Jump to content

శాసనపద్యమంజరి (రెండవభాగము)/పీఠిక

వికీసోర్స్ నుండి

శాసనపద్యమంజరి

ద్వితీయభాగపీఠిక

ప్రాచీన శిలాశాసనములలో నున్న తెలుఁగుపద్యములు కొన్ని యిదివఱలో "శాసనపద్యమంజరి" యనుపేర బ్రకటించియున్నారము. ఆమంజరిలో 88 శాసనములలో నిమిడియున్న 287 పద్యములున్నవి. వానిలో మొదటిశాసనము 770 వ శాలివాహనశకసంవత్సరప్రాంతమందును జిట్టచివరిది 1600 వ శాలివాహనశకసంవత్సరప్రాంతమందును బుట్టినవి. ఆపద్యములు ప్రకటించిన పిదప లభించిన పద్యముల నిప్పు డామంజరిలోనే ద్వితీయభాగముగాఁ బ్రకటించుచున్నారము. ఇందు 46 శాసనములలోగల 95 పద్యము లున్నవి. ఈశాసనములలో మొదటిది 1046 వ శకసంవత్సరములోను జివరిది 1732 వ శకసంవత్సరమున బుట్టినవి. ఈ రెండుభాగములలోని పద్యములను గలిపి కాలానుక్రమముగా నేర్పఱించి యొక్కసంపుటముగా బ్రకటించుట యుక్తముగా నుండెడిది. కాని ప్రథమభాగము పుస్తకము లన్నియు నమ్ముడుపడకుండుటచే నట్లు చేయుటకు వీలు లేకపోయినది. ఇప్పుడు విడివిడిగా నుండుభాగములు రెండును వ్యయమైన పిదప నారెండుభాగముల పద్యములను గలిపి యొక్కపుస్తకముగా ముద్రించెదము.

ఈ శాసనములలో గొన్ని "South Indian Inscriptions" (దక్షిణహిందూస్థానశాసనములు) అనుగ్రంథములనుండి గ్రహింపబడినవి. ఈవిషయ మాయాస్థానములయందు వక్కాణింపబడినది. ఇవిగాక తక్కిన శాసనము లన్నియు శాసనప్రతిబింబములను బట్టి ప్రతులు వ్రాసినవియే.

పద్యములు శాసనములయం దున్నవియున్నట్లే ముద్రింపబడినవి. ప్రాచీనగ్రంథలేఖనసంప్రదాయమును బట్టి పాఠకులు తమంతట దాము సవరించుకొనదగిన తప్పులను విడిచిపెట్టి మిగిలినవానికి సరియైనపాఠములు పుటలయడుగునఁ జూపబడినవి. ఈవిషయమందును, ఇతరవిషయములందును గూడ బ్రథమభాగవిషయమున గమనించిన యేర్పాటులనే యీభాగవిషయమున గూడ గమనించినారము. ఈరెండుభాగములను జేర్చి యొక్కగ్రంథముగా భావించి చదువుకొనుట యుచితము.

జ. రామయ్య