శివపురాణము/కైలాస ఖండము/మహావాక్యార్ధ నిరూపణము

వికీసోర్స్ నుండి

1. ఓం తత్త్వమసి = నీవు బ్రహ్మమై యున్నావు.

2. ఓం అహంబ్రహ్మాస్మి = శివాత్మకుడైన నేనే బ్రహ్మమును.

3. ఓం ప్రాణోస్మి = నేనే ప్రాణమునై యున్నాను.

4. ఓం ప్రజ్ఞానం బ్రహ్మ = పరిపూర్ణ జ్ఞానమే బ్రహ్మము.

5. ఓం అయమత్మాబ్రహ్మ = ఈ జీవాత్మ పరబ్రహ్మము

6. ఓం ప్రజ్ఞానాత్ర్మా = రూపగుణోపయోగ సమ్మిళిత విషయ జ్ఞానమే ప్రజ్ఞానాత్మ.

7. ఓం ఈశావాస్యమిదం సర్వం = ఈ కనబడు జగమంతయు బ్రహ్మమై యున్నది.

8. ఓం ఏష ఆత్మాంతర్వా మ్యమృతః = ఈ ఆత్మయే సర్వాంతర్యామియైన అమృత స్వరూపము

9. ఓం దాదేవాహ తదముత్ర - యదముత్ర తదన్విహ = ఇకలోక పరలోకములందు క్షణభంగురమైన సుఖస్వరూపం ఒకటే!

10. ఓం అన్యదేవ తద్విదితా దధో అవిదితాదధి = ప్రత్యక్షంగా తెలియబడు ప్రపంచము కంటెను, తెలియబడని ప్రకృతి (మాయ) కంటెను బ్రహ్మము భిన్నము.

ఇంకా...వేదాంతార్ధ ప్రతిపాదకాలైన మహావాక్యాలు ఎన్నో ఉన్నప్పటికీ, విశేష వ్యాఖ్యాల పైనగాని అర్ధం కానట్టివి.

సన్యాసుల విధులు:

యతులకూ - సన్యాసులకూ కొన్ని ప్రత్యేక విధులున్నాయి.

ప్రణవ స్వీకారం అనే పేరట, పామరుల్ని సైతం సమ్మోహ పరిచేదైన సన్యాసాశ్రమ స్వీకారం చేసినవారు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి. గురుధ్యానానంతరం ప్రాణాయామం, మానసిక పూజచేసి కాలకృత్యములు నిర్వర్తించుకోవాలి. సూర్యనమస్కారాలు చేయాలి. భస్మ రుద్రాక్షధారణ అవశ్యకం, ప్రణవం జపించాలి.

శివారాధన చేస్తూ భిక్షాటనం చేయవలసి ఉంటుంది. ఏకాంత వాసం కూడా అత్యంతావశ్యకంగా విధించారు తత్త్వజ్ఞులు.

యతులకూ - సన్యాసులకూ కొన్ని నిషేధాలూ ఉన్నాయి.

వీరికి తాంబూలం పనికి రాదు. ఇత్తడి - రాగిపాత్రలు నిషేధం. రాత్రి ఆహార స్వీకరణ - పగటినిద్ర విసర్జించాలి. తెల్లని బట్టలు ధరించరాదు.

సామాన్యుల మృతదేహాలకువలె, వీరి మృతదేహాలకు సంస్కారం కూడదు. ఖననం మాత్రం సరిపోతుంది.

సహచరులు దగ్గర లేకపోగా, యతినిర్వాణం చెందడమనేది సాధారణంగా జరగదు. అట్లు జరిగితే నిర్వహించాల్సిన విధులను కార్తికేయుడు సవివరంగా చెప్పాడు. అరుదు కనుక అది మనకు అప్రస్తుతం!" అని చెప్పి, అనంతరం..

"సామాన్య గృహస్థు శివదీక్ష జీవితాంత పర్యంతం స్వీకరించినా, కొన్ని విధులున్నాయి. స్వీకారదినం నుంచి గురువుచే ప్రసాదించబడిన స్ఫటిక శివలీంగాన్ని నిత్యం ఆరాధించాలి. చాతుర్మాస్యాది పర్వకాలాల్లో ఏకాదశ రుద్రాభిషేకాలు, విశేషదానాలు ఆచరించవలసి వుంటుంది. కొంత నిర్మాల్యం ఈశాన్యదిశయందు చండీశ్వరుని కోసం ప్రత్యేకంగా తీసి ఉంచాలి. ఏనాడూ శివ తీర్ధప్రసాదాలు స్వీకరించనిదే నిత్య భోజనం కూడదు. శివలింగం పైభాగాన ఉమామహేశ్వర విగ్రహాలను (రూప పూజనిమిత్తం) ఉంచవచ్చును! మహాశయులారా! కైలాసవాసునికై ఏర్పరచబడిన వివిధ అర్చనరీతులను వినిపించాను. సాయం సమయమైనది" అని చెప్పగా సంధ్యావందనాది నిత్యనైమికాదులు నిర్వర్తించు కోడానికి ఋషిగణాలు లేచారు.