శివపురాణము/కైలాస ఖండము/నారదునిచే దూష్యమైన సంపెంగ

వికీసోర్స్ నుండి

ఒకానొక కాలంలో ఒక దురాత్ముడు ఉండేవాడు. అయినను అతడు నిత్య శివపూజాసక్తుడు. ప్రతిదినం సంపెంగలచేత శివుని పూజించి ఆయన కరుణాకటాక్ష వీక్షణాలకు పాత్రుడైనవాడు.

ఆ దేశపు చక్రవర్తినే శాసించగల స్థితికి చేరుకున్నవాడు. చక్రవర్తి అంతటి వాడిని, పాదాక్రాంతుడిగా చేసుకున్న గర్వంతో అతడు ప్రజలను పీడించసాగాడు. కానీ, అతడిపై ఫిర్యాదు చేసినా రాజు పట్టించు కొనేవాడుకాదు.

ఇలా ఉండగా - అతడు ప్రతిరోజు తన అర్చన (సంపెంగపూలతో) మానివేయకుండా జాగ్రత్త పడుతూవచ్చాడు. ఆ కారణాన అంతులేని శివానుగ్రహానికి పాత్రుడయ్యాడు.

నారదుడు ఓసారి భూలోక సంచారార్థం వచ్చినప్పుడు ఈ వైనం అంతా చూశాడు. కానీ ఆయనకు మొదట్లో ఈ దుష్ఠుని అంతర్యం అంతుపట్టలేదు.

అతడెటువంటివాడని అడగ్గా, సంపంగి బదులివ్వలేదు. కేవలం ఆ దుష్టబుద్ధి అకృత్యాలకు భయపడి సంపంగి మారుపల్కలేదు.

అయినా దేవర్షి అంతటివాడు అడిగినప్పుడు సత్యం చెప్పాలి కదా! దుష్టుని బెదిరింపు వల్ల చెప్పలేకపోవచ్చు! అసత్యమేల? నారదుడు తరచి తరచి ప్రశ్నించినా తనకేమీ తెలియదంది సంపంగి.

అసత్యదోషానికి పాల్పడినందువల్ల "నేటినుంచీ నీ పూలు శివపూజార్హత కోల్పోవుగాక!" అని శపించాడు నారదుడు.

అంతవరకు శివప్రీతికరమైన సంపెంగకు శివపాద సన్నిధి చేరే అవకాశం నశించింది. గొప్ప వ్యక్తులతో అసత్యములాడినచో ఎటువంటి ఆపదలైనా సంభవిస్తాయనడంలో వింత లేదు కదా!

ఏఏ కామ్యాలకు ఎన్ని పుష్పాలు? పత్రాలు ?

ఎటువంటి కోరికలు లేకుండా శివపూజచేసి తరించు వారలకు ముక్తి తథ్యం!

అయితే లౌకిక ప్రపంచంలో జీవించే వారికి, ఏదో ఒక మనోరధం ఉండడం సహజం కనుక, ఆయా వాంచితార్ధులు యధాశక్తి ఒక క్రమాన్ని పాటించడం ద్వారా, కోరికలు నెరవేర్చుకోగలుగుతారు.

ధనం కోరేవారు లక్షపద్మాలు, లక్ష మారేడు పత్రాలు, లక్ష శంఖాలు, లక్ష పుష్పాలతో పూజించాలి! రాజు కాదల్చుకున్నా ఇదేక్రమం, పువ్వుల విషయంలో నిబంధన లేకున్నా కోటి పార్ధివ లింగాన్ని పూజించాలి!

పరపతి కావాలనుకుంటే 50 వేలపూలు చాలు! వాక్శుద్ధికి, విద్యాభివృద్ధికి, ఆరోగ్యవృద్ధికి 59 వేల పుష్పపూజ శ్రేయస్కరం.

సమస్తమైన కోరికలు తీరడానికి లక్ష సంఖ్య కలిగిన ఎర్రటికాడ కలిగిన ఉమ్మెత్తపూలు ; అంతే సంఖ్యలో మారేడు పత్రి అవసరం! సంపెంగ, మొగలి పూలకు నిషేదం ఉన్నదని గ్రహించాలి.

లక్ష సంఖ్య కలిగిన బియ్యపుగింజలు, అక్షతలుగా శివలింగపూజ చేస్తే లక్ష్మి అభివృద్ధి చెందుతుంది.

వివిధ పురాణాల్లో - సందర్భానుసారం ఏయే పుణ్య తిథులలో - ఏయే పుష్పాలతో పూజిస్తే ఏయే ఫలితాలు కలుగుతాయో మీకు ఇదివరకే చెప్పి యున్నాను కనుక ఇప్పుడు ప్రత్యేకంగా ప్రస్తావించడములేదు. ఇంకా మీరేమైనా సందేహిస్తే అడగవచ్చును" అన్నాడు సూతుడు.

"మహానుభావా! పది మహా వాక్యలున్నయని వేదవిదులు అంటూంటారు కదా! ఏమిటవి? వాటిని సంక్షిప్తంగా తెలుపగోరు చున్నాము" అని శౌనకాదులడుగగా సూతుడు చెప్పనరంభించాడు.