శివపురాణము/లింగ వైభవ ఖండము/ద్వాదశ జ్యోతిర్లింగాలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

"సప్త జన్మల పాపం నశించి సన్మార్గ వర్తనలు కావడని కీస్తోత్రం అత్యంత ఫలప్రదాయమైనదనీ - కేవలం స్మరణ మాత్రాన సంకల్ప సిద్ది కలుగుతుందనీ వివరించారు మన పూర్వీకులు.

" ఓం సౌరాష్ట్రే సోమనాధం చ !

శ్రీ శైలే మల్లికార్జునం !!

ఉజ్జయిన్యాం మహాకాళం !

ఓంకారే పరమేశ్వరం !!

కేదారం హిమవతః పృష్ఠేః !

ఢాకిన్యాం భీమశంకరం !!

వారణాస్యాం తు విశ్వేశం !

త్ర్యంబకం గౌతమీతటే !!

వైద్యనాధం చితాభూమౌ !

నాగేశం దారుకావనే !!

సేతుబంధే చ రామేశం !

ఘశ్మేశం చ శివాలయే !!"

మునులంతా అయనతో శృతి కలిపారు. అనంతరం

ఆయా స్థలాల విశేషాలు చెప్పమని శౌనకాది మునివరేణ్యులు కోరగా సూతుడు ఇలా చెప్పసాగాడు.

1. సౌరాష్ట్ర:

"ఈ పన్నెండు జ్యోతిర్లింగాలలో మొదటిది ప్రభాసక్షేత్రంలో ఉన్న సోమనాధ స్వామి. (సోమనాధ లింగం)

దక్ష ప్రజాపతి తన 27 గురు పుత్రికలను (అశ్వని, భరణి మొ|| 27 నక్షత్రాలు వీరే) చంద్రునకిచ్చి పెళ్లి చేశాడు. కాని చంద్రుడు ఒక్క రోహిణి యందు మాత్రం ఎక్కువ ప్రేమకలిగి, మిగతా వారిని సరిగ్గా చూడకపోగా వారంతా తమ తండ్రితో చెప్పుకున్నారు.

అది సహించని దక్షుడు, చంద్రుని క్షయ వ్యాధిగ్రస్తుడై పోవాలని శపించాడు. బ్రహ్మదేవుని సూచనమేరకు, చంద్రుడు ఈ ప్రభాస తీర్థానగల శివలింగాన్ని అర్చించి రోగ విముక్తుడైనాడు. సోముడు అనగా చంద్రుడు. లింగరూపుడై ఇక్కడ వెలసిన శివుని ఆరాధించాడు కనుక దీనికి సోమనాధ క్షేత్రం అని పేరు వచ్చింది.(ప్రస్తుతం ఇక్కడ వున్న సోమనాధ మందిరంలోని గర్భగుడి క్రింద ఉన్న గుహలో - ఆనాటి చంద్రార్చిత శివలింగాన్ని చూడగలం!)

2. శ్రీశైలం:

ఆంద్రదేశమందున్నదీ శ్రీశైల క్షేత్రం. శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిగా కొలువై ఉన్న స్వామివారు సాక్షిగణపతి సహితుడు కూడ!

క్రౌంచ పర్వతం వీడి అలిగి వెళ్లిపోయిన తమ కుమారుని షణ్ముఖుని వెతుకుతూ ఇక్కడ జ్యోతిర్లింగ రూపుడై వెలశాడు. 'శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే' అని ఇక్కడ శ్రీశైల శిఖర దర్శనం చేసిన వారికి పునర్జన్మ అనేది ఉండదని శ్రుతి.

3. ఉజ్జయిని:

శిప్రా నదీ తీరంలోని (మాళవ) ఉజ్జయినీ నగరంలో మహా కాళేశ్వర లింగం మూడవది.

ఉజ్జయిని రాజు చంద్రసేనుడు శివార్చనపరుడై ఉండడం చూసి, శ్రీకరుడనే గోపబాలకుడు ఆ విధానం శ్రద్ధగా పరికించి తానూ ఒకరాతిని తెచ్చి అట్లే పూజించసాగాడు. ఇంట్లో వాళ్లు అతని పూజకు ఆటంకం కల్పిస్తున్న కొద్దీ అతడిలో భక్తి తత్పరత అధికం కాసాగింది. చివరకు స్వామి ఆ రాతిలోనే స్థిరపడ్డాడు.

సంధ్యా సమయంలో ఈ కాళేశ్వర లింగాన్ని దర్శించడం విశేష ఫలప్రదం.

4. అమలేశ్వరం:

మాళవ దేశంలోని నర్మదాతీరంలో ఉన్న ఈ జ్యోతిర్లింగం, ఈ క్రమంలో నాలుగవది.

పర్వతాలన్నిటిలోకెల్లా తానే గొప్ప పర్వతాన్ననే అహంకారంతో వింధ్యపర్వతం విర్రవీగుతూండగా, అట్టి వింధ్యుడికి - అహంకారం అణచడానికి నారదుడు నడుం కట్టాడు.

పర్వతాల్లో కెల్లా మేరువే గొప్పవాడని - అతడికి దైవత్వం ఉందనీ నారదుడు చెప్పడంతో, తానూ దైవత్వం సాధించాలని వింధ్యుడు నర్మదా నదీ తీరాన అమలేశ్వరంలో పార్థివ లింగారాధన చేసి, పరమేశ్వరాను గ్రహానికి పాత్రుడయ్యాడు. దేవతల కోరిక మేరకు జ్యోతిర్లింగ రూపుడై పరమశివుడు ఓంకార మూర్తిగా వెలశాడు.

5. కేదారం:

హిమాలయ పర్వత శ్రేణులలో, ఒక కొండ కొనకొమ్ము ఆకృతిలో సదాశివుడు కేదారనాధుడిగా అవతరించడానికి నరనారాయణులనే మునివర్యులే కారకులు. వారి ఉగ్రతపోదీక్షకు మెచ్చిన శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపుడైనాడు.

6. ఢాకిని:

సంపూర్ణ శివభక్తులైన సుదక్షిణ - కామరూపుల జంట సంరక్షణార్థం పార్వతీపతి జ్యోతిర్లింగ రూపుడై సహ్యాద్రి కనుమలలో భీమనదీ ఉత్తర దిశాతీరాన భీమశంకర జ్యోతిర్లింగంగా (త్రిపురాసుర సంహారము తర్వత) వెలసిన తావు ఢాకిని, ఇక్కడ విహారానికి వచ్చి, ఈ ప్రాంతపు నైర్మల్యానికి ముచ్చటపడి లింగరూపుడైనాడు.

సర్వసంకటహరుడుగా, భీమేశ్వర లింగానికున్న ఖ్యాతి అనంతం.

7. వారణాశి:

మహా క్షేత్ర తీర్థరాజమై, సర్వ విద్యాధామమై విరాజిల్లే (అవిముక్తం) ముక్తి క్షేత్రమైన వారణాశి లేదా కాశీ సాంబశివునికి అత్యంత ప్రీతి పాత్రమైన ప్రదేశం.

ప్రళయకాలంలో కూడా - ఈ క్షేత్రాన్ని విశ్వేశ్వరుడు లయం నుండి మినహాయింపు ఇచ్చినట్లు ప్రతీతి.

స్వామి లింగరూపుడై ఇచ్చట వెలసి, సదా సుప్రసన్నంగా సర్వ సేవ్యంగా ఉంటాడు. అన్నఫూర్ణ - ఢుంఢి వినాయక బిందుమాధవ సహితుడైనట్టి ఈ ప్రదేశానికి 'కాశ్యాంతు మరణాన్ముక్తిః' అని ఇక్కడ మరణించేవారికి ముక్తి కలుగుతుందని శాస్త్ర వచనం.

శ్రీహరి తపస్సు చేసిన విశేషస్థలి కూడ.

8. త్రయంబకం:

బ్రహ్మగిరిపై గౌతమ మహర్షి తపస్సుకు అనుగ్రహించి, నాసికవద్ద తన జటాజూటం నుండి గోదావరి నదిని ప్రవహింపజేసి అనుగ్రహించిన పరమేశ్వరుడు ఈ నదీ తీరాన త్రయంబకేశ్వరుడనే జ్యోతిర్లింగంగా వెలిశాడు.

9. వైద్యనాదం:

రావణాసురుని అనుగ్రహించిన శివుడు, తానే స్వయంగా ప్రసాదించిన లింగం ఎక్కడా క్రిందపెట్టకుండా పూర్తిగా చేతులతో మాత్రమే తీసుకేళ్లాలని ఆంక్షపెట్టి మరీ ఇచ్చాడు. ఎక్కడ దానిని భూమిపై ఉంచితే అక్కడ ప్రతిష్ఠాపన అయిపోగలదన్నాడు.

తన లంకానగరిలో ప్రతిష్ఠించాలన్న తాపత్రయంతో దాన్ని పొందివున్నాడు రావణుడు.

వింధ్య పర్వతాల దగ్గర కొచ్చేసరికి, కారణాంతరాల వల్ల లింగాన్ని చేతుల్లోంచి దించవలసివచ్చి, సమీపంలోనే ఉన్న ఓ గొల్లపిల్ల వాడిని పిలిచి తాను వచ్చి తీసుకొనేదాకా ఆ లింగం చేతుల్లోనే ఉంచవలసిందని కోరాడు. ఈలోగా దేవతల ప్రేరణచే, ఆ గొల్లడు రావణుడు రాకుండానే దాన్ని నేలన పెట్టేశాడు.

ఇంకేమూందీ? అది అక్కడే ప్రతిష్ఠితం అయిపోయింది. పర్లి అనే ప్రాంతంలో ఈ జ్యోతిర్లింగ ప్రతిష్ఠకు గొల్లని రూపంలో శ్రీకృష్ణుడే కారకుడని ఐతిహ్యం. ప్రత్యక్షంగా రోగనివారకుడై వైద్యనాధస్వామిగా అనుగ్రహిస్తున్నాడిక్కడ.

10. ద్వారక:

నాగనాధుడు లేక నాగేశ్వరుడుగా ద్వారకా పట్టణాన విరాజిల్లు తున్న పరమేశ్వర జ్యోతిర్లింగం పదవది.

దారుకుడనే రాక్షసుడి బారినుండి సుప్రియుడు అనే మహాశివార్చనాపరుని రక్షించి జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు ఇక్కడ. ఈ లింగార్చన వల్ల చక్రవర్తిత్వం సిద్ధిస్తుందని నలచక్రవర్తి నిరూపించాడు.

11. రామేశ్వరం :

త్రేతాయుగంలో రాముడు, రావణవధ అనంతరం, సేతుబంధనం చేసిన ప్రాంతంలో శివార్చన చేసి, జ్యోతిర్లింగ రూపంలో అక్కడే స్థిరుడిగా ఉండమని కోరగా పరమేశ్వరుడు అనుగ్రహించాడు.

12. దేవగిరి:

దక్షిణాదిన దేవగిరి పర్వత సమీపంలో ఘశ్మ అనే మహా భక్తురాలి కోరికపై ఘశ్మేశ్వర లింగరూపుడైనాడా మహేశ్వరుడు".

..అని అయా జ్యోతిర్లింగాల విశేషాలను చెప్పిన సూతుడు, మరోసారి ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం చేసి, స్తోత్రపఠన ఫలితాన్ని ఈ విధంగా ఎరింగించాడు -

శ్లో. ద్వాద శైతాని నామాని - ప్రాతరుత్థాయ యః పఠేత్‌

సర్వ పాప వినిర్ముక్తం - సర్వసిద్ధిప్రదం లభేత్‌ ||

యం యం కామ మపేక్ష్యైవ - పఠిష్యంతి నరోత్తమాః

ప్రాష్యంతి కామం తం తం హే - పరత్రేహ మునీశ్వరాః ||

ఏతేషాం పూజనే నైవ - వర్ణానాం దుఃఖనాశనం

ఇహలోకే పరత్రాపి - ముక్తిర్భవతి నిశ్చితం ||

ఉదయం మేల్కొంటూనే, ఇప్పుడు చెప్పుకున్న 12 జ్యోతిర్లింగాలను స్తోత్ర రూపాన గాని - నామరూపాన గాని భక్తితో తలచుకొనువారలు పాపాల నుండి విముక్తులవుతారు. ఎవరెవరు ఏ యే కోరికలతో ఇది పఠిస్తారో వారికాయా కోరికలు తప్పక సిద్ధిస్తాయి. ఇక - ఆ జ్యోతిర్లింగాల దర్శనం, పూజ సిద్ధించిన వారికి ఇహలోకంలో సమస్తసంపదలు కలిగి, పరమునందు ముక్తి తథ్యం!