శివపురాణము/ఉమా ఖండము/శతాక్షిగా ఉమ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఒకానొక కల్పమందు దుర్గముడు అనే రాక్షస వీరుడుండేవాడు. బ్రహ్మను మెప్పించి వేదాలను వరంగా పొంది, వాటిలో దేవతలని బలహీనుల్ని చేయగల అంశాలన్నీ బాగా వొంట బట్టించుకున్నాడు. ఎవరికీ నీళ్లు దొరక్కుండా చేశాడు. సమస్త ప్రాణికోటికీ జీవనాధారమైన నీరు మాయమయ్యేసరికి సమస్త లోకాలూ తల్లడిల్లి అందరూ అంబనే శరను వేడారు. అభయమిచ్చింది మాత.

నూరు(100) సంఖ్యగల కళ్లతో వారికి ప్రత్యక్షమైంది. తొమ్మిది రాత్రులూ - తొమ్మిది పగళ్లు ఆమె కరుణ రసాన్ని వర్షించింది. ప్రజలంతా ఆ నేత్రాంచలాల నుంచి ఊరిన నీటిని అమృతోపమానంగా స్వీకరించి ప్రాణాలు నిలుపుకున్నారు. వాపీ - కూప - తటాకాదులు నింపుకున్నారు.

దుర్గముడు వేదాపహర్త అయ్యాడని (స్వ ప్రయోజనం కోసమే ఏదైనా వినియోగించుకో గోరువారు చోరులతో సమానమని - అందునా సర్వులకు ఉపయోగించే వాటిని, ఒక్కరే అనుభవించడం చోరచర్య అవుతుందని శాస్త్రం.) భావించిన దేవతలు, ఆ విషయమై శతాక్షికి మొరపెట్టుకోగా, వేదాలను తిరిగి తెచ్చివ్వడానికి, చక్ర ప్రయోగం చేసి దుర్గముడిని సంహరించింది మాత.

ప్రజలకు కందమూలాది వివిధ శాకములను సైతం అనుగ్రహించడం వల్ల ఆవిడ 'శాకంబరీదేవి' కూడా అయింది.

దుర్గముడిని దునుమాడినందున, దుర్గమమైన పర్వతాలను - అరణ్యాలను సంచారస్థలాలుగా ఎంచుకొన్నందున ఆమె 'దుర్గ' గా కీర్తింపబడింది.

ఇంకా వివిధ పేర్లతో అలరారుతున్నదీ ఉమాదేవియే!

భయంకర రాక్షసుల్ని సంహరించి నందున భీమ అనీ; భ్రమరాల్ని (కీటకాల్ని) నియమించి అరుణు డనేవాడిని అణచినందున భ్రామరి అనీ (భ్రమరాంబ); శివుని భార్య కనుక శివాని అని ఆవిడ్ని స్తుతిస్తారు.

భక్తుల మేలుకోరి లీలలను చూపింస్తుంది. మరుపున అహంకరిస్తే అజ్ఞాన సంహారం చేస్తుంది. సమస్త కళలూ - శక్తులూ ఆమెనుంచే ఉద్భవించాయి. సిరులూ - సిద్ధులూ ఆమె వల్లనే ఆవిర్భవించాయి. తన లీలావిలాసాల్లో ఆమె స్త్రీ రూపధారిణి - ఆమె పురుష రూపధారిణి. ఆవిడే ఉమ. శంకర మహాదేవుని మనోరమ!