శివలీలావిలాసము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శివలీలావిలాసము

ప్రథమాశ్వాసము

ఇష్టదేవతాప్రార్థనము



నగజాఘనస్తనవిసృత్వరసంకుమదైణనాభిసం
కానిశవాసితస్ఫుటభుజాంతరుఁ డిందుసుధాపయస్పదృ
గ్భూనుతకీర్తి పీఠపురకుక్కుటలింగమహాప్రభుం డశే
షానతభక్తపాలనపరాయణుఁ డీవుత మా కభీష్టముల్.

1


క.

మగనిసగమేన నెలకొని, ముగురంబలయందు నాదిమూలం బగుచున్
జగ మేలు సర్వమంగళ, జగమే లిడుఁగాత మాకు సమ్యక్కరుణన్.

2


ఉ.

శ్రీరమణీరమేశ్వరులఁ జిత్తమునం గదియించి భారతీ
సారసగర్భుల న్మిగుల సంస్తుతిఁ జేసి మతంగజాననున్
సారెకుఁ గొల్చి దెందులురిసత్కులపావను లింగనార్యు నిం
పారఁ దఱంచి మున్నిటిమహాకవుల న్భజియించి వేడుకన్.

3

కవివంశాభివర్ణనము

సీ.

కౌండిన్యగోత్రవిఖ్యాతుండఁ గూచిమంచ్యన్వయాంభోధినీహారకరుఁడ
గంగనమంత్రిశేఖరునకు నంగనామణి యగులచ్చమాంబకును సుతుఁడ
బహుకార్యనిర్మాణబంధురప్రతిభుండఁ గుక్కుటేశ్వరకృపాకూరలబ్ధ
సత్కవితామహాసామ్రాజ్యభారధౌరేయుఁడ బుధజనప్రియచరితుఁడ


తే.

దెందులురి లింగనారాధ్య దేశికేంద్ర, దత్తమాహేశ్వరాచార్యవృత్తిరతుఁడ
గందరాడఘనగ్రామమందిరుండఁ, దిమ్మకవిచంద్రుఁ డను జగద్వినుతయశుఁడ.

4


సీ.

ప్రౌఢి మై రుక్మిణీపరిణయంబును సింహశైలమాహాత్మ్యంబు నీలపెండ్లి
కథయును రాజశేఖరవిలాసంబును నచ్చతెనుంగురామాయణంబు

సారంగధరనరేశ్వరచరిత్రంబు సప్తార్ణవసంగమాహాత్మ్యకంబు
రసికజనమనోభిరామంబు లక్షణసారసంగ్రహమును సర్పపురస


తే.

మంచితక్షేత్రకథనంబు మఱియుఁ బెక్కు, శతకదండకసత్కృతుల్ ప్రతిభఁ గూర్చి
యుల్ల మలరారఁ బార్వతీవల్లభునకు, భక్తి నర్పణఁ జేసినభవ్యమతిని.

5


వ.

ఇట్టి నేను మదభీష్టదైవతం బైనకుక్కుటేశ్వరశ్రీమన్మహాదేవునకు నంకితంబుగా
మఱియు నొక్కప్రబంధంబు రచింపం దొడంగి.

6

షష్ఠ్యంతములు

క.

సర్గాపసర్గఫలదని, సర్గునకున్ భర్గునకుఁ బ్రశమితమహాంహో
వర్గునకు సూరినతస, న్మార్గునకు మనోజ్ఞసాను మద్దుర్గునకున్.

7


క.

అంభోజాసనమదసం, స్తంభునకున్ శంభునకు నుదంచితకరుణా
రంభున కఖిలావనసం, రంభునకు మందితమౌనిరాడ్డింభునకున్.

8


క.

సర్వసుపర్వకదంబక, పూర్వునకున్ శర్వునకును భుజబలలీలా
ఖర్వునకు శమితయమరా, డ్గర్వునకు మహోక్షరాజగంధర్వునకున్.

9


క.

బాణాదిభక్తజనసం, త్రాణునకున్ స్థాణునకు నుదంచదుదన్వ
త్తూణునకు సరసిజేక్షణ, బాణునకున్ సత్యవాక్యపరిమాణునకున్.

10


క.

సామజదానవదర్పవి, రామునకున్ సోమునకును రజతమహీభృ
ద్ధామునకుఁ గోటిదినకర, ధామునకు మహోగ్రసమరతలభీమునకున్.

11


క.

పురదైతేయస్మరసం, హరునకు హరునకు నిరంతరాత్యంతదయా
పరునకుఁ బీఠాపురమం, దిరునకు శ్రీకుక్కుటేశదేవవరునకున్.

12


వ.

సమర్పణంబుగా నారచియింపం బూనిన శివలీలావిలాసం బనుశృంగారరసప్రబం
ధంబునకుం గథావిధానం బెట్టిదనిన.

13

కథాప్రారంభము

గీ.

హస్తిపురమున నొక్కనాఁ డర్జునుండు, భీష్ముఁ గన్గొని మ్రొక్కి సంప్రీతిఁ బలికెఁ
దాత ని న్నొక్కపుణ్యకథాప్రసంగ, మడుగఁ గోరెదఁ గృపతోడ నాన తిమ్ము.

14


క.

నీ వెఱుఁగనిపుణ్యకథల్, క్ష్మావలయమునందు లేవుగద యేవైనన్
భావింపఁగ నఖిలజగ, త్పావని యగుగంగమహిమఁ బ్రతిభం జెపుమా.

15


ఆ.

శివుఁడు గంగ నేల శిరమున నిడుకొనె, గంగ విష్ణుపాదకమలమున జ
నించు టెట్లు తాత నిక్కంబుగా నిది, తేఁటపడఁగ నాకుఁ దెలుపవలయు.

16


వ.

అదియునుం గాక.

17

గీ.

గంగఁ గొందఱు జాలరికన్నె యనుచు, నెన్నుచుండుదు రమ్మాట యేర్పడంగ
వినఁదలంచెద నమ్మహావేణి కీవు, కూర్మిపట్టివి గద లసద్గుణకలాప.

18


గీ.

అనిన గాంగేయుఁ డప్పాండుతనయుఁ బలికె, వత్స నే మున్ను నారదువలన విన్న
తెఱఁగు నీ కిప్పు డెలమితో నెఱుఁగఁ జేతు, నింపు దైవార విను మని యిట్టులనియె.

19


ఆ.

మొదలఁ గమలగర్భుఁ డుదకంబుల సృజించి, వీర్య మందులోన విడిచె నది స
హస్రకరనిభప్రభాంచిత మై హిర, ణ్యస్వరూప మైనయండ మయ్యె.

20


వ.

అయ్యండంబునందుఁ జరాచరాత్మకం బైనసకలప్రపంచంబు సృజియించి వృద్ధిఁ
బొందింపుచుండె నంత.

21


గీ.

మూషికాసురుఁడను సురద్వేషి యొకఁడు, దూఱి యయ్యండమున కొకతూటు వొడిచె
నందువలన మహోదకం బద్భుతంబు, మీఱఁ బెనువెల్లియై చొచ్చి పాఱుచుండె.

22


క.

ఆవెల్లి జగము లన్నియు, వేవేగ న్ముంచి జంతువితతికి నెల్లన్
వావిరి నుపద్రవంబుం, గావింపుచు నున్న నీలకంఠుఁడు పేర్మిన్.

23


గీ.

జగదుపద్రవశాంతికై తగిలి మున్ను, కాలకూటంబుఁ గంఠభాగమున నిడ్డ
చందమున నమ్మహాంబునిర్ఝరము నెలమి, దనజటాజూటవీథి నందముగఁ దాల్చె.

24


గీ.

అపుడు గంగ మహేశుజటాగ్రవీథి, బట్టఁజాలక యుప్పొంగి పైకిఁ బొరలి
ఘనతరంగిణి యై దూఱి కమలజాండ, వివరమున బాఱఁ జగుదుపద్రవము గాఁగ.

25


గీ.

హరియు నయ్యెడ మూషకాసురు వధించి, తనపదాంగుష్ట మబ్బిలద్వారసరణి
నునిచి నీ రాఁచె సందుననుండి యూఁట, యించు కాలోపలికిఁ బ్రవహింపుచుండె.

26


వ.

ఆప్రవాహంబు సకలభువనంబులఁ బవిత్రంబుగా గంగాభవాని యేకార్ణవం
బుగ జగంబు లన్నియు ముంచి లోజంతుకోటిజలచరంబులక్రియ మించి
చెలంగి పొంగి.

27


క.

తన కెదు రెవ్వరు లే రని, మునుకొని గర్వాతిరేకమునఁ బలికినన
వ్వనితారత్నము గనుఁగొని, కినుక మదిం బెనఁగొనంగ గిరిశుఁడు పలికెన్.

28


గీ.

ఆఁడుదానవు నీ కిట్టు లబ్బురంపు, గర్వ మేటికి నాచేతఁ గమలసంభ
వాదులును మున్ను గర్వించి యడఁగి చనిరి, గర్వ మెంతటివారికిఁ గాదు సుమ్ము.

29


క.

భూచక్రంబున కిప్పుడె, వే చని నీ వందు మత్స్యవిక్రయవృత్తిన్
ప్రాచుర్యంబుగ మనియెడు, నీచకులంబున జనించి నిలువుము చెలియా.

30


గీ.

అనిన నళుకొంది గంగ యోయనఘచరిత, తప్పు సేసితి లొంగి నీదయ దలిర్పఁ
గాచి రక్షించు నన్నెదఁ గాఁక యిడఁగ, నిన్ను నెడఁబాసి క్షణమైన నిలువఁజాల.

31

క.

నావుడు శంకరుఁ డిట్లను, నీ వటువలెఁ గొన్నినాళ్లు నిలిచిన పిదపన్
దేవత లెన్నఁగ నిన్నున్, దేవేరిగఁ బెండ్లియాడి తెచ్చెద మరలన్.

32


వ.

అని పరమేశ్వరుం డానతిచ్చిన నట్లనె గంగాభవాని దాసకులకన్యాస్వరూ
పంబు ధరియించి భూలోకంబునకు వచ్చి పారావారతీరంబున మహేశ్వరుం
గురించి తపం బాచరింపుచుండె నంత.

33


సీ.

శంఖదేవుం డనుజాలరిగేస్తుండు దనబంధువుల దానుఁ దవిలి యొక్క
నాడు దా నేలూరినగరంబునందుండి జలధికి వేఁటాడఁ జని యొకయెడఁ
దపముసేయుచు నున్న తరళాయతేక్షణఁ జిన్నికన్నియఁ జూచి చేరఁబోయి
తల్లి నీ వెవ్వరిదానపు కుల మెద్ది తలిదండ్రు లెవ్వారు కులము పేరు


గీ.

నెద్ది తప మేల చేసెద విచట నిట్లు, సరసిజానన నాకు నీచందమెల్లఁ
తెలియజెప్పు మటన్న నక్కులికిమిన్న, యింపు దళుకొత్త నతనికి నిట్టు లనియె.

34


గీ.

తండ్రి విను మేను గంగను దక్షహరుఁడు, నన్ను నొకకారణమున డెందంబులోని
నలిగి జాలారికన్నియ వై జనించు, మని శపించిన వచ్చి యి ట్లైతి జుమ్ము.

35


గీ.

తల్లి యైనను విను మఱిఁ దండ్రి యైన, నీవె కా నింక నన్యుల నే నెఱుంగ
నెవ్విధంబున సాఁకెదొ హితముతోడ, ననిన ముద మంది యతఁ డిట్టు లనుచు బలికె.

36


అమ్మ నీ వేమి గోరిన నట్ల సేతుఁ, గలవు మాయింట సకలభాగ్యంబు లిపుడు
రమ్ము నాతోడ మాభవనమ్మునకును, జీవనప్రాయముగఁ జూతుఁ జెలియ నిన్ను.

37


క.

రావమ్మ భువనపావని, రావే నాముద్దుబిడ్డ రావె లతాంగీ
రావే శుభఫలదాయిని, రావే జగదంబ యిపుడె రా నాతోడన్.

38


వ.

అని యపుత్రకుండు గావునఁ బెన్నిధానంబు గన్న పేదచందంబున దైవంబు
నా కిప్పు డిబ్బాలారత్నంబు నొసంగె నని పొంగి దానిం దోడ్కొని నిజగృ
హంబున కరిగి తనభార్య యగుచక్రమదేవి కప్పాప నొసంగిన నవ్వధూ
రత్నంబు.

39


ఆ.

పెరుఁగుఁ బాలు జున్నుఁ బెల్లంబు నెయ్యి కొబ్బరి యనఁటిపండ్లు పనసపండ్లు
పిండివంట లిక్షుఖండంబు లోరెంబు, ప్రీతి యెసఁగ నొసఁగి పెనుచుచుండె.

40


వ.

అట్లు పెనుచుచున్నయెడ.

41


ఉ.

అంగదముద్రికావలయహారలలాటిక లెమ్మె నెమ్మెయి
స్రంగులు గుల్కఁ గ్రొందగటునాడెపుఁబావడసొంపు నింప మే

ల్బగరుగిల్కుటందియలు బాళిగ నంఘ్రుల ఘల్లుఘ ల్లనన్
గంగ యనుంగులం గలసి కౌతుకలీలలఁ గ్రీడసేయుచున్.

42


సీ.

బొమ్మపెండ్లిండ్లు సొంపుగఁ జేసి గుజ్జనగూటియామెత లనుంగులకుఁ బెట్టు
బలితంపుటపరంజిపంజరంబుల నిడి చిలుకబోంట్లకు మేత లెలమి నొసఁగు
నాడెంపునెలఱాలమేడలపై నిల్చి లీల మై తూఁగుటుయ్యాల నూఁగుఁ
బరువంపునెత్తావివిరిబొండుమల్లెకుం జాదుల నీ రెత్తి ప్రోది సేయు


గీ.

బోటులను గూడి కిన్నెరమీటు నింపు, నాటుకొలుపుచు జిలిబిలిపాట పాడు
హాళి దైవారఁ జెంగల్వకేళికుళుల, నోలలాడుఁ జెలంగి యవ్వాలుగంటి.

43


వ.

అట్లు క్రీడింపుచు దినదినప్రవర్ధమాన యగుచున్నంత.

44


సీ.

నిద్దంపుసోగపెన్నెరులు వేసలికందె నెదఁ జిన్నిచన్నులు కుదురులెత్తెఁ
గనుదోయి నరసిగ్గుకలికిచూపు లెసంగె నూనూఁగునూఁగారు గాననయ్యెఁ
దావిమోవికిఁ గ్రొత్తతలిరుడాలు ఘటిల్లె జిలిబిలిపలుకుల మొలచె దీప్తి
నెమ్మొగంబున వింత నిగనిగజిగి పొల్చెఁ జిన్నారినగవులు చెంగలించె


గీ.

నడలఁ గడలేనిమురిపెంబు గడలుకొనియె, మెఱుఁగుచెక్కులతళతళల్ దుఱఁగలించెద
గటిధరం బించుకించుక ఘనతఁ దాల్చెఁ, జెలికి లేజవ్వనము మేన మొలుచుటయును.

45


వ.

అట్టి నవయౌవనారంభంబునఁ జీనిచీనాంబరానర్ఘమణివిభూషణసుగంధతాంబూ
లాదికంబులం దేజరిల్లుచుండె నంత.

46


సీ.

సిరులకు మన్కి యై చిరసుఖాకర మైన కైలాసశైలశృంగంబునందు
మహనీయతపనీయమయసముద్దీప్తి నిశాకాంత మాణిక్యసౌధవీథి
నలువయు వెన్నుండు బలరిపు ప్రముఖదిక్పతులును సనకాదియతివరులును
నందీశగుహగజాసనభృంగిరిటవీరభద్రభైరవముఖప్రమథపతులు


గీ.

దవిలి కొలువంగ గిరిరాజతనయఁ గూడి, యనుపమానర్ఘరత్నసింహాసనమున
నక్కజం బగుఠీవిమై నొక్కనాఁడు, హాళిఁ గొలువుండె రాజరేఖార్ధమౌళి.

47


వ.

అయ్యవసరంబున.

48


సీ.

మినువాక తెలినీరు నినిచినకుండికఁ బసిఁడిచాయలఁ గేరుపల్లజడలు
వెన్నెలనిగ్గును వెదచల్లు నెమ్మేను చక్కనిస్ఫటికంపుజపసరంబు
గాలి సోఁకిన మ్రోయుకడిదికిన్నెరవీణ యభినవమృదుసులకృష్ణాజినంబు
దట్టంపుగోపిచందనపుండ్రవల్లికల్ పసమించుకాషాయవసనములును


గీ.

గలిగి భవభర్గ చంద్రశేఖర మహేశ, హర మహాదేవ సాంబ శంకర గిరీశ
యనుచు వేడుక నచ్చోటి కరుగుదెంచె, సారవిద్యావిదుం డైననారదుండు.

49

గీ.

అ ట్లరుగుదెంచి దివిజసంయమివరుండు, భక్తి దైవార నమ్మహాప్రభునినగరు
సొచ్చి హెచ్చినవేడుక లచ్చుపడఁగఁ, గేలుగవ మోడ్చి యద్దేవిమ్రోల నిలిచి.

50


సీ.

రాకేందునీకాశరమ్యగాత్రమువాని రమణీయఫణిభూషణములవానిఁ
గందర్పశతకోటిసుందరాకృతివాని డమరుత్రిశూలఖడ్గములవాని
సదమలదరహాససరసాననమువాని భసితాంగరాగవిభ్రమమువాని
సింధురాజినసమంచితనిచోళమువానిఁ గరుణాకటాక్షవీక్షణమువానిఁ


గీ.

బ్రథితభువనోద్భుతోరువైభవమువాని, ఘనతరానందహృదయపంకజమువాని
సకలలోకాధిపతి యైనసాంబశివునిఁ, గనియె మునిమాళి కన్నులకఱువు దీఱ.

51


క.

అటువలెఁ బొడఁగని కేల్గవ, నిటలస్థలిఁ జేర్చి సంజనితకౌతుకవి
స్ఫుటదంతరంగుఁ డై య, జ్జటికులవల్లభుఁడు వాక్యచాతురి మెఱయన్.

52


సీ.

భసితాంగరాగాయ భక్తానురాగాయ పాలేక్షణాయ తుభ్యం నమోస్తు
భర్మాద్రిచాపాయ భద్రేంద్రవాహాయ భయవిదూరాయ తుభ్యం నమోస్తు
భండనోద్దండాయ సుప్రతాపాయ భవ్యరూపాయ తుభ్యం నమోస్తు
భరతప్రవీణాయ భవనాయితనగాయ భద్రప్రదాయ తుభ్యం నమోస్తు


గీ.

భావభవసంహరాయ తుభ్యం నమోస్తు, భవసరన్నావికాయ తుభ్యం నమోస్తు
భద్రచర్మాంబరాయ తుభ్యం నమోస్తు, భారతీశార్చితాయ తుభ్యం నమోస్తు.

53


వ.

అని నమస్కరించి వెండియు.

54


సీ.

జయజయ కైలాసశైసనికేతన జయజయ దేవతాపార్వభౌమ
జయజయ గిరితనూజామనోంబుజభృంగ జయజయ దైవవేశ్యాభుజంగ
జయజయ నిగమాంతసముదయసంవేద్య జయజయ భువనరక్షాధురీణ
జయజయ జలజతసంభవాండపిచండ జయజయ శాశ్వతైశ్వర్యధుర్య


గీ.

జయ పురందరహరివిరించనముఖాఖి, లామరస్తోమముకుటాంచలాంచితాబ్జ
రాగమాణిక్యరోచిర్విరాజమాన, చరణపంకేరుహాద్దేశ జయ మహేశ.

55


క.

పరమేశ నిన్నుఁ బొగడఁగఁ, దరమే శేషునకు హరిపితామహబలసం
హరులకు సనకాదిమునీ, శ్వరులకు నొక్కింతయైన వర్ణింపంగన్.

56


సీ.

మహిమ మీఱఁగ సర్వమంత్రరాజం బైనగాయత్రి కీవె పో నాయకుఁడవు
శ్రుతు 'లేకయేవరు ద్రో నద్వితీయ' యం చనిశంబు నిన్నెకా వినుతి సేయుఁ
బ్రత్యహంబును 'శివాత్పరతరం నాస్తి' యం చలర స్మృతుల్ నిన్నె తెలుపుచుండుఁ
బురుషోత్తమఖ్యాతిఁ బరఁగు వెన్నుఁడు వేయిరాజీవముల నిన్నె పూజ సేయు

గీ.

జలజగర్భుండు మొదలగు జంతువులకుఁ, బతి వగుటఁ జేసి నీకె విశ్రుతము గాఁగ
బశుపతిసమాఖ్య చెల్లె నబ్బురము మీఱ, నిన్నుఁ గొనియాడ నెవ్వరు నేర్తు రభవ.

57


మ.

కరికిన్ మర్కటకీటపోతమునకుం గాలాహికిన్ మూలపో
టరికిం జెంచుకొలంపుబత్తునకు వేడ్క న్మోక్షసామ్రాజ్యసు
స్థిరసౌఖ్యం బొనఁగూర్చి ప్రోచినకృపాసింధుండ వాహా భళీ
సరియే యీహరికుఱ్ఱవేల్పుదొర లెంచ న్నీకు శ్రీకంధరా.

58


గీ.

శ్వేతుఁడు మృకండుసూనుండుఁ బ్రేతనాథు, చేతఁ గడ లేనియిడుమలఁ జిక్కి పొక్కి
నిన్ను శరణన్న జముఁ బడఁదన్ని వారి, కెన్నటికిఁ జావు లేకుండ నిడితి వభవ.

59


క.

హరి తననయనాబ్జముతోఁ, దొరలఁగ నొకవేయివికచతోయజముల నీ
శిరమునఁ బూజించినఁ గని, యిరువుగ నాతనికిఁ జక్ర మిచ్చితివి గదా.

60


క.

సురదనుజు లబ్ధిఁ దరువగ, గరళము ప్రభవించి జగము గాల్పఁగ దానిన్
సరగున గళమున నిడుకొని, పరిపాలించితివి గద ప్రపంచంబు శివా.

61


గీ.

భైరవాకృతియును వీరభద్రమూర్తి, శరభసాళువరూపంబు సరవిఁ దాల్చి
నలినభవదక్షనారసింహులశిరంబు, లేపు మీఱంగఁ దునుమవె యీశ నీవు.

62


సీ.

గడితంపుటపరంజిగట్టుసింగిణి విల్లు గాలిబోనపుఁదిండికాఁడు నారి
యీరేనుమేనుల నేపుచూపుల కోరి యార్మూఁడుతునియలై యలరు నరద
మిరుదుగ మొగములదొర తేరుపూన్పఱి పగటివేలుపు నేలబండికండ్లు
ప్రాబల్కుతుటుములు బలవారువంబులు తెరగట్టుమన్నియ తెగలుబంట్లు


గీ.

గాఁగ దిగప్రోళ్లు బలితంపుఁగడిమిఁ గూల్చి, జగము నావడి యుడిపి నిశ్ళంక నలరు
నీప్రభావంబు బుధులు వర్ణింపఁగలరె, భానుశతకోటిసంకాశ పార్వతీశ.

63


సీ.

పులికరాసంబును బూదిగంధంబును బుఱియకంచంబును బునుకుపేర్లు
చిలువపుఱాసొమ్ములు చికిలిముమ్మొనవాలు కంకటికోడలేజింకకూన
పలుకుటందియలు చౌనంచనెమ్మొగములు మెట్టబిడారంబు వెట్టకన్ను
చేతికుత్తుక యాలపోతుటెక్కెంబును గ్రొన్నెలతలపువ్వు విన్నుదురము


గీ.

గలిగి వెలుఁగొందు నీమూర్తిఁ దలఁపునందు, నిలిపి యేప్రొద్దుఁ గొలుతు న న్నెలమిఁ బ్రోవు
శత్రుబలభీమ దేవతాసార్వభౌమ, గిరిసుతానాథ నిఖిలనిర్జరసనాథ.

64


గీ.

వేయినోళ్లను మఱి రెండువేలనాలు, కలు గలుగుశేషునకునైన నలుమొగముల
ప్రోడకైనను దరమె ని న్బొగడ నింక, వేయు నేటికి ననుఁ బ్రోవు విశ్వజనక.

65

గీ.

అని నుతించుమునీంద్రు గని శివుండు, సారకరుణామృతార్ద్రసుస్వాంతుఁ డగుచు
నుచితపీఠాంతరమునఁ గూర్చుండఁజేసి, కుశల మడిగి యతిమధురోక్తుల వచించె.

66


క.

మునివర సకలజగంబులు, ననివారణముగ జరింతు వచట నచట నీ
కనుఁగొన్నవింత లెల్లను, వినుపింపుము మారు వేడ్క విస్తరిలింగన్.

67


క.

ఏయేజగములఁ జూచితి, వేయేదేశములు గంటి వేయేపురముల్
పాయక పొడఁ గాంచితి వీపు, డాయెడలం గలుగువార్త లచ్చుగఁ జెపుమా.

68


గీ.

అనిన నారదుం డిట్లను నభవ సకల, భువనములఁ జూచుకొనుచు నేఁ బోయిపోయి
నవకుతూహలమహితమానసుఁడ నగుచు, భూతలమ్మున నేలూరిపురము గంటి.

69


సీ.

బహురత్నవిరచితప్రాసాదములచేత రమణీయమణిగోపురములచేత
నిందిరాకరదివ్యమందిరంబులచేత సుకరకపోతపాలికలచేతఁ
దపనీయమయదేవతాధామములచేతఁ బటువజ్రసౌపానపటలిచేత
భక్తశైలోన్నతప్రాకారములచేత దివిజేంద్రనీలవేదికలచేత


గీ.

విమలపద్మాకరోద్యానసమితిచేత, గంధగజరాజధేనుసంఘములచేత
ధరణి సురముఖ్యసజ్జనోత్తములచేత, భవ్యగతిఁ బొల్చు నేలూరిపట్టణంబు.

70


చ.

అసమశరోపమానసముదంచితవిగ్రహఁ గంటి నందుఁ గ్రొ
మ్మిసిమికడానిబంగరపుమించుల మించు పిసాళిమేసిరుల్
రసికమనోంబుజంబులకు రాగము గూర్పఁ గొఱంత లేనిమే
ల్పస నెలరారు నొక్కయెలఁబ్రాయపుజాలరికన్యకామణిన్.

71


ఉ.

అన్నులమిన్నులం ద్రిభువనాంచితరూపవిలాసమాన్యులం
గన్నులఁ గంటిఁ గాని శశిఖండనమండన యెందునేని న
క్కన్నియవంటిసోయగపుఁగల్కిఁ గనుంగొను టే నిఱుంగ నో
యన్న గణింప శక్యమె మహాహికి దానికడిందియందముల్.

72


ఉ.

కొమ్మలు సాటియే మరునికొమ్మకరఁబునఁ గ్రాలుజాళువా
బొమ్మకుఁ గమ్మవింటినెఱపోటరిక్రొవ్విరితోఁటలోని దా
నిమ్మకు నిమ్ముల న్వలచునిద్దపుసంపెఁగపూవుకొమ్మ కం
దమ్ములకెల్ల నిక్కడ యనం దగు జాలరిముద్దుగుమ్మకున్.

73


చ.

కులుకుమిటారిగబ్బిచనుగుబ్బలసౌరు జగానిగారపుం
దొలుకరికార్మెఱంగుల నెదుర్కొనుకొప్పుమిటారునిద్దపుం

గలికిపిసాళివాలు తెలిగన్నులతీరు గణింప మాయురే
యల కలకంఠకంఠి కలరారునోయారులు దానికుద్దియే.

74


సీ.

చిన్నారిజాబిల్లి కన్నెగేదఁగిపువ్వు వెన్నెలతెలినిగ్గువన్నెలగని
తళుకుపుత్తిడిబొమ్మ తొలుకరిక్రొమ్మించు తలిరుజొంపపుమావిపలుకుచిల్క
చక్కెరలప్ప గొజ్జఁగినీటిపెనువాత కపురంపుబరిణి వెలగలువకొలను
వలపులదీవి జవాదినించినబావి కమ్మకస్తురిక్రోవి నిమ్మపండు


గీ.

చికిలినిద్దంపుటద్దంబుపికిలిబెండు, మగువతలమిన్న వెలలేనిమానికంబు
నాఁగ నలరారు నయ్యెలనాగ బాగు, దెలుప శక్యంబె యేలాటివలఁతికైన.

75


సీ.

సతిమోమునకు నోడి చందమామ కృశించి వెలవెలనై బైట వ్రేఁగుచుండెఁ
జెలిక్రొమ్ముడికి నోడి తొలుకరిమబ్బులు నిలువెల్ల విషమూని మలలు ముట్టె
నువిదపాలిండ్లకు నోడి బంగరుగిండ్లు కాఁకచే నుడుకుచుఁ గఱఁగఁబాఱెఁ
జేడికన్దోయికి నోడి బేడిసమీలు మిట్టిపాటున నేట బిట్టుపడియెఁ


గీ.

దరుణినునుజెక్కులకు నోడి దర్పణములు, మైల వాటిలఁ గొంతఁ గన్మాసి యుండె
నేమి చెప్పుదు నఖిలలోకేశ నీకు, దానిసౌందర్య మెన్న నాతరము గాదు.

76


సీ.

అలికులవేణిశైవలరోమవల్లరి సారసవదనకల్హారపాణి
కలహంసగామిని కచ్ఛపచరణాగ్ర మకరజంఘాలత శకులవదన
కలభోరుకాండ కోకపయోధరద్వయ సైకతజఘన కింజల్కరదన
కంబుకంధర వీచికావళి యావర్తనాభికావివర మృణాలబాహ


గీ.

యగుచు భువనాభిరామవిఖ్యాతి నెపుడు, వెలయుచున్నట్టి యాఘనవేణితోడ
గరుడగంధర్వయక్షకిన్నరనిలింప, భుజగగజగామినులు సాటి పోలఁగలరె.

77


క.

పొడవుగ నెగసి తళు క్కని, పొడ చూపి యదృశ్య మగుచుఁ బోవుమెఱుంగుల్
పడఁతుకనెమ్మెయిజిగి కెన, యిడఁగాఁ బోలవుగదయ్య యిందువతంసా.

78


సీ.

ఇది కీలుఁజడ గాదు చదువుపల్కుహుమావజీరునివాఁడికటారు గాని
యిది నెమ్మొగము గాదు కొదమతుమ్మెదనారివిలుకానియద్దంపుఁబలక గాని
యిని కటాక్షము లౌనె చివురాకుబాకుసాధనుగానితూఁపుమొత్తములు గాని
యివి కుచంబులు గావు పూజిరానెఱజోదుమేలిబంగరుబొంగరాలు గాని


గీ.

యిది వలపుకెంబెదవి గాదు మదనభూప, కరవిరాజితపద్మరాగంబు గాని
యనుచు రసికాగ్రణులు దనయవయవములఁ, బొగడ నెగడొందు నౌర యాచిగురుఁబోఁడి.

79

సీ.

కలికివాల్గన్నులఁ దిలకించి చూచిన వెడవింటిదొరబాణవృష్టి గురియుఁ
గులుకుచు జిలిబిలితెలినవ్వు నవ్వినఁ గమ్మగప్రపుదుమారమ్ము గ్రమ్ముఁ
దొకతొక వెలయుముద్దులమాట లాడిన సాంసార విరితేనెసోన చిలుకుఁ
బుడమిఁ జక్కగఁ జూచి యడుగిడి నడిచినఁ బలితంపుఁగెంపురంగులు వెలుంగు


గీ.

కచకుచకటిభరంబుచేఁ గౌను వడఁక, నూత్నచామీకరామూల్యరత్నఘటిత
కాంచికాఘటికాఘణంఘణలు సెలఁగ, దాసకులనారి మరునినిద్దపుఁగటారి.

80


ఉ.

సుద్దుల కేమి నాపలుకు సూనశరాంతక చిత్తగింపు మ
మ్ముద్దియతళ్కుచూ పతనుమోహనశాతశిలీముఖంబుతో
నుద్దిడుకంగఁ బోయి మది నూహ యొనర్పఁగ నట్లు కానిచో
నద్దిర యెల్లవారిహృదయంబులఁ గాఁడి చనఁగ నేర్చునే.

81


ఉ.

ఆలతకూన యాలలన యాలవలీదళకోమలాంగి యా
లోలకురంగశాబకసులోచన యామదచంచరీకనీ
లాలక యాసమగ్రతుహినాంశుమనోజ్ఞముఖారవింద యా
నీలకచాశిరోగ్రమణి నీకుఁ దగుం బెఱమాట లేటికిన్.

82


గీ.

గంగ యనుపేరు దన కెసఁగంగ భువన, మంగళాకృతిఁ బొల్చునయ్యంగనాల
లామఁ గనుఁగొంటివేని యోస్వామి నీకు, నిరుపమానందసంసిద్ధి దొరకుఁ జుమ్ము.

83


గీ.

అని మునీంద్రుఁ డెఱింగిఁప నభవుఁ డపుడె, కొలువు చాలించి యెల్లవారలను బోవఁ
బనిచి తనతోడ రాఁ గోరుపర్వతాధి, రాజపుత్రిక నంతఃపురమున నిల్పి.

84


సీ.

జడలు చిక్కులు వాపి నడునెత్తి సిగ వైచి తావిసంపెఁగపూలదండఁ జుట్టి
నిటలభాగమున నున్వెలిబూదిరేఖయుఁ బూపకస్తురిచుక్కబొట్టు పెట్టి
వలువబంగరుశాలువలెవాటు గావించి మొలఁ బట్టుదట్టియమ్ముల బిగించి
నులిచి గాటెంపుమీసలు చక్క సవరించి బవిరిగడ్డము దీరువడఁగ దువ్వి


గీ.

కేలఁ జారుకపాలంబు గీలుకొలిపి, మేన నవగంధసారంబు మెదిచి పూసి
గిలుకుపావలఁ దొడిగి యిగ్గిరిశుఁ డప్పు, డతిమనోహరజంగమాకృతి ధరించె.

85


వ.

అట్లు జగన్మోహనోకారజంగమాకారంబు
ధరించి చనుదెంచి యేలూరి
మహానగరంబుఁ బ్రవేశించి తదంతికప్రదేశంబున నొక్కచోట.

86


మ.

కనియె న్నీలగళుండు బిల్వబదరీఖర్జూరజంబీరచం
దనమందారలవంగచూతలవలీనారంగభల్లాతకీ
పనసాశ్వత్థాకపిత్థతాలవటరంభానారికేళాదికా
వనిజాతానిశభాసమానము సరోవాపీవృతోద్యానమున్.

87


సీ.

కలకంఠకులకంఠకాకలీధ్వానము ల్చెలఁగి దిక్వలయంబు చెవుడు పఱుప
శుకశారికాకదంబకమృదుస్వనములు జనుల కామోదంబు సంఘటింపఁ

బ్రమదనృత్యన్మత్తబర్హిణారావంబు లవిరతశ్రుతిపుటోత్సవ మొనర్ప
నవనవమకరందనందితేందిందిరగానము ల్చిరసుఖాకరము గాఁగ


గీ.

ఘనమరాళారవంబులు గ్రమ్ముకొనఁగ, బంధురసుగంధగంధిలగంధవాహ
శాబకము లోలి నధ్వకశ్రమము దీర్ప, నతిమనోహరగతిఁ బొల్చె నవ్వనంబు.

88


వ.

అందు.

89


సీ.

తావులీనెడుగుజ్జుమావిమ్రాకులచెంతఁ బెనఁగొన్న గున్నసంపెఁగలసజ్ఙఁ
గపురంపుటనఁటిమోఁకల కంటి ప్రాఁకిన పరువంపుద్రాక్షపందిరులక్రింద
గమగమవలచు చొక్కంపుగొజ్జఁగినీట నేటఁజక్కెరకడ నిరువుకొన్న
బలితంపుఁజెంగల్వబావులక్రేవులఁ బన్నినచలువచప్పరమునీడ


గీ.

నందముగఁ బొల్చునిద్దంపుఁజందమామ, ఱాలఁ గట్టినజాళువామేలితిన్నె
మీఁద మోదంబు దళుకొత్త మిక్కుటంపు, ఠీవిఁ గూర్చుండి జంగమదేవుఁ డపుడు.

90


వ.

అయ్యవసరంబున.

91


సీ.

కురులు చిక్కులు విప్పి కొప్పు విప్పుగ దిద్ది యసదుకస్తురిబొట్టు నొసలఁ బెట్టి
వలిపెచెంగావిపావడ చక్క సవరించి కళుకుబంగరుచేలఁ గటి ఘటించి
చిలుఁగుపైఠాణికంచెల గుబ్బలు బిగించి గణితంపువలిగమ్మగలప మలఁది
కలికికన్నుల మించుకజ్జలంబు ధరించి యలరుసంపెఁగదండ లరుత నించి


గీ.

హారకేయూరకటకమంజీరకాంచి, కాంగుళీయకకర్ణపత్రాదివివిధ
మణివిభూషణనిర్మలఘృణులు వెలుఁగ, గంగశృంగారలీలావృతాంగి యగుచు.

92


గీ.

నెచ్చెలులఁ గూడి వేడుక లచ్చుపడఁగ, నొచ్చె మొదవనిహాళిమైఁ బెచ్చు పెరిఁగి
పచ్చవిల్కానిమేటిరా లచ్చి యనఁగ, వచ్చి చెచ్చెర శృంగారవనము సొచ్చి.

93


క.

చొచ్చి ఝణంఝువునినదస, ముచ్చయరంభాసమానమోహనకటకో
ద్యచ్ఛరణసరసిరుహ యై, విచ్చలవిడిఁ బూలు గోసె వెలఁదులు దానున్.

94


చ.

చిలుకలఁ దోలి కోయిలలఁ జిందరవందర గాఁగ నేలికే
కుల బెదరించి తుమ్మెదల గుప్పునఁ బాఱ నడంచి యంచలం
గొలకులఁ బాసి జక్కవలకు న్నిలరాయిలు చూపి పూఁబొదల్
వలఁగొని దూఱి కప్పురపువంతుల దాఱి విహారలీలలన్.

95


గీ.

కప్పురము రేఁచి లతికానికాయ మూఁచి, పాదపము లెక్కి తియ్యనిపండ్లు మెక్కి
సరసగతి డాసి తావిక్రొవ్విరులు గోసి, చెలులు పుష్పాపచయకేళి సలిపి రోలి.

96


సీ.

కనకాంగి నీనాసికకు జోక యగువీఁకఁ గనుపట్టుచున్నవి గంధిఫలులు
శుకవాణి నీవాతెఱకు సాటి యగుపాటిఁ దనరారుచున్నవి దాసనములు
ముకురాస్య నీగుబ్బలకు నుద్ది యగుబుద్ధి నిం పూనుచున్నవి యీడెపండ్లు
కలకంఠి నీనాభికకు సరి యగుమురిఁ బొలుపొందుచున్నవి పొన్నపూలు

గీ.

ముగుద నీదంతముల కెన యగుపొగరున, మురువుఁ జూపుచు నున్నవి మొల్లమొగ్గ
లనుచు నన్యోన్యసరసోక్తు లాడుకొనుచు, ననలు గోసిరి సరసిజాననలు మొనసి.

97


ఉ.

అప్పుడు జంగమేశ్వరుఁ డొయారము దద్దయు మీఱ వేడ్కతో
గుప్పున లేచి పాదములగుత్తపుఁబావలు మెట్టి లీల న
య్యెప్పులకుప్ప లున్నయెడు కుబ్బలరారఁగఁ జేరి కోరికల్
చొప్పడ మ్రోల నిల్చి మదిఁ జొక్కుచు నబ్బురపాటు వాటిలన్.

98


సీ.

చిన్నారిమోమునఁ జిలుగుచెమ్మటఁ గ్రమ్మఁ గొనబాఱుపువ్వులఁ గోయుదాని
గడితంపులేయెండఁ గ్రాఁగిన నెమ్మెయి నీడల నందంద నిలుచుదానిఁ
దాఱి పూఁబొదరిండ్ల దూఱుచో నడలిన క్రొమ్ముడి సవరించుకొనెడిదాని
గుత్తంపువలిగబ్బిగుబ్బచన్నులమీఁద నెలకొన్నసరు లిమ్ముకొలుపుదాని


గీ.

నీటుమీఱంగ జిలిబిలిపాటఁ బాడి, బోటులకు సంతసం బెదఁ బూచుదాని
వన్నియలకెల్ల మిన్నయై యున్నదానిఁ, జిన్నిప్రాయంపుజాలరికన్నెఁ గనియె.

99


చ.

కని యెనలేనికూర్మి మదిఁ గ్రమ్మఁగ నమ్మగ మిన్నమిన్నకా
మనసిజరాజ్యలక్ష్మి యగుమానినిదగ్గఱఁ జేరి కోరికల్
బెనఁగొన నౌర యీకులుకుబిత్తరిగుత్తపునిండుగౌఁగిటం
దనివి సనన్ సుఖింపక నితాంతలతాంతశరార్తి యారునే.

100


క.

అన్నుల నెందఱినేనియుఁ, గన్నులఁ జూచితిమి గాని గరుడాహిమరు
త్కిన్నరనరభామలు నీ, కన్నెలతలమిన్న బోలఁ గలరే యెన్నన్.

101


గీ.

సకియనెమ్మోము పున్నమచందమామ, కలికికన్నులు వాలుగగండుమీలు
పొలఁతిచనుగుబ్బ లపరంజిబొంగరాలు, తరుణిచెక్కులు మృదునవదర్పణములు.

102


గీ.

కలికి పదియాఱువన్నెబంగరుసలాక, గావలయు నెద్దిరా యట్లు గాక యున్న
నఖిలసంగపరిత్యాగు లైనయతుల, డెందములకైన నాస పుట్టింపఁగలదె.

103


చ.

పగడము బంధుజీవకముఁ బంకజరాగము దాసనంబు లేఁ
జిగురును బింబికాఫలముఁ జెందిరముం దిర మొప్పు నిప్పుడే
ముగుదులమిన్నతియ్యనునుమోనికి సాటి యటంచు నెంచఁగాఁ
దగదుగదా తగం దగవుదప్పి వచించుట దోసమేకదా.

104


చ.

మొలకమిటారిగుబ్బలును ముద్దులు గారు మెఱుంగుచెక్కులుం
దళుకుపిసాలిచూపులును దమ్మివిరి న్నిరసించుమోము క్రొం
దొలుగరిమబ్బులం దెగడుదోరపుఁగొప్పును గల్గి యొప్పు ని
క్కలికియలంతజవ్వనము గన్నులపండువ యయ్యె నద్దిరా.

105

సీ.

గజనిమ్మపండుల గజిబిజి యొనరించి మాలూరఫలములఁ గేలిసేసి
తమ్మిమొగ్గలచొకాట మెల్ల సడలించి క్రొన్ననబంతులఁ జిన్నఁబుచ్చి
కరికుంభములఁ దిరస్కారంబు గావించి యపరంజిగిండుల నపహసించి
పొన్నకాయలసౌరు సన్నగిలఁగఁ జేసి జక్కవకవ నెకసక్కె మాడి


గీ.

మేలిరతనంపుబలుబొంగరాలఁ దెగడి, కనకధాత్రీధరేంద్రశృంగములఁ గేరి
లీల నలరారు నౌర మే లీలతాంగి, కులుకుసిబ్బెపువలిగబ్బిగుబ్బదోయి.

106


గీ.

బాలికామణిపెన్నెరుల్ బారెఁడేసి, చేడియలమిన్నకన్నులు చేరెఁడేసి
కలికివలిగబ్బిగుబ్బలు గాఱెఁడేసి, చేసి నడు మేల మాయంబు సేసె నజుఁడు.

107


చ.

నిలుకడఁ గన్నకార్మెఱుఁగు నిద్దపుఁబల్కుల నేర్చుకొన్నక్రొం
దళుకుపసిండిబొమ్మ నెఱతావులు గాంచినమానికంబు చే
ష్టలుగల గుజ్జుమావి దిగఁజాఱిననిర్మలచంద్రరేఖ యీ
యలికులవేణిసోయగ మయారె యొయారుల నెందుఁ జెందునే.

108


ఉ.

అద్దిర నాకు దీనినెన రబ్బిన గొబ్బున గుబ్బదోయిఁ జే
కొద్దిగఁ బట్టి కౌఁగిటను గూర్చి నిగారపుమోవిసారెకు
న్ముద్దులు గొంచు మన్మథవినోదముల న్విహరింతుఁ గానిచో
నెద్దియు నామనంబున కొకించుక కోరికఁ దీర్ప నేర్చునే.

109


క.

అని పలుకుచు మెల్లన య, వ్వనితామణిఁ జేర నరిగి వలపులు నిగుడన్
మనసిజమదసంహరుఁ డి, ట్లనియెన్ మృదువచనరచన లలరారంగన్.

110


క.

ఎవ్వితవు నీవు దవ్వుల, బువ్వులఁ గోయంగ వచ్చి పొలుపారడులే
జవ్వనపుమేను గందఁగ, నివ్వనవీథిం జరింప నేమిటి కబలా.

111


క.

కామునిఁబూజ యొనర్పన్, హైమవతీరమణునకు సమర్పణ యిడనో
గోముగఁ బా న్పలరింపనొ, యెమిటి కీపూలు గోసె దిభరాడ్గమనా.

112


క.

కొమ్మలను గూడి క్రొవ్విరి, కొమ్మలపై నిమ్ముమీఱఁ గూరిమిమరునా
లమ్ముల నెమ్మదిఁ ద్రిమ్మరు, తుమ్మెదలఁ గలంచె దిట్లు దోసము గాదే.

113


క.

చెంగల్వలు వలెనో గొ, జ్జెంగులు గావలెనొ మంచిచేమంతులు సం
పెంగలు వలెనో తెచ్చెద, శృంగారవతీలలామ చెపుమా నాకున్.

114


క.

కొమ్మా కొమ్మా యిదె విరి, కొమ్మ కర మలసి సొలసి కోసితి నీకై
రమ్మా పూఁబొదరిండ్లకు, నిమ్మారఁగ మఱియుఁ గోసి యిచ్చెద నచటన్.

115


క.

జిలిబిలిచెమ్మట మోమున, నలుముకొనం బొదలవింట నలసెద వేలా
వెలిపూసురటి న్విసరెద, నిలుమా యొక్కింతసేపు నీరజవదనా.

116


క.

నను లాఁతివానిగా నె, మ్మనమునఁ దలఁపంగఁ జనదు మానిని వేడ్కన్

నునుగప్పురంపువిడె మిది, గొనుమా యనుమాన ముడిగి కువలయనయనా.

117


వ.

అనిన నేమియు మాతాడక గంగ యూరకుండినఁ దత్సఖీజనంబు లజ్జంగమ
య్యం గనుంగొని యిట్లనిరి.

118


క.

ఎవ్వఁడవు రోరి నీ విపు, డివ్విధమున నాము మీఱి యేకతను వనిం
బువ్వులఁ గోయుచు మెలఁగెడు, జవ్వనులం జెనకి పొదుపఁ జాగితివి భళీ.

119


క.

ఏరా గారా మారఁగ, నారాటం బెత్తి హత్తి యబలలఁ జెనకన్
మేరా తీరా యూరక, పోరా పోరాము లుడిగి పొ మ్మెటకైనన్.

120


వ.

అనిన వారివచనంబులు సరకుఁగొనక వెండియు జంగమేశ్వరుండు గంగం
గనుంగొని.

121


గీ.

పువ్వుబంతు లొసఁగవే పువ్వుఁబోఁడి, చిగురుటాకైన నీగదే చిగురుఁబోఁడి
దండఁ గూరిచి యిడుము వేదండయాన, యనుచు మెల్లనె నర్మోక్తు లాడుకొనుచు.

122


సీ.

కిన్నెర మీటి కన్గీటి సన్నలు సేయుఁ బకపక నగి యేలపదముఁ బాడుఁ
గెంగేలలాంతంబు గిరగిరఁ ద్రిప్పు లోఁ జొక్కుచు వెడవెడ మెక్కు మెక్కు
లింగ లింగ యటంచుఁ జంగువ దాఁటు మీసలు గీటు గడ్డంబుఁ జక్కఁదువ్వుఁ
గులుకుచు జిలిబిలిపలుకులఁ జెప్పు గామిడి యయి పైఁటకొం గొడిసి తిగుచుఁ


గీ.

దివిరి బతిమాలి దిక్కులు దిరిగి చూచు, నవలి కరుగుదోఁ ద్రోవ కడ్డవడి నిలుచు
వలపు మీఱఁగఁ జెలిమరుల్ గొలుపుకొనుచుఁ, గోడెప్రాయంపుజంగమకులవిభుండు.

123


క.

క్రొమ్మావికొమ్మచివు రదె, కొమ్మా కొంగేల నందుకొమ్మా యని మే
లమ్మాడుఁ జిలుగుపయ్యెదఁ, గ్రమ్మినవలిగుబ్బదోయిఁ గనుఁగొను వేడ్కన్.

124


వ.

ఇత్తెఱంగున హొరంగునం జెలంగి మెలంగుజంగమపుంగవుం గనుంగొని యంగనా
మణు లిట్లనిరి.

125


క.

మున్నెప్పుడుఁ గొమ్మలతో, నెన్నికగాఁ దిరిగినాఁడ వేమి బళా మేల్
కన్నెలవెంబడిఁ బడి కడు, మున్నఱికెల మెలఁగె దిట్లు మోసంబుగదా.

126


క.

కొంచక ము న్నెందఱి భ్రమ, యించితివి గదా చెలంగి యీ వేసమునన్
మంచిది నీదత్తురము లొ, కించుక మాయెడల సాగ వే లామాటల్.

127


సీ.

కరతాళగతు లెసంగఁగఁ దందనా ల్వాడి చొక్కుచుఁ జిందులు ద్రొక్కె దేమి
కిలకిల నగుచుఁ గన్గీట సన్నలు సేసి వలిపువ్వుఁబొదలకుఁ బిలిచె దేమి
గరుపంపుఁజిన్నరాగము దీసి యబ్బురపాటుగాఁ గిన్నెర మీటె దేమి
చెలరేఁగి గురవప్ప శివ యంచు నటువలె వెడవెడ గంతుల వేసె దేమి


గీ.

కడిఁదియొయ్యార మేపార నడరి మంచి, విరులబంతులఁ దెమ్మని వేఁడె దేమి
జోగు లెచ్చట యిల్లాలిజోటు లెచట, కానిబుద్దులు మాని వేగంబె చనుము.

128

క.

అన విని జంగమఱేఁ డా, ననబోఁడుల నీసడించి నగుచుం గన్యా
జనచూడారత్నంబుం, గనుఁగొని వెండియును నేర్పు గదురఁగఁ బలికెన్.

129


ఉ.

అంగన నిన్నుఁ గంటి నెఱియం గనుపండువు గాఁగ నేఁడు నీ
బంగరుబొంగరాల కెనవచ్చుమిటారపుగబ్బిగుబ్బ లు
ప్పొంగఁగఁ గౌఁగిలించి వలపుల్ దళుకొత్త సుఖింపఁజేయవే
జంగమవారిపాపఁడ భుజంగకలాపమనోజ్ఞభూషుఁడన్.

130


క.

వెండియుఁ బైఁడియు నాయెడఁ, గొండలవలె నుండు మెండుకొని యెప్పుడు నో
యఁడజగామిని చూడ న, ఖండమహోన్నతవిభూతిఁ గలవాఁడఁ జుమీ.

131


గీ.

ఎంతకన్నను నీడక న్నెఱుఁగకుండ, గరిమ నుండుదుఁ దలపువ్వు గందకుండ
నెలఁత నన్నేలు చిరసుఖాన్వితుని జేసి, నిన్ను నేప్రొద్దుఁ దలమీఁద నిలుపుకొందు.

132


గీ.

అంబుజాక్షి కుబేరునియంతవాఁడు, బలియుఁ డొక్కఁడు చెలికాఁడు గలఁడు నాకు
మఱియుఁ దఱలనిసిరి గలనెఱ యనుంగు, గలఁడు గద నాకు బ్రహ్మను గన్నవాఁడు.

133


క.

మేనెల్లఁ దెల్లఁబాఱెను, గానంబడ దిప్పు డొక్కకన్నులకంబుల్
జానరవిజడలుకంటెను, జానరొ నినుఁ గోరి పైదొసంగులు పడుటన్.

134


గీ.

 అన్న మెన్నడు నెఱుఁగ నీయానఁ గన్ను, దెఱవ వెఱతును మంటచేఁ దెఱలుచుండు
మేను సగ మయ్యెఁ గుత్తుకలోని చేదు, వదల దలివేణి నీమీఁదివలపుకతన.

135


క.

పులికిని భూతంబునకున్, బలితపుమత్తేభేమునకుఁ బామున కెదలోఁ
దలఁకక తిరిగెద నెప్పుడుఁ, బొలఁతీ నీమీఁదివలపు పొరిఁబొరిఁ బెరయన్.

136


శా.

రావే మత్తచకోరచారునయనా రావే జగన్మోహినీ
రావే రాజమరాళశాబగమనా రావే లతాంగీమణీ
రావే పూర్ణసుధామయూఖవదనా రావే మిళిందాలకా
నావెంటన్ లతికాగృహంబునకుఁ గందర్పాహవక్రీడకున్.

137


క.

మారుని నే మును గెలిచితి, వైరము దీర్పంగఁ బూని వాఁ డిపు డెదిరెన్
హా రమణీరతిరమణుని, హారమణీ నన్ను రతుల నలరింపఁగదే.

138


సీ.

కొమ్మ కొమ్మని కమ్మకెమ్మోవిపానకం బెమ్మెతో గ్రాలంగ నియ్యరాదె
తళతళల్ దులకించుబెళుకువాల్గన్నుల సొంపార మో మెత్తి చూడరాదె
నిక్కు చక్కనిగుబ్బ లక్కునఁ గదియించి బిగియారఁ గౌఁగిటఁ బెనచరాదె
ఘనజఘనస్థలఘటితనీవీబంధ మెడలించి మరుకేళి నెనయరాదె

గీ.

చిల్కుచిల్కునఁ దేనియల్ చీలుకఁ గులీకి, పలుకఁగారాదె సిగ్గు నిప్పచ్చరముగఁ
జెలులటక్కులఁ దలఁపున నిలుపఁబోక, మానినీమణి తమిఁ దీర్చి మనుపు మిపుడు.

139


క.

అగ్గలపువలపుసొలపులఁ, బెగ్గిలి నిను వేఁడుకొనెదఁ బ్రియమారఁగ నన్
బిగ్గఁ గవుంగిటఁ గూర్పవె, సిగ్గెల్లను వీడనాడి చిగురుంబోఁడీ.

140


క.

న న్నన్యుం గా నెన్నక, సన్నకసన్నగను గోర్కె సమకూర్పవె నీ
కన్నెఱికపుమున్నెఱికపు, మున్నెఱికలు సూపనేల ముద్దులబాలా.

141


వ.

అని యనేకప్రకారంబులఁ బ్రార్థించిన నమ్మించుఁబోఁడి యించుక తల వంచి
యూరకున్న సంగడికత్తియ లజ్జంగమేశ్వరున కిట్లనిరి.

142


క.

జంగమదేవర వని యొక, భంగిం దాగితిమి గాక బాపురె నిన్నున్
భంగించి పాఱఁ దఱుమమె, లొంగక మఱియొక్కరైన లోకం బెఱుఁగున్.

143


క.

అఱమఱ లేటికి మాతో, మఱిమఱిఁ గొఱగాని వెడఁగుమాటలు పలుకన్
వెఱవపు మంచిదె మాచే, నెఱిఁగెదుగద యింక నిపు డహీనగుణాంకా.

144


చ.

సరిసరి మంచిజాణవె విచార మిఁ కేటికి నన్యకామినీ
సురతవిహారలంపటతఁ జొక్కు చు మేలము లాడవచ్చె నీ
కరణి మెలంగుచుండుటకుఁ గాదనువారలు లేరు ధాత్రిపై
హరిహరి యింతదుండగపుటాటలఁ గంటిమె యెందు నేనియున్.

145


క.

తిరుసుక దినునీ వెంతెర, కర మరుదుగ నుదుటఁ గన్ను గలవాఁ డైనం
దరలి చనగలఁడె మాతో, నిరసించి యహహ కడిందివింతలు పుట్టెన్.

146


క.

కావరమున మాచెలిపై, నీవిధమునఁ గన్ను వేసి యెలవించెద హా
మావారు విన్న జంగమ, దేవర ననుకొన్న నీకుఁ దిప్పలు రావే.

147


వ.

అనిన నజ్జోగిరాయండు వారల కి ట్లనియె.

148


మ.

పలుచందంబుల వేఁడుకొన్న నకటా బాలామణిం గూర్పకే
చల మారం గలగిం(హిం)పఁజూచితిరి వాచాలత్వము ల్మీఱ నె
చ్చెలు లి ట్లందఱు మీరు గల్గుటకు రాజీవాననుం గంతువా
లలరుందూపులపాలఁ బో నిడెదరా హా యెంతగయ్యాళులే.

149


మ.

కలకంఠంబులు శారికల్ శుకములుం గాదంబముల్ భృంగముల్
బలము ల్తోడుగ వెంట నంటి కొలువన్ బాలానిలంబు ల్కెలం
కుల రాఁ బంకజవైరి మింట వెలుగం గో యంచుఁ బెల్లార్చి మీ
కలకంఠీమణిపై మరుం డెదురుచోఁ గాపాడఁగా నేర్తురే.

150

వ.

అని పలికి వెండియు గంగం గనుంగొని.

151


క.

ఉన్నవిధంబున వేఁడిన, సన్నక నన్నుఁ గనుకోర్కె సమకూర్పక హా
మిన్నంది పొంగి పొరలెద, వన్నన్న గణింప బల్గయాళివి గదవే.

152


క.

తాఱుచుఁ బూపొద లెల్లను, దూఱుచు బలితంపుఁజెట్లతుది కెక్కి వడిం
జాఱుచుఁ బెద్దలయానతి, మీఱుచు విహరింప నీకు మేరయె చెపుమా.

153


క.

పలుమఱుఁ బతిమాలిన లోఁ, గలఁక వహించుకొని లోతు గనఁబడనీ కీ
మలకలఁ బెట్టెదు నీకు, న్నిలువెల్ల విషంబు గదవె నీరజగంధీ.

154


క.

విను విను నాపలు కిప్పుడు, వనజాకముఖీలలామ వాలెము నాతోఁ
బెనఁగొనఁగఁ జనిన నవ్వుల, ననిశము భంగములపాల నడలెదవు సుమీ.

155


గీ.

అనినఁ జిఱునవ్వు లోలోన నడుచుకొనుచు, గంగ తనతళ్కుక్రొవ్వాడికలికిచూపు
లతనువిరిగల్వతూపులై యతని కాఁడ, నింపు దీపింప మెల్లన నిట్టు లనియె.

156


క.

భళిభళి సర్వజ్ఞుఁడవే, పలుకుల కింకేమి లాఁతిపడుచులవెంటన్
వలఁగొని తిరిగెడునిన్నీ, యిలఁ గా దనువారు లేరె యెంతటివారున్.

157


గీ.

పరసతీలోలుఁడవు నీవు బాళి మీఱ, నచలసంస్థితి సానుల నంటి తిరుగఁ
జెల్లుగా కిట్టు లిల్లాండ్రఁ జేరి మెలఁగఁ, జనునె నీనెయ్య మిఁకఁ జాలు చాలు పొమ్ము.

158


గీ.

అని పలుకుచున్నచోఁ జెలు లద్దిరయ్య, జోలెజంగంబు నీ కింతజోలి యేల
సరి భళా పదవదరెయం చరిదిహొయలు, గదురఁ జనుదెంచి రిండ్లకు గంగఁ గూడి.

159


క.

అత్తఱి జంగమరాయఁడు, చిత్తము తత్తరముఁ జెందఁ జిడిముడి పడుచున్
బిత్తరిహొయ లెదఁ బెనఁగొన, మెత్తంబా టూని చనియె మెల్లనఁ బురికిన్.

160


వ.

చని యొక్కవివిక్తదేవతాగారంబున నుపవిష్టుండై యుండె నని సవ్యసాచికి గాం
గేయుఁ డెఱింగించిన నతం డతిని నవ్వలికథావిధానం బె ట్లని యడుగుటయును.

161

ఆశ్వాసాంతము

మ.

శరదిందూపమదేహ నిర్జితవిపక్షవ్యూహ కైలాసభూ
ధరశృంగాటకగేహ దీనజనసంత్రాణామితోత్సాహ భా
స్వరగోవల్లభవాహ పర్వతసుతాసంభోగకేళీకళా
నిరతాభ్యంచితమోహ సారబలనిర్ణిద్రాగ్రబాహర్గళా.

162


క.

కరుణావరుణాలయ గిరి, శరణా శరణాగతార్తజనఘనభయసం
హరణా తరుణాభామృత, కిరణాభరణా సమగ్రకీర్తిస్ఫురణా.

163

మాలిని.

పురదనుజవిభంగా భూషితోద్యద్భుజంగా
సురుచిరధవళాంగా సూరిచేతోబ్జభృంగా
కరకలితకురంగా కాంతగంగోత్తమాంగా
తరణిశశిధరాంగా దైవవేశ్యాభుజంగా.

154


గద్యము.

ఇది శ్రీమత్కుక్కుటేశ్వరకరుణాకటాక్షనిరీక్షణసంలబ్ధసరసకవితా
సామ్రాజ్యధురంధర ఘనయశోబంధుర కౌండిన్యసగోత్రపవిత్ర కూచిమంచి
గంగనామాత్యపుత్త్ర సకలసంస్కృతాంధ్రలక్షణకళాకౌశలాభిరామ తిమ్మకవి
సార్వభౌమప్రణీతం బైనశివలీలావిలాసం బనుశృంగారరసప్రబంధంబునందుఁ
బ్రథమాశ్వాసము.