Jump to content

శివతాండవము/తాండవ ప్రశస్తి

వికీసోర్స్ నుండి

తాండవ ప్రశస్తి


శ్రీ ఆనందకుమారస్వామి 1924లో శివతాండవమను పేర ఆంగ్లమున నొక వ్యాస సంపుటి ప్రచురించెను. ఆ గ్రంథము నేటికిని రసజ్ఞులకు మోదము కూర్చుచున్నది. అందొక వ్యాస ఖండమున శివతాండవ తత్త్వము వర్ణింపబడియున్నది.

సర్వ ప్రపంచ సృష్టిస్పందనములే నృత్య భంగులు. ఆరభటీ వృత్తి సమ్మిళితము తాండవమనియు, కైశికీ సమ్మతమైన లాలిత్య శోభలతో నిండినది లాస్యమనియు విబుధుల నిర్వచనము. భర్తృదారికయగు ఉత్తరకు బృహన్నల నేర్పినది లాస్యమని తిక్కన పేర్కొనెను.

సృష్టి పరమేశ్వర లీలయని వేదాంతుల ప్రవచనము. ఈ లీలయే - పరమ వస్తువు - ఏకైక సత్యము యొక్క వ్యక్తరూపము. ఈ భ్రమించుటనే పరమమని నమ్మినవారు భ్రమ పాలగుదురు. ఈ చైతన్యరూపము నుపాశించి, అద్దాని కతీతమైన ముాలపదార్ధమే సర్వమని, అద్దానికి రెండవది లేదని తపస్వులు తురీయావస్థ యందు కనుగొని, అనుభూతులపొంది ఆ పరమస్థితియందు తాదాత్మ్యమును పొందిరి. అట్టివారు ఈనాటికిని కైవల్యస్థితిని చేకూర్చుకొనగలరు.

ఈ రీతి విపరీతమే - లౌకికదృష్టిలో !

ఈ తాండవ తత్త్వమును మూడూ విధములుగా మీమాంసీకరించవచ్చును. సర్వ ప్రపంచ సృష్టి స్పందన చైతన్య స్వరూపమే శివనృత్యము. అఖిలాండ బ్రహ్మాండ కోటులు అనంతముగ వివిధ భంగులలో కదలుచుండును.

రెండవది: భ్రమనొంది పాశబద్ధులైయుండు జీవకోట్లకు ముక్తి నొసంగు సంహారక్రియా ప్రతీకయే ఈ ప్రళయ తాండవము. పునస్సృష్టికి వలసిన పరమ సమకూర్చునదియు ఈ తాండవమే. మూడవది: తాండవమునకు రంగభూమి చిత్-అంబరము మానవ హృదయాంతర సీమయే. ఇది విజ్ఞులకు వేద్యమను అనుభూతిశాల. ఇచ్చట పరమశివుడు రంగస్థల మేర్పరచికొని, నృత్యమాడి, జీవునికి మోక్షమిచ్చును.

ఈ తాండవ మహాత్మ్యము ' చిదంబర ముమ్మని కోవై, ' తిరుములారి తిరుమంత్రము, ' ' ఉన్మై విలక్కము,' 'శివజ్ఞాన సిద్ధియర్ ' మున్నగు గ్రంథము లందు విపులముగా వర్ణింపబడియున్నది.

(ఓం) శి-వా-య-న-మః యను పంచాక్షరి తత్త్వమే ఈ నృత్యము యొక్క బాహ్య స్వరూప శబ్ద సంపుటియని ఉన్మై విలక్కమున వివరింపబడి యున్నది. ఏ తదుపాసనమే ఉపాసమునికి ద్వంద్వాతీత స్థితిని గూర్చి, శివమును గూర్చుననియు అందు ఉద్ఘాటింపబడినది.

శివప్రదోషస్తోత్రమున:-

కైలాస శైల భవనేత్రిజగజ్జనిత్రీం
గౌరీం నివేశ్య కనకాంచిత రత్నపీఠే
నృత్యం విధాతు మభివాంఛతి శూలపాణౌ
దేవాః ప్రదోష సమయేను భజంతి సర్వే

వాగ్దేవీ ధృతవల్లకీ శతమభోవేణుందధత్పద్మజః
తాలో న్నిద్రకరో, రమా భగవతీ గేయ ప్రయోషాడ్వితా
విష్ణుస్సాంద్ర మృదంగ వాదనపటుర్దేవాస్సమం తాత్‌స్ఖితా
సేవంతే తమనుప్రదోష సమయే దేవంమృడానీపతిమ్‌

గంధర్వ యక్ష పతగోరగ సిద్ధ సాధ్య
విద్యాధరామర వరాప్సర సాంగణాశ్చ
యేన్యే త్రిలోక నిలయాస్సహభూతవర్గాః
ప్రాప్తే ప్రదోష సమయే హరపార్శ్వసంస్థాః

సర్వలోక సమస్త భూతకోటికి మోదము గూర్చునది ఈ శివతాండవము. ఇద్దాని వర్ణించు కవి తపస్విగా నుండవలయును. ప్రస్తుత గ్రంథ రచయిత అగస్త్యేశ్వరు నుపాసించి, అద్దేవుని కృపాకటాక్షమునకు పాత్రులై శివ తాండవమును, నంది నాందిని, శివాలాస్యమును, విజయా ప్రార్థనమును ఓజోగుణాన్వితముగా, కర్ణరసాయనముగా అభివర్ణించి చదువు వారికి, వినువారికి తదాత్మ్యానుభము కల్గించునట్లు ఉత్తమ కావ్యసృష్టి కావించియున్నారు. కావ్యమునకు పరాకాష్ట "నైతావద్ ఏన పరో అన్యద్ అస్తి" అను ఋగ్వేదసూక్తి. (కేవలమిదికాదు, పరమైనది వేరుగ నున్నది అని స్ఫురింపచేయుటయే.)

వీరు ఈ వస్తు ప్రదర్శనమున శివకేశవులకు అభేద ప్రతిపత్తిని సాధించినారు. సర్వసృష్టి చైతన్యస్వరూపమే నటరాజు తన భక్తిని లీలగా సంకల్పించి, సృష్టిజాలమును సృజించి, తాను వేరైన శేషశయనుడు-రంగనాథుడు లీలానృత్యమునకు ప్రయోక్త. నటునికి ప్రయోక్తకు కార్యభారమున ఏక వ్యక్తిత్వము కలదు. శివము సాధించుటే కైవల్యమును పొందుట!

ఇంతేగాక శివతాండవముచే కలుగు ఆనందప్రీతికయే గిరిజాదేవి. తాండవించు శివుని శరీరములో ఆమె సాబాలు పంచుకొన్నది.

ఇట్లే కేశవ మోహినీరూపములు. స్త్రీ పురుష సమన్వయ మిచ్చటను పరిస్ఫురించును. ర్యాలి యందలి శిల్ప ప్రతిష్ఠలో భాసించునది ఈ అర్థనారీశ్వరత్వమే. శివశివా సమ్మేళనము పార్శ్వానుక్రమము. కేశవ మోహినీత్వము ముందు వెనుకల సమన్వయము.

తెలిసికొనవలసినది తత్త్వ మొక్కటియని; రెండవది లేదని.

                                                                     నే. శ్రీకృష్ణముర్తి

మూలస్థానేశ్వరాలయము

విక్రమసింహపురి

24-6-1961