శుకసప్తతి/ప్రకాశకవిజ్ఞప్తి

వికీసోర్స్ నుండి

ప్రకాశకవిజ్ఞప్తి

తెనుఁగుకావ్యములలో జాతీయజీవితమును బ్రతిబింబింపఁజేయుచు, శృంగారరసోల్లసితములగు కథలతో, జాతీయములతో, సరసకవితాధోరణితో రచితమైన “శుకసప్తతిని" మేము చక్కగ క్రీ॥ శ. 1935లో ముద్రించితిమి. అది అంతకుముందు ‘సరస్వతి’ పత్రికలో వెలువడిన ముద్రితప్రతికన్న అవతారికాది విశేషములఁ గలిగియున్నది. కాని కథలుమాత్రము విశేషముగ లభింపలేదు. ఈ నడుమనే మా ముద్రితప్రతులన్నియుఁ జెల్లిపోవుటచేత దీని ముద్రణము ఇపుడు చేయవలసిన యావశ్యకమేర్పడినది. ఆంధ్రసారస్వతవిమర్శకులలోఁ బ్రసిద్ధులు శ్రీ సురవరము ప్రతాపరెడ్డిగా రీగ్రంథముద్రణమునకు మమ్ము మిక్కిలిగాఁ బ్రోత్సహించి, ఉపోద్ఘాత వివరణములు వ్రాసి యిచ్చిరి.

ఇంతవఱకు ముద్రిత శుకసప్తతిలో చేరని పెక్కుకథలను గ్రొత్తవానిని శ్రీ నిడుదవోలు శివసుందరేశ్వరరావు గారు మాకు వ్రాసియిచ్చి ఈ గ్రంథసమగ్రస్వరూపమునకు తోడ్పడిరి. ఇప్పు డీగ్రంథములలో నున్నవిశేషకథ లీవఱ కెక్కడను తెలియరాలేదని చెప్పవచ్చును. మఱియు నీ కవికాలనిర్ణయమును చక్కగా మొదట నిర్ణయించిన శ్రీ నిడుదవోలు వేంకట రావుగారు, తాము ప్రకటించిన “కదిరీపతికాలము" అను వ్యాసము నిందులో చేర్చుట కనుమతి యొసంగిరి. విపులమగు నుపోద్ఘాతమేగాక విశేషపదములపట్టిక అర్థసహితముగ నిందుండుటచే నీ ముద్రణము ఆంధ్రమహాజనుల నాకర్షించునని నమ్ముచున్నాము. ఈ గ్రంథప్రకటనమున మాకుఁదోడ్పడిన పై వారల కందఱకు మాకృతజ్ఞత నిందుమూలముగఁ దెలుపుచున్నాము.