Jump to content

శివపురాణము/రుద్ర ఖండము/శివుని అష్టమూర్తి నిరూపణము - పంచ బ్రహ్మావతారాలు

వికీసోర్స్ నుండి

నవావతార రుద్రమూర్తులు

"శ్వేతవరాహ కల్పంలో 7వ మన్వంతరం (వైవస్వతం) లో సంభవించే ద్వాపర యుగాంతం (ప్రస్తుతం నడుస్తున్న కలియుగానికి ఐదువేల ఏళ్ళకు పూర్వం)వేదవ్యాసుడికి సహకరించే నిమిత్తం శిఖా యజ్ఞోపవీత ధారుడై శ్వేతాచార్యుడిగా అవతరిస్తాడు. రెండో ద్వాపరంలో సుతారుడిగా; తృతీయ ద్వాపరంలో దమనుడిగా; చతుర్ధ ద్వాపరంలో సుహోత్రుడిగా; ఐదు ఆరు ఏడు ద్వాపరాలలో వరుసగా కంకుడు, లోకాక్షి, జైగీషవ్యుడుగా; అష్టమ నవమ దశమ ద్వాపరాల్లో వరుసగా దధి వాహన, ఋషభ, తపోధనావతారాల్లో దర్శన మిస్తాడు.

ఈ విధంగానే 28 ద్వాపరాల్లోనూ అవతరించే శివుడి అవతార నామధేయాలు వరుసగా ఇలా ఉంటాయి: ( 11వ ద్వాపరం నుండి 28వ ద్వాపరం వరకు) తపుడు, అత్రి, బలి, గౌతమ, వేదశిర, గోకర్ణ, గుహవాస, శిఖండి, మాలి, అట్టహాస, దారుక, లాంగలీక, శ్వేతయోగి, శూలి, దండి, సహిష్టు, సోమశర్మకు లీశావతారాలు. శైవం వర్ధిల్లేలా ఆయా అవతారాలకు శివత్వం మూర్తీభవిస్తుంది.

శివుని అష్టమూర్తి నిరూపణము

ఈ శివపురాణ ప్రారంభముననే స్తుతించబడిన రుద్ర స్తోత్రాంతర్గతమైన శివుని అష్టమూర్తి నిరూపణము మనకు ప్రత్యక్ష ప్రమాణంగా కనిపించగలదు.

వీరిలో మొదటి మూర్తి (ఈశ్వరుడు)'శర్వుడు'. భూమిని అధిష్టించి ఉంటాడు. అనగా భూమిమూర్తిగా కలిగి ఉంటాడని అర్థం. ఇక జలాధిష్ఠాన మూర్తి భవుడు. సమస్త విధ అగ్నులకు మూర్తి రూపుడు రుద్ర నామధేయుడు. లోపలా బయటా నిరంతరం చలించే వాయు రూపుడు ఉగ్రుడు. ఐదోవాడు - పంచభూతాత్మకుడు - ఆకాశరూపుడు భీముడు. క్షేత్రజ్ఞుడై, జీవాత్మలో వసించే మూర్తి రూపుడు పశుపతి. సూర్యాంతర్వర్తియై ప్రకాశించే సప్తమూర్తి ఈశానుడు, ఇక సచ్చిదానంద మయుడైన యజమాన రూపుడై విరజిల్లువాడు శివుడు.

పంచ బ్రహ్మావతారాలు:

బ్రహ్మ ధ్యానమూర్తియై ఉండగా, ధ్యానఫలం వల్ల గౌరవర్ణంతో జన్మించిన తొలి అవతారం 'సద్యోజాత బ్రహ్మావతారం'. అయితే ఈ అవతార ఉద్దేశం కేవలం - శివజ్ఞానప్రచారమే కనుక, కేవలం నల్గురు శిష్యులకు మాత్రమే దర్శనీయమైంది. నందుడు,ఉపనందుడు, సునందుడు, విశ్వనందుడు అనే వారికి మాత్రం సద్యోజాత శివ సందర్శన భాగ్యం లభించింది. మనస్సున లీనమయ్యాడు.

ఈ క్రమంలో రెండవది - వామదేవ బ్రహ్మావతారం. ఇరవయ్యో రక్తకల్పంలో ఎర్రని బ్రహ్మ శివధ్యాన యోగంలో ఉండగా సంభవమైంది ఈ అవతారం. ఈ అవతార ముఖ్యోద్దేశం - బ్రహ్మకు ఈ చరా చర జగత్తును పుట్టించే శక్తిని ప్రసాదించడం వరకు పరిమితమైంది. విరజ, వివాహ, విశోద, విశ్వభావనుడనే నలుగురు శిష్యులకు ఈ అవతారం చూసి తరించే యోగం కలిగింది. ఇతడూ అంతర్హితుడై మనస్సున లీనమయ్యాడు.

మూడోది - తత్పురుష బ్రహ్మావతారం. ఇందు శివుడు పీతాంబరధారి. ఇరవయ్యొకటో కల్పంలో జరిగిందీ అవతార సృష్టి. ఇందులో బ్రహ్మకు సృష్టిని వివిధ రకాలుగా చేయగల సామర్ధ్యం ప్రసాదించబడింది. శిష్యవర్గం లేదు. ఇతడు హృదయవాసి, ఆత్మతత్త్వం తెలిసినవాడు.

అఘోరబ్రహ్మావతారం నాలుగవది. శివకల్పంలో జరిగిందీ అవతారం. పూర్తిగా నలుపు శరీరం బ్రహ్మకు, తన ప్రమేయం అవసరం లేని విధంగా సమస్తవిధ సృష్తిక్రమమునందు పరిపూర్ణ సామర్ధ్యం చేకూర్చడానికి ఈ అవతారరూపుడైన శివునికి కృష్ణ, కృష్ణాస్య, కృష్ణశిఖ, కృష్ణకంఠధరులు శిష్యులు. ఈ అవతారం కూడా కేవలం బ్రహ్మకే పరిమితం. బుద్ధి తత్వావాసి.

ఈశానబ్రహ్మావతారుడైన పంచబ్రహ్మగా అవతారం దాల్చినాడు శివుడు. ధ్యానమగ్నుడైవున్న బ్రహ్మకు సృష్టికారక పురుషుడ్ని చూపించడం కోసం ఎత్తిన ఈ అవతారమందు శుద్ధస్ఫటిక వర్ణుడూ - సర్వాభరణ భూషితుడూ అయిన పురుషుడుగా ఉద్భవించి జీవుడిని అధిష్టించి ఉంటానని సెలవిచ్చాడు - భోగాశ్రయుడైనవాడు.

పంచబ్రహ్మావతారాల్లో ఈశానుడే మనకు దగ్గరయినవాడు.