శివలీలావిలాసము/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

ద్వితీయాశ్వాసము



రాజితగుణసంగా
ఘోరాఘతమఃపతంగ కుతలశతాంగా
తారేశహారనారద
హీరాభశుభాంగ కుక్కుటేశ్వరలింగా.

1


వ.

అవధరింపుము పాండునృపాలనందనునకు గంగానందనుం డిట్లని చెప్పం దొడంగె
నట్లు శాంబరి జంగమేశ్వరుండు వివిక్తదేవతాగారంబున వసియించి యున్న
సమయంబున.

2


గీ.

సకలలోకాధిపతి యైనశంకరుండు, గంగకై బిట్టు వంతలఁ గలఁగుచుండెఁ
బగలు సేయుట తగదని పరచె ననఁగఁ, గమలహితుఁ డస్తశైలశృంగమునఁ జేరె.

3


గీ.

కాలకంఠుండు జాలారికన్నె తనకు, నబ్బు నని యుబ్బి తాండవం బాడుచున్నఁ
జదలఁ బర్వినకెంజాయజడ లనంగ, నంబరస్థలి సాంధ్యరాగంబు మెఱసె.

4


గీ.

చిగురువిల్కాఁడు దనతొంటిపగఁ దలంచి, విశ్వరూపంబు దాల్చి కోవెలలు నళులు
గ్రమ్ముకొని కొల్వఁ జంద్రశేఖరునిమీఁదఁ, గడఁగి దండెత్తె ననఁగఁ జీఁకటులు పర్వె.

5


క.

సుర లపు డంబరకేశుని, శిరమునఁ బూజించుచున్నఁ జెన్నారెడుక్రొం
బరుపంపుబొండుమల్లియ, విరు లనఁ దారకలు గగనవీథి న్మెఱసెన్.

6


క.

హరునకు గంగకుఁ బెండిలి, సరగున నగు నని నిలింపసతు లారతు లీ
గరములఁ బట్టిన మేల్బం, గరుపళ్లెం బనఁగఁ దుహినకరుఁ డుదయించెన్.

7


గీ.

భవుఁడు జాలారికన్నెకై బడల నొడలి, విరహపరితాపజనితపాండురమరీచు
లబ్బురంబుగ జగములఁ బ్రబ్బె ననఁగఁ, బండురేయెండ లెల్లెడ నిండుకొనియె.

8


ఉ.

జంగమరాయఁ డయ్యెడల జాలరిలేమయొయార మాత్మ వే
భంగుల నెంచి దర్పకుని బారికి బిట్టు చలించి యౌర సా

రంగవిలోచనామణి పరాకున న న్గికురించి యేగుచో
బంగరుపైఁటకొం గొడిసిపట్టి పెనంగక పోవనిచ్చితిన్.

9


ఉ.

గద్దరిబోటికత్తియలు గ్రమ్మి నయమ్ముగఁ బెక్కులాగులన్
సద్దులు సేయఁగా భ్రమసి జంటఁ బెనంగఁగ నేరనైతి వే
సుద్దుల కేమి యీపలువకోటులపంతము దీఱె నేఁడు నా
బుద్ధికి మోస మయ్యెఁ గద బూమెలగీములు వామలోచనల్.

10


చ.

మరుఁడు విరోధి చంద్రుఁడును మందసమీరుఁడు నేల నిల్ప రీ
పరభృతశారికానికరబర్హిమరాళశుకీమధువ్రతో
త్కరములు నాకు భూతములు కంజముఖీమణి బల్గయాళి హా
హరిహరి యింక నీసరసిజాంబకబాధల కెట్లు దాళుదున్.

11


ఉ.

ఏగతిఁ దాళువాఁడ నిపు డెవ్వరి నేక్రియ వేఁడువాఁడ న
బ్బా గిరి నింక నెందు సులభంబుగఁ గన్గొనువాఁడ నెట్లు పై
వేగినదాకఁ దాకువెడవిల్తునితూపుల నోర్చువాఁడ నా
హా గురులింగ దానిహొయ లాత్మఁ దలంచిన గుండె ఝల్లనున్.

12


ఉ.

హా వికచారవిందముఖి హా మదమత్తమరాళగామినీ
హా విబుధేంద్రనీలరుచిరాలకజాలక హా విలాసినీ
హా వరవర్ణినీజనశిఖాగ్రమణీ రమణీ ననుం గడున్`
భావభవప్రసూనశరబాధల కగ్గము సేసి యేగితే.

13


క.

చిరసుఖదాయిని వని నిను, నిరవొప్పఁగ వేఁడుకొనిన నిటు భంగములం
బెరయించి లోఁతు చూపక, దరిఁ జేర్పక సుళ్లఁ బెట్టఁ దగునే గంగా.

14


క.

నీకరుణామృతధారా, శీకరములఁ బైనఁ జిల్కి చెచ్చెరఁ దాపో
ద్రేకము చల్లార్పం గదె, రాకాహిమధామసమతరంగా గంగా.

15


వ.

అని మఱియు విరహావేశంబున.

16


ఉ.

ఎక్కడ నల్కుడైన జలజేక్షణ వచ్చె నటంచు లేచి న
ల్దిక్కులు సూచి కానియెడ దీనత నుస్సురటంచు నూర్చు నే
చక్కిట నెద్ది గన్గొనినఁ జాన శుభాకృతిగాఁ దలంచు హా
చక్కెరబొమ్మ యంచుఁ బలుచందములం బలవించు సారెకున్.

17


ఉ.

కన్నుల మూయుఁ ద్రుళ్లిపడి గ్రక్కున దిక్కులు రోయు నూరకే
సన్నలు సేయుఁ బై వలువఁ జయ్యన నవ్వలఁ ద్రోయు మింటిపై
వెన్నెలఁగాయుచందురునివేఁడికిఁ దాఁ బెడఁబాయు నద్ది రా
చిన్నెలజంగమప్రభుని చిత్తవికారము లెన్నఁ జిత్రముల్.

18

క.

అళికీరశారికాపిక, కలహంసమయూరకోకకలరవకురలీ
కులరవముల కులికిపడుం, జలిమలయల్లుండు గుండె ఝ ల్లని లీలన్.

19


వ.

మఱియును.

20


క.

మదనాదాసకులాంబుజ, వదనామణికొఱకు నేను వందురఁ బోనీ
కదనా యిటులేఁపఁగ నఖ, గద నాచే నైనతొంటికత మఱచితివా.

21


గీ.

మొదల నిలమీఁదఁ బడఁదన్ని పిదప నాద, రించి తలనుంచుకొనుటకు మంచిలెక్క
హా గురుద్రోహి వగు టెల్ల నగపడంగ, నన్ను బన్నంబు నొందింపఁ జన్నె చంద్ర.

22


వ.

అని బహుప్రకారంబుల మనోవికారంబులం దొరలుచుండె నంత నిక్కడ.

23


గీ.

గంగ ముద్దుగుల్కెడునాజంగమయ్య, చెలువు మది నెంచి వలపులు చెంగలించి
యంగభవశాతచూతసాయకపరంప, రావికంపితహృదయరాజీవ యగుచు.

24


చ.

కళవళపాటుతో నులకకంకటిపై మెయిఁ జేర్చి తద్దయున్
సొలయుచు మోవిమానికపుసొమ్ములు సడలించి వైచి యూ
ర్పులు నిగుడించుచుం జెలిమిబోటుల బిట్టు సళించుచుం గడున్
వలపులవెచ్చ హెచ్చ మదవారణయాన మదిం జలించుచున్.

25


క.

చిలుకలు నంచలు రొదలుచుఁ, బిలిచిన మాటాడ నోడి బెగ్గలుచు మదిం
గలఁగుచుఁ బండుచు లేచుచు, బలవించుచు వగలఁ బొగిలి బాములఁ బడుచున్.

26


మ.

తల యూచుం దనలోనఁ దానె నగుఁ జెంతం జేరగానీక నె
చ్చెలులం దిట్టఁ గనుంగవం బడిబడిం జిప్పిల్లుబాష్పాంబువుల్
తెలివారుం గొనగోళ్ల మీటుఁ బొగలున్ దివ్యప్రతాపోజ్వల
జ్జలజాతాంబకశాతచూతనిశిఖస్ఫారానలజ్వాలలన్.

27


వ.

ఇట్లు విరాళిం గ్రాలుచుండి మఱియుం దనలోన.

28


ఉ.

ఏటికిఁ బువ్వుదొంపునకు నేఁగితి నేఁగిన నందు నీటునం
బాటిలుచున్న క్రొందలిరుఁబ్రాయపుజంగము నేలఁ గంటి న
మ్మేటి నటు ల్గనుంగొని తమిం గవగూడక యేల వచ్చితిన్
బూటకపుంబొలంతుకలు బూ మెలఁ బన్ని రిఁ కేమి సేయుదున్.

29


వ.

అని జంగమేశ్వరుంగురించి యిట్లనియె.

30


గీ.

చిగురువిల్కాని గెల్చు నాసొగసుకాఁడు, లీలమై వచ్చి న న్బతిమాలుకొనిన
బేలనై యేలఁ బొమ్మంటి జాలి మాలి, చెల్లఁబో నింక నే నేమి సేయుదాన.

31

ఉ.

అక్కట గబ్బిగుబ్బగవ నక్కు నఁ జేర్చి కవుంగిలించి క్రొం
జక్కెరమోవిపానకము సారకుఁ జాల నొసంగి వానితోఁ
జక్కెరవింటిమేల్బిరుదుసంగరలీల సుఖింపకున్నచో
గ్రక్కున నాకు నీసుమశరప్రదరానలతాప మారునే.

32


ఉ.

కిన్నెర మీటుచు న్వగలఁ గేరి యలంతిగఁ బాటఁ బాడుచున్
సన్నలు సేయుచు న్బిగువుచన్నులపైఁ గను వేసి డాయుచున్
సన్నక నన్నుఁ బూఁబొదలచాయకు రమ్మని వేఁడునీహొయల్
గన్నులఁ గట్టినట్టు లగు గద్దరి జంగమరాయ సారెకున్.

33


ఉ.

ఇందునిభాననామణుల నెందఱి నెందఱి ము న్భ్రమించి శ్రీ
నందనుఁ బాఱఁద్రోచితివి న న్నటుల న్వలయించి నెమ్మదిం
గొందల మందఁజేసి యెటకో చనుదెంచితి నీతుటారపుం
జంద మెఱుంగనైతిఁగద జంగమరాయ సతీమనోహరా.

34


క.

మారాశుగశుకమధులి, ట్పారావతపికమరాళబర్హిమరున్నీ
హారాంశులసడి కళికెద, రారా నన్ ప్రేమ నేలరా రభసమునన్.

35


గీ.

పూలు పన్నీరు గందంబుఁ బోఁక లాకు, లనఁటిపండులుఁ జక్కెర యగరుఁ గప్పు
రంబుఁ గస్తురిఁ గూర్చి యర్చన లొనర్తు, రార వైళంబ జంగమరాయ యిపుడు.

36


వ.

అని వగలం బొగులుచున్న మగువం గనుంగొని సఖీశిఖామణులు దమలో నిట్లనిరి.

37


గీ.

కూళజంగంబు వాలారుగోళ్లనిండ, వలపుమందేమొ చల్లి యిక్కలికి నిట్లు
మరులు గొల్పెను గాఁబోలు మాయగాండ్రు, జోగులను నమ్మవచ్చునె సుదతులార.

38


గీ.

ప్రేతభూములఁ దిరుగుచు భూతకోటి, వెంటఁ జనుదేర వేల్మిడి యొంటిఁ బూసి
తోళ్లు బునుకలు నెమ్ములు బెల్లుదాల్చు, జోగులకు మందుమంత్రముల్ జోలె నుండు.

39


వ.

అని గంగం గనుంగొని.

40


గీ.

ఏమె నీనెమ్మనాన సి గ్గింతలేక, వాసిఁ దిగవాడి పొగలెదు గాసిఁబడుచుఁ
బెద్ద లెన్నంగఁ దగిననీబుద్ధి విడిచి, చిడిపిజంగంబు దా నేమి సేసెనొక్కొ.

41


గీ.

తల్లిదండ్రులు గులముపెద్దలును మఱియుఁ, దగినచుట్టంబులును విన్నఁ దప్పు కాదె
చిన్నదానవు నీ విట్లు సిగ్గుమాలి, పలుదెఱంగుల నొరలంగఁ బాడియగునె.

42


క.

కటకట పిడికెడుకూటికిఁ, గొటికెలఁ బడి బికిర మెత్తుకొని మనియెడు న
మ్మటుమాయజంగమునకై, యిటువలెఁ గృశియింపఁదగునె యిందునిభాస్యా.

43

గీ.

వద్దు మాయమ్మ యిఁక మంచిబుద్ధి గలిగి, దత్తురపుజంగమయ్యపైఁ దలఁపు విడిచి
నెమ్మిను౦డుము శుభములు నివ్వటిల్లు, జోగు లెచ్చట నాడెంపుజోటు లెచట.

44


సీ.

కటకట నాఁకటఁ గస్తి వొందఁగనేల వెసఁబట్టి దోశెంబు మెసఁగరాదె
యొడలెల్ల బిగిదప్పి బడలి యుండఁగ నేల యగరుగస్తురిగంధ మలఁదరాదె
సొగసెల్ల విడిబాఱి వగలఁ గుందఁగ నేల వెలలేనిరవణము ల్పెట్టరాదె
తలయెల్ల జడగట్టి మలిన మొందఁగ నేల తీరుగా గ్రొమ్ముడి దిద్దరాదె


గీ.

గట్టివలిపట్టుపుట్టము ల్గట్టరాదె, చెలఁగి కపురంపుఁదములంబు సేయరాదె
దావిక్రొంబువ్వుసరములఁ దాల్పరాదె, యువిద నీ కిది యేలాటియోజ చెపుమ.

45


చ.

చిలుకలఁ గొట్టె దేమి దరిఁ జేరినబోటులఁ దిట్టె దేమి పె
న్వలపులఁ బొక్కె దేమి తలవంచి మదిం గడుఁ జొక్కె దేమి యూ
ర్పుల నిగుడించె దేమి కనుబొమ్మలసారె ముడించె దేమి హా
చిలుకలకొల్కి నీవెడఁగుచిన్నియ లిన్నియుఁ జెప్పఁ జిత్రముల్.

46


వ.

అనిన వారల కాకన్యకామణి యిట్లనియె.

47


క.

చెలులార యింత నెగ్గులు, వలుకంగా నేల లచ్చికొమరున కెనయౌ
చెలువము గలయవ్వలఁతికి, వలసితి మీతోడ నింక వాదము లేలా.

48


గీ.

వినుఁడు నామాట మీరెల్ల వీను లలర, నలినముఖులార నాప్రాణనాథుఁ డైన
జంగమస్వామిఁ దెచ్చి యోర్వంగరాని, మదనవిశిఖార్తి మరలించి మనుపరమ్మ.

49


ఉ.

బంగరుపట్టుపుటములు భాసురరత్నవిభూషణంబు లు
ప్పొంగఁగ మీకు నిచ్చి పరిపూర్ణకృపామతి నాదరింతు నా
లింగముతోడు నాపలుకు లెస్సగ నమ్ముఁడు బోటులార యా
జంగమరాజశేఖరుని జయ్యన నిచ్చటఁ దెచ్చి నిల్పుడీ.

50


క.

ఇవ్విధము గాకయుండిన, నవ్వల ఱవ్వలఁ బెనంచి యందఱిలోనన్
నవ్వులఁ బెట్టక యూరకె, పువ్వారంబోఁడులార పొం డిరువులకున్.

51


మ.

కుల మెల్ల న్నిరసించి గేలి యిడ నీకోపంబు దీపింప మా
తలిదండ్రుల్ నిలయంబునం దిడక పంతంబారఁ బోఁదోల నీ
చెలికత్తెల్ మఱి మీర లందఱును ఛీఛీ యంచు దూషింప నీ
వలఱేని న్నగువానికౌఁగిటను నే వాలంబు గ్రీడించెదన్.

52


వ.

అని కనరు గనంబడం బలికిన నళికి చెలికత్తియ లొండొఱులమొగంబులు చూచు
కొనువారును, గుజగుజలఁ బోవువారును, సళించువారును, నీసడించువారును,
నిదె మిడిమేళం బనువారును నై యుండి యలసి కొంతతడవున కించుక గనుమూసి
నిదురింపం దొడంగి రాసమయంబున.

53

క.

గంగయుఁ గడితపువలువచె, ఱంగు ముసుంగిడి కడిందిఱాతనమున నా
శృంగారవనికి మెల్లనె, జంగమపుంగవుని వెదుకఁ జనియె నొకర్తై.

54


వ.

అట్లు చని వనిం బ్రవేశించి.

55


సీ.

కొదుగక గాటంపుఁబొదరిండ్ల దండలఁ గొదకొని సారెకు వెదకి వెదకి
తిన్ననికపురంపుఁదిప్పలచొప్పుల నిలుచుచు నందంద నెమకి నెమకి
వలపుగొజ్జఁగినీటివంతల చెంతల డాసి పల్దెఱఁగుల రోసి రోసి
పరువంపువలిదాఁకపందిళ్లసందుల సొలయుచు మఱిమఱిఁ జూచి చూచి


గీ.

వలపు లంతంత కుబ్బ నవ్వన్నెకాని, నెందుఁ బొడఁగాననేరక కుంది కుంది
యిందువదన వనితరుబృందములను, ఆశ లడరంగ నిట్లని యడుగఁదొడఁగె.

56


సీ.

చిన్నారివగకాఁడు చెన్నార మీవద్ద నిలిచియుండఁడుగదా నిమ్మలార
సింగారములకుప్ప చెలువొప్ప మీదండ మొనసియుండఁడుగదా పనసలార
ముద్దుజంగమఱేఁడు మురిమీఱ మీపజ్జ మసలియుండఁడుగదా మావులార
నెఱజాణతలమిన్న నీటార మీచెంత దాఁగియుండఁడుగదా దబ్బలార


గీ.

యలరువిలుకానిఁదెగడుసోయగము గలిగి, కడిఁది మీచాయనిగ్గులు కడలఁ బర్వ
జగము లెల్లను వలయించు జగమగండు, మీకడకు రాఁడు గద వలిదాఁకలార.

57


క.

ఈ డెన్నరానిసొగసుల, నాడెందము గరఁగఁజేసి నలిఁ బెట్టినయా
పోడలతలమానిక మిపు, డీడా నీనీడ కీడ కేతేరఁడుగా.

58


క.

అన్నన్న కడిఁదివగలన్, నన్ను న్వలయించి చనుట నాయమె వానిం
గన్నారఁ జూపఁగదవే, పొన్నా నీ కెన్నరానిపుణ్యంబుగదే.

59


క.

జగమెల్లను వలయింపఁగఁ, దగుసోయగమున వెలుంగుదంటవిరాళిం
బొగలించి చనియె వానిం, బొగడా గనఁజేయునీకు బొగడిక వచ్చున్.

60


గీ.

తలిరువిల్కానిదాడికి నళికి యుళికి, పలుదెఱంగుల నినుఁ గోరి వలసియున్న
చెలియ నలయింపఁ దగదని తెలిపి వాని, నగపడఁగఁజేయరే కొమ్మటనఁటులార.

61


వ.

అని మఱియును జంగమేశ్వరుం గురించి యిట్లనియె.

62


ఉ.

ఏలర యింతవింతచలమేలర నన్ను మనోభవానల
జ్వాలలవేఁడిమిం బొగలఁ జాలర లేజవరాలరా మదిం

జాల దిగు ల్దగుల్కొనియె జాలము సేయక వేగవచ్చి నా
మ్రోలఁ గనంబడం గదర ముద్దులజంగమరాయ మ్రొక్కెదన్.

63


ఉ.

పొంగుచు నీముఖాంబుజము ప్రొద్దునఁ జూచినవేళ యెట్టిదో
యంగజుఁ డెంతయుం గుపితుఁడై వెనుదీయక యేఁచఁజొచ్చె న
న్నంగనలం గలంచి యిటురా రెదఁ బెట్టెద వేల చాల నీ
సంగతిఁ గోరుకొంటిఁగద జంగమరాయవిలాసభాసురా.

64


గీ.

అనుచు వనమెల్లఁ ద్రిమ్మరి యందు నెచట, జంగమస్వామిఁ గానక గంగ యలసి
చాల నొప్పొరు బాలరసాలసాల, మూలమునఁ గొంగుపఱచి కన్మూసియుండె.

65


క.

మరుఁ డపు డిందీవరసర, సిరుహసితోత్పలామ్రశితవిశిఖంబుల్
పొరిఁబొరి వెడవింటఁ దొడిగి, కరిగామినిఁ బింజెపింజె గాఁడఁగ నేసెన్.

66


క.

అటు వేసిన హా యని య, క్కుటిలాలక సోలి తెలిసి కుసుమాస్త్రనిశా
విటమధుకరహంసకుహూ, రటమలయానిలులఁ గినుక ప్రబ్బఁగఁ బలికెన్.

67


గీ.

పార్వతీశంకరులమీఁదఁ బఱచి మున్ను, బన్న మందిన సుద్ది లోపలను మఱచి
యిపుడు నామీఁదఁ దొడిగెద విక్షుచాప, మింక నీ వేమి యయ్యెదో యెఱుఁగరాదు.

68


క.

సోమా నీవును నేనును, గామాంతకుశిరముమీఁదఁ గలసి మెలసి మున్
బ్రేమమున నుందు మిప్పుడు, నామీఁద న్వేడి చూప నాయమె నీకున్.

69


సీ.

మరుని శంభునికంటిమంట మ్రింగెడునాఁడు తాఱి మీ రేబొక్క దూఱినారు
దర్పకుఁ డభవుచే దగ్ధుఁ డయ్యెడునాఁడు తలఁగి మీ రేయేటఁ గలసినారు
వలరాజు హరునిచే నిలిగిపోయిననాఁడు సరిగి మీ రేకోనఁ జొచ్చినారు
మదనుఁ డీశ్వరునిచే మడిసిపోయిననాఁడు పారి మీ రేతిప్పఁ బట్టినారు


గీ.

వాఁడు గ్రమ్మర జీవించి వచ్చినపుడు, సిగ్గులే కిట్లు వెంబడిఁ చేరినారు
మధుపచక్రాంగపరభృతమలయపపను, లార గణుతింపఁదరమె మీబీర మిపుడు.

70


వ.

అని యనివారితానంగసంతాపాటోపఁబునం బొరలుచుండె నంత.

71


గీ.

ఆత్మగృహమున నక్కడ ననుఁగుచెలులు, త్రుళ్లిపడి లేచి సెజ్జయు నెల్లచోట్లు
వెదకి గంగను గానక వెఱఁగుమీఱి, వరుస నందఱు శృంగారవనము సొచ్చి.

72


సీ.

కందర్పశరబాధఁ గుందుచు నందంద శివశివా యని సద్దు సేయుదానిఁ
బొగలుచు గడితంపుబుడిబుడి వేఁడికన్నీటిజాల్ కొనగీర మీటుదాని
నెందు నల్కుడువిన్నఁ బొందుగాఁ జెవియెుగ్గి పొంచి నల్గడ లాలకించుదానిఁ
బొరిఁబొరి నిలమీఁద బొరలుచు లేచుచు నుసురంచు నిట్టూర్పు లుచ్చుదానిఁ

గీ.

గమ్మకపురంపుబలుదుమారమ్ము చిమ్మి, క్రమ్ముకొని వీచువలినాతెమ్మెరలకు
నడలి యెడరార గడగడ వడఁకుదానిఁ, జిన్నికన్నియఁ గాంచి రాచిగురుఁబోండ్లు.

73


గీ.

కాంచి మెల్లన దరి కరుదెంచి లోని జడుపు దీరంగఁ బుప్పొడిఁ దడిపి వైచి
మెదవుగపురంపుబూఁది నెన్నుదుటఁ బెట్టి, యిందుబింబానలు దాని కిట్టు లనిరి.

74


ఉ.

అమ్మక చెల్ల నీ విటఁ గయాళితనమ్మున మమ్ముఁ బిల్వ కే
ముమ్మర మైనవేదనల మున్గుచు నీనడురేయిఁ గోనకున్
నెమ్మది నొంటి రాఁదగునె నీమదిలో నళు కేల లేదె హా
కొమ్మ వచింపఁ జిత్రము లగుంగద నీదుకడిందిచందముల్.

75


క.

చిలుకలు గొరువంకలు గో, యిల లంచలు నెమలిగములు నెడపక యెపుడున్
గొలగొలలాడుచు విరహుల, నిలువఁగ నిచ్చునే వనంబు నీకుం గొఱయే.

76


గీ.

కొసరి యిట్టి పుప్పొడి కేలుగొనచు నొక్క, యెడను గాలూనఁ గందదు బడి వరించు
జోగి జంగాల కిరవైనచోటు గదవె, పడతి యిఁక వానిపై నాస విడిచిరమ్ము.

77


గీ.

అమ్మ నీయింట సకలభాగ్యములు గలవు, దండ్రి యందఱిలో నెన్నదగినధనికుఁ
డింకఁ దగుచోటఁ గల్యాణ మెలమిఁ జేయు, వద్దు రావమ్మ యింటికి బుద్ధి గలిగి.

78


వ.

అని యూరడించి నెచ్చెలు లచ్చేడియ నింటికిం దోడ్కొని తెచ్చి యిష్టగోష్ఠి
ప్రకారంబులఁ బ్రొద్దుగడుపుచుఁడి రంత.

79


ఆ.

వేగుఁజుక్క వొడిచె విడువక తామ్రచూ, డంబు లఱచె నిరులడంబు మాసెఁ
దూర్పు దెల్లవారె దోయజమిత్రుండు, పొడవుగొండమీఁదఁ బొలుపు చూపె.

80


ఉ.

అప్పుడు బోటినెచ్చెలులు హాళిని దాసకులాగ్రగణ్యుఁ డై
యొప్పెడుశఁఖదేవుకడ నొయ్యనఁ జేరి కుమారిచందముల్
దప్ప చొప్పడం దెలిపి తా రట నేఁగిన నాతఁ డాత్మలో
ముప్పిరిగొన్నయంగదల మున్గుచు నేమియఁఁ దోఁచకుండినన్.

81


గీ.

కొంతతడవు విచారించి కూఁతుఁ బిలువఁ, బంచి కూర్చుండ నిడి బుజ్జగించి యొడలు
దడవి ముద్దాడి కొండొకదడవునకుఁ గు, మారికామణిఁ గాంచి ప్రేమమునఁ బలికె.

82


క.

అమ్మా నీతలఁ పేమియు, సమ్మతి గాకున్న దిపుడు స్వాంతఁబున కే
నిమ్మాట విని కలంగుచు, రమ్మని పిలిపించినాఁడ రయమున నిన్నున్.

83


గీ.

తల్లి నీ వేమి గోరినఁ దగిలి సేతుఁ, గాని యిక్కానిపని సేయఁ గాదు సుమ్ము
కేరి మఱి యెద్దియైనఁ గాంక్షింపఁబోక, చిడిపిజంగమవానిఁ గాంక్షింపఁదగునె.

84

క.

కులమునఁ గలపెద్దలు విని, వెలిపెట్టినఁ గూడి పొత్తు విడినాడిన హా
తలవంపు లయ్యెడుంగద, చెలియా యీలాటిబుద్ధి చెల్లునె నీకున్.

85


క.

కులమును రూపంబును గల, చెలువుని రప్పించి పెండ్లి సేసెద నీకున్
జలజాక్షి గానిబుద్ధులు, వల దిఁక నామాట వినుము వాలాయముగన్.

86


వ.

అనినం దండ్రికి గంగ యిట్లనియె.

87


ఉ.

పొంగుచు మూఁడులోకములఁ బూనికతో విహరించి పాపముల్
భంగ మొనర్చుచు న్భువనపావని నా విలసిల్లుజాహ్నవీ
గంగను గాని నే మనుజకన్యను గాను నిజం బతండునున్
జంగమవాఁడు గాఁ డల భుజంగమరాజకలాపుఁ డారయన్.

88


గీ.

తండ్రి యిమ్మాటఁ గొంత చిత్తమున నీ వె, ఱింగినది గాక యూరక ఱిచ్చిపడక
యతని రప్పించి వెస వివాహం బొనర్చు, నిఖిలవాంఛాఫలంబులు నీకుఁ గలుగు.

89


క.

ఇటువలెఁ గాకుండిన నా, నిటలాక్షునిపాద మాన నీయాన మఱెం
తటిబలవంతునినైనను, గటకట నే నింక నొరుని గా గాంక్షింపుదునే.

90


వ.

అనిన సంతసిల్లి శంఖదేవుండు వెండియుఁ గూఁతున కిట్లనియె.

91


గీ.

అమ్మ యిమ్మాట నిక్కువం బయ్యెనేని, నతఁడు నిజమూర్తిఁ జూపించి యఖిలదివిజ
వర్తములఁ గూడి యింటికి వచ్చెనేని, ప్రేమ దైవార నే నిన్ను బెండ్లిసేతు.

92


క.

విను మూరక ని న్నొసఁగిన, జనులందఱు నవ్వుఁ గులముసాములు నన్నుం
గనుఁగొని యెగ్గులు వల్కరె, వనితా నీ వెఱుఁగనట్టివల నిఁకఁ గలదే.

93


అ.

అనిన సంతసిల్లి యపుడు గంగాభ, వాని యభవు నాత్మలోనఁ దలఁచి
కరయుగంబు మోడ్చి స్థిరభక్తి దైవార, వినయసరణి నిట్టు లనుచుఁ బలికె.

94


సీ.

సకలలోకారాధ్య సర్వజ్ఞ సర్వేశ గిరిసుతాప్రాణేశ దురితనాశ
భూతభావన పరంజ్యోతిస్వరూప మహాదేవ శంకర హర మహేశ
జగదవనాధార నిగమాంతసంచార ఫాలలోచన భగ నీలకంఠ
నందివాహన భృంగినాట్యప్రమోద గీర్వాణసంస్తుత్య పురాణపురుష


గీ.

నాదబిందుకళామయ వేదవేద్య, చక్రధరబాణ భక్తరక్షాధురీణ
నామనోనాథ కైలాసనగనివాస, వేడ్క నవధారు దేవ నావిన్నపంబు.

95


గీ.

దేవ మాతండ్రి యగుషంఖదేవుఁ డిపుడు, నాకు నీకును బెండ్లి యొనర్పఁ గోరి
తివురుచున్నాఁడు బ్రహ్మాదిదివిజవరులు, దవిలి గొలువంగ వేవేగఁ దరలిరమ్ము.

96

గీ.

నీకు నామీఁదఁ బ్రేమంబు నెరయఁ గల్గె, నేని నే నీకుఁ బ్రియురాలనేని యిపుడె
పేర్మి వైవార జాలారివిభునిమ్రోల, నిలిచి నామాట సత్యంబు నెరపవయ్య.

97


వ.

అని గంగ ప్రార్థింపుచున్నసమయంబున.

98


సీ.

హరియు బ్రహ్మయుఁ బురందరముఖ్యదిక్పతుల్ రవిసుధాకరముఖ్యగ్రహపతులును
సనకోదియోగికుంజరులు వశిష్ఠాత్రిమైత్రావరుణిముఖ్యమౌనివరులు
వీరభద్రకుమారభైరవభృంగిరీటాదిప్రమథనాథు లప్సరసలు
గరుడకిన్నరయక్షగంధర్వఖచరగుహ్యకనాగసిద్ధవిద్యాధరులును


గీ.

బలసి కొలువంగ నసమవైభవముతోడ, నందికేశ్వరు నెక్కి యానందలీల
సకలలోకాధిపతి యైన సాంబశివుఁడు, దాసకులమాళిమ్రోలఁ బ్రత్యక్షమయ్యె.

99


వ.

అట్లు సాక్షాత్కరించిన దాక్షాయణీవల్లభుం బొడఁగాంచి పులకితాశేషావయవుం
డును, నిర్భదానందరసోత్ఫుల్లనేత్రుండును, విస్మయాకులస్వాంతుండును నగుచు
దాసకులజ్యేష్టుండు సాష్టాంగదండప్రణామంబులు గావించి బహుప్రకారంబుల
వినుతించి కృతాంజలి యై యిట్లనియె.

100


గీ.

అభవ నాభాగ్యమహిమ శక్యంబె పొగడ, హరిపురందరకమలాసనాదులకును
గనఁబడగరాని నిన్ను నేఁ గంటి నిపుడు, పావనం బయ్యె నహహ నావంగడంబు.

101


గీ.

నీచకులయింటి కిప్పుడు నీవు వచ్చి, యొనరఁ గన్యార్థివై నిల్చియున్నవాఁడ
వేతెఱంగున నిన్ను సంప్రీతుఁ జేసి, యనుపఁగలవాఁడనయ్య చంద్రోత్తమాంగ.

102


వ.

అని విన్నవించి యొక్కదివ్యమణిమయమందిరంబువ విడియించి, సకలబుధబాంధ
వామాత్యపురోహితసుహృజ్జనంబుల రావించి, శుభముహూర్తంబు నిర్ణయించి,
నిజగృహాదికం బలంకరించి తదనంతరంబున.

103


సీ.

శుభతూర్యనినదంబు లభినవస్థితి మ్రోయఁ గరదీపికాసముత్కరము వెలుఁగ
ద్విజసతీమణులు ముత్తెపుసేసఁబ్రాల్ సల్ల నుర్వీసురేంద్రు లాశీర్వదింప
గణికానికాయ మగ్గలిక నృత్యం బాడ వనజాతముఖులు నివాళు లొసఁగ
వందిమాగధులు కైవారంబు లొనరింప గాయకుల్ గానవైఖరులు నెరప


గీ.

మంగళద్రవ్యములఁ గొంచు మఱియుఁ ఋణ్య, కాంత లరుదేర నత్యంతకౌతుకమున
సకలబుధబాంధవాశ్రితసహితుఁ డగుదు, భవు నెదుర్కొనెఁ గైవర్తపరిభృఢుండు.

104


వ.

అప్పుడు మహాదేవుండు దివ్యదుందుభిధ్వానంబులును, గంధర్వకిన్నరగానంబులును,
రంభోర్వశీప్రముఖాప్సరస్సరోజాస్సాలాస్సావధానంబులును, జండీశ్వరప్రపదిత

గద్యపద్యవిధానంబులును, దివిజర్షభప్రవర్షితదేవతరుప్రసూనంబులును, దేవవిమా
నంబులును, నిరంతరమహోత్సవలీలాముహూర్తవత్ప్రమథభటసంతానంబులును,
బృందారకసుందరీసందోహపరివేష్టితచిత్రమణివితానంబులును, ననూనంబు లై
చెలంగ నందికేశ్వరారూఢుండై, యభినవవైభవంబువ శంఖదేవునగరు బ్రవేశించి,
యచ్చట వాహనంబు డిగ్గి, వివాహమంటపాభ్యంతరంబు సొచ్చి, సముచిత
పీఠాగ్రంబున సుఖాసీనుఁడై యున్నసమయంబున.

105


ఉ.

అంగన లొక్కకొందఱు ప్రయత్నముతోడ నలంకరించి యు
త్తుంగవివాహవేదికి వధూమణిఁ దోడ్కొని తెచ్చి వేడ్క ను
ప్పొంగుచు నున్నయాచకులు భూసురముఖ్యులు నప్పురాంతకున్
గంగను బెండ్లిపీట నిడి కంకణముల్ దగఁ గట్టి రంతటన్.

106


గీ.

శంఖదేవుండు దేవతాసార్వభౌముఁ, డగుమహాదేవునకుఁ బ్రియం బలరఁ గాళ్లు
గడిగి తనముద్దుబిడ్డను గంగ నపుడు, ధారవోసె నిలింపబృందములు వొగడ.

107


వ.

అప్పుడు.

108


సీ.

సిరియను వాణియుఁ జెలఁగి సేసలఁ జల్ల గురుఁ డొజ్జయె లగ్న మరసి తెలుప
హరియు బ్రహ్మయఁ బెద్దలై పనుల్ సమకూర్ప శ్రుతివాక్యములు వసిష్ఠుఁడు వచింప
శచియు నరుంధతీసతి నివాళు లొసంగ రంభోర్వసులు వింతరవళి నాడఁ
దుంబురునారదుల్ దొడరి గానము సేయ దేవదుందుభులు మేల్ ఠీవి మెఱయ


గీ.

హర్షమున విశ్వకర్మ దా నంది యిచ్చు, కసకమంగళసూత్రంబు గంగయరుతఁ
గట్టి శుభ మొందె నసమానగరిమ మెఱయ, సకలభువనాధిపతి యైనశంకరుండు.

109


గీ.

హరునితలన్ గంగయు న, త్తరుణిశిరంబున హరుండు దమిమీఱఁగ వా
విరిముత్తెపుఁదలఁబ్రా ల్వో, సిరి చిఱునగవులు దర్ప శివకరలీలన్.

110


వ.

అట్లు విధ్యుక్తప్రకారంబున వివాహం బొనరించి, కంకణబంధంబు వెడలించి యు
న్నంత నొక్కనాఁ డొక్కశుభముహూర్తంబున.

111


సీ.

ఘనసారహిమనీరగంధసార మపారమృగనాభికామోదమేదురంబు
మణిమయపర్యంకమంజూషికాసాలభంజికాపుంజవిభ్రాజితంబు
తపనీయముక్తావితానకళావికావ్యజనదర్పణచామరావృతంబు
కాలాగరుదశాంకకౌళికసామ్రాణికాధూపవాసనాగంధిలంబు


గీ.

వీటికావేటికాజాలవిలసితంబు, కజ్జలకరండమండలాఖండరత్న
దీపసంతానదీపితోద్దీపితంబు, నైనయొకకేళికాగృహాభ్యంతరమున.

112

క.

మదనవిభంజనుఁ డతిస, మ్మదహృదయాంబురుహుఁ డగుచు మహిళామణికై
యెదురెదురు చూచుచుండఁగ, మదవతు లొకకొంద రపు డమందప్రేమన్.

113


గీ.

బాలికామణిఁ గైసేసి పడకటింటి, కెలమితోఁ దోడుకొని చని యిందుమౌళి
యొద్దఁ గదియించి తమ్ములం బొసఁగఁజేసి, చనిరి సన్నకసన్న నాశంభుఁ డపుడు.

114


గీ.

చిగురుఁబోఁడిని సెజ్జకుఁ దిగిచి బుజ్జ, గించి కౌఁగిటిఁ బెనచి కోర్కెలు దలిర్పఁ
గామశాస్త్రోక్తనియతి నక్కంజముఖిని, రతులఁ గరిగించి సుఖలీలఁ గ్రాలుచుండె.

115


వ.

అట్లు నవోఢాసంగమసౌఖ్యానుభవలీలావైభవంబునం జెలంగుచుఁ, గొన్నివాస
రంబు లచట నుండి, యంతట నొక్కనాఁడు యథాస్థానంబునకు వేంచేయ నుద్యో
గించి, మహాదేవుండు శంఖదేవున కిత్తెఱం గెఱింగించిన నతం డిట్లని విన్నవించె.

116


క.

దేవా నాకుల మెల్లను, బావనమై వెలసె భక్తపాలన విద్యా
ప్రావీణ్యం బేర్పడఁగా, నీ విచ్చటి కరుగుదెంచి నిలుచుటకతనన్.

117


గీ.

దేవ మాయింట నెప్పుడు నీవు నిలిచి, యుండవలె ననుకోర్కె లో నుండు నాకు
వెఱతు నిమ్మాట మీతోడ విన్నవింప, నింక మీచిత్త మెట్టిదో యెఱుఁగనేర.

118


క.

మా కిట నీ వల్లుఁడవై, ప్రాకటగతి నిలిచియున్న భాగ్యంబునకున్
లోకు లెఱుంగఁగ నన్నుం, జేకొని ధన్యునిగఁ జేయు సితకరమకుటా.

119


ఆ.

అనిన మెచ్చి శంభుఁ డటులేని దివ్యజ, లాపహారలింగరూపు నగుచు
నీగృహమున నుందు నిశ్చలభక్తితో, నన్ను గొలుచుచుండు నయవిచార.

120


వ.

అని యతండు గోరినట్లనె కృపఁజేసి మన్నించి యతని నచ్చట నుండ నియమించి
మహోత్సాహంబున.

121


గీ.

అభవుఁ డప్పుడు దివ్యదుందుభులు మెఱయఁ, బ్రమథవరులును దివిజులు బలసికొలువ
గంగతోఁగూడి వృషరాజగమనుఁ డగుచు, లీల వేంచేసెఁ గైలాసశైలమునకు.

122


ఉ.

అంతకమున్న నారదమహామునివర్యుఁడు వెండికొండ కే
కాంతము గాఁగ నేఁగి గిరికన్యక గన్లొని యంబ శూలి దా
సంతస మొప్ప గంగ యనుజాలరికన్నియఁ బెండ్లియాడి నీ
చెంతకు వచ్చుచుండె నిదె చెప్పితి నీకు సవిస్తరంబుగన్.

123


క.

అని దివిజమునివరేణ్యుఁడు, వినిపించి యథేచ్ఛ జనిన విస్మయ మొదవన్
మనమున హిమవద్భూధర, తనయ దిగుల్ పూని తద్దఁ దలఁకుచు నుండెన్.

124

సీ.

అంతట శంకరుఁ డఖిలామరుల యథాస్థానంబులకుఁ బంచి సరభసముగ
గౌరికి వెఱచి యాగంగను జడలలో నిడుకొని నగరున కేఁగుటయును
గొరకొరతోడ నక్కుధరేంద్రనందన తలుపులు బంధించి చల మెలర్ప
మీనాంకదమనుని లోనికి రాకుండ నతికఠినోక్తుల నాడుచున్న


గీ.

మదిఁ గలంగి పురారి యమ్మధురవాణి, కిట్టు లని పల్కె నహహ నీ కిట్టికినుక
యేల నామీఁదఁ బొడమె నే నేమితప్పు, సేసితి వచింపఁగదవె నాచెంత నిపుడు.

125


క.

భక్తపరాధీనుఁడ నే భక్తుల నరయంగఁ గోరి ప్రతిదినము నా
సక్తిని దిరుగుచు నుండుదు, వ్యక్తావ్యక్తుండ నగుచు వనజాతముఖీ.

126


వ.

కావున నాకుం దప్పుగా విచారించి కవాటబంధనం బొనరించు టుచితంబె
యనిన నతనికి భవాని యిట్లనియె.

127


గీ.

ఎచటి కేగితి విందాక నెచట నుంటి, వెవ్వఁడవు నీవు నీతెఱం గే నెఱుంగ
గ్రొత్తపెండిలికొడుకులాగునఁ గడింది, సొగసు కొనియున్నావు చూడ నిపుడు.

128


గీ.

తివిరి కామాంధకారివై తిరుగుప్రోడ, వేమి నీజాడ యింతయు నెఱుఁగరాదు
తెలియఁజెప్పు మటన్న నద్దేవితోడ, సింధురేఖాశిఖామణి యిట్టు లనియె.

129


క.

పర్వేందువదన విను మే, సర్వజ్ఞుఁడ నహహ మేలు సర్వజ్ఞునిపై
నిర్విని జను లెవ్వారు న, ఖర్వమతిం దలఁగి పోరుగద పరికింపన్.

130


గీ.

నీలకంఠుండ నే హరినీలవేణి, నీచెలిమిఁ గోరుకొని వచ్చి నిలిచినాఁడ
నౌర మే ల్నీలకంఠుఁడ వైతివేని, కేక లిడుకొంచు వేగంబె గిరికిఁ జనుము.

131


క.

క్రీడాకిరాతుఁడను నేఁ, జేడియ యటులైన నీవు జింకలు పులులుం
గ్రోడంబులు గలయడవికిఁ, బోడిమితో వేఁటలాడఁ బొమ్మా నెమ్మిన్.

132


సీ.

అబల నేఁ బశుపతి నహహ నీ వట్లైన నాలమందకు ఱంకె లడరఁ జనుము
స్థాణుఁడ నేను గంజాతాక్షి యబ్బబ్బ మోడు మాటాడుట చూడ మెందుఁ
బురసంహరుఁడ నేను బొలత నీ వట్లైన మావీట నుండక మరలి పొమ్ము
పన్నగధరుఁడను బడఁతి నీ వట్లైనఁ బడిగె లెత్తుచు నూళ్లఁ బడి తిరుగుము


గీ.

భూతనాథుఁడ నేను బూఁబోఁడి యట్టు, లేని నల ప్రేతభూముల కేగు మీపుడు
కుటిలకుంతల నే మహానటుఁడ నట్టు, లైనఁ బ్రభువులకడ కేఁగి యాడు మెలమి.

133


క.

చిగురాకుఁబోఁడి విను మే, నగవాసుఁడ నట్టు లొదవినన్ ఱెక్కలతో
గగనమున కెగసి చెట్లకు, జగతస్థితి నిలువఁబోక చనుమా వేగన్.

134


గీ.

విను విరూపాక్షుఁడను నేను వనజవదన, యహహ బుధులు విరూపాక్షుఁడైనవానిఁ
జూడరాదని తఱుచుగ నాడుచుంద్రు, తొలఁగి వేంచేయు మిఁకఁ బెక్కుపలుకు లేల.

135

గీ.

అనుచుఁ దానాడుమాటల కగతనూజ, పొసఁగఁ గల్పించి యుత్తరం బొసఁగుటయును
దలఁకి యాపూర్ణనీహారధామముఖికిఁ, గాలకంఠుండు నమ్మికగా వచించె.

136


గీ.

తెఱవ నే నేమి పాపంబు నెఱుఁగ నీవు, వట్టికప్పులు నామీఁదఁ గట్టి యిట్లు
గలఁక నొందింపనేల యాగ్రహము మాని, వినుము నామాట యొక్కటి వీను లలర.

137


సీ.

ననఁబోఁడి నామాట నమ్మకుండితివేనిఁ జెనకి బెబ్బులివాఁతఁ జెయ్యిడియెద
గట్టిగాఁ బెనుబాముఁ బట్టి యాడించేద విషమైన మ్రింగెద వెఱపు లేక
కొదుగక ఐడిఁ బెద్దగుడి సొచ్చి నిలిచెద నవవీల గోపదం బంటుకొనెద
నంకిలి లేకుండ నగ్గి ధరించెదఁ బట్టుగా ద్విజరాజు ముట్టుకొనెద


గీ.

మఱియు నేబాసయైని నేమమునఁ జేతుఁ, గాన నింక నీతలంపులో మాని మాని
నీశిరోమణి నన్ను మన్నింపు మిప్పు, డెలమితోడుతఁ గదియించి యేలుకొనుము.

138


గీ.

అనిన నంబిక యొక్కింత యాత్మ నలరి, యౌర నీ కిట్టిబాసలు నచ్చివచ్చుఁ
బలుకు లేటికి రమ్మని తలుపుదీసి, పిలుచుటయ నేఁగి యతఁ డొద్ద నిలుచుటయును.

139


గీ.

అతని సంభోగచిహ్నంబు లరసి చూచి, పార్వతీదేవి యిట్లని పల్కె నహహ
యిప్పు డే నేమిపాపంబు నెఱుగనంటి, వెచటి వీచిన్నెలో నాకు నెఱుఁగఁజెపుమ.

140


క.

పసుపును గుంకుమ గంధము, నసమాంబక నీదుమేన నట్టువదలి యే
బిసరుహముఖి యంటించెనొ, కసరక నాతోడ నిపుడు గట్టిగఁ జెపుమా.

141


వ.

అనిన భవుం డిట్లనియె.

142


క.

విను మానిని జనులందఱు, వెనుకయ్యను బూజసేయ వెస నాతఁడు నన్
బెనఁగి కవుంగిటఁ బొదవిన, దనువున నవి యంటుకొనియెఁ దప్పే నాకున్.

143


గీ.

కాలకంధర నీమోవిగంటు లేమి, కారణంబునఁ బొదవె నా గౌరి వినుము
మరునితోడ నెదిర్చి సంగర మొనర్చు, తఱిని గోపించి కీరంబు గఱచెఁ జుమ్ము.

144


క.

హాటకగిరిధర నీమెయిఁ, గాటుక యంటిన దదేమి కారణ మబలా
కాటుక కా దిఁక లత్తుక, గాటపుగరళప్రభావికాసము సుమ్మీ.

145


క.

మే లెంతటి నెఱజాణవొ, బాళిగ దత్తురములాడి వంచించెదవో
బాలేందుజూట నీ మెయిఁ, బూ లంటుకయున్న వేల పొంకక చెపుమా.

146


గీ.

భామ విను మున్ను శ్వేతుఁ డన్భక్తవరుఁడు, వెలవెలందికిఁ బూల్గొంచు వెడలునెడల
గొన్ని మహిమీఁద వ్రాలినఁ గోరి వాఁడు, నాకు నర్పింప నవి యంటి నాటుకొనియె.

147


క.

పన్నగరాజాంగద నీ, కన్నుల కెఱు పేల గలిగె గౌరీ భక్తుల్
ని న్నర్ధరాత్రి నఱకు, నన్ను న్జాగరణ మునిచినం బొసఁగె నిటుల్.

148


గీ.

అంచు నిరువురు నిటు భాషించుతఱిని, నీలకంఠుండు మోహంబు నిలుపలేక

సర్వమంగళచరణకంజములమీఁద, వ్రాలె న న్నుద్ధరింపవే వనిత యనుచు.

149


క.

వ్రాలినఁ గనుఁగొని గిరిసుత, మే లహహా జాణ వగుదు మెచ్చితి నిన్నున్
లే లె మ్మనుచుఁ గవుఁగిట, గీలించి విభుని మనోజకేళిం దేర్చెన్.

150


వ.

అ ట్లుమామహేశ్వరు లన్యోన్యనురాగంబు లినుమడింప నఖండమహావైభవంబు
నఁ బ్రమోదింపుచుండి యొక్కనాఁడు.

151


క.

వేడబ మొప్పఁగ నెత్తం, బాడుచు నున్నంత గిరిజ యాటకు లోనై
యోడి శివుఁ డూరకుండినఁ, గ్రీడామోదమున గౌరి కిలకల నవ్వెన్.

152


వ.

అప్పు డమ్మహాదేవియౌద్ధత్యంబు సహింపలేక శివజటాగ్రంబున గంగ తొంగి
చూచిన దానిం గనుంగొని భవాని శంకరునిమొగంబు చూచి యిట్లనియె.

153


గీ.

ఏమి పాపం బొకింతి నే నెఱుఁగనంటి, వహహ నీకెంజడలలోన నడఁగి తొంగి
తొంగి చూచుచు నున్న దేధూర్తసతియొ, దానిచందంబు తెలుపుమా తడయ కిపుడు.

154


క.

మును దారుకావనంబున, మునిదారల భ్రమలఁ బెట్టి మోహింపఁగఁ జే
సినమేటివన్నెకాఁడవు, నినుఁ జెప్పఁగ నేల యింక నేడు వృషాంకా.

155


క.

భల్లాణరాజుకూరిమి, యిల్లాలే కడిఁదిహొయల నింపొందిన యా
చెల్లాంబం గామించిన బల్లిదుఁడవు నీహొరంగు పలుకం దరమే.

156


గీ.

సురలు నసురులు నమృతంబు సరుదుకొనఁగ, లేక పోరాడుచోఁ జక్రి లీల నొక్క
నెలఁతయై పంచి యిడుచున్న నీవు దాని, వెంటఁబడి పర్వులెత్తవె వేడబమున.

157


వ.

అని మఱియు నిట్లనియె.

158


ఉ.

అక్కట నీవు న న్నిటుల నారడిఁబెట్టి కలంపఁజూచుటల్
నిక్కముగా మదిం దెలియునేరక యూరక మోసపోతి నిం
కెక్కడిసత్యశౌచములు హీనకులంబు వెలందిఁ బెండ్లియై
డక్కగ నెత్తిఁ బెట్టుకొని టక్కులు వల్కెద వేమి చెప్పుదున్.

159


గీ.

తివిరి నామీఁద నొక్కతె దెచ్చి యిపుడు, లేదు లేదని బొంకుపల్కెద వయారె
దానిఁ క్రిందికి దించి నాదఱిని నిల్పి, మాటలాడించుమా యింక మరుగు లేల.

160


క.

తగులమి యొకచోఁ డక్కరి, వగ లొకచోఁ బెరయఁ జెలులు వంచింతురు గ
ట్టిగ నెట్టిబాస చేసిన, మగవారిని నమ్మరాదు మాట లిఁకేలా.

161


వ.

అని పలుకుచున్నసమయంబున.

162


క.

నిగిడెడు కొరకొరతోడన్, మొగ మించుక చేవురింపఁ బోణిమి నబ్రం
బుగ నగభవనునిగడితఁపు, సిగలోపలనుండి గంగ చివ్వున నుఱికెన్.

163

వ.

అప్పుడు భవాని దానిం గనుంగొని యిట్లనియె.

164


క.

ఎక్కడిదానవె నీ విటు, లక్కజముగ నాహృదీశునౌఁదలపైఁ బెం
పెక్కఁగ వసించి యిప్పుడు, చిక్కున నుఱికితివి బుద్ధి సెప్పెదఁ జుమ్మీ.

165


క.

నీ వెక్కడ నే నెక్కడ, భావజహరుఁ డెచట నోసి పరఁగంగ నిఁకన్
గావర ముడిగి తటాలున, వేవేగ మదాలయంబు వెలువడి పొమ్మా.

166


క.

పోకుంటివేని నిన్నున్ రాకాసులవంటి ప్రమథరాజోత్తములన్
దీకొలిపి ప్రోలు వెడలఁగ, నూకింతుఁజుమీ చలంబు నూలుకొనంగన్.

167


వ.

అనినం బార్వతీదేవికి భాగీరథి యిట్లనియె.

168


గీ.

అక్కరో యిట్టిమాటల నాడనేల, నీవు శంభునిఁ గోరి ము న్నేవిధమున
వచ్చి చేకొనియున్నావొ వాలెముగను, నేను నటువలె వచ్చినదానఁ జువ్వె.

169


క.

చిగురాకుఁబోండ్ల కెల్లను, మగఁ డేమారగను మేటిమక్కువతోడన్
సగమేన నిల్పుకొన్నను, సిగలో నిడుకొన్నఁ నీకుఁ జెల్లుఁగదమ్మా.

170


వ.

అనిన భవాని దాని కిట్లనియె.

171


క.

మే లహహా యెంతటిగ, య్యాళివె చేరినటులుండ కఱచెదవు కడుం
గూలికి వచ్చినయాతఁడు, పాలికిఁ బట్టినక్రియ న్విపర్యాసముగన్.

172


ఆ.

అడుగు నిలుపనీక వడికొట్టు చూపుచు, నింగి ముట్టి మిగులఁ బొంగె దేమి
గట్టివాతనంబు గనఁబడనౌనె నీ, నిలువు నీరుగాను నీచురాల.

173


వ.

అనిన గంగ యిట్లనియె.

174


ఆ.

పెద్దదాన వనుచుఁ బెళ పెళ నార్చుచు, జగములెల్ల మ్రింగజాలునట్టి
సత్తిరూపు పూని జడిపింపవచ్చెదు, కినుక నిగుడ నీవు గిరితనూజ.

175


వ.

అనిన హైమవతి యిట్లనియె.

176


గీ.

నిచ్చనిచ్చలుఁ బంకంబు నివ్వటిల్లఁ, గోరి మితిలేనిజలచరకోట్లలోన
నడచుకొనియఁండు చెనటు నయారె నీవు, నన్ను నెదిరింప నెట్టిదానవె తుటారి.

177


ఆ.

వక్రగతులచేత వాలెంబుఁ బెక్కుత్రో, వల వెలుంగుచుండి కలఁక నిగుడఁ
దూఱి మొరసెదేమి దిష్కీర్తి బొడవి నీ, బ్రతుకు బైలు గాను పలువదాన.

178


క.

అనిన న్జాహ్నవి గిరినుతఁ, గనుఁగొని యిట్లనియె నీవు ఘనరాలవె మేల్
మును చండికవై యొకకా, ఱెనుపోతును జంపి దానిహితమతిఁ గొనవే.

179


గీ.

సక్రియ యూరూర దేశదేశములఁ బెద్ద, సత్తివై నిల్చి కూళ్లును శాకములును
గోళ్లు గొరియలు గుగ్గిళ్లు కుడుము లట్లు, దనివిసన మెక్కు కడుపుబద్దరివి గదవె.

180


వ.

అనిన నంబిక యిట్లనియె.

181

గీ.

ఓసి గయ్యాళి నీ కింతరోస మేల, చెడుగుజాలారివానింటఁ బొడమి బిట్టు
చేఁప జెల్లలు దిని మేను చెందకున్న, పరికెతవు నీవు నాతోడ సరియె చెపుమ.

182


వ.

అనిన భాగీరథి యిట్లనియె.

183


గీ.

అప్పరో యింక నీగుట్టు చెప్ప నేల, కల్లు గంజాయి నంజుడు నెల్ల ప్రొద్దు
బాళిగాఁ దిను కడజాతివానియింటఁ, బుట్టితివొ లేదొ చెప్పుమా గట్టిగాను.

184


వ.

అని యిత్తెఱఁగున నిరువురు వాదింపుచున్నసమయంబునఁ గాత్యాయనీదేవి మహా
దేవునిమొగంబు సూచి యిట్లనియె.

185


గీ.

అకట నామీఁద నీ విపు డొకతెఁ దెచ్చి, వాద మొదవించి యెఱుఁగనివానిఁబోలెఁ
జూచుచున్నాఁడ వింక నీచొప్పు దెలిసె, నంచుఁ గోపించి చనుచున్న నళికి హరుఁడు.

186


గీ.

వనితపదపద్మములమీఁద వ్రాలి నేను, దప్పు సేసితి లోఁగొమ్ము దయ దలిర్ప
నిందుముఖి యింక నెలఁతుక లెందరున్న, నీవు పట్టంపుదేవివి గావె చెపుమ.

187


వ.

అని బుజ్జగించి గాఢాలింగనఁబు గావించి గంగచేత భవానికి మొక్కించి
వారిద్దఱిం గనుంగొని యిట్లనియె.

188


ఆ.

ఒక్కచోటఁ బుట్టి యొక్కనిఁ జెంది మీ, లోన మీరు వైర మూని యిట్లు
పో రొనర్పనేల పొలఁతుకలార మీ, రొద్దిమీఱఁ గూడియుండుఁ డింక.

189


క.

అని నగసుత నర్ధాంగం, బున జాహ్నవి ముత్తమాంగమున నిడి కమలా
సనముఖ్యులు గొలువఁగ శివుఁ, డెనయొదవనిఠీవి జగము లేలుచు నుండెన్.

190


సీ.

గడితంపుమువ్వన్నెకడిదిదుప్పటియును బసమీఱుబంగారుపట్టుచేల
రుచిరాభినవచారురుద్రాక్షమాలికల్ మరువైనహురుమంజిముత్తెసరులు
భువనాభిరామవిభూత్యంగరాగంబు సారికాశ్మీరపటీరచర్చ
భూరిశోభాకీర్ణభుజగభూషణములు మణిమయతపనీయమండనములు


గీ.

పాండురారుణవర్ణవిభ్రాజమాన, గాత్రమును గల్గి శృంగారగరిమ నలరు
నర్ధనారీశ్వరేశ్వరుఁ డభవుఁ డిందు, మౌళి భక్తాళి ననయంబు మనుచుచుండు.

191


గీ.

అనుచు భీష్ముఁడు పాండుపుత్త్రునకు గంగ, కథ యెఱింగింప నలరి యాపృధుబలుండు
నిటలలోచనుఁ దలఁపున నిలిపి మ్రొక్కి, యతితరామోదహృదయుఁడై యలరుచుండె.

192


గీ.

శాలివాహనశకవర్షసంఖ్యవసున, వాంగశశిసంజ్ఞ నలరుధాతాబ్దమునను
దగ్గ రచించినయీకృతి ధరణియందు, నాసుధాకరతారార్క మగుచు నుండు.

193


క.

వినుఁ డీకృతి ముప్పదియొక, దినమునకుం జెప్పినాఁడ దేవునియానన్

జను లెన్నఁ గుక్కుటేశ్వర, ఘనకరుణాదృష్టి వలనఁ గవివరులారా.

194


క.

ఈకథ చదివిన వ్రాసిన, బ్రాకటముగ విన్న జనులపాపము లడఁగున్
జేకురు సకలసుఖంబులు, శ్రీకంఠునికరుణచేత సిద్ధము గాఁగన్.

195

ఆశ్వాసాంతము

చ.

అరిబలదర్పశోషణ మహాహివిభూషణ సత్యభాషణా
సరసకృపానిరీక్షణ విచక్షణరక్షణ పుణ్యలక్షణా
హరిముఖనిర్జరావన విషాగ్నినిషేవన విశ్వభావనా
సరసిరుహాక్షసాయక లసత్ఫలదాయక లోకనాయకా.

196


తోటకవృత్తము.

శివశంకరశాశ్వతశిష్టరతా, భవర్గసమాశ్రితభక్తహితా
దివిషజ్జనసేవిత ధీమహితా, వివిధాగమవందిత విశ్వనుతా.

197


మాలినీవృత్తము.

ప్రముదితమునిజాలా భక్తలోకానుపాలా
శమసమదవిభరాగా చారుగంగోత్తమాంగా
ప్రమథగణసనాథా పార్వతీప్రాణనాథా
కుముదహితకలాపా కుక్కుటాధీశరూపా.

198


గద్యము.

ఇది శ్రీమత్కుక్కుటేశ్వరకరుణాకటాక్షనిరీక్షణసంలబ్ధసరసకవితా
సామ్రాజ్యధురంధర, ఘనయశోబంధుర, కౌండిన్యసగోత్రపవిత్ర, కూచిమంచి
గంగనామాత్యపుత్త్ర, సకలసంస్కృతాంధ్రలక్షణకళాకౌశలాభిరామ తిమ్మకవి
సార్వభౌమప్రణీతంబైన శివలీలావిలాసంబను శృంగారరసప్రబంధంబునందు
సర్వంబును ద్వితీయాశ్వాసము.

శివలీలావిలాసము సమాప్తము