Jump to content

శివపురాణము/సృష్టి ఖండము/బ్రహ్మ విష్ణువులకు తత్త్వోపదేశం

వికీసోర్స్ నుండి

ఆ విధంగా - విధాత, విష్ణువు చేసిన మహత్తర స్తోత్రాలకు సంప్రీతుడై పశుపతి వారిద్దరికి వేదాలను అర్థసహితంగా బోధించాడు. అనేక రహస్య తత్త్వాలను ఎరుకపరిచాడు. అవన్నీ గుహ్యమైనవి. పండితులకు సైతము గహనమైనవి. నిత్య నూతనార్ధాలతో నిరంతరం శోభించునవి. వాదాతీతమైనవి. పండితోత్తములనే పరీక్షకు పెట్టే, అంత విపులార్ధాత్మకమైన వేదాలు మామూలు పండితులమనుకునే వారికి ఎంత మాత్రమూ అందనివి. "అట్టి విశిష్టమైన వేదాలను - వాటి అధ్యయన శీలురను భూలోకమున కేవలము భూసురుల పరము గావించుచున్నాననీ - ఋషుల అంశన జన్మించినందువల్ల అవి బ్రాహ్మణుల సొత్తు అగుచున్నవనీ, అంతటి మహిమాన్వితములైన వేదాలను గాని - వేదపారంగతులను గాని ఎవరైనా తెలిసి తెలియక నిందచేస్తే - వారు నన్నే దూషించినట్లుగా గ్రహించండి.! అంతే కాదు! మీరిరువురు కూడా రాబోయే ఒకానొక కల్పకాలములో బ్రాహ్మణాంశ యందు వివిధ క్షేత్ర - బీజ రూపకంగా జన్మింతురు. ఇందు మరల చెప్పుచున్న విశేషమొకటి కలదు. బ్రహ్మవు అయినప్పటికీ, నీకు రూపపూజ ఉండదు. మానస పూజ మాత్రమే! విష్ణువుకు రెండు రకాల పూజాలూ జరుగును.

పద్మనాభా! బ్రహ్మ సృష్టికి ఎటువంటి అవాంతరాలు కలుగకుండా, దుష్టశిక్షణ - శిష్టరక్షణ కార్యభారము నీవు నిర్వర్తింతువుగాక! అఖండ యశోకారకుడవుకమ్ము! నీ వల్ల నెరవేరని కార్యక్రమములు ఏర్పడినచో, వాటిని నేను తీర్చగలను" అని తన తత్త్వము కొంత బోధించి కొంత వారి విజ్ఞతకు వదలి అంతర్హితుడయ్యాడు శివదేవుడు.

ఋషివరేణ్యులారా! బ్రహ్మవిష్ణువుల గర్వాలను, అతిశయాలను నేర్పుగా అణచిన పరమపురుషుడు చెరొక కార్యభారాన్నీ నిర్వర్తించమని అదేశించిన ఖండమిది" అంటూ ప్రధమ ఖండము ను ఆ నాటికి పరిసమాప్తి చేసాడు.

                                       సృష్టి ఖండము సంపూర్ణము.