శివపురాణము/సృష్టి ఖండము/బ్రహ్మ - విష్ణువుల సంవాదం

వికీసోర్స్ నుండి

అసలు.. తననెవరు పుట్టించినదీ కూడా ఆ చతుర్ముఖునకు అర్థంకాని స్థితి. అసలు మూలం ఏమిటో శోధించాలని, ఆ పద్మం మొదలు తెలుసుకోవాలని తామరతూడు గూండా ప్రయాణించసాగాడు అతడు. నూరేళ్ళు గడిచినా మొదలు దరిదాపులకు చేరువ కాలేకపోయాడు.

బాగా విసిగి, వెనుదిరిగాడు. ఈలోగా - అనూహ్యంగా పెరిగిపోతూన్న తామరపుష్పం చతుర్ముఖునికి మరింత అందకుండా - అంతు తెలీకుండా పైకెదిగిపోయింది. మరో వందేళ్లు గడిచాయి. ఆది - అంతూ, అసలు - మూలం, పై శిఖరం ఏదీ తెలీక ఆ తామరతూడు మధ్యనే క్రిందు మీదులవుతూ మరో శతవత్సరాలు గతించాయి చతుర్ముఖునికి.

ఇలా ఎంతకాలం? అనే చింత అధికమై, చతుర్ముఖుడు కొట్టు మిట్టాడుతుండగా 'తపించు' అనే అశరీరవాణి హెచ్చరిక తోచింది. ఎంతో తపించిన మీదట, తపోవేగ ప్రయాణఫలాన నారాయణుడి చెంతకు చేరుకోగలిగాడు హిరణ్యగర్భుడు.

చతుర్భుజుడై, నీలదేహుడై, మిలమిల మెరిసే అభరణాల కాంతులతో ప్రకాశిస్తూ నిద్రిస్తున్న నారాయణుని లేపి ఎవర్నువ్వు అంటూ ప్రశ్నించాడు బ్రహ్మ. "కుమారా! నీకు ఇంతకాలం పట్టిందన్న మాట నన్ను చూడడానికి. పోనీ! ఇప్పటికైనా తెలుసుకున్నావు నాయనా!" అని అనునయంగా పలికాడు విష్ణువు.

చతుర్ముఖుడికి కోపం వచ్చింది. నీట్లోపడి నిద్దరోతూన్నది చాలక, ఇన్ని వందల ఏళ్ళు కేవలం పైకీ - క్రిందికీ ప్రయాణించిన తనను.. ఒక్క ప్రయాణంలోనే ఇంతకాలం గడిపిన తనను... ఇంత తేలిగ్గా తీసేస్తాడా? అని రోషం వచ్చింది.

"అసలు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? స్వయంభువుని నేను. అందర్నీ పుట్టించగల శక్తి నాకుంది. అనాదిని. నిద్రమత్తు విడిచి కాస్తచూడు! నా దర్శనంతో పుణ్యాత్ముడివి కమ్ము! అని మహా అహంకార స్వరంతో పలికాడు చతుర్ముఖుడు.

నారాయణుడెంత నయమున భయమున చేప్తున్నప్పటికీ, అంత కంతకూ హిరణ్యగర్భుడి అహం పెచ్చు పెరుగుతోందే తప్ప తరగడం లేదు. మరీ ముఖ్యంగా ఈ నిద్రమొహం తనను చిన్నవాణ్ణి చేసి ఆడించెయ్యడం, చతుర్ముఖుడికి తలకొట్టేసినట్టుగా ఉంది. "అది కాదు కుమారా! ఈ జగత్ సృష్టి నిమిత్తం నిన్ను నాయొక్క నాభికమలం నుంచి ఆవిర్భవింపజేసిన దెవరనుకున్నావు? అది నేనే!" అన్నాడు విష్ణువు.

"చాలించు నీ గొప్పలు! ఎంత కోతలు కోస్తే మాత్రం నమ్మొద్దూ? నేను ముందే చెప్పాను - నీకంటె పెద్దననీ - స్వయంగా పుట్టాననీ!"

"అది నీ భ్రమ!" అన్నాడు విష్ణువు.

"భ్రమపడుతున్నది నీవే! ఎంతయినా, నిద్రమత్తు ప్రభావమే అంత!"

"ఇది మత్తుకాదు చతురాననా!"

'మత్తు కాకుంటే మాయ! కాకుంటే - నీ అజ్ఞానం'. పరిహసించాడు బ్రహ్మ.

"కాస్త తెలుసుకుని మాట్లాడు! శుద్ధ అజ్ఞానివి నీవే!"

"తెలుస్తూనే ఉంది అజ్ఞానమెవరిదో! పరబ్రహ్మాన్ని నేనే!" అహంకరించాడు బ్రహ్మ.

శివమాయా విలసనం అటువంటిది. ఇద్దరూ ఆ మహామాయ కెరఅయి వాగ్యుద్ధ శూరులైపోసాగారు.

సంవాదం ముదురి పాకానబడింది. లీలావినోదాన్ని చూస్తున్నాడు పరమశివుడు. శ్రీ సదాశివుని మహిమ పూర్తిగా తెలియగల సమర్థులెవరు? ఇటు చతురాననుడికీ అంత చతురతలేదు. అటు నారాయణుడికీ పారీణత లేదు. వాగ్యుద్ధం మరింత ముదరసాగింది.

అది అసాధారణ స్థితికి చేరుకున్నాక, ఇక దానికి అడ్డుకట్ట వేయదలచి, పరమశివుడు ఆది మధ్యాంత రహితమైన లింగరూపములతో అక్కడ ప్రత్యక్షమైయ్యాడు. ఆ మహాతేజోలింగ దర్శనంతో అంతవరకూ వారిద్దరికీ కప్పివున్న మాయ యవనిక తొలగింది. బ్రహ్మ విష్ణువు లిద్దరూ పశ్చాతాపం చెంది, శివతత్వ స్ఫురణతో శివుని శతథా స్తుతించారు.