శుకసప్తతి/ఇరువదియవకథ

వికీసోర్స్ నుండి

ముప్పవుఁగదా యనిన నప్పడంతి తప్పక కనుంగొన నప్పతత్రిగోత్రారి యిట్లని చెప్పందొడంగె. 224

ఇరువదియవకథ


ఉ. ఉజ్జయినీపురంబు మెఱయు న్మణిహర్మ్యశిఖావిహారియో
షిజ్జన మొక్కచో జలము చేఁదికొనం దలవాంచఁ దన్ముఖో
ద్యజ్జలజాభియాతికి భయంపడి దేవనదీరథాంగముల్
పజ్జ ముడుంగఁ బాఱుఁ బృథుపద్మకుడుంగములం దడంగగన్. 225

ఉ. ఆపుర మేలు పూర్ణకరుణాభరణుం డగువిక్రమార్కుఁడు
దీపితమంత్రశక్తి గడిదేఱిన భట్టి యుపాయ మాత్మబా
హాపరిపాలితం బటుసమగ్రశుభప్రతిపాదిగా బుధ
స్థాపకదానలక్ష్మి యను దాది యశోరుచికన్య బ్రోవఁగన్. 226

ఉ. ఆతని కొక్కమంత్రి గలఁ డద్భుతశీలుఁడు పుష్పహాసవి
ఖ్యాతుఁ డతండు నవ్విన లతాంతపువాన యెసంగు నిస్తులా
స్తోతకరాద్భుతక్రియలు చూచినయప్పుడు మానసైకశో
కాతిశయంబు బల్మిని దదాస్యము హాస్యము గాన దెన్నఁడున్. 227

తే. అంత నొకనాఁడు విక్రమార్కావనీంద్రుఁ
డంతిపురమునఁ గదళిక యనేడు పేరఁ
దనరు మోహపురాణియుఁ దానుఁ గూడి
పొత్తుల భుజింపఁగా నొక్కబోనకత్తె. 228

తే. ఒఱపు దనరారఁ జేఁపలయూర్పుఁగూర
యిడినఁ గదళిక చే యెగనెత్తి యాస్య
మవలగాఁ ద్రిప్పి యిదియేమి యారగింప
వనెడు పతిఁజూచి రానిజంకెనలు నిగుడ. 229

ఉ. ఎన్నఁడు నిన్నెఁ గాని పరునెన్నఁడుఁ గన్గొన గండుమీల ని
ట్లెన్నిక లేక యంటి భుజియింపఁగవచ్చెఁ బతివ్రతాత్వసం
పన్నిధినైన నాకనుచుఁ బల్కిన పళ్ళెరమందు ద్రుళ్లియ
క్కన్నులకల్కిమాటకుఁ బకాపక నవ్వే విపక్వమీనముల్. 230

క. నవ్వినఁ గనుఁగొని పొదివిన
నివ్వెరచేతులను వార్చి నృపవరుఁ డంత
నివ్వటిలు సందియంబున
జవ్వాడుమనంబుతో హజారముఁ జేరెన్.231

తే. చేరి మంత్రుల రావించి చిన్నఁబోవు
మొగముతోడుత నద్భుతంబును వచింప
నేల నవ్వెనొ యుడికినమీలు తెల్పు
డనుచు గద్దించి యడుగ నయ్యలఘుమతులు. 232

క. ఇదియేమొ యిపుడు తెలియదు
గద తగ వివరించి చూడఁగాఁ దోఁచినచోఁ
బదపడి చనుదెంచియు విని
చెదమన వారలకు నృపతి సెలవిచ్చుటయున్. 233

క. పనిచినఁ జనువారలలో
ఘనబుద్ధి యనంగఁ బేరుగలమంత్రి గృహం
బున కరిగి హాస్యహేతువుఁ
గననేరక వగలఁబొగులగా నట్టియెడన్. 234

క. బాలసరస్వతి యతిమతి
శాలినియగు మంత్రితనయ చనుదెంచి యిదే
మాలోచన యని యడిగి త
దాలాపములెల్ల విని మహాద్భుతమతియై. 235

వ. తన్మత్స్యహాసంబునకుం బూర్వంబునం బ్రవర్తిలిన కదళికావిక్రమార్కులవాక్యంబు లామ్రేడితంబుగా విని యంజనముఖంబున నిక్షేపంబునుంబోలె మనీషాబలంబునం దత్కారణం బెఱింగి యయ్యా యీయాశ్చర్యంబు వధూశాంబరీవిడంబనంబునం బొడమినయది పాముజాడ పామునకుంగాని పరులకుం దెలియఁబడని తెఱంగున నంగనలకుంగాని యిత్తెఱంగుఁ గనుంగొన మీకుఁ గొలఁదిగా దీగుట్టు బట్టబయలు గావించినం బాపంబు ప్రాపించుఁ గావున విజనాంతరంబున నుపాయంబున భూనాయకున కేఁ దెలిపెద నని యజ్జనకునివెంట వసనాచ్ఛాదితాందోళికారోహణంబునం దెరమఱుంగునం గూర్చుండి యక్కురంగనయన యనుప్రసంగంబు దిగిచి రాజపుంగవుతో నిట్లనియె. 236

తే. విక్రమార్కేంద్ర సర్వజ్ఞ చక్రనర్తి
వయ్యు నిక్కార్య మనయుల నడుగఁదగునె
యడిగితేని నిజోదంత మవల నొడివి
యడలు పద్మినిఁ బోల్పఁ బట్టగుదువీవు. 237

వ. అనుచుం బల్కెఁ దదనంతరంబు ప్రభావతీరమణీమణి యరుణోదయంబుఁ గాంచి కేళీనిశాంతంబున కరిగి యానాఁటిరేయి భూనాయకుపొందు డెందంబునం దలంచి యానందంబునఁ గందర్పశాంబరీమత్తవేదండంబు చందంబున మందమందగమనంబునం జనుదేర మన్మథతురంగంబు గనుంగొని యంతరంగం బుప్పొంగ నయ్యంగనామణి కిట్లను న ట్లాబాలసరస్వతియు నావైసారిణహాస్యంబు నాకారరేఖాపరాభూతకుసుమశరాసనుం డగునారాజన్య మూర్ధన్యుతో నుపమానంబుగా యవనికాభ్యంతరంబున నుండి చెప్పందొడంగె నీవు నాకథ వినుము మఱి పోదువు గాక యని యప్పతంగపుంగవం బిట్లని చెప్పందొడంగె. 238


క. ఆకథ యేలాగనినఁ బ
రాకు విశాలం బనాపురం బోకటి తగుం
గాకోదరయువసౌథా
నీకాయతకమలఖేయనిరుపమ మగుచున్. 239

క. అందొక శూద్రుఁడు సుమతి య
నం దగుఁ బద్మిని యనం దనర్చిన పరిపూ
ర్ణేందువదన యిల్లాలుగఁ
బెందెవులుం బోని లేమి పెటపెటఁ బేల్పన్. 240

సీ. చేయప్పు లనుచు నిచ్చినవారు కటువుగా
నడుగ నుంకించి నోరాడ కరుగ
నెనరైనజుట్టాలమనుచు వచ్చినవారు
బడలిక చేతఁ జెప్పకయె చనఁగ
నాయవారంబున కనుచుఁ జేరినవారు
పరిహసింపక మున్నె తిరిగిపోవ
నెక్కలె జోగంచు నేతెంచువారు మా
టాడి చూడక వేగ మవలికేగ
తే. శిశువు లెల్లను గలవారి చిన్నవాండ్రు
తినెడి చిఱుతిండి గని యది తెమ్మటంచు
గీజుపోరుట కెదఁ బెల్లగిల్లఁ బొగిలి
పొలఁతి యూరార్ప నతఁడు కాఁపురము సేయు. 241