శివతాండవము/ముందుమాటలు
ముందుమాటలు
ఆంధ్రదేశములో - యీ ఖండ కావ్యమునకు గొప్ప ప్రచారము వచ్చినదని చెప్పవచ్చును. నా యితర కృతి మేఘదూతకును తెనుగు దేశమున నిట్టి ప్రచారమే గలదు. కాని 'శివతాండవము' లోని విశేషమేమనగా -యితర భాషల వారు గూడ దీనిని ప్రేమింపగల్గుట. నైనిటాల్ లో మహాదేవి వర్మ, దినకర్ మొదలైన హిందీ కవులు దీనిని నాలుగైదు సారులు వినుట తటస్థించినది. వీరికి భాష తెలియదు. దీనిలోని శబ్దసమ్మేళనము వారి నాకర్షించినదనవచ్చును. వారెల్లరు దీనిని హిందీలో కనువదించవలసినదిగ ప్రోత్సహించిరి. ఆపని యీనాటికిని నెరవేరలేదు. నా హిందీ కవిమిత్రులలో అగ్రగణ్యులైన దినకర్, జానకీ వల్లభశాస్త్రి మొదలైన వారిప్పటికిని అదేమాట యనుచుందురు. కాని, దీని నెన్నటికైనను సలక్షణముగ ననువదింపగలుగుదునో, లేనో చెప్పలేను. ఢిల్లీ మొదలైన ప్రదేశములలో కృపలానీ, దేశముఖ్ వంటివారు యీ రచనకు హర్షించిరి.
తిరువాన్కూరులో నున్నపుడు మళయాళ పండితులు గూడ దీనిని చదివించికొని విన్నారు. దీనిలోని సంస్కృత రచన వారి నెంతయో యాకర్షించినట్లున్నది. మొన్న (25-5-61) కలకత్తాలోగూడ శివతాండవ పఠన జరిగెను. అక్కడి చపలకాంతరాయ్, కాళిదాస ముఖర్జీ మొదలైన పెద్దలు యీ కావ్యమును విని చాల ఆనందపడినారు. దీనిలోని సంస్కృత కవిత్వము, నాగరిలిపిలో ముద్రించిన బాగుండునని వారిచ్చిన సలహా.
పరమశివుని తాండవ భాగమంతయు ఉద్ధతశైలిలో నడచినది. లాస్యము లలితమైనది. అక్కడి శైలినిగూడ లలితముగనే నడపితిని. పరమశివుని తాండవమునకు ముందు నంది యొనర్చిన నాంది గలదు. అట్లే పార్వతి యొనర్చిన లాస్యమునకును తొలుత విజయ యను చెలికత్తె చేసిన ప్రార్థనమున్నది. ఇవి రెండును సంస్కృత రచనలు.
దీనిలోని గుణదోషములకు రసికులు ప్రమాణము.
కడప 1-6-1961 |
గ్రంథకర్త |