శివపురాణము/లింగ వైభవ ఖండము/శివక్షేత్రాంతరాలు, నందీశ్వరాది లింగములు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శివ క్షేత్రాంతరాలు

ఈ 12 ప్రదేశాల్లో ఉన్న శివలింగాలే కాక, నర్మదా - సరస్వతీ సంగమంలో గౌరీశంకరుడు ; తిరుచ్చెన్నగోడ క్షేత్రంలో అర్ధనారీశ్వరుడు, బృందావనంలో గోపీశ్వరస్వామి; హరిద్వారంలో శ్రీ దక్షేశ్వరుడు ; గోకర్ణ క్షేత్రంలో ఆత్మతత్త్వ లింగంగా ప్రసిద్ధి చెందిన మహాబళేశ్వరస్వామి ; అయోద్యలో నాగేశ్వరుడు ; శివసాగర క్షేత్రంలో ముక్తినాధుడు ; తంజాపూరులో బృహదీశ్వరుడు ; భువనేశ్వరంలో లింగరాజుస్వామి ; 'మహీ' నది సంగమ స్థలమైనచోట అంతకేశ్వరుడు ; మల్లికా - సరస్వతీ నదీ సంగమ స్థలాన గల భూతేశ్వర లింగం ; నాగావళీ - వంశధార సంగమ స్థలంలో సంగమేశ్వరుడు ; సింధు తీరాన కపాలేశ, నందీశ్వర, విమలేశ్వర, కంటకేశ్వర లింగాలు ... ఇలా అనంతకోటి లింగాలతో మన భరతఖండము అలరారుతోంది.

ఇవికాక - దివ్యమైనవి ; అవతారగాథల యందు అగోచరంగా మూర్తి రూపాన వెలసిన లింగాత్మక శివరూపములు ఆలయరహితంగానే అర్చించబడుతున్నాయి.

నందీశ్వరాది లింగములు

వీటి తర్వాత - కాలంజరమనే పర్వతం మీద నీలకంఠుడనే శివలింగము ; అలాగే నందికేశ్వర లింగం ; భక్త రక్షణార్థం నర్మదాతీరాన వెలసిన కుంభేశ్వర, కుమారేశ్వర, కుబేరేశ్వర, శూలేశ్వర, సోమేశ్వర, సర్వేశ్వర, పరమేశ్వర, ఆర్తేశ్వర, సింహేశ్వర, మండపేశ్వర, ధుంధురేశ్వర, తీక్షణేశ్వర, మంగళేశ్వర లింగాలు ; ఆంజనేయస్వామి స్వయంగా ప్రతిష్ఠించిన కపీశ్వర లింగం ఎంతో ప్రాముఖ్యమైనవి.

అసలు నర్మదా తీరం అంటేనే - శివలింగాల నిలయమా అన్నంత ప్రశస్తి పొందింది" అని లింగ వైభవం వివరించాడు సూతుడు.

తల్లిని తన్నబోయిన యముడు

సాధారణంగా ప్రతి పుత్రుడూ తల్లిదండ్రులను దైవ సమానులుగానే ఎంచి పూజించుట జరుగుచున్ననూ, కలియుగమునందు ఈ ధర్మము కాల వశమున తిరగబడగలదని సూతమునీంద్రులు అనగా, దానికి కారణమేమిటని శౌనకాదులు అడిగారు.

"మహర్షులారా! కలి ప్రభావం ఇంత అంత అని చెప్పజాలము. జగత్తంతయు ప్రళయానికి చేరువవు తరుణమందు కలి ఇంకనూ విజృంభించును. పాప పుణ్య విచక్షణ నశించును. గో బ్రాహ్మణులు మిక్కిలి బాధించబడుదురు. మహిమల పేరిట ఇంద్రజాల విద్యలు చెలామణి యగుచుండును. మ్లేచ్చజాతులలోని ఎవరినో ఒకరిని సిద్ధ పురుషులను చేసి ప్రజలు కొలిచెదరు. బ్రహ్మా - విష్ణు - రుద్రులకు పూజలుండవు. వారిని ఎవరైనా పూజించువారు ఉన్నచో, అట్టివారు హేళనలకు గురియగుచుందురు. ఇది యంతయు మీకు కల్కిపురాణమున మరి యొకసారి విశదీకరింతును - ప్రస్తుతము మనము మన్వంతరాలను గూర్చి చెప్పుకొనుచున్నందున ఆ విషయమునకు వత్తుము -

సూర్యభగవానుని భార్య సంజ్ఞాదేవి. వీరికి వైవస్వతుడు. యముడు అనే యిద్దరు కొడుకులు, యమి అనే కూతురు కలిగారు.

క్రమక్రమంగా పెరుగుతున్న చండభానుడి తేజాన్ని సంజ్ఞాదేవి భరించలేకపోయింది. ఆమె తన లాగానే - ఉండే మరో స్త్రీని అచ్చుగ్రుద్దినట్లుండే లాగున సృష్టించి, ఆమెకు చాయాదేవి అని పేరు పెట్టింది.

భర్త తేజం వల్ల అలసటచెందినందున సంజ్ఞ కొంతకాలం విశ్రాంతికి పుట్టినింటికి పోదలచి, తన పుత్రుల్ని - పుత్రికను చాయ కొప్పగించి ఏనాడూ వారిని సవతి తల్లి భావంతో చూడవద్దనీ - అట్లే సంజ్ఞకు చాయ ప్రతిరూపం అనే రహస్యం ఎట్టి పరిస్థితిలోనూ వెల్లడి చేయవద్దనీ కోరింది. సరే అంది చాయ.

కొంతకాలం గడిచింది---

విశ్రాంతి తీసుకొని, భర్త దరిచేరుటకు తిరిగొచ్చిన సంజ్ఞకు చాయ ఎంతమాత్రం ఆ అవకాశం ఇవ్వలేదు.

ఈలోగా - చాయకు సావర్ణి, శని అనే పుత్రులు ; తపతి అనే కూతురు సూర్యుని వల్లనే జన్మించారు. తన పిల్లల్ని ఓ విధంగా, తన సవతి పిల్లల్ని ఇంకో విధమంగా చూడసాగింది.

యముడు ఇది భరించలేకపోవడంతో, చాయను ఎడమ కాలితో తన్నబోయాడు. నీ కాలు కుంటిదైపోవుగాక! అని శపించిందామె. అందుకే కలియుగంలో యమ ధర్మరాజు ఒంటికాలితో కుంటుతాడని అంటారు.

యముడు ఈ శాపం సంగతి తండ్రి చెవిన వేశాడు. కన్న కొడుకును, ఆ తల్లిని - వారి ప్రవర్తనల్ని పరిశీలించాడు. చాయని నిగ్గ దీయడంతో ఆమె సంజ్ఞచే సృజించబడినదని తెలిసేసరికి, ధర్మనిర్ణయం విషయమై అ ప్రత్యక్షసాక్షి సంకట స్థితిలో పడ్డాడు.

కొడుకును చేర బిలిచి "నాయనా! యమధర్మరాజా! ఇందులో నీ తప్పేమీ లేదయ్యా! నీవు ధర్మ పరిపాలకుడవుగానే అన్ని యుగాలలోనూ ఉంటావు. శాపకారణమనేది నీకు కలియుగంలో మాత్రమే వర్తించే విధంగా అనుగ్రహిస్తున్నను"...అని వరంగా మార్చాడు.

ఆ తరువాత - సూర్యుడు తన దివ్యదృష్టిచేత సంజ్ఞాదేవి ఎక్కడున్నదీ తెలుసుకొని ఆమె గుర్రం రూపంలో ఉండడం చూచి, తానుగూడా గుర్రం రూపం ధరించి ఆమెను చేరుకున్నాడు.

అలా గుర్రం రూపంలోనే వారికి కలిగిన సంతానమే అశ్వినీ దేవతలుగా మనం గ్రహించాల్సి ఉన్నది. వారిని వైద్య శాస్త్రములో నిష్ణాతులను చేసి దేవతలకు వైద్యులుగా అనుగ్రహించాడు సూర్యుడు.

ఆ తదుపరి---

తల్లులు ఎట్టి వారైనను, జన్మనిచ్చినందున వారిని దూషించుట గాని, ఆనాదరణ చేయుటగాని ; హింసించుటగాని ; అంతంచేయుట గాని -

అనే ఈ నాలుగు ఘోర కృత్యాలను నాలుగు మహా ఘోరాలుగా ప్రకటించి, అట్టి పనిని ఏ పుత్రుడు చేయునో వానికి ప్రాయశ్చిత్తం లేని విధంగా ధర్ముడు శిక్షించ వచ్చునని ఆనతినిచ్చాడు.." అని సెలవిచ్చారు సూత పౌరాణుకులు.

నందీశ్వర లింగావిర్భావం గురించీ, వైశాఖ శుద్ధ సప్తమినాడు నర్మదలో గంగ అంతర్లీనంగా నివసించడం గురించీ ప్రశ్నించారు శౌనకాదులు. దానికి సూత మహర్షి ఇలా చెప్పసాగాడు---

"చాలా అద్భుతమైన ఇతిహాసం అడిగారు. చెబుతా - వినండి!

ఒకానొకప్పుడు, కొన్ని మన్వంతరాల క్రిందట సువాదుడనే బ్రాహ్మణుడు తన తల్లి అస్థులను కాశీ వద్ద గంగానదిలో కలిపేందుకు బయలుదేరాడు.

దారిలో 'వింశతి' అనేచోట మజిలీ చేసి, ఆ రాత్రి ఒక బ్రాహ్మణుని ఇంట తలదాచుకున్నాడు.

ఆ రాత్రి తొలిజాము గడిచేసరికి ఒక వింత జరిగింది.

సువాదుడు బసచేసిన గృహస్థుడికి ఒక ఆవు ఉన్నది. దూడను చేపుకోసం ఆవు దగ్గరకు తీసుకొస్తుండగా, తన తొందరలో ఉన్న దూడ ఆ గృహస్తు కాలిని తొక్కింది. కోపగించుకున్న ఆ బ్రాహ్మణుడు, ఓ దుడ్డు కర్రతో బాదడమే గాక దూడను గోవు దగ్గర వదలకుండా కట్టేశాడు. పాపం! ఆ లేగదూడ ఆకలి కొద్దీ అలా అరుస్తూనే ఉంది.

తల్లికి చాలా కష్టంగా తోచింది. కాని, ఏం చేయగలదు? కొంతసేపటి తర్వాత దూడను ఓదార్చింది. "నీకు కలిగించిన ఈ కష్టమే -

ఈ బ్రహ్మణుడికి కలిగిస్తాననీ, అందువల్ల బ్రహ్మహత్యా దోషం సంభవించినా సరే! దాన్ని పోగొట్టుకొనే మార్గం తెలుసు" అనీ పలికేసరికి, గోవు మాటలు విన్న సువాదుడికి చాలా ఆశ్చర్యం కలిగింది.

మరునాడు ఉదయం ఏవో కారణాంతరాల వల్ల, ఆ గృహస్థు పాలుపితికే బాధ్యత కొడుకుపై ఉంచి, ఎటో వెళ్ళాడు. ఆ పిల్లవాడు ఆవు దగ్గరకు రాగానే, అది ఒక్కసారి కొమ్ములతో పొడిచింది. బాలకుడు మరణించాడు. గృహస్థు కోపం సంగతి తెలిసిన ఆ ఇల్లాలు, ఆవుకు కట్లువిప్పి వదిలేసింది.

కాశీప్రయాణంలో మరో మజిలీకి సిద్ధం అయిన సువాదుడు, ఆవును అనుసరిస్తూ వెళ్ళాడు. చిత్రంగా ఆవు శరీరం నల్లగా కమిలిపోయింది. అది వడివడిగా నర్మదా తీరాన్ని చేరింది.

లింగరూపుడై ఈశ్వరుడు వెలసివున్న తీర్థానికి దగ్గరలో ముమ్మారు మునిగి (నర్మదా జలాలతో కూడిన) తన శరీరంపై వున్న నీటిని లింగంపై పడేలా చిలకరించింది.

అంతే! ఆ గోవు బ్రహ్మహత్యా పాతకం మటుమాయమై పోయిందనడానికి సంకేతంగా, దాని శరీరం పై ఏర్పడ్డ కారునలుపంతా కూడా పోయింది. నర్మదను అర్చించి, వెంటనే అక్కడున్న లింగరూపుని దర్శించి - పూజించి కాశీకి బయల్దేరాడా బ్రాహ్మణుడు - అపరిమితాశ్చర్యం లోంచి ఇంకా తేరుకోకుండానే.

ఎట్టకేలకు కాశీ చేరి, గంగను ప్రార్ధించగా ఆమె స్త్రీ రూపంలో బ్రాహ్మణునికి ప్రత్యక్షమై "ఆ ఆవు మునిగినచోట అతి పవిత్రమైనది. ఈ రోజు వైశాఖ శుద్ధ సప్తమి. గంగ నర్మదలో నివశిస్తుంది.

ఆ ప్రదేశంలో ఉన్న లింగమే నందీశ్వరలింగము. అక్కడ నీ తల్లి అస్థికలు నిమజ్జనం చేస్తే ఆమెకు తప్పక శివ సాయుజ్యం అందగలదు" అని ఉపదేసించింది.

గంగామాత చెప్పిన చొప్పున, అతడా విధంగానే నర్మదాంతర్గత గంగ నివశించు ప్రదేశాన తన తల్లి అస్థులు కలుపగా, ఆమె దివ్యరూపంతో సువాదునికి కనిపించి "నాయనా! నీవు ధనధాన్య సమృద్ధిని చెంది చిరాయువై వర్దిల్లెదవు గాక! నాకు ఉత్తమగతులు కల్గించిన నీవు వంశ విస్తరణ కర్త వగుదువుగాక!" అని ఆశీర్వదించింది.

ఒకానొక రుషిక, బల్యవితంతువు,సదా శివ ధ్యాన తత్పరురాలై నర్మదా తీరమందున శివారాధన చేస్తుండగా 'మూఢు డ' నే రక్కసుడు ఆమె వెంటపడి వేధించ బూనినపుడు రుషిక శివుని లింగరూపునిగా ఉండమని కోరిన మీదట అక్కడ వెలిసిన పరమశివు డీనందీశ్వర లింగము.

ఇది జరిగిన వైశాఖ శుద్ధ సప్తమీ దినమందు, బ్రహ్మాది దేవతలంతా అక్కడకు రాగా - గంగామాత కూడా వచ్చి నర్మద యందు అంతర్వాహినిగా ప్రవహించినందు వల్లనే, ఆ ప్రదేశానికి అంతటి మహిమ కలిగింది" అని వివరించాడాయన.

పరమ మాహేశ్వరుని లింగవైభవాన్ని పునః పునః స్మరించుకుంటూ, శౌనకాది మునులు సాయం సంధ్యాద్యనుష్ఠానాలకై లేచారు.

శ్రీ శివమహాపురాణ ప్రవచనం సూతమహర్షి అరంభించిన నాటి నుండి, రోజుకో 'సంహిత' శౌనకాది మహర్షులు వింటూ వచ్చారు.

తొమ్మిదవరోజు కూడా యధావిధిగా, అంతా అయనను పరివేష్ఠించి ఉండగా సూత పౌరాణికుడు ఇలా చెప్పసాగాడు :..

                        లింగ వైభవ ఖండము సంపూర్ణము