Jump to content

శివతాండవము/శివలాస్యము

వికీసోర్స్ నుండి

శివలాస్యము

ఫక్కుమని నవ్వినది జక్కవల పెక్కువలఁ
జక్కడుచుచనుదోయి నిక్కఁ పార్వతి యపుడు
నిక్కుచనుదోయిలో నిబిడరోమోద్గమము!
దిక్కుదిక్కులనెల్ల దివ్యనేత్రోత్సవము!

తెగమిగులు దొగలు జిగి బుగులు గన్నులదోయి
నిగనిగలు మిట్టింప నిలచి చూచెను గౌరి
నిలుచువాలకములో నెలవంపు వంపులోఁ
కులికినది యమృతమో! గోటిసౌందర్యాలొ!

బంధూకపుష్పసంబంధు వగు చిరుపెదవి
నందముగ గదియించె నలసహాసం బార్య
యానవ్వులోఁ గదలె నచ్చరలసిగ్గులో!
కాని యీశ్వరు కలలో! కామధేనువుపాలొ!

స్థలపద్మములయొప్పు గల తామ్రతలపాద
ములఁ గదల్చెను దేవి మురిపెములు జిలికించి
కదలుకదలికలోనఁ గలకలా నవ్వెనఁట
కొదమగంటలొ! నిల్చికొన్న స్వరకన్యకలొ!

లలితముగఁ బలికిన మొలనూలు, గోయిలల
జిలుఁగుగొంతుక తీపి జలజలా పారించి,
యా వాకలో నిల్చె నాగమాంబురుహమ్ము
లావిరులపై నాడె నానందబ్రహ్మమ్ము!

జంకించినది లలిత చపల భ్రూలతలతో
శంకరునిశర్వాణి జలద సుందరవేణి
తటుకునను సూచిహస్తంబుతో, నాగేంద్ర
కటకునకు ధైర్యంబు కంపించిపోయినది!

అటుబండె నొకసారి యతివ కిలికించితం
బిటువిరిసె నొకసారి యింతి యుల్లోకితము[1]
ప్రమదాకపోలమ్ము భావకిమ్మీరితము
కమనీయ మదరాగ కలికా విచుంబితము

కుణుకుణు క్వణనంబు లనుగతిగముగఁ బాడ
నణుమధ్య జూపినది యభినయ విభేదములు
వనములను, వనధికంకణములను, జగతిలో
నణువణువునను భావ మాక్రమించిన దపుడు

తరళలోచన వింత తానకంబుల నిలచి
కరపద్మముల నర్థకలనంబుఁ జూపించె
నా సృష్టి నందుకొన కమరులును దేవర్షు
లాశంకితులు, నద్భుతా క్రాంతమానసులు

గా నించినది దేవి, కలకంఠశృతివీధి
లో, నిత్యరమణీయలోకములు పొంగెత్తఁ
పలికినవి వల్లకులు కలకంఠిగానమ్ముఁ
పలికినవి వల్లకులొ! పరమేశ్వరియొగాని!

తకఝణుత, ఝణుతతక, తకిటతది గిణతొత
గిణతొ తదిగిణతొ యను రణనములు మీఱంగఁ
ప్రతిగజ్జె యెడఁదలో భావములు బులకింపఁ
ప్రతిభావమున రసము వాఱిదిక్కుల ముంప.

ప్రియురాలి యూరువులు బ్రేరేప చషకమ్ము[2]
పయి మందవలితమ్ములయి లేచు దరగలటు
బాలేందుఫాల, నగబాల, పార్వతి నిలిపి
లీలావిపర్యాప్త రేచితభ్రూలతలు[3]

పరివాహితము శిరము[4], చిఱునవ్వు, నెత్తమ్మి
విరికన్నుఁ గవలందు విభ్రమాలోకితము[5]
కించిదాకుంచితము, చంచలము, బొమదోయి
పంచాస్త్రుబాణమ్ము, పర్వతేశ్వరు సుతకు

నవశిరోభేదములు[6] నవకంబుగాఁ జూపి
భవురాణి యష్టగుణభావదృష్టులు[7] మోపి
పదిరెండుహస్తములు[8] బట్టి, మదిరాక్షి మఱిఁ
బదిలంబుగాఁగ గ్రీవాభేదములతోడ

ఆడినది గిరికన్నె యలసమారుత మట్లు
బాడినది సెలకన్నె పకపకా నవ్వినటు
లాటపాటల తోడ నవశులై బ్రహ్మర్షి
కోటులెల్లెడ నమిత జూటులై సేవింప

శరదబ్జధూళిపింజరితముల చక్రముల
సరిదూగు లావణ్యభరిత కుచయుగ్మములు
చనుకట్టు నెగమీటి మినుఁ దాకునో! యనగ
వనజాక్షి, పై పైని వక్షమ్ము విరియించి
                        యాడినది గిరికన్నె

ఒకవైపు భ్రూభంగ మొదిగించి చూచినది
వికచసాకూతముగ విశ్వేశ్వరుని లలిత

యా చూచుచూపుతో నర్ధేందుభూషునకుఁ
బూచిపోవఁగ బుష్పముకుళములు నిలువెల్ల
                        నాడినది గిరికన్నె!

మేఖలా చంద్రికిత మృదుమధురమౌ మధ్య
మాకంపితఁ బయ్యె నగరాజప్రియపుత్రి
కా కంపితంబులో నలసవ్రీడాభరం
బాకేకరితదృష్టి[9] యనురాగసూచకం
                        బాడినది గిరికన్నె!

సవ్యహస్తం బర్ధచంద్రాఽభినయముతో
దివ్యలీలనునిలిపి, దేవి నడుమునయందుఁ
కొనగోట నుదుటఁ గమ్మిన జెమ్మటల మీటి
కొనచూపులనె శివుని గోర్కె లోతులు దూటి
                        యాడినది గిరికన్నె!

కోపఘూర్ణితమైన కొదమనాగము వోలె
తీపులగునూరుపులు దెసలెల్ల జల్లించి
యలసవలితములు జేతుల భంగిమలతోడ
జలజారిమకుట గన్నుల నాస లెసకొల్పి
                        యాడినది గిరికన్నె!

నడునొసలిపై నున్న నాభినామము కరఁగి
వడిజాఱి కనుబొమల వంకలను నిలువంగఁ

క్రొత్తఁదోమిన దంతకోరకంబుల గాంతి
గుత్తులుగ గుత్తులుగ హత్తికొన శివుపైని
                        యాడినది గిరికన్నె!

సమపాదయుతమైన స్థానకస్థితి నిలచి
క్రమముగాఁ జూపులను గంజాక్షి విరజిమ్మి
ఘలుఘల్లుఘలు మనెడి వలయునాదములతోఁ
చిలిపినవ్వుల సుమాంజలి వట్టి శివునికై
                        యాడినది గిరికన్నె!

వెలయంగఁ దొమ్మిదగు విధములను చెలువముగ
నలినాక్షి భూచారినాట్యములు[10] జూపించి
పదునాఱగు ఖచారిపద్ధతుల[11] నెసగించి
మదిరాక్షి గతిచారి మధురిమలు బొసఁగించి
                        యాడినది గిరికన్నె!

శిరము చూపులు మించు చెక్కిళ్ళు కనుబొమలు
తరుణాధరము పయోధరములును దంతములు
ముఖరాగచిబుకములు మొదలైన వావగలు
సకియ, భావానుగుణ చాలనంబుల నెసఁగ
                        నాడినది గిరికన్నె!

శుకతుందనిభ కుచాంశుకము వదులుగ జాఱ
మొకముపై ముంగురులు ముసరుగొని విడఁబాఱఁ
బంచెవన్నెలకాసె వగలు గులుకఁగ విమల
చంచలాక్షులఁ కటాక్షాంచలమ్ములు మిగుల
                        నాడినది గిరికన్నె!

సమరూపములగు నంసములుఁ గటి కంఠములు
సమపాదములు నంగసమరూపచలనములు
నురుము పెక్కువయు, సుందర భావప్రకటనము
సరసీజముఖి నాట్యసౌష్ఠవమ్మును, జాట
                        నాడినది గిరికన్నె!

ఆవైపు నీవైపు నతిరయంబునఁ దూఁగ
భావభవు తరవారినా వెలయు కీలుజెడ
చలితనాట్యమున కాశ్చర్యపరవశుఁడగుచు
లలితేందుధరుడు దానిలువఁ దిన్నఁగనగుచు
                        నాడినది గిరికన్నె!

పూవుగుత్తులనడుమఁ బొలుచు గిసలయమువలె
దా విమలమర్దళాంతరమునను నిలుచుండి
పలుమారు నిలమీఁద లలితముగఁ గ్రుంగి, కిల
కిలకిల మటంచు, మేఖల నవ్వులనుఁ బొదల
                        నాడినది గిరికన్నె!

జరతపావిడ చెఱఁగు చలియింప, గంతసరి
గరము నటియింప, బంధుర శ్రోణి గంపింప

గరయుగంబుల ఘల్లుఘలుమంచు నెలుగించు
వరకంకణములతో భావభవు గంధగజ
                        మాడినది గిరికన్నె!

కలఁగఁ జెక్కిళ్ళపయిఁ గస్తూరి మకరికలు
మలఁగ నిటలంబుపైఁ దిలకంబు లలితంబు
నిడుదఁ గన్నులఁ దేరు నీలోత్పలములతోఁ
తడఁబడని లయతోడఁ గడువేగముగ నప్పు
                        నాడినది గిరికన్నె!

ధిమిధిమి యటంచు దుర్దిన వారిధరధీర
భ్రమబూన్చి మద్దెలలు బలుమాఱు ధ్వనియింప
జకితచకితాంగియగు సౌదామనియు వోలె
వికచాక్షి యజ్ఞాత విభ్రమంబులు జూపి,
                        యాడినది గిరికన్నె!

భవుని వక్షమునందుఁ బదలాక్షఁ చిత్రించి
నవరసంబులకుఁ బుణ్యపుఁ బంట జూపించి
భరతముని నానంద తరళితునిఁ గావించి
సర్వకన్యలకుఁ దత్తఱపాటుఁ గల్పించి
                        యాడినది గిరికన్నె!

కుచ్చెళులు భువిఁ గుప్పగూరియై నటియింప
ముచ్చెమటతో మొగము మురిపెముల వెలయింప
ముచ్చటగ నిరుప్రక్క ముక్కరయుఁ గంపింపఁ
పచ్చవిల్తునిపూన్కిఁ పారంబు జూపింప
                        నాడినది గిరికన్నె!

ప్రతిపదములో శివుఁడు బరవశతఁ దూగంగ
సతి జంద్రమకుటంబు సారెకుఁ జలింపంగ
వ్రతతి దూగాడినటు వాతధూతంబౌచు
శతపత్రమది ముక్తసరి విచ్చికొన్నట్టు
                        లాడినది గిరికన్నె!

గగన వనమున విచ్చికొనిన జలదంబట్లు
వనముననుఁ బారాడు వాతపోతంబట్లు
పోతమ్ము గల్లోలములపైనిఁ దూగినటు
శాతాక్షి గాయమ్ము సంచాలితమొనర్చి
                        యాడినది గిరికన్నె!

బ్రహ్మాణి యానంద పారిప్లవాంగియై
జిహ్మగాక్షముల వీక్షించి మిన్దాకంగ
సకలామరులు శిరస్స్థలకీలితాంజలులు
సకలేశ్వరునిఁ దన్ను సంస్తుతించుచుండ
                        నాడినది గిరికన్నె!

ప్రతిసుమముఁ తన్మయత్వమునఁ గిలకిల నవ్వఁ
ప్రతిపక్షి యున్మాద పరవశత నదియింపఁ
ప్రతిజీవి పులకింపఁ బదునాల్గు లోకముల
సతులితంబైనట్టి యద్వైతమే మ్రోగ
                        నాడినది గిరికన్నె!

తనలాస్యమును మెచ్చి తరుణచంద్రాభరణుఁ
డనుమోదమునఁ జేతులను గలిపి యాడంగ

శివశక్తులొక్కటిగఁ జేరినంతన మౌను
లవికృతేంద్రియు "లో!" మ్మటంచుఁ జాటింపంగ
                        లాడినది గిరికన్నె!

పలికిరంతటన గీర్వాణులెల్లరుఁ గూడఁ
జలితకంఠముల శివశక్తులకు మంగళము!
కచ్ఛపీవీణ యుత్కంఠతోడుత రాగ
గుచ్ఛముల నీన నా ఘూర్ణితములుగ దిక్కు
                        లాడినది గిరికన్నె!

దేవాది దేవాయ! దివ్యావతారాయ!
నిర్వాణరూపాయ! నిత్యాయ! గిరిశాయ!
గౌర్యైనమో! నిత్యసౌభాగ్యదాయై!
తురీయార్ధదాత్ర్యై!! ధరాకన్యకాయై!!

  1. మీదికి నిక్కింపబడిన దృష్టి యుల్లోకితము.
  2. ఆమె లేచిత భ్రూలతలు బాల లలితముగ వగుపడినవి అవి యెట్లున్నవనగా, ప్రియురాలు ప్రియునకు మధ్య మదించునపుడు ఆమె యూరువులచేత వామద్యపాత్రమున లేచు మద్య తరంగము లంత లలితముగ నున్నవి.
  3. అందముగ మీది కెత్తబడినవి.
  4. వింజామరమువలె ఇరుప్రక్కలకు వంచు శిరస్సు పరివాహితము.
  5. తిరుగుడు గల చూపు ఆలోకితము.
  6. సమము, ఉద్వాహితము, అధోముఖము, అలోలితము, ధ్రు కంపితములు, పరావృత్తోతిప్తములు, పరివాహితము.
  7. సమము, అలోకితము, సాచి, ప్రలోకితము, నిమీలితము, ఉల్లోకితము, అనువృత్తము, అవలోకితము, దృష్టులు.
  8. ఇచ్చట హస్తశబ్దము హస్తప్రాణముల కౌపచారితము, హస్త ప్రాణములు పదిరెండు. ప్రసారణ, కుంచిత, రేచిత, పుంఖిత, అపవేష్టితక, ప్రేరిత, ద్వేష్టిత, వ్యావృత్త, పరివృత్త, సంకేత, చిహ్న, పదార్థటీకలు.
  9. కనుబొమ్మలు పైకెత్తిన దృష్ఠి.
  10. నేలపైనిలిచి చేయు నాట్యము.
  11. పైకి చెంగించుచు జేయు నాట్యము.