Jump to content

శివపురాణము/రుద్ర ఖండము/రుద్రావిర్భావం - ఏకాదశ రుద్రాలు

వికీసోర్స్ నుండి

సూతమహర్షి చెప్పుచున్నాడు:

ఆరవనాటి ఉదయం, తిరిగి విహితమైన అనుష్ఠానాలన్నీ పూర్తి చేసుకున్న అనంతరం - శౌనకాది మహర్షుల; మహర్షిపత్నుల వంక దయా దృక్కులు ప్రసరిస్తూ "మునిసత్తములారా! నేనీ రోజు చెప్పబోవు రుద్రఖండము, శ్రీ శివపురాణం మొత్తానికే తలమానికము. శ్రద్ధాళువులయి వినెదరుగాక!" అని ఉపోద్ఘాతించి - అందరి వంకా సాభిప్రాయంగా చూసి తిరిగి చెప్పసాగాడు -

శివుని ఆరంభావతారాలు:

"సజ్జనులు - సుజ్ఞానులు అయినవారు భక్తి, జ్ఞాన, వైరాగ్యాదుల ద్వారా గుర్తించి ఆరాధించగల తొలి అవతారాలు చెబుతాను వినండి! అవి ఈశ్వరుని దశావతారాలుగా ప్రసిద్ధికెక్కాయి.

1. మహాకాలుడు (పరదేవతః మహాకాళి)

2. తారుడు (పరదేవతః తారాశక్తి)

3. బాల భువనేశ్వరుడు (బాల భువనేశ్వరి పరదేవత)

4. షోడశ కళాయుక్త శ్రీవిద్యేశ్వరుడు (శ్రీ విద్యేశ్వరి)

5. భైరవుడు (భైరవి)

6. భిన్న మస్తకేశుడు (భిన్నమస్త)

7. ధూమవదీశుడు (ధూమేశ్వరి)

8. బగళాముఖేశ్వరుడు (బగళాముఖి)

9. మాతంగేశ్వరుడు (అమ్మవారు మాతంగి)

10. కమలేశ్వరుడు (ఆమె - కమలాదేవి).

పరదేవతాసహితంగా ఇవీ శివావతారాలు. ఇవికాక - ఏకాదశ రుద్రాలు; నవావతారాలు; అష్టమూర్తులు; పంచబ్రహ్మావతారాలు; నందీశ్వర - భైరవ - కాలబైరవ - శరభ - యక్ష - ఉగ్ర నృసింహావతారాలు; వైశ్వానరుడనే అగ్నిముఖేశ్వరుడు, దూర్వాసావతారము, హనుమదవతారము, వేతాళవతారాలు, వైశంనాధ - యతినాధ - ద్విజేశ్వర - భిక్షువర్య - అశ్వత్థామాది అవతారాలు...ఈ విధంగా అనంతంగా ఉన్న ఈశ్వరావతారాలు మహాగుహ్యమూ - గహనమూ అని గ్రహించాలి! వీటిని రేఖామాత్రంగా స్పర్శించినా, శివుని రుద్రలీలలను వివరించడానికి నాకైనా అసాధ్యమే! సహస్రముఖాలు శతకోటి సంవత్సరాలు (మానవ కాల ప్రమాణరీత్యా) ఏకధాటిగా చెప్తే సాధ్యపడవచ్చునేమో! అంత విస్తృతమూ - భాష్యయుక్తమూ అయినదీ రుద్రసంహిత! పై చెప్పిన శతరుద్రల గురించి మీకు ఓ వరసక్రమంలో - నా చేతనైనంత వివరించే ప్రయత్నం చేస్తాను...

రుద్రావిర్భావం:

పరమ మాహేశ్వరుడు, తన సంపూర్ణాంశతో అర్ధనారీశ్వరుడిగా ఆవిర్భవించాడు. పుడుతూనే తనతోపాటు ఎన్నో రుద్రగణాలను కూడా ఆవిర్భవింప చేసుకున్నాడు. ఇదే ప్రకృత్యాతీతమైన మహారుద్ర సృష్ఠి.

అర్ధనారీశ్వరావతారం:

బ్రహ్మ ప్రాకృతిక జీవధాతువులతో మానవ సృష్టి గావించాడు. కాని, వాళ్ళు పెరుగుదల లేక అలానే ఉండిపోయారు. అనగా వారి నుండి పునః సృష్టి లేకపోవడం చూసి విచారగ్రస్తుడైనాడు బ్రహ్మ.్ అపుడు అశరీరవాణి స్త్రీ పురుషులను (మిధున ప్రకృతి) కల్పించమని పలికింది. బ్రహ్మకు స్త్రీ రూపం ఏమిటన్నదీ అర్ధం కాలేదు. రుద్రుని పరిపరి విధాల ప్రార్ధించాడు. అప్పుడు శివానుగ్రహం వల్ల రుద్రుని అర్ధనారీశ్వర తత్త్వం, దృగ్గోచరమైంది బ్రహ్మకు. తననుండి శక్తిని విడదీసి చూపించాడు - రుద్రుడు. అప్పుడా రుద్ర భ్రూమధ్యమమున, ముక్కు ప్రారంభపు మూలనుండి ఆవిర్భవించిన దేవీ అంశ స్త్రీ రూపసృష్టికి దారి చూపింది బ్రహ్మకు. అనంతరం ఆ శక్తి శివునిలో లీనం అయిపోయింది. ఇదీ - పరమాద్భుతమైన , రుద్రాత్మక అర్ధనారీశ్వర అవతారం.

ఏకాదశ రుద్రాలు

దేవతలు రాక్షసుల బాధల కోర్వజాలక తమ తండ్రి అయిన కశ్యపుడిని ప్రార్ధించారు. శివునికై తపించిన కశ్యపుడికి శివానుగ్రహం కలిగింది. దేవతల దుఃఖాన్ని ఆయన శివునికి వివరించి, దారిచూపమన్నాడు.

సురభి యందు కశ్యపుడికి పదకొండుగురు కొడుకులుగా శివుడు ఉద్భవిస్తానని మాట ఇచ్చాడు. ఆ ప్రకారమే కాలాంతరంలో...

1. అజపా , 2. అహిర్భుద్నుడు, 3. చండుడు, 4. కపాలి, 5. భవుడు, 6. భీముడు, 7. పింగళుడు, 8. విలోహితుడు, 9. విరూపాక్షుడు, 10. శంభుడు, 11. శాంతుడు అనే రూపాలతో జన్మించాడు.

ఇదే ఏకాదశ రుద్రావతరణం. ఈశాన్య దిక్కున వాసం ఏర్పరచుకున్న ఈ 11 గురు శివరూపులే శిష్టుల్ని రక్షిస్తూ లీలావిలాసాలు ప్రదర్శిస్తున్నారు. "నమో రుద్రేభ్యః" అని ఆపాడు సూతమహర్షి.

మునులంతా కూడా ఇదే మంత్రాన్ని రుద్రాధ్యాయం నుండి ఉచ్చైస్వనంతో పఠించారు. అనంతరం...