శివపురాణము/యుద్ధ ఖండము/జలంధరుని జననం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

కైలాసంలో ఉన్న పరమశివ దర్శనార్ధం వెళ్లిన దివస్పతి, బృహస్పతులిద్దర్నీ పరీక్షించదలచాడు పార్వతీపతి. తనను ఎంత వరకు తెలుసుకోగలుగుతారో చూద్దామని, శూలి తలక్రిందులుగా వ్రేళ్లాడే భేతాళ రూపంలో కనిపించాడు.

దేవేంద్రుడికి లీల అర్ధం కాలేదు. స్వర్గాధిపతినన్న అహంకారంతో వున్నాడాతడు. శివుని తెల్సుకోగల జ్ఞానం అహంకారం వల్ల అణగిపోగా - దర్పం కొద్దీ "శివుడు కైలాసంలో లేకుండా ఎటు వెళ్లాడో నీకేమైనా తెలుసా వ్రేళ్లాడే జీవుడా?" అని అడిగాడు.

బదులు చెప్పకపోయేసరికి ఆగ్రహించిన వజ్రపాణి, ఆయుధ ప్రయోగానికి సిద్ధపడ్డాడు. ఆ చేతిని అలాగే స్తంభింపజేశాడు మహేశ్వరుడు. క్రోధం కొద్దీ భేతాళరూపం మీదకు లంఘించబోయాడు ఇంద్రుడు. ఫాల నేత్రాగ్నిలో కాలిన మన్మధునిగతే వజ్రికీ పట్టేదే గాని, ఆయన ముడోకన్ను తెరిచేలోగా, చప్పున బృహస్పతి అసలు సంగతి గ్రహించినవాడై తాను స్తుతిస్తూనే ఇంద్రుని కూడా శివుని ముందు మోకరిల్ల జేశాడు.

అప్పటికే - అరవిచ్చిన కంటిలోంచి ఎగసిన ఒకటి - రెండు అగ్ని కీలల్ని లవణసముద్రంలోకి విసిరేసి అంతర్ధానం అయ్యాడు శివుడు.

అలా ఈశ్వరుని కోపం ద్వారా జ్వలించిన అగ్నివల్ల జన్మించాడు జలంధరుడు. బ్రహ్మను గురించి ఘోరతప మాచరించి, ఒకానొక దానవ రాజేంద్రుడైన కాలనేమియొక్క పుత్రికను వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు బృంద. రాక్షస బంధుత్వం కలుపుకోవడంతో, దైవాంశ వల్ల జన్మించి నప్పటికీ రాక్షసునిగానే పరిగణింపబడ్డాడు -జలంధరుడు.

ఒకనాడు ఇష్టాగోష్ఠి ప్రసంగంలో రాక్షస గురువు ప్రసంగ వశాత్తు క్షీరసాగర మధన ఘట్టం చెప్పడంతో - జలంధరుడు దైవద్వేషిగా మారి, సర్వ సైన్యసమేతుడై స్వర్గం మీద యుద్ధం ప్రకటించాడు.

ఆ యుద్ధంలో - జరామృత్యుభయంలేనివా రైనప్పటికీ, దేవతల సంఖ్య కంటె దానవుల సంఖ్య అపరిమితంగా ఉండడంతో -వాళ్లకు రాక్షస పీడ అధికమైంది.

అది తట్టుకోలేని దేవతలు పారిపోయి మేరుపర్వత గుహాంతర్గత లైనారు. స్వర్గం జలంధరుని వశమైంది.

శత్రుశేషం మిగలరాదన్న ముద్ధనీతికొద్దీ దేవతలు దాగిన చోటు నుంచి, వారిని పరారీ చేయించేదాకా విశ్రమించలేదు జలంధరుడు.

విష్ణువుతో తలపడిన జలంధరుడు

దేవతలందర్నీ రక్షించడానికి సన్నద్ధుడైనాడు శ్రీహరి. లక్ష్మీదేవి భర్తను వారించింది. సముద్ర తనయయైన తాను, జలంధరుడుకి సోదర వరుస అవుతున్నందున, తన తమ్ముడ్ని చంపవద్దని కోరింది.

అతడు శివఫాలాగ్ని సంజాతుడనీ, పైగా బ్రహ్మచేత వరాలు పొంది ఉన్నవాడనీ, కనుక చంపదల్చుకోలేదనీ సతికి అభయం ఇచ్చాడు శ్రీపతి.

కేవలం జగడం కోసం మాత్రమే జలంధరునితో తలపడిన జగన్నాటక సూత్రధారి, శివేచ్చ ననుసరించి అంతు తెలియనంత కాలం అతడితో అలా యుద్ధం చేస్తూ అలసిపోయేలా చేశాడేతప్ప, జలంధరుడిని నిజంగానే వధించలేదు. శ్రీమతికిచ్చిన మాట నిలుపుకోవడానికే అలా చేశాడు తప్ప, తల్చుకుంటే శ్రీహరికి జలంధర వధ ఓ ఘనకార్యమే కాదు!

జలంధరుడి పోరాట పటిమకు అచ్చెరువొందిన లక్ష్మీపతి ముచ్చట పడి యుద్ధ శాంతిని ప్రకటించి , ఏదైనా వరం కోరుకోమన్నాడు.

తాను దైవద్వేషిగా మారినా, దేవతల్లో శిష్టుడైన విశ్వంభరుడు తనను ప్రేమమీర వరం కోరుకోమనే సరికి, ఓ క్షణం పాటు జలంధరుడికి నోట మాటరాలేదు.

కాస్సేపటికే తేరుకున్న ఆనందంలోంచి స్తుతిలోకి దిగి, వరస కూడా కలిపి మరీ ఇలా కోరుకున్నాడు జలంధరుడు.

"బావా! వాసుదేవా! నిజంగానే నువ్వు నన్ను అనుగ్రహించదలిస్తే, అంతకంటే నాకు వేరే ఆనందం ఇంకొకటి ఉండదు. పైగా నీవు మాకు అక్కగారైన సిరితల్లికి పతివి! కనుక నిన్ను వేరే వరం ఏలకోరవలె! సతీసమేతంగా వచ్చి; నా ఇంట నివసిస్తే నాకు అదే చాలు!" అన్నాడు జలంధరుడు.

జలంధరుడు ఇలా కోరడంలో రాజకీయమైన అంశం గ్రహించు కున్న రమాపతి ఖంగుతిన్నాడు. కానీ ఏం చెయ్యగలడు! వరం అను గ్రహిస్తానని చెప్పి తీరా మాట తప్పితే అంతకన్న పరువు తక్కువ మరొకటి ఉండదు కదా! 'ఇటు బంధు మర్యాదా చేసినట్టు ఉంటుంది - అటు దేవతలకు కిటుకులు చెప్పగల కేశవుడిని దేవతలకు దూరం చేసినట్టూ ఉంటుంది' అని ఆ కోరిక కోరాడు జలంధరుడు. వరం అనుగ్రహించడానికంటే, ఏదైనా ఉపాయాంతర మున్నదా అని ఆలోచించాడు శౌరి.

"నేను వరం ఇవ్వడానికి అభ్యంతరం ఏంలేదుగానీ, మీ అక్కయ్య పుట్టింట ఎంతకాలం ఉండగలదు? స్త్రీ పుట్టింట ఎక్కువకాలం ఉంటే లోకులేమనుకుంటారు?" అంటూ మెలిక పెట్టబోయాడు మురారి.

"నాకు తెలీని లోకరీతి చెప్తున్నావా - మాధవా! ఆడపిల్లని పుట్టింటి వారు సగౌరవంగా ఆహ్వానించాలేగాని, ఆమెకి పుట్టినింటి మమకారం తరగని గని అని నేను తెలుసుకోలేనా?" అంటూ వైకుంఠునికు వాగ్బంధనం చేశాడు జలంధరుడు.

సతీసమేతంగా వెళ్లి జలంధరుడింట నివసించడం వినా గత్యంతరం లేకపోయింది శౌరికి.

ఉన్న ఒకే ఒక్క ఆధారం, వైరి పక్షంలోకి మారిపోవడంతో - అమరులకు ఏం చెయ్యడానికీ - పాలుబోలేదు.

ఇలా ఉండగా, త్రిలోకసంచారి నారదుడు అలవాటులో పొర పాటువలె వైకుంఠంలోనికి అడుగుపెట్టి, అంతలోనే నారాయణుడు జలంధరుని అతిథిగా వెళ్లిపోయిన వైనం గుర్తొచ్చి, నారాయణ నామ స్మరణం చేసుకుంటూ స్వర్గం ప్రక్కగావెళ్తూ, లోపలికి తొంగిచూశాడు - ఇంద్రుడికోసం.

ఇంకెక్కడ ఇంద్రుడు? జలంధరుని ధాటికి ఏనాడో స్వర్గాన్ని దానవులకు అప్పజెప్పేసి పరివార సమేతంగా గుహల్లోకి పరారీ అయి పోయాడని తెలిసి, ఇంద్రుడ్ని వెతుక్కుంటూ ఓ గుహాంతర్భాగంలోకి జొరబడ్డాడు.

విచారం మొత్తం మూర్తీభవించినట్టున్న ఇంద్రుని చుట్టూ, అంతకంటే విచారగ్రస్తులై ఉన్న దేవతాగణాలను చూశాడాయన.

బృహస్పతి జరిగిన సంగతంతా విశదంగా తెలియపరిచాడు దేవర్షికి.

"బుద్ధికి బృహస్పతి అంటారే! ఏదైనాసరే దేవతల నుద్ధరించే ఉపాయం చెప్పలేకపోయారా?" అని అడిగాడు నారదుడు.

"ఇంకెక్కడి బుద్ధి? ఇంకెక్కడి తేజస్సు? తమస్సావరించింది మమ్మల్ని! అంతా - ఆ మురారితోనే మరలిపోవగా, పరారీ అయి ఇక్కడ తలదాచుకున్నాం!" అని దీనంగా పలికిన బృహస్పతి మాటలకు చలించిపోయాడు నారదుడు.

"త్రైలోక్య సంచారీ! మా విచారాన్ని దూరం చెయ్యగల మార్గం తమకేదైనా స్ఫురిస్తుందేమో! తమరే ఓ దారి చూపాలి!" అని దేవతలు యావన్మందీ నారదుల వారిని ఓ మాట అడిగిచూశారు.

దైవ పక్షపాతి అయిన సురమౌని, తననంత పెద్దను చేసి సలహా అడిగినందు కయినా వారికి మేలు చేకూర్చాలని నిర్ణయించుకున్నాడు. ఆయన ఏం చేసినా, అది జగత్కళ్యాణ కారకమవుతుంది గదా!

"తప్పకుండా మీకు శుభమగుగాక! ఇక చూడండి నా తడాఖా" అని ఓ గొప్ప పథక రచన చేశాడు దేవర్షి.