శుకసప్తతి/ఎనిమిదవకథ

వికీసోర్స్ నుండి

యతఁడు ప్రార్థించి పుత్తేర నరుగుదెంచెఁ
బొలఁతిచెంతకు నంతకుఁ బ్రొద్దుగ్రుంక. 95

ఉ. గందపుఁబూతఁబోలు ఱవికందగగుబ్బలమీటు హారపుం
జందెపువాటుమాటు బురుసాపని పయ్యెదనీటుఁ జాటునే
యందగు మేల్ముసుం గమర నల్ల బ్రభావతి వచ్చె మీనుడాల్
పొందినరాచవాని యొఱలోనికటారిఁ దుటారమాడుచున్. 96

ఉ. వచ్చినఁ జూచి కీరమురువారముమీఱ ముఖారుణద్యుతుల్
బచ్చెనపన్న నానృపతిపాలికిఁ బోయెదవేమొ పొమ్ము నీ
యిచ్చకు వచ్చినట్లు రమియింపు మొకానొక మాటపుట్టినన్
నెచ్చెలి లేదుబంతియను నేర్పున దిద్దుకొనంగఁ జాలినన్. 97

చ. వదినెలపోరు మాన్ప నిజవల్లభు నిద్దురపుచ్చ మామనో
రదమఁగ నత్తగారికి భయం బొనరింప మఱందినూరకే
గదమఁగఁ దోడికోడలి కొకానొకనింద ఘటింపవచ్చుఁ బో
కదిసిన నేర్పుచేత బెళుక న్వెరవొందిన జారకాంతకున్. 98

ఎనిమిదవకథ

ఉ. ఇందుల కొక్కగాథ గల దింతటిలోఁ బతి పాఱిపోవఁడో
యిందునిభాననా వినుమ యిందిరకుం దిరమైన యిల్లు సం
క్రందనరాజధాని కెనగాఁ దగుశూరవరావలోక మా
రందసమాఖ్యచే నొకపురంబు పరంతపరాజు ప్రోవఁగన్. 99

తే. అచట జనవల్లభుండన నమరు నొక్కఁ
డంగసౌష్ఠపమున రతి యౌననంగ
నలరు మెండైన నిండుప్రాయంబుకలిమి
రస్తుమీఱుచు నాతని గేస్తురాలు. 100

తే. వీటఁగల కోడెకాండ్రెల్ల వింతరతుల
జవుల మరగించి భయము లజ్జయును దీర్చ
జారవిద్యలఁ గడు గడిదేఱి యామి
టారి విడివడ్డమరుతేజి దారిమీఱి. 101

క. తిండికతంబునఁ గండలు
మెండుగఁ దాఁ బెంచి మగఁడు మెదలఁ డనుచు ను
ద్దండత నది మిండనికిన్
వండిన కుడు మనఁగ దుడ్డువైఖరి మెలఁగున్. 102

చ. పలుమఱు నేటినీటి కని బానిసఁ బిల్చెద నంచు ఱోలురో
కలికని కూరగాయ కొనఁగావలె నంచొకలేనికార్యమే
పలుకుచుఁ గోడెకొండ్ర కనుపండువుగా నడయాడువీథిన
వ్వల నిఁక మాట లేల తలవాకిటఁ గాఁపుర మయ్యె దానికిన్. 103

చ. కలయని వింతవాఁ డెదురుగా నడతేరఁగ డాసి యవ్వలం
బెళుకుచు నమ్మచెల్ల తరుణీ చెఱఁగించుక సోఁకె దానికిం
దలఁపున నేమిసేయునొకదా యని నెచ్చెలితోడఁ బల్కి మె
చ్చులు దులకింప వాఁడు తనుఁ జూచినఁ బక్కున నవ్వు వీథులన్. 104

తే. తనదుచిన్నెలకై యాసఁ దడవు సేయ
నడుగవచ్చిన మనసురానట్టివారి
రట్టుగావించి మగనాలిఁ బట్టడాసి
తౌర మొఱ్ఱో యటని దుమ్ము తూరుపెత్తు. 105

క. కంటికి బ్రియమగువానిన్
గెంటని తమకమునఁ గామినీభూత మనన్
వెంటఁబడి కౌఁగిలింపక
నింటికిఁబో దవ్వధూటి కెంతటి తమియో. 106

క. పతిఁ బ్రక్కఁ బండినప్పుడు
రతి కొంగక నిదురవోదురా యయ్యో నా
చతురుఁడ గుఱకలు చాలున్
గతి చెప్పు మటుంచు వానిఁ గడు బాధించున్. 107

క. ఇట్టివగనడుచుతనవగఁ
జుట్టములకుఁ దెలుపు మగని సుద్దులు విని యా
దిట్ట చని వారితో మఱి
యెట్టువిడుం దన్ను నాథుఁ డొల్లఁడటంచున్. 108

తే. మఱియు నమ్మాయలాఁడికోమటినెలంత
లందఱును గువ్వకోల్గొని యగడుసేయ
వారిఁ గూర్చుండఁబెట్టి నావర్తనంబు
దెలియదే కద మీకంచుఁ బలుకఁ దొడఁగు. 109

ఉ. అన్నెముపున్నె మే నెఱుఁగనమ్మ మతిం బతి నాదుపాలికిం
బెన్నిధి గాఁగఁ జూతు మెఱమెచ్చులుగా వొరునెట్టివాని నే
గన్నులనైనఁ జూడ నిది కల్లయొ సత్యమొ చూచుచున్నవాఁ
డన్నలినాప్తుఁ డింకొకటి యారజ ముట్టిపడ న్మెలంగుదున్. 110

తే. అట్లు మెలఁగుట యేమిటి కంటిరేని
నింక నెక్కడిసిగ్గు మాయింటియతని
కాసపుట్టింప మెలగుదు నట్టులయ్యు
బూచివలెఁ జూచుననువానిఁ బొడిచిత్రోయ. 111

చ. కలిగినవాఁడుగా మరునికన్నను వన్నియగల్గువాఁడుగా
కులమున మేటిగా సవతిగోరము గానమటంచు నెంచి వే
డ్కల కెదురేగుదు న్మగఁడు గల్గియు లేనివిధంబు సేసీ తా
నెల గలనైన నన్నుఁ గరుణింపఁడు భోగమువారిపొందునన్. 112

క. నాసుద్ది యింతగని మది
దోసమనక తనదుసెట్టి తొత్తులకేమో
బాసలఁట బండికండ్లట
చేసన్నఁట విన్నవారు చెప్పిరి నాతోన్. 113

తే. పాన్పు కెక్కించి తన ప్రక్కఁ బవ్వళింప
గోరి నేఁ జూడ ఱేలు తాఁగుడిచి కట్టి
యూరకే యిల్లు వెడలు నాయుసుఱు తాఁకి
దీపములుసైత మల్లాడుఁ దెఱవలార. 114

సీ. పతిపత్నినని మేనఁ బసుపు పూసికొనంగ
సొగసులాయని ముంతపొగ ఘటించుఁ
బెనిమిటి గలదాననని కాటుక ధరింప
వేడుకలా యంచు విఱిచికట్టు
ముత్తైదువనటంచుఁ బత్తి బొట్టు వహింప
జిన్నెలాయని కాలఁజేతఁ బొడుచు
ధవసంగత నటంచుఁ దులదువ్వి ముడిచిన
మురువులా యని ముడ్డిమూతి నులుచుఁ
తే. బొలుపు దిగనాడి నే చిన్నఁబోయియున్న
నతని కెక్కడ కీడౌనొ యనుచు నాతఁ
డెంతచేసిన నేమాన కింటఁగలుగు
సొమ్ము మెయిఁబూని కాననిచోటుఁ గందు. 115

క. ఇల్లీలనుండ నింటం
బల్లియు నను జౌకసేయు పలుకులు వినరే
యెల్లెడ లోకములో మగఁ
డొల్లనియాసతిని మారి యొల్లదనంగన్. 116

ఉ. నాకనరాదుగాక మలినత్వము పోగయి సేయు జోకలన్
రేకల నన్నుఁ బోలఁగలరే కలకంఠులు నేరరా యయో
పోకలు వారబాలికల పోలిక వారలమాయచేత నన్
జౌక యొనర్చునాథుఁ డది చాలక దిట్టును గొట్టు నెప్పుడున్. 117

చ. కటకట నన్ను దూఱెదరుగాక వివేకము లేక మీకు ని
చ్చట మగవారు లేరెకద చర్చయొనర్పఁగ నాఁడుదాని కే
మిటికని నాథుఁ గూర్చువిధి మీర లెఱుంగరె యిట్టిపోఁడి మే
యటమటమైనఁ దాళవశమా నెఱప్రాయపుఁబూవుఁబోడికిన్. 118

క. అని చిత్తిని మగఁడొల్లని
తను వేటికిఁ దనకటంచు దయవుట్టఁగ బో
రున బాష్పంబులు తెలిగనుఁ
గొనలం గురియంగ గోడుగోడున నేడ్వన్. 119

తే. వార లెల్లను బంగారువంటి నిన్నుఁ
బాసి పలుగాకులకుఁ గొంగుపఱచు చెలుల
నంటివర్తింప వాని కేమాయె ననుచు
నంతయు నిజంబనుచు నిండ్ల కరుగు నంత. 120

క. జనవల్లభుండు బాంధవ
జనముల వెసఁగూర్చి భార్యచందము దెలుపన్
విని వారంద ఱిదేమని
నెనరున గద్దింపఁ జిత్తినీసతి కడకన్. 121

తే. ఇంత యేటికి నీరేయి నితఁడు పడుక
టిల్లు వెలువడి యెక్కడి కేగుఁ దలుపు
మూసి గడియ బిగించెద మోసపోక
తెల్లవాఱిన మీరది తెలిసికొనుఁడు. 122

క. ఏనిల్లు వెడలిపోయినఁ
దాను గవాటంబె మూయఁదలఁడె యంతన్
దానం దెలియదె తనవగ
నా నేరము సెప్పఁడేటి నగుఁబా టిచటన్. 123

క. అన విని వారిది యగునని
చనుటయు నానాఁటిరేయి శయ్యపయి న్నా
థునిప్రక్క నుండి తమి రేఁ
గినఁ జిత్తిని చనియెఁ దలుపు గిఱు కనకుండన్. 124

తే. అంత నిద్దుర లేచి వైశ్యాగ్రగణ్యుఁ
డనుఁగుటిల్లాలు లేకుంటఁ గని కవాట
బంధన మొనర్చి తానుండెఁ బాన్పుమీఁదఁ
బంత మీడేఱె ననుచున్న యంతలోన. 125

చ. చనుఁగవజోడుపో టొకభుజంగునకుం బదఘాత మొక్కజా
రునకుఁ గటాక్షనీలమణిరోచు లొకానొకతేరకానికి
న్మనసిజకేళి యొక్కయుపనాథునకు న్గలిగించి వేగుజా
మునఁ జనుదెంచెఁ జిత్తిని సముజ్జ్వలకేళిగృహంబుఁ జేరఁగన్. 126

తే. వచ్చి యరదనిరోధంబువలనఁ జూచి
కాంతుచేష్ట యెఱింగి చేగడియ దివియఁ
గూడ దెత్తఁగరాదింకఁ గోరివచ్చు
చెనఁటిచుట్టాలచేత బజీతనగుదు. 127

క. అని యెంచి వరుని వాకిటిఁ
కనుపం దానిల్లుసొచ్చి యరరముమూయం
దనతప్పుఁ దప్పఁ జిత్తిని
వనిజా యేత్రోవ త్రొక్కవలయుం జెపుమా. 123

తే. అనఁ బ్రభావతి రసభంగ మగు నిదేల
మాటిమాటికి నడిగి నామన్కిఁ గొనఁగ
వినఁగఁ జిడిముడి పడియెడువీనుదోయి
చిలుక నాతోడ నీవది తెలుపు మనిన. 129

ఉ. కీరము కెంపుసొంపునడఁగించు మెఱుంగులముక్కుటెక్కు చె
న్నారఁగఁ బల్కుఁ కల్కి విను మత్తఱిఁ జిత్తిని చిత్తవీథిలో
ధీరతఁ బూని లేని తెగదెంపు వహించుచుఁ బల్కె నల్కతో
నేకము లేనిదానికరణి న్బతి యింపున నాలకింపఁగన్. 130

తే. వెడలిపోయితి నివ్వీథి వెంట నరుగు
పెండ్లివారలఁ జూడ నాపిన్నతనము
గూల నింతటిలో పట్టి కోపమెత్తి
తలుపు బిగియించె మగఁడేమి తలఁచినాఁడొ! 131

క. చుట్టాలచెంత నాకున్
ఱట్టొనరింపంగఁ దలఁచెనా యందుకు వా
రెట్టును జాలరెకా సడి
గట్టఁగలరె నొసటఁ గన్ను గలవారైనన్. 132

ఉ. ఏనటువంటిదాననే యహీనపతివ్రత నేను గల్గఁగా
వానలుఁ బంటలుం బుడమి వర్తిలు నింత యెఱుంగలేక తా
నే నను రవ్వచేసినఁ దృణీకృత మింతె శరీర మొక్కమ
ట్టైన ననూనదుఃఖ మెనయన్ దన కాఁపుర మెత్తిపోవదే. 133

క. కానీ బహుతరతోయా
నూనంబైనట్టి బావి యున్నది నేను
న్నానంచు మిగులఁ జప్పుడు
గానపుడే యగ్గయాళి గ్రక్కునఁ జనియెన్. 134

క. చని నూతిలోపల గుభు
ల్లన నొకగుండెత్తి వైచి యల్లనఁ గనుచా
టున నిలువఁబడియె నిజమని
జనవల్లభుఁ డాత్మలో విచారముమీఱన్. 135

క. ఎత్తెదగాకని చనియె
న్మత్తచకోరాక్షి కేళిమందిర మపుడు
ద్వృత్తిఁ జొరబాఱి మూసిన
ముత్తెమువలెఁ దలుపు మూసి మొక్కలమిడియెన్. 136

క. అదిగని నివ్వెరఁగున నె
మ్మదిగానక తద్వరుండు మ్రాన్పడియుండెం
జదికిలఁబడి యంతట రవి
యుదయించిన వచ్చి బంధు లొక్కటఁ జూడన్. 137

తే. వారితో నది యోయన్నలార కంటి
రా వితవితగ నన్నింత ఱట్టు సేసి
తానె తొత్తులకాంక్ష మదంబుకతన
నిల్లుపట్టక తిరిగెడు నివ్విధమున. 138

క. అని పలుక వార లలుకన్
జనవల్లభుఁ దిట్టి వానిజాతికి వెలిగా
నొనరించిపోయి రోచ
క్కనికొమ్మా యింతనేర్పు గలిగినఁ బొమ్మా. 139

క. అనినఁ బ్రభావతి తనయా
త్మనె యౌరా యాఁడువారి తల్లియ యనిచి
త్తిఁనిఁ బొగడి తెల్లవాఱుటఁ
గని చనియెం గేళిలసదగారంబునకున్. 140

వ. చని యథోచితవిధంబునం బ్రవర్తిల్లె దదనంతరంబ క్రమంబున. 141

చ. హరనటనాతివేగగళితాలికలోచనవిస్ఫులింగమై
సరసిజబంధుఁ డస్తగిరిచక్కటి వ్రాలఁ దదీయకీచకో
త్కరములు గాలు క్రొందగుపొగల్బలెఁ జీకఁటి పిక్కటిల్లె నం
బరమునమించుఁదత్తృటితమౌక్తికముల్బలెఁ జుక్క లొప్పఁగన్. 142

చ. అపుడు ప్రభావతీరమణి హారమణీఘృణిధోరణీప్రసూ
నపటలయు న్వినీలవసనభ్రమరాళియు నై లతాకృతిం
గపురువహించి వచ్చిన శుకంబు “మనోరథసిద్ధిరస్తు తే
చపలవిలోచనే” యని యసహ్యపుదీవన నిచ్చి యిట్లనున్. 143

తొమ్మిదవకథ

ఉ. వింటివె యొకవింతకథ వీనుల కింపు ఘటింపఁజాలు ని
ష్కంటకరాజమౌళి దొరగా విదిశాపురి మించు నందు నే
వెంటఁ గొఱంతవోని పృథివీసురుఁ డొక్కఁడు సోమశర్మ పే
రింట నెసంగు భార్యయయి రేవతిపేరి వధూటి గొల్వఁగన్. 144

సీ. గాదెలఁ గొలుచు ముక్కారుఁ బండెడు మళ్లు
నత్తోఁపు నడబావు లండ దొడ్డి
యాకుఁదోఁటలగుంపు పోఁకమ్రాకులు గుత్త
చేలు గొఱ్ఱలకదుపొలమంద
చెఱకుగానుగ మొద ల్జెడక వర్ధిలు నేర్పు
బానిసె ల్బడవాళ్లు బంటుపైద
పారిగోడలు గొప్పపడసాల మేల్మచ్చు
గారముంగిలి వింతగాని పొరుగు