Jump to content

శివపురాణము/యుద్ధ ఖండము/శ్రీహరి మోహినిగా మారుట

వికీసోర్స్ నుండి

అ అవకాశాన్ని దేవతలు చటుక్కున ఉపయోగించుకున్నారు.

చూడగానే శరీరం వశందప్పి, కామం కన్నులు గప్పేసేటంత త్రైలోక్యసౌందర్యం తనను ఆవహింపజేసుకుని శ్రీ మహావిష్ణువు మోహినీ అవతారం ఎత్తి, హొయ్యారంగానడుస్తూ తన కులుకులతో రెప్పవెయ్యడం కూడా మర్చిపోయేలా రాక్షసుల్ని వలలో వేసుకోవడానికి సంసిద్దుడయ్యాడు.

మాయామోహిని మోసం

అంత హఠాత్తుగా తమమధ్యకు ఈ సుందరాంగి ఎలా వచ్చిందా అన్న విచక్షణ లేకుండా, అంతవరకూ అమృతం జుర్రుకుందామనుకున్న అసురగణం అ మోహిని చుట్టూ చేరి, ఆమె అందాన్ని జుర్రుకోవడానికి పోటీపడసాగారు.

విష్ణుమాయా విలాసాన్ని తెలుసుకోగలవార లెవ్వరు?

అంతగానూ ఒకర్నొకరు తోసుకుంటూ తనమీద పడిపోబోతుంటే, వారిని లాఘవంగా తప్పించుకుంటూ దేవతలవైపు ఓ చూపు ప్రసరించింది.

ఇక - దేవతలూ తోసుకోసాగారు ఆమెకోసం.

చిరునవ్వుతోనే, వారిని కన్నుగీట వారించి, ఒక్కనిమేషమాత్రం తానేమిటో వారికెరుక చేయడంతో, దేవతలు అప్రమత్తులైనారు.

కాని...

దనుజులు మాత్రం మరింత ప్రమత్తతతో, ఆ మోహిని కులుకు విలాసాలకు చిత్తుచిత్తుగా అయిపోసాగారు.

ఎవరికీ అందకూండా, తన వంపుసొంపులు ప్రదర్శిస్తూనే "చూడబోతే మీ రెండుపక్షాలకు ఏదో తగాదా ఉన్నట్టుంది!" అంది.

ఆమె సమ్మోహక శక్తి అలాంటిది...

మొత్తం విషయమంతా పోటీపడి, రాక్షసులు నివేదించారు.

అంతా సవివరంగా చెప్పి "సుందరీ! నువ్వే న్యాయం చెప్పు! ఒకటికాదు ..రెండుకాదు..అసంఖ్యాకంగా సముద్రం అట్టడుగు నుండి పైకి తేలిన సమస్త సంపద తమదే అని ఈ దేవతలు బుకాయించి స్వర్గానికి తరలించేశారు. అయితే - ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి! ప్రళయ భీకరమైన హాలాహల విషాన్ని మాత్రం ఆదిదేవుడైన బోళా శంకరుడు మ్రింగి మమ్మల్ని ఆదుకున్నాడు. ఆయనే గనుక దాన్ని మ్రింగి ఉండకపోతే, మేం మలమలా మాడి మసైపోయేవాళ్ల మనుకో! ఆ అగ్ని కీలలు అంతటివి! ఆ గరళకంఠునికి ఏమిచ్చినా ఋణం తీరదు. ఏదో మా శక్తికొద్దీ ఆ హాలహల గళధారికి చల్లదనం ఉంటుందని చంద్రుడ్ని ఆయనకు సమర్పించుకున్నాం! మా కానుకను ఆయన శిరసావహించి, చంద్రుడిని నెత్తిన పెట్టుకున్నాడనుకో! అదలావుంచు! మొత్తం మీద అన్నీ దేవతల పరం అయ్యాయి! కనీసం ఇదొక్కటి మాకు వదిలెయ్యండీ అన్నాం! ఒప్పుకోవడం లేదు. భాగం కోసం పట్టుబడుతున్నారు. పోనీ నువ్వు చెప్పు! ఇదేం న్యాయమో!" అంటూ మళ్లీ సుందరి అందాన్ని కళ్లతోనే త్రాగేసే ప్రయత్నంలో పడ్డారా దానవులు.

"ఎంతమాత్రం న్యాయం కాదు! ఇది పూర్తిగా మీకే చెందినా...నాకో సందేహం!" అని అర్ధోక్తిలో ఆగింది మోహిని.

'పూర్తిగా చెందుతుంది' అని నిర్ధారిస్తే అది సాక్షాత్తు భగవానుడు చెప్పాడు గనుక, వరంగా పరిణమించే అవకాశం ఉన్నందున సగంలోనే ఆపేశాడు మోహినీరూపుడైన దామోదరుడు.

"సుందరికి సందేహమా? ఏమిటో అడిగేసేయ్ " అంటూ తొందరించారు రాక్షసులు.

"మరేం లేదు! ఇది పంచుకొనే ఆత్రంలో మీలో నేనుముందు అంటే నేనుముందు అనే వాక్ కలహం బయల్దేరి, అది చేతుల్ధాకా వచ్చిందంటే అమృతం చుక్క మిగలకుండా నేలపాలయిపోతుంది గదా!" అంది సుందరి.

"సరిగ్గా చెప్పావు! దీనికి దారేది?" అంటూ వాళ్లంతా ఆలోచనలో పడగా, తాను పంచగలనని క్రీగంట సూచించింది మోహిని.

ఆమె వాల్చూపులకు దాసోహం అన్నారు దానవ గణం. తక్షణం అమృత భాండాన్ని ఆమె చేతిలోపెట్టారు.

మాయా విలసనంలో మాత్రమే కాదు! మాటకారితనంలోనూ తన నేర్పు చూపించదలచినది మోహిని! వారి నోటితోనే వారిచేత 'న్యాయాల యోచన పేరిట' ఓ వాగ్దానం తీసుకున్నది.

'న్యాయానికే కట్టుబడి ఉంటాం!' అన్నారు రాక్షసులు.

"మీరు నిజంగా ఉత్తములు! ఇక్కడో ధర్మసూక్షం ఉంది. దానవోత్తములారా! అసూయకొద్దీ దానవులు దేవతల్ని వంచించీ - బలిమిచేత వంచీ అమాంతం లాక్కున్నారనే అపవాదు మీకు సంప్రాప్తించడం మీకు ఇష్టమేనా? ఈ లోకనిందకు మీరు సిద్ధమేనా?"

ఆలోచనలో పడ్డారు అందరూ.

"నిజమే! లోకులు సహజంగానే బయటకు కనిపించునది మాత్రమే నిజమని నమ్ముతారు. కంటికి కనిపించని కథ వారికేల? కంటతడిపెట్టుట అన్నది ఎవరికి జరిగినా, సానుభూతికి ఎంతో ఆస్కారం ఇచ్చినట్లే!" ఒప్పుకున్నారందరూ.

"అయితే నామాట వినండి! మీకు మేలుచేయడానికే నా యోచన. మీరంతా సముద్ర స్నానం చేసిరండి!" అని రాక్షసులను అవతలకు పంపించి, దేవతలందర్నీ ఒక వరసలో కూర్చుండ బెట్టింది - మోహిని.

ఆ విధంగా రాక్షసుల్ని వంచించి దేవతలకు అమృతం పంచి పెడుతున్న వైనం రాహుకేతువులనే ఇద్దరు రాక్షసులు గమనించారు. కనుసైగలు చేసుకుంటూ అందులో ఏదో మోసం ఉందని గ్రహించారు.

ఎవరిహడావిడిలో వాళ్ళున్నారులెమ్మనే దైర్యం కొద్దీ, చల్లగా ఆ ఇద్దరూ వచ్చి సూర్యచంద్రుల ప్రక్కనే కూర్చున్నారు. సూర్యచంద్రులకు ఆ సంగతి అర్థమయ్యేలోగానే, మోహిని వారి చేతుల్లోనూ అమృతం పోయడం జరిగిపోయింది.

సూర్యచంద్రులు మోహినికి మాత్రమే అర్ధం అయ్యేలా, వారిద్దరూ రాక్షసులని కనుసైగ చేశారు.

తక్షణం సుదర్శన చక్రం వచ్చి, వారి తలలను తరిగి పారేసింది.

నిజానికి - ఆ అమృతప్రభావం అనన్యం, అసామాన్యం కనుక, అది స్పర్స మాత్రముననే కాస్త ఫలితం ఇవ్వడంతో వారు విరూపులుగానే ఐనా చావకుండా మిగిలారు.

తదుపరి - బలిచక్రవర్తి బుద్ధి కుశలత మేరకు దానవులు చేసేదిలేక, యుద్ధ ప్రయత్నం కూడా విరమించుకొని వెనుదిరిగిపోయారు. తదాది వారికి దేవతలపట్ల మరింత అసూయ ప్రజ్వరిల్లసాగింది.