియును
వలవ దామీద సురభాష నిలుపరాదు.
| 33
|
క. |
ఇల సురభాషల కొన్నిటి
తిలకింపఁగ వికటమనుచు తిరమగునామం
బులు కథలుఁ దెలియు[6]కొఱకై
నిలిపితి కవిసమ్మతాన నిల్కడగాఁగన్.
| 34
|
వ. |
అని యిట్లు సకలసుకవిజనానందకందళితంబై యొప్పు యేతత్ప్రబంధ
నిర్మాణసామర్థ్యంబు నిరూపించి మదీయవంశావతారం బభివర్ణించెద.
| 35
|
గీ. |
పరమద్రావిడయాసూశివంశవార్ధి
కుదిని శ్రీసాధుభట్టార్య గురువరుండు
కడుముదంబున బ్రభవించి ఘనత కెక్కె
పుడమి మౌద్గల్యఋషిగోత్రపూజ్యుఁ డనగ.
| 36
|
క. |
నిరహేతుకకృపచేతను
సిరివరుఁడగురంగశాయి సిరు లింపొందనన్
కరుణాకటాక్షవీక్షణ
[7]గరిమన్ బ్రియపుత్రుఁ గాంచుకైవడి కూర్మిన్.
| 37
|
క. |
మును రంగశాయి యతిపతిఁ
గనుఁగొని కూరాధినాథుఁ గాంచి మఱింగం
టి నదెవ్వరన నాశో
భనగతి నాసూరిసాధుభట్టరుఁ డలరెన్.
| 38
|
గీ. |
పరమకృపచేత శ్రీరంగపతియె యిట్లు
నానతిచ్చిన శ్రీసూక్తి యన్వయమున
నిల మఱింగంటివారనేయింటిపేర
గురుశిఖామణు లెన్నఁగా బరిఢవిల్లె.
| 39
|
గీ. |
అట్టి శ్రీసాధుభట్టారకాహ్వయునకు
తనయుఁడై పిళ్లలోకార్యుఁడు జనించె
నతని కుదయించె పెరియపిళ్లాఖ్యగురుఁడు
శరధి నుదయించు ఘనసుధాకరునిబోలె.
| 40
|
సీ. |
ఆదేశికేంద్రున కాత్మజుఁడై భువి
రాజిల్లె శ్రీరంగరాయగురుఁడు
నతనికి దీర్థచారయ్యయు జన్మించె
పేర్మి యాఘనునకుఁ బెరియజియ్య
రుదయించె, సత్కీర్తిసదయు డామేటికి
సూనుఁ డై యామున సూరి బొడమె
గరిమతో నిమ్మహాఘనున కుద్భవమయ్యె
మాధవగురువర్యమహితయశుఁడు
నతని కుదయించె సకలరాజాధిరాజ
రాజమకుటాగ్రఘటితచిరత్నరత్న
బహుళనీరాజనాతివిభ్రాజితాంఘ్రి
సరసిజుంఁడు చెన్నయాచార్యచక్రవర్తి.
| 41
|
క. |
పాయక [8]నలందిఘళ్ నా
రాయణ జియ్యరుని మేనయల్లుండై య
త్యాయతకీర్తుల మించెన్
ధీయుత మఱిఁగంటి చెన్నదేశికుఁ డెలమిన్.
| 42
|
సీ. |
రాజపుత్రికఁ బూను రాక్షసుఁ బ్రోఁద్రోలెఁ
బెనుబాముముక్తికిఁ బెట్టఁబంపె
నవని బందొమ్మండ్ర యన్నలతో బుట్టి
హరిశీలఁబావనుఁ డగుచుఁ వెలసె
మనవాళయోగికి మఱియుద్దియై యుండె
వనదంతిచేతఁ బూజనము లందె
శాస్త్రోక్తినరటరచక్రవర్తులఁ గెల్చెఁ
బైకొన్న బెబ్బులిఁ బాఱనడఁచె
తననంతాళువారనఁ దనరునట్టి
యురగపతిసంతతిని దల్లి కుద్భవించె
విమలగుణవర్తి ప్రత్యేకవిష్ణుమూర్తి
చారుతరహేళి చెన్నయాచార్యమౌళి.
| 43
|
గీ. |
సిరుల దేవరకొండకు చేర్వ పణక
రాజుపల్లియగట్టుపై రాజు లెన్న
శ్రీమఱింగంటి చెన్నదేశికశశాంకుఁ
డహహ మఱిగంటి చెన్నరాయఁడన వెలసె.
| 44
|
ఉ. |
చెన్నుగ బ్రహ్మరాజపురి చెన్నుఁడు దా నిలవేల్పు గాఁగ నా
చెన్నునిబేరుఁ బూని సిరి జెందెడు దేవరకొండ సీమలో
సన్నుతపణ్కరాజు పలిశైలమునన్ మఱిఁగంటి చెన్నుఁడై
యెన్నిక కెక్కె భూజనము లెన్నగ నింటను దొడ్డపే రిడన్.
| 45
|
గీ. |
పుడమిలో పాచిపైకంబు ముడుచునారి
కింటి బొజుఁగన బిరుదు వహించు చెన్న
దేశికునకు తనూజు లై తిరుమలయ్య,
భట్టరుఁడు, సింగరప్పడుఁ బ్రబలి రందు.
| 46
|
క. |
సరసుఁడు భట్టరుగురునకు
తిరువేంగళసూరి గల్గె, ధీరాత్మునకున్
|
|
|
తిరుమలదేశికు, డతనికి
తిరువేంగళనాథ నామధేయుఁడు వెలసెన్.
| 47
|
వ. |
అమ్మహామహుని మహనీయప్రభావంబు వివరించెద.
| 48
|
సీ. |
కమనీయమై యొప్పుకలిమికి రారాజు
గాంభీర్యగరిమకు కంధిరాజు
రూపసౌందర్యాదిరూఢికి రతిరాజు
కడుధైర్యలక్ష్మికి గట్లరాజు
ఘనతరసత్కాంతికళలకు ద్విజరాజు
తథ్యవాక్యములకు ధర్మరాజు
విరివిగ సద్యోగవితతికి సురరాజు
ఘనభాగ్యగరిమకు కమలరాజు
పరమద్రావిడయాసూరివంశరాజు
గురుతరం బైన మౌద్గల్యగోత్రరాజు
చతురమఱిగంటి వేంగళాచార్యరాజు
రాజరాజాధి దేశిక రాజరాజు.
| 49
|
ఉ. |
దాపున నాయనంతగిరి, ధర్మపురీస్థలి, యూరుగొండ, గం
గాపురి, బ్రహ్మరాయపురి, కర్పర, రేబలె, యండబెట్ల, బా
చేపలి యాదియైన హరితీర్థములన్ గురురాయపట్టణ
స్థాపకుఁ డై జెలంగె బుధసమ్మతి వెంగళనాథుఁ డెంతయున్.
| 50
|
గీ. |
అట్టి వేంగళగురునియర్ధాంగలక్ష్మి
వరదయాగుణనికురుంబ వరదమాంబ
సిరుల సౌందర్యవిద్యావిశేషకళల
బలియు లైనట్టి యష్టపుత్రులను గనియె.
| 51
|
సీ. |
మత్తేభనరహయమనుజేంద్రమకుటాగ్ర
మిళితాంఘ్రియుగళుఁ డప్పలగురుండు
నిగమచేతస్తంత్రనిపుణార్ధసంపత్తి
నతిశయిల్లెడు వేంకటార్యమౌళి
|
|
|
సంగీతనాటకస్వరకల్పసాహిత్య
చిత్రకవియు నారసింహగురుఁడు
పరవాదికుమతుల పటుశాస్త్రహరణుఁ డై
రాజిల్లు కోనేటిరాయ శౌరి
వినుతశతఘంటబిరుదాంకవిజయుఁడైన
జగ్గగురుకాంతదేశికచంద్రునకును
ననుజుల గురంగ నరసింగరార్యఘనులు
నవని ప్రబలిరి; యే సింగరాహ్వయుండ.
| 52
|
మ. |
వరవందారుజనావళీహృదయసద్వాంఛార్థకృద్వేంకటే
శ్వరసంపూర్ణకృపాసుధామిళితవీక్షామాధురీమార్గవి
స్ఫురితైకైకదినప్రబంధరచనాస్ఫూర్జర్వచశ్రీశుఁడన్
నరనాగాశ్వనృపాలసభ్యగణితుండన్ సింగరాచార్యుఁడన్.
| 53
|
షష్ఠ్యంతములు
క. |
ఏవంవిధగుణవితతికి
దైవాధిపశాసితాభ్రదృఢజలధారా
గ్రావాశనిసముదయహృ
ద్గోవర్ధనశిఖరిధృతి కకుంఠితమతికిన్.
| 54
|
క. |
నక్షత్రాధ్యక్ష విరూ
పాక్ష సుధాక్షీరజలధి హర్యక్షమరు
ధ్వృక్షహిమక్షోణీంద్ర వ
ళక్షళరీరునకు సత్కళాసారునకున్.
| 55
|
క. |
అనిమిషనాథాదిదిశా
జననాయకమస్తకాగ్రసంఘటితమహా
ఘనముకుటరత్ననీరా
జనశోభితచరణునకు రసాభరణునకున్.
| 56
|
క. |
కరధృతగిరికిన్, రక్షిత
కరికిన్, భ క్తజనహృదయకంభవహరికిన్,
హరికిన్, కర్పరపురనర
హరికిన్, పదదళితకాళియాహ్వయఫణికిన్.
| 57
|
వ. |
సమర్పణంబుగా నాయొనర్పంబూనిన సీతాకల్యాణంబను నాంధ్రభాషా
నిరోష్యమహాప్రబంధరత్నంబునకు కథాసూత్రం బెట్టిదనిన.
| 58
|
కథాప్రారంభము
గద్య
ఇది శ్రీమత్కర్పరాచలలక్ష్మీనృసింహావతారవేంకటేశ్వర
వరప్రసాదలబ్ధసకలైశ్వర్యధురీణ ప్రసిద్ధసిద్ధసారస్వత
దశరథరాజనందనచరిత్ర నిరోష్ట్యాదివింశతి
ప్రబంధనిర్మాణపారీణ శారదాప్రశ్నవివరణ
శతఘంటావధాన, మౌద్గల్యగోత్ర
పవిత్ర తిరుమలదేశికపౌత్ర
తిరువేంగళాచార్యపుత్ర
మఱింగంటి సింగరాచార్య
ప్రణీతంబైన
సీతాకల్యాణంబను నాంధ్రభాషానిరోష్ఠ్యమహాకావ్యంబునందు
సర్వంబును దృతీయాశ్వాసము సంపూర్ణము.