శివపురాణము/సృష్టి ఖండము/శివుని అష్ట మూర్తులు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

బ్రహ్మ దేవుడు అతన్ని "నీవు సర్వ భూత స్వరూపుడవు." అని అభినందించి, "నిన్ను వరుసగా రుద్ర నామ ధేయము నుంచి మహా దేవ నామము వరకు నేను ఎలా సృష్టి ఊహ చేశానో చెప్తున్నాను! విను" అంటూ ఇలా వివరించాడు.

1. రుద్రుడు: "యాభి రాదిత్య స్తపతి రశ్మిభి | స్తాభిః పర్జన్యో వర్షతి ||"

అనే వేద ప్రామాణికాన్ననుసరించి నీవు సూర్య స్థానంలో ఉందువు. సూర్యుడే సర్వ చరాచర జగత్తుకు ఆత్మ స్వరూపుడు. (ఆదిత్య హృదయం) జగత్కారణ కర్త. సస్యానుకాల వర్ష కారకుడు. 'సూర్య ఆత్మా జగత సస్థుషశ్చ' అనే స్మృతి వాక్యానుసారం ఈ జీవజాలాన్నంతటినీ ప్రభావితం చేయ గలడు. కనుక - రూపం రౌద్రం. భార్య సువర్చల. కొడుకు శని.

2. భవుడు: 'యోప్సునావం ప్రతిష్టితాం వవేద - ప్రత్యేవతిష్ఠతి' అని శ్రుతి లోకాలన్నీ నీళ్లలో ఓడల్లా తేలు తున్నవని గ్రహించే వాడే భవుడు. కనుక - శరీరం నారము. (అపో నారా ఇతి ప్రోక్తాః!) నీటి యందు నీ ఉనికి పట్టు గలదు. ఈ మూర్తిలో నీకు భార్యా పుత్రులు ఉష - ఉశనులు

3. శివుడు: శర్వుడు అనే నామాంతరంతో గూడ పిలువ బడతావు. శరీరంలో ఎముకలు ఎట్లా నిలబెట్ట బడి ఆధారభూతమై నిలుస్తాయో, ఆ విధంగా ఈ భూమి కూడా నివసించడానికి వీలు కల్పించేలా నిలబెట్టబడి ఉంది. కనుక ఈ మూర్తి యందు నీ ఉనికి పట్టు భూమి. శరీరము - శార్వము. భార్య - వికేశి. కొడుకు - అంగారకుడు.

4. పశుపతి :

"అహం వైశ్వానరో భూత్వా |
ప్రాణినాం దేహ మాశ్రితః ||"

అని గీతా ప్రవచనం.

అన్ని జీవుల శరీరం లోనూ జఠరాగ్ని అనేది జీర్ణ క్రియ కు దోహద కారి. కనుక ఈ మూర్తి లో నీ స్థానం అగ్ని. శరీరం - వైశ్వానరం. భార్య - స్వాహా దేవి. కొడుకు - స్కందుడు.

5. ఈశ్వరుడు : ప్రాణుల శరీరం లోని ప్రాణ, అపాన,వ్యాన,ఉదాన,సమాన అనే నామాంతరంతో వాయువుల రూపంలో ఉండి మానవుల్ని జీవింప చేస్తావు. కనుక ఈ మూర్తి యందు నీ స్థా నం- వాయువు. 'ఈశానస్సర్వ విద్యానాం - ఈశ్వరస్సర్వ భూతానాం' అని శ్రుతి. కనుక శరీరం - ఈశానం. భార్య - శివ. కొడుకు - మనోజవుడు.

6. భీముడు : ఈ మూర్తిలో నీ స్థానం ఆకాశం. దేహం లోని రంధ్రాలలో (బయలు ప్రదేశం) వ్యాపించి ఉంటావు. నీ శరీరం భీమము. దశ దిశలు భార్యలు, స్వర్గుడు కొడుకు.

7. ఉగ్రుడు : యజమానుడైన గృహస్థు రూపంలో నీవు ఈ మూర్తి యందు వశించెదవు. యజ్ఞదీక్ష యందుండు యజమానుడు - నీకు ఉనికి పట్టు. దేవతలను సర్వాంతర్యామిని యజ్ఞంతో సంతుష్టి చేయు వాడవు. నీ శరీరం ఈ మూర్తిలో ఉగ్రము. భార్య దీక్ష. కొడుకు సంతానుడు.

8. మహా దేవుడు : "సోమ ఓషధీనా మధిపతిః" అని శ్రుతి వాక్యము.కనుక నీ స్థానము చంద్రుడు. ఈ మూర్తిలో ఓషధులన్నిటికీ అధిపతివై, వాటిని వృద్ధి చేసి ప్రాణులకు జీవ ప్రమాణ వృద్ధికి దాతవు కూడా అయ్యెదవు. కనుక నీ శరీరము - చాంద్రమసం. భార్య - రోహిణి. కొడుకు - బుధుడు

- ఈ ప్రకారము శివుని అష్టమూర్తి నిరూపణము జరిగినది. ఇదంతయూ సృష్టి వైచిత్ర్యమే! శివుని అష్ట మూర్తులను, ఆయా మూర్తి తత్వాలను గ్రహించిన వాడు ఆ పరమేశ్వరానుగ్రహానికి పాత్రులవు తారు.

అంతే కాదు! ...

"శివనామాష్టకం (శివుని ఎనిమిది పేర్లు) కూడా ఎంతో పుణ్య ఫల దాయకం! ఆ పేర్లు ఇవి: శివాయ నమః, రుద్రాయ నమః, మహేశ్వరాయ నమః, విష్ణవే నమః, పితామహాయ నమః, (ఈ ఐదు పంచ సాధకులకు ప్రియమైనవి). సంసార భిషజే నమః, సర్వజ్ఞాయ నమః, పరమాత్మాయ నమః (ఈ మూడు మోక్ష సాధకులకు శుద్ధ నివృత్తి కారకాలు.) ఉభయ తారక మైన ఈ నామాష్టకం విశిష్టత ఇంతింతని చెప్ప బడనిది. కనుకనే నేను ఈ శివ పురాణం మీకు వినిపింప ప్రారంభిస్తూ - రుద్ర స్తుతి పఠించడం జరిగింది." అని చెప్పాడు సూతుడు.

మహర్షులంతా కూడా సూత మహాముని ఆదే్శానుసారం రుద్ర స్తుతి చేశారు.

అనంతరం ...

తిరిగి సూత పౌరాణికుడీ విధంగా సెలవిచ్చాడు -

"యోవై భ్రహ్మాణం విదధాతి - యో దేవానాం ప్రథమం పురస్తాత్‌ - విశ్వాధిపో రుద్రో మహర్షిః " అని శ్రుతి

దీని ప్రకారం - ఈ వస్తు (గుణ, రూప, రస, గంధ, స్పర్శాత్మక మైన )సమస్తమూ రుద్రుని సృష్టి. బ్రహ్మాదులందరూ అమృత రూపుడిగా ఆరాధించే ఆ పరమేశ్వరుడు అచలుడు. ఆనంద మూర్తి. ఆదిత్య వర్ణుడు, సర్వాధిపతి, తిమిరాతీతుడు. సర్వుడు.

"ఇట్టి పరమేశ్వరుని కన్న పెద్ద గానీ - చిన్న గానీ - సాటి గానీ ఎవరూ లేరు. సర్వ ప్రాణుల యందు - అణువణువు నందు నిండిన స్వయం ప్రకాశక సదానంద మూర్తి. మోక్షార్ధి అయిన వాడు ఆశ్రయించ దగ్గ ఏకైక విరాడ్రూపుడు ఆ పరమేశ్వరుడొక్కడే! శివ తత్వ జిజ్ఞాసువులకు సైతం అందినట్టే అంది, అగోచరమయ్యే మహా మూర్తి మంతమైన తత్వం ఆయనది!" అని చెప్తూన్నంత లోనే "మహానుభావా! మరి మాకొక్క ధర్మ సందేహము. శివ తత్వము తెలియుట ఎట్లు ? ఇతః పూర్వ మెవరైనా అట్టి ప్రయత్నము చేసిన వారున్నారా ? ఉంటే ఏ విధముగా చేసిరి ?" అని ప్రశ్నించారు కొందరు మునీద్రులు

శివ తత్వార్థి యైన నారదుడు :

"నేను ఇప్పుడు ప్రస్తావించ బోవు విషయం సరిగ్గా అదే ! శివ తత్వం గ్రహించే నిమిత్తం ఎందరో ప్రయత్నించారు. అట్టి వారిలో సాక్షాత్తు నారద మునీంద్రులొకరు" అన్నాడు సూతుడు.

"నారదుల వారు లేని పురాణం లేదు గదా! ఆ లోకోక్తి నిజమయ్యేలా ఉన్నదే!" అంటూన్న శౌనకుని వంక చిద్విలాసంగా చూచి, పురాణ కథా శ్రవణం కొన సాగించాడు సూత మహర్షి -

"పూర్వం ఒక కల్ప కాలం వెనుక ఎన్నడో - నారద మునివరేణ్యులు శివ తత్వ జిజ్ఞాసులై అఖండమైన తపస్సు చేశారు. అది ఎంత తీవ్ర తరమైనదీ అంటే ... ఆ తపోగ్రతకు ఎక్కడెక్కడి లోకాలూ జ్వలించి పోసాగాయి. ఇంద్రుడు వెంటనే మన్మథుని రప్పించి, నారద తపస్సుకు విఘాతం కలిగించ వలసిందిగా కోరాడు. 'నారదుడాజన్మ బ్రహ్మచారి. ఆయన మామూలు మునీశ్వరుడు కాడు. ఈ అనగుని బారికి లొంగడు' అని తన అశక్తత వెల్లడించాడు మన్మథుడు. నీ ప్రయత్నం శక్తి వంచనలేకుండా చేయమని చెప్పాడు ఇంద్రుడు. తప్పని సరైన తరుణంలో - వసంత కాలాన్నీ, సుఖ - పిక - కీర - సారికాది గుణాల్నీ, చెరకు వింటినీ, పూల బాణాల్నీ తన మొత్తం సంబారాలనూ వెంట నిడుకొని బయల్దేరాడు మన్మథుడు. నారదుడు తపస్సు చేస్తున్న ప్రదేశానికి వచ్చాడు. తీరా చూస్తే అది ఒకప్పుడు తాను శివ నేత్రాగ్ని జ్వాలలకు దగ్ధమైన చోటు అని తెలుసు కున్నాడు. ప్రస్తుతం నారదుడు అంతటి ముక్కంటి గురించే తపస్సు చేస్తున్నాడు. తనకు మళ్లీ ఏ ఉపద్రవం రానున్నదో! ఇటు ఇంద్రుని ఆజ్ఞను ధిక్కరించనూ లేక, అటు మరో సారి, శివాగ్రహానికి గురి కావల్సి వస్తుందేమో అనే శంక మన్మథుని మనస్సును మధిస్తుండగా, అన్య మనస్కం గానే నారద తపో భంగానికి సిద్ధ మయ్యాడు." సూతుడీ విధంగా చెప్పగానే శౌనకాది మునులందరూ "పౌరాణిక కథా కథన శ్రేష్ఠా! ఈ మన్మధుని వృత్తాంతమేమి ? గతమున అతడెట్లు భస్మ మయ్యెను ?" అని అడిగారు. వారి కోరికపై సూతుడు కామ దహన ఘట్టాన్ని చెప్పడం ప్రారంభించాడు -