శివపురాణము/సృష్టి ఖండము/సృష్టి క్రమము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

మహా ప్రళయ కాలంలో జగత్తులన్నీ నశిస్తాయి. అంతా జల మయం. ఒకే సముద్రంలా తోచే అట్టి అపార జలరాశి ఆవరించి ఉండగా - సహస్ర శీర్ష, సహస్ర కర పాద రూప సహితుడై విరాట్పురుషుడు సత్వ గుణ ప్రేరితుడై సమాధి స్థితి యందు విశ్రాంతి తీసు కుంటాడు. ఆ తరుణ మందు - భూనభోంతరాళములందు ఎటు చూసినా చిమ్మ చీకటి వ్యాపించి ఉంటుంది.

సృష్టి, స్థితి, లయాలకు మూల భూతుడైన ఆది దేవుడొక్కడే వటపత్ర శాయిగా దేదీప్య మానంగా ప్రకాశిస్తూ, తెలివి రాగా నిద్ర లేచి ఈ ప్రపంచపు దురవస్థను చూచి విచారిస్తాడు. రజోగుణ ప్రభావం చేత జ్ఞానాన్ని ఉద్దీపింప జేస్తాడు. అదే పునః సృష్టికి సంకల్పం వంటిది. బ్రహ్మగా, నారాయణుడిగా, రుద్రుడిగా అనేక నామాలతో సంకీర్తింప బడే ఆది విరాట్‌ స్వరూపుడే,జ్ఞానం ద్వారా అహంకారాన్ని, దాన్నుండి మనస్సును, దాని వలన పంచ భూతములైన పృథి వ్యాపస్తేజో వాయు రాకాశాల్ని పుట్టిస్తాడు.

వీటిలో ఆకాశం వల్ల శబ్దం, వాయువు వల్ల స్పర్శ, అగ్ని వల్ల రూపం, జలము వల్ల రసం, భూమి వల్ల గంధం జన్మిస్తాయి. ఆ తదుపరి ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనే పంచ ప్రాణాలు; సత్వ, రజ స్తమం గుణాలనే త్రిగుణాలు ఉద్భవిస్తాయి. ఇందు నుండి సత్వ గుణ ప్రతినిధిగా విష్ణువు, రజో గుణ ప్రతినిధిగా బ్రహ్మ, తమో గుణ ప్రతినిధిగా ఈశ్వరుడు వెలుగొందుతారు.

వీరిలో మహేశ్వరుడు సనాతనుడు, నిరంజనుడు, అరూపుడు, ఆది మధ్యాంత రహితుడు. సృష్ట్యంతాన - తమో గుణ ప్రాబల్యం వల్ల సంహార కార్యానికి ఇతడే కర్త అవుతాడు. అనగా - మరలా ప్రళయ కాల జల రాశికి ఆధార భూతుడౌతాడు. కనుక పరమ శివుడను పేర ఇతడు చిరస్థాయిగా నుండువాడని అర్థం!

"సూక్ష్మంగా తరచి చూడగా పరమ శివుడే పైన చెప్పిన సమస్తం సృష్టించు వాడు. అనగా స్వయంభువు కూడా అతడే అవుతున్నాడు.

తన మహేశ్వరాంశ తో సహా బ్రహ్మ, విష్ణ్యంశ లను కూడా లయ స్థితి కి తెచ్చే ఈ పరమ శివుడు 'ఆది విరాట్పురుషు' డనుటకు సందేహమేమున్నది ? బ్రహ్మ కల్పాంతకాలంలో యోగనిద్ర చెందేది ఇతడే! తిరిగి ఈ సృష్టి లీలా వినోదానికి కారణ భూతుడూ ఇతడే! మహర్లోకంలో ఉన్న దివిజ మహర్షులంతా ఈ లీల లను స్వయంగా పరికింప శక్తి కలిగిన వారు. వారు తప్ప ఇతరులెవ్వరునూ లేరు.

బ్రహ్మగా సృష్టి ఆరంభించి, రాత్రి అయ్యే వరకు ఆ సృష్టి లోనే బ్రహ్మ గడిపే కాలం - 'ఒక కల్ప కాలము'. అటు వంటిదే రాత్రి విశ్రాంతితో గడిపే కాలం - మరొక కల్పకాలం. కనుక ఇటువంటి రెండు కల్పములు (ఒక పగలు - ఒక రాత్రి) బ్రహ్మకు ఒక రోజు.

ఇటువంటి ఒక రోజు జరగాలంటే, 14 మన్వంతరాలు గడవాలి. (మన్వంతరాలు 14. అవి: స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుస, వైవస్వత, సూర్యసావర్ణి, అగ్నిసావర్ణి, బ్రహ్మసావర్ణి, రుద్రసావర్ణి, దక్షసావర్ణి, రౌచ్య, భౌచ్య అనేవి.

వీటిలో ఒక్క మన్వంతరం గడవాలీ అంటే - మానవుల లెక్కల ప్రకారం ఏడు యుగాలు గడవాలి. (అవి: కృత, త్రేతా, ద్వాపర, కలి అనే 4 యుగాలు. ఈ నాల్గు యుగాలూ మరలా అవే ఆవృతమవుతూ ఉంటాయి.) ఒక్కొక్క యుగం లోనూ కొన్ని తరాలకు తరాల జీవులు జనించడం - నశించడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రకారం మానవుల జీవిత కాలం అతి స్వల్పం! కనుక ఈ స్వల్ప కాలాన్నే సక్రమ మైన రీతిలో మలచు కొని, దుస్తరంబైన ఈ మాయామయ సంసారమనే సాగరం నుండి విముక్తి పొందాలి. ఈ ప్రపంచం లోనే మళ్లీ జన్మిస్తూ - మరణిస్తూ ఉండక, ధర్మ ప్రవర్తనతో, జ్ఞాన సముపార్జనతో ఉత్తమ జీవితం గడపడమే విముక్తి సాధన. ధర్మం నాలుగు పాదాలతో నడయాడుతూ ఉంటుంది అవే సత్యము, అహింస, శాంతమూ, దయ. కృత యుగాంతానికి సత్యం నశించినది. త్రేతాయుగం అంత్యకాలం నాటికి అహింస అణిగింది. ద్వాపర యుగం ముగిసే సరికి శాంతం అంతరించింది. ప్రస్తుత కలి యుగమున దయ అంతరించే సూచనలున్నవి. ఆయా యుగాలు ధర్మాలు కోల్పోయాక వచ్చేది ప్రళయం. ఇక పునః పునః సృష్టి!.. ఇదీ సృష్టి క్రమం. ఇదొక చక్రం వలె నిరంతరం ఆవృతమయ్యే విధానం. అందుకే ఆది మధ్య అంతం లేని నిరంతర భ్రమణం. - 'కాలం' యొక్క స్వభావం.

ఈ కాలము అనేది మూడు విధాలు. అవి:- మానుష మానము, దేవ మానము, బ్రహ్మ మానము.

పైన చెప్పిన కల్పముల వంటివి బ్రహ్మ మానం. (ప్రస్తుతము మానుష మానం ప్రకారం - 28వ మహాయుగం లోని 5102వ కలి యుగం నడుస్తున్నది. ప్రస్తుతము నడుస్తున్నది వైవస్వత మన్వంతరం.

ఈ కాల ప్రశస్తి గురించిన ప్రస్తావన తో ప్రథమమున చెప్పినట్లు - ఒకానొక కల్ప కాల ప్రారంభ సమయమున, బ్రహ్మదేవుడు తన వంటి మహా తేజస్వి యైన కుమారుని ప్రభవింప జేయ సంకల్పించాడు.

అంతే!...

సంకల్పించినదే తడవుగా, తేజో పుంజ మనదగిన ఓ గొప్ప కాంతితో నీల లోహిత వర్ణుడైన ఒక కుమారుడు బ్రహ్మ తొడపై ప్రత్యక్షమై, తనకో పేరు కావాలని ఏడవ సాగాడు. రుద్రుడని నామ కరణం చేశాడు బ్రహ్మ. తనకొక్క పేరు చాలదన్నాడు ఆ బాలుడు. ఈసారి భవుడని పేరు పెట్టాడు. ఇంకా ఆ బాలకుడు ఊరకొనక పోవడం వల్ల శివుడు, పశుపతి, ఈశ్వరుడు, భీముడు, ఉగ్రుడు, మహాదేవుడు అనే మొత్తం ఎనిమిది పేర్లు పెట్టి సంతుష్టుని చేశాడు బ్రహ్మ.

"నన్ను అష్టమూర్తిని చేశావు బాగానే ఉంది. మరి వేటికి స్థాన శరీర విశేషాలు, ఉనికి పట్లు, పత్నీ పుత్రులు... ఇన్ని హంగులు ఏ విధంగా కూర్చావో చెప్పు!" అని అడిగాడు - పరమ శివాంశ గల ఆ బాలుడు.