శాసనపద్యమంజరి
జయంతి రామయ్య పంతులు గారి
శాసనపద్యమంజరి
సంపాదకులు
డా. ఈమని శివనాగిరెడ్డి-స్థపతి
డా. కొండా శ్రీనివాసులు
డా. జి.వి.పూర్ణచందు
ప్రధానసంపాదకుడు
డా.దీర్ఘాసి విజయభాస్కర్
జయంతి రామయ్య పంతులు గారి
శాసనపద్యమంజరి
ఒకటవ, రెండవ భాగాలు
సంపాదకులు
డా. ఈమని శివనాగిరెడ్డి-స్థపతి
డా. కొండా శ్రీనివాసులు
డా. జి.వి.పూర్ణచందు
ప్రధానసంపాదకుడు
డా.దీర్ఘాసి విజయభాస్కర్
ప్రచురణ
ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక & సంస్కృతి సమితి
అమరావతి-2018
జయంతి రామయ్య పంతులు గారి
శాసన పద్యమంజరి (ఒకటవ, రెండవ భాగాలు కలిపి)
సంపాదకులు
డా.ఈమని శివనాగిరెడ్డి-స్థపతి,
సీఈవో, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ & అమరావతి
డా. కొండా శ్రీనివాసులు,
ఆం.ప్ర. చరిత్ర కాంగ్రెస్ పూర్వ కార్యదర్శి
డా.జి.వి.పూర్ణచందు,
కృష్ణాజిల్లా రచయితలసంఘం కార్యదర్శి
ప్రధాన సంపాదకులు
డా.దీర్ఘాసి విజయభాస్కర్,
సీఈవో, ఆం.ప్ర.సృజనాత్మకత & సంస్కృతి సమితి
కాపీలు : 1000
వెల: రూ. 150.00
ఒకటవ భాగం ప్రథమ ముద్రణ : 1930
రెండవ భాగం ప్రథమ ముద్రణ : 1937
పునర్ముద్రణ : 29-07-2018
ప్రతులకు :
ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత & సంస్కృతి సమితి
2వ అంతస్తు,
ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత నృత్య కళాశాల,
దుర్గాపురం, విజయవాడ-3.
ఫోన్ : 96188 48470
డి.టి.పి.: మలపాక సోమయాజులు
కవర్ పేజీ : గిరిధర్ అరసవెల్లి
ముద్రణ : మల్లెతీగ ముద్రణలు, విజయవాడ - 98669 08843
ఆంధ్రప్రదేశ్ శాసనసభ,
వెలగపూడి,
అమరావతి.
డా.మండలి బుద్ధప్రసాద్
హృద్యసుందరి శాసనపద్యమంజరి
నన్నయకు బాగా ముందే తెలుగులో పద్యముందని తెలియజెప్పిన శ్రీ జయంతి రామయ్య పంతులు గారు తెలియని తెలుగు చరిత్రకారులు, శాసనపరిశోధకులు, సాహితీమూర్తులు వుండరంటే అతిశయోక్తి కాదు. యుద్ధమల్లుని బెజవాడ శాసనంలో తెలుగుపద్యా లున్నాయని మొట్టమొదటిసారిగా చెప్పింది ఆయనే. శాసనాలను సేకరించి, పరిష్కరించి, దక్షిణభారతశాసనసంపుటి పేరిట ప్రచురించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆంధ్రసాహిత్యపరిషత్తు ఏర్పాటులో కీలకపాత్ర పోషించటమేకాక, ఎన్నో శిలాశాసనాలను ఆ సంస్థ పత్రిక ద్వారా వెలుగులోకి తెచ్చి తెలుగువారి చరిత్రను సుసంపన్నం చేశారు. తనకున్న ఆసక్తి కొద్దీ అనేకశాసనాల నకళ్ళను ముందేసుకుని, వాటిలోని పద్యాలను గుర్తించి, గణవిభజన చేసి, ఛందస్సుతో పాటు రెండుభాగాలుగా 'శాసనపద్యమంజరి' అనే పుస్తకాలను ప్రచురించి తెలుగు చారిత్రకసాహిత్యజగత్తుకు ఎనలేనిసేవ చేశారు.
1930, 1937 సంవత్సరాల్లో వరుసగా జయంతి రామయ్య పంతులుగారి శాసనపద్యమంజరి మొదటి, రెండు భాగాలు ముద్రించబడి ప్రజల మన్ననలు పొందాయి. ఆ పుస్తకాలు ఇపుడు అందుబాటులో లేనందువల్ల ఈతరం పరిశోధకులకు అందించాలనే ఉద్దేశంతో పురావస్తుపరిశోధకులు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ & అమరావతి, సీఈవో, డా॥ ఈమని శివనాగిరెడ్డి-స్థపతి, కృష్ణాజిల్లా రచయితలసంఘం కార్యదర్శి, డా॥ జి.వి.పూర్ణచందు, శాసనపరిశోధకులు డా॥ కొండా శ్రీనివాస్ లు ఈపుస్తకపునర్ముద్రణకు పూనుకోవటం హర్షించదగ్గవిషయం. ఈ సందర్భంగా వారిని నేను అభినందిస్తున్నాను.
కీ.శే.జయంతి రామయ్య పంతులు గారి 'శాసనపద్యమంజరి' యువపరిశోధకులకు ఎంతో ఉపకరిస్తుందని ఆశిస్తూ...
20-07-2018
అమరావతి
డా.మండలి బుద్ధప్రసాద్
ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత &
సంస్కృతి సమితి
ఘంటసాల వెంకటేశ్వరరావు
ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల
దుర్గాపురం, విజయవాడ.
డా. దీర్ఘాసి విజయభాస్కర్
ఫలించిన కల
తెలుగులో వచన కవిత్వం క్రీ.శ. 6వ శతాబ్దిలో ప్రారంభమైంది. క్రీ.శ. 9వ శతాబ్దిలో పద్యకవిత్వం ప్రారంభమైనా, శాసనాలను పరిశోధించిన తరువాత గానీ ఈ విషయం వెలుగులోకి రాలేదు. కీ.శే. జయంతి రామయ్య పంతులుగారు, తెలుగు శాసనాల్లో పద్యాలను గుర్తించిన తరువాత నన్నయ కంటే ముందు తెలుగులో కవిత్వం లేదనే వాదన వీగిపోయింది. 1920వ దశకంలో జయంతి రామయ్య పంతులుగారు తెలుగు శాసనాలను సేకరించి, వాటిలోని పద్యాలను గుర్తించి, కాలానుక్రమణికలో శాసనపద్యమంజరి పేరిట 1930లో మొదటి సంపుటాన్ని, 1937లో రెండో సంపుటాన్ని ఆంధ్రసాహిత్య పరిషత్తు ద్వారా ప్రచురించి అందుబాటులోకి తెచ్చారు.
88 ఏళ్ళ క్రితం ప్రచురించిన మొదటి సంపుటం, 57ఏళ్ళ తరువాత పునర్ముద్రణ పొందినా ఈ తరానికి ఆ రెండు సంపుటాలు అందుబాటులో లేవు. చరిత్ర సాహిత్య విద్యార్థులు, పరిశోధకుల విజ్ఞప్తి మేరకు జయంతి రామయ్య పంతులుగారి శాసనపద్యమంజరి రెండు సంపుటాలను కలిపి, ఒకే సంపుటంగా తీసుకురావటానికి చరిత్ర, పురావస్తు పరిశోధకులు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ & అమరావతి, సీఈవో, డా॥ఈమని శివనాగిరెడ్డి పూనుకోవటం ఆనందించదగ్గ విషయం. ఈ సందర్భంగా ప్రచురణ బాధ్యత చేపట్టిన ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక మరియు సంస్కృతి సమితి పక్షాన సహసంపాదకులు డా.జి.వి.పూర్ణచందు, డా. కొండా శ్రీనివాసులుగార్లను కూడా అభినందిస్తూ, ఈ పుస్తకం చరిత్ర, సాహిత్యం విద్యార్థులు, పరిశోధకుల ఆదరణ చవిచూస్తుందని ఆశిస్తూ, కీ.శే. జయంతి రామయ్యపంతులుగారిని స్మరించుకుంటూ...
20-07-2018
అమరావతి
దీర్ఘాసి విజయభాస్కర్, సీఈవో
మనవి మాటలు
తెలుగునేలపై శాసన పరిశోధన ప్రారంభమై రెండు శతాబ్దాలైంది. వాటి నకళ్ళను ప్రామాణిక పత్రికల్లోనూ, అప్పటి పురావస్తు సర్వేక్షణసంస్థ సంపుటమైన ఎపిగ్రాఫియా ఇండికాలోనూ, ఇతర సంస్థల పత్రికల్లోనూ ప్రచురించేవారు. దక్షిణభారత శాసన సంపుటులు, ఆంధ్రసారస్వత పరిషత్ పత్రికకోసం శాసనాలు సేకరించటంలో భాగంగా ప్రముఖ శాసన పరిశోధకులు శ్రీ జయంతి రామయ్య పంతులుగారు, శాసన పద్యమంజరిని రెండువిడతలుగా ప్రచురించారు. దీనివల్ల నన్నయకంటే ముందు 178సం॥ పూర్వమే తెలుగులో పద్యము పుట్టిందని నిరూపించారు. 1937లో రెండవభాగము పీఠికలో రామయ్యపంతులుగారు 'ఇపుడు విడివిడిగా నుండు భాగములు రెండును వ్యయమైన పిదప నారెండుభాగముల పద్యములను గలిపి యొక పుస్తకముగా ముద్రించెదము' అని పేర్కొన్నారు.
ఆ మహనీయుని ఆశయం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత & సంస్కృతి సమితి, సీఈవో, డా. దీర్ఘాసి విజయభాస్కర్ గారి పుణ్యమా అని ఆ రెండు పుస్తకాల్ని కలిపి ఒక్కటిగా జయంతి రామయ్య పంతులుగారి శాసనపద్యమంజరిని తీసుకురావటమైంది. మొదటి భాగములోని గ్రామాల వరుసక్రమం, రెండవ భాగములోని గ్రామాల వరుసక్రమం, యథాప్రకారమే కొనసాగించి, మొదటిభాగములోని 88 గ్రామాల తరువాత, రెండోభాగంలోని మొదటిగ్రామం నుంచి 89 నుంచి కొనసాగించటమైంది. పాఠకులు ఈ పుస్తకాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాము.
డా.ఈమని శివనాగిరెడ్డి-స్థపతి
డా.కొండా శ్రీనివాసులు
డా.జి.వి.పూర్ణచందు
కృతజ్ఞతలు
శ్రీమతి భూమా అఖిలప్రియ,
గౌ. ఆంధ్రప్రదేశ్ భాష, సాంస్కృతిక, పర్యాటక శాఖామాత్యులు,
డా. మండలి బుద్ధప్రసాద్, గౌ. ఉపసభాపతి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ,
శ్రీ ముఖేష్ కుమార్ మీనా, ఐ.ఎ.ఎస్, కార్యదర్శి, పర్యాటకశాఖ, ఆం. ప్ర.,
డా.దీర్ఘాసి విజయభాస్కర్, సీఈవో, ఆం.ప్ర. సృజనాత్మకత & సంస్కృతి సమితి,
కీ.శే. జయంతి రామయ్యపంతులు గారు,
డా.జి.వి.పూర్ణచందు, కార్యదర్శి, కృష్ణాజిల్లా రచయితల సంఘం,
డా. కొండా శ్రీనివాసులు, ఆం.ప్ర. చరిత్రకాంగ్రెస్ పూర్వ కార్యదర్శి
శ్రీ వై.హరిశ్చంద్రప్రసాద్, ఛైర్మన్, మాలక్ష్మీగ్రూప్ & కల్చరల్ సెంటర్ ఆఫ్
విజయవాడ &అమరావతి,
శ్రీ సందీప్ మండవ, సీఈవో, మాలక్ష్మీ ప్రాపర్టీస్ ప్రై.లి.,
కుర్రా జితేంద్రబాబు
డైరెక్టర్, డెక్కన్ ఆర్కియోలజికల్ & కల్చరల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్
డా.డి.సూర్యకుమార్, శాసన పరిశోధకులు
డా.అ. ఉమామహేశ్వరశాస్త్రి, డా. ఎస్.జై.కిషన్, గోళ్ళనారాయణరావు,
డా. గుమ్మా సాంబశివరావు, డా. వెన్నా వల్లభరావు, శుభాకర్ మేడసాని, కలిమిశ్రీ,
గిరిధర్ అరసవెల్లి, సోమయాజులు మలపాక, చందూ కార్తీక్ గార్లకు
నా కృతజ్ఞతలు.
డా.ఈమని శివనాగిరెడ్డి - స్థపతి, సీఈవో
ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ & అమరావతి
4వ అంతస్తు, మధుమాలక్ష్మి ఛాంబర్స్, మొగల్రాజపురం, విజయవాడ-10.
మొబైల్ : 9848598446, E. mail: drreddynithm@gmail.com
శ్రీ జయంతి రామయ్యపంతులు
శ్రీ జయంతి రామయ్య పంతులు గొప్పపండితుడు. శాసనపరిశోధకుడు. ఆంధ్రభాషోద్ధరణాభిలాషి. గోదావరిజిల్లాలోని కోనసీమలో గల అమలాపురంకు సమీపంలోని ముక్తేశ్వరం ఆయన స్వగ్రామం, జన్మస్థలం. శ్రీ జయంతి 1860, జూలై 18న జన్మించారు. తల్లి సోమమ్మ, తండ్రి రామయ్య. తెలుగువారికి తెలుగుదనానికి, ముఖ్యంగా తెలుగుభాషకు ఊపిరి అందించిన గొప్ప కవిపండితుడు జయంతి రామయ్య పంతులు. నేటితరం యువతకు బొత్తిగా జయంతివారిపేరే ఎరుగని పరిస్థితి వుంది. మహాకవి నన్నయ్యకు పూర్వమే తెలుగుభాష వుందనీ తెలుగులో కవిత్వం రాశారని జయంతి రామయ్య రుజువు చేశారు. శ్రీ రామయ్య పంతులు పలు అరుదైన శాసనాలను వెలుగులోకి తెచ్చారు. ఐతే ఈ విషయాలు నేటితరంలో చాలా కొద్దిమందికే తెలుసు.
తెలుగుభాషోద్ధరణలో మహనీయుల నిరంతరశ్రమ, కృషి ఎంతో వుంది. అలాంటి మహనీయులను గుర్తుంచుకోవడం నేటి యువత తమ విధిగా భావించాలి. శ్రీ జయంతి రామయ్య పంతులు తెలుగుభాష పూర్వాపరవిషయాలపై అనేకపరిశోధనలు చేశారు. పలుశాసనాలను వెలుగులోకి తీసుకొచ్చారు. తెలుగుభాషాపరంగా ఎన్నో చారిత్రకవిషయాలపై జయంతిరామయ్య విశేషకృషి, పరిశోధనలు చేశారు. విశేషంగా విజయనగరచక్రవర్తులవిషయమై సంగమవంశరాజులకు, తుళువవంశరాజులకు మధ్య సాళువవంశరాజులు పాలించిన విషయాన్ని బహిరంగపరిచింది జయంతివారే. ఈ సంగతిని జయంతివారు తనపరిశోధనల ద్వారా దేవులపల్లి శాసనంతో రుజువు పరిచారు.
అలాగే, విజయవాడ ప్రాంతంలో 'యుద్ధమల్లుని' శిలాశాసనం వెలికి తీసింది జయంతి రామయ్యగారే. యుద్ధమల్లుడు రాసిన తెలుగు పద్యాలను ఒకశిలాశాసనంలో ఉన్నవాటిని బహిరంగపరిచా డాయన. ఆమాదిరిగా యుద్ధమల్లుడు తెలుగులో మహాభారతం రాసిన నన్నయ్య భట్టారకుని కంటే పూర్వుడని తెలుగులోని మహాభారతం కంటే పూర్వం తెలుగుభాష వుందని సాధికారికంగా, సహేతుకంగా తెలుగువారి దృష్టికి తీసుకొచ్చా డాయన. ప్రాచీనాంధ్రశిలాశాసనాలలోని పద్యాలను సేకరించి వాటిని క్రోడీకరించి 'శాసనపద్యమంజరి' పేరున రెండు సంపుటాలుగా ఆయన ప్రచురించారు. అలాగే, “దక్షిణహిందూదేశశాసనములు" అనే గ్రంథాన్ని ఆయన ప్రచురించారు. శ్రీ జయంతి రామయ్య రాష్ట్రంలో జిల్లా మేజిస్ట్రేటుగా, ప్రెసిడెన్సీ మేజిస్ట్రేటుగా పని చేశారు. ఆయన వృత్తిరీత్యా ఎక్కడ పనిచేసినా, సాయంసమయాల్లో తన కిష్టమైన సాహిత్యకార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. ఆ రోజుల్లో పిఠాపురం, బొబ్బిలి, వెంకటగిరి సంస్థానాధీశులు, తుని రాణిగారు, ఉయ్యూరు జమీందారులు తదితరు లెందర్నో ప్రోత్సహించి వారినుంచి ఆర్ధికసహాయం పొంది “ఆంధ్రసాహిత్యపరిషత్తు" నొకదాన్ని ఏర్పాటు చేసి తద్వారా ఎన్నో ప్రాచీనశిలాశాసనాలను, సుమారు ఐదువేల తాళపత్ర సంపుటాలను సేకరించారు. అలాగే, అనేకానేక అముద్రిత, అమూల్యగ్రంథాలను సేకరించి సాహిత్యపరిషత్తుకు అందజేశారు. ఆంధ్రసాహిత్యపరిషత్తు తొలుత చెన్నైలో వున్నా, ఆ దరిమిలా కాకినాడకు తరలించారు. ఈ పరిషత్ పక్షాన ఒకపత్రికను కొంతకాలంపాటు నిర్వహించారు. ఈ పత్రిక ద్వారా ఎన్నో అమూల్యసాహిత్యసమాచారాన్ని ప్రచురించి వాటిని ప్రత్యేకగ్రంథాలుగా, సంపుటాలుగా తెలుగువారికి అందించిన ఘనత రామయ్య పంతులుగారికి దక్కుతుంది.
సంస్కృతం, తెలుగు భాషలలో గొప్పపాండిత్యంతో పాటు, 1882లోనే డిగ్రీ పూర్తి చేసిన జయంతి రామయ్య 1884లో పిఠాపురం మహారాజావారి స్కూలులో ప్రధానోధ్యాపకుడిగా కొంతకాలం పన్జేసారు. ఆ దరిమిలా న్యాయశాస్త్రం అధ్యయనం చేసి బి.ఎల్. పట్టా పొంది 1911లో జిల్లా మేజిస్ట్రేటుగా నియమితు లయ్యారు. బ్రిటీషువారి పాలనలో ప్రముఖన్యాయాధికారిగా స్థానికప్రజలందరికీ ఎనలేనిసేవ లందించా రాయన. అంతేకాదు ఉత్తరరామచరితము, ముక్తేశ్వరశతకం, చంపూరామాయణం, అమరుకము వంటి ఆధ్యాత్మిక గ్రంథాలను ఆయన రచించారు. 'ఆంధ్రవాఙ్మయవికాసవైఖరి' అనే విమర్శనాత్మకగ్రంథం, ఇంగ్లీషులో "Defence of Literary Telugu, Dravidian Lexicography" వంటి పలుగ్రంథాలను ఆయన రాశారు. తెలుగు భాషాచరిత్రలకు సంబంధించి జయంతి రామయ్య చేసిన పరిశోధనలు అనన్యసామాన్యం. గిడుగువారి వ్యవహారికభాషావాదనపట్ల మక్కువ చూపక గ్రాంథికభాషావాదిగా తనను తాను ప్రకటించుకున్నా రాయన. తెలుగుభాషకు ఇతోధికసేవ లందించిన జయంతి రామయ్య పంతులు గారు 1941 ఫిబ్రవరి 19వ తేదీన 81 సంవత్సరాల నిండువయస్సులో స్వల్ప అస్వస్థతకు గురై తుదిశ్వాస విడిచారు. తెలుగువారందరికీ ప్రాతఃస్మరణీయుడు జయంతి రామయ్య పంతులు.
డా.మల్లాది కృష్ణానంద్
(మన తెలుగు పెద్దలు నుంచి)
శాసనపద్యమంజరి
పీఠిక
ఆంధ్రదేశమం దచ్చటచ్చట నున్న శిలాశాసనములందలి తెలుఁగు పద్యము లిందుఁ గూర్పఁబడియున్నవి. వీనిలో ననేకములు మాతృకలను బట్టి గాని వాని ప్రతిబింబములను బట్టి గాని నేను స్వయముగాఁ బ్రతివ్రాసినవియే. కొన్ని శాసనము లచ్చటచ్చట నిదివఱలో బ్రకటితములై యున్నవి. ఏయే గ్రంథములందు ముద్రింపఁబడినవో యవి యథాసందర్భముగ సూచించినాఁడను. ఇదివఱకుఁ బ్రకటింపఁబడని శాసనములలో నేవియైన రాజకీయశాసనాధికారవర్గముచే సంభృతములైన శాసనములలోఁ జేరియున్నచో నాశాసనము లాశాసనవర్గమువారు ప్రకటించిన యేయేసంవత్సరపు పట్టికలలో నేయేసంఖ్య గలవిగా నున్నవో యదియు సూచించినాఁడను. ఇందు మొదటిశాసనము 770వ శకసంవత్సరప్రాంతమునందును, చివరిది 1600వ శకసంవత్సరప్రాంతమందును బుట్టిన వగుటచే నెనిమిదివందల సంవత్సరములకంటె నధిక మగుకాలమందుఁ బుట్టినపద్యము లిందుఁ గలఁ వని తేలుచున్నది. వీనిలో మొదటిశాసనము నన్నయభట్టారకుని ప్రభువగు రాజరాజనరేంద్రునికంటె నూటడెబ్బది ఎనిమిది సంవత్సరములు పూర్వము – అనగా శ.స. 766 మొదలుకొని రాజ్యముచేసిన గుణగవిజయాదిత్యుని రాజ్యకాలమునఁ బుట్టినది. దానికి నించుమించుగా నేఁబది సంవత్సరముల పిదప రెండవశాసనము పుట్టినది. కావున నీరెండు శాసనములును వాగనుశాసనకాలముకంటెఁ బూర్వము పుట్టినవే. ఈనాఁటిమండలముల వరుసనుబట్టియే యేయేమండలములలో నెన్నెన్ని శాసనములు దొరికినవో యీ క్రిందిపట్టికవలనఁ దెలియఁదగు. గంజాము ... 1
విశాఖపట్టణము ... 1
గోదావరి ... 11
కృష్ణ ... 17
గుంటూరు ... 52
నెల్లూరు ... 1
కర్నూలు ... 1
కడప ... 2
గోలకొండదేశము ... 2
———
88
———
మొత్తము పద్యములలో ముప్పాతికకు మించి కృష్ణాతీరమందు దొరికినవి. పూర్వకాలమందు, కృష్ణాతీరమందుఁ గవులెక్కుడుగా నున్నట్లు దీనివలనఁ దెలియుచున్నది.
ఈపద్యములవలని ప్రయోజనములు రెండువిధములు. దేశచరిత్రము తెలిసికొనుట యొకటి, ఆంధ్రశబ్దలక్షణమును ఛందస్సును గాలక్రమమున నెట్లు మాఱియుండునో యది తెలిసికొనుట యొకటి. భారతాది ప్రాచీనగ్రంథములు కూడ భాషాచరిత్రశోధన కుపయోగించునవియే కాని యవి పుట్టినవి పుట్టిన ట్లిప్పటివారికి లభించుటలేదు. కవులు వ్రాసిన మాతృకలు చిరకాలముక్రిందటనే నశించిపోయి... వానిని బట్టి యాయాకాలమువారు వ్రాసియుంచిన ప్రతులలోఁ జిట్టచివరవియె యప్పుడు దొరుకుచున్నవి. పాండిత్యాభావముచేత నేమి పాండిత్య ముండియుఁ బ్రాచీనప్రయోగములు తప్పు లనుకొని సవరించుటవలన నేమి కేవలప్రమాదముచేత నేమి ప్రతులు వ్రాసినవా రచ్చట్చటఁ బాఠముల దిద్దుచుండిరి. లిఖితప్రతులలోఁ బాఠాంతరములుండుటయే యిందులకు నిదర్శనము. ఇట్లు మారియున్న గ్రంథములం బట్టి కవిప్రయుక్తపాఠముల నిర్ణయించుటశ్రమసాధ్యము. ఈ శాసనపద్యము లన్ననో కవులజీవితకాలములో నెట్లు లిఖింపఁబడినవో యట్లే మనకు లభించుటచేఁ గవిప్రయుక్తపాఠనిర్ణయమున కత్యంతప్రబలసాధనములుగా నున్నవి. ఈ విషయములో నేమి యితరవిషయములలో నేను వీనిప్రామాణ్య మేమాత్రమును జెడకుండుటకై పద్యపాఠములు తూచాలు తప్పకుండ నున్నవి యున్నట్లే ముద్రింపఁబడినవి. ప్రమాదముచే నెక్కడనయిన నొక్కపాఠము తప్పియుండిన నుండునేమో కాని తప్పకుండ నుండవలయుననియే సర్వప్రయత్నములు చేసినారము.
ఈపద్యములం దయినను గవ్యుద్దిష్టములు కానిపాఠములు కొన్ని ప్రవేశించి యుండఁగూడదా యన్నచోఁ బ్రవేశించి యున్నవని యొప్పుకొనక తప్పదు. లేఖకప్రమాదజనితదుష్టప్రయోగము లనేకము లచ్చటచ్చటఁ గన్పట్టుచున్నవి. ఆపాఠము లున్నవి యున్నట్లే మూలమం దుంచి వానిని సవరించువిధ మాయాపుటలయం దడుగున సూచింపఁబడినది.
ఇవి గాక కవిప్రయుక్తము లనఁదగిన పాఠములలోఁ గూడ వర్ణక్రమమునందును శబ్దలక్షణమందును నిప్పటి సదాచారమునకు విరుద్ధము లయిన ప్రయోగములు కొన్ని కనఁబడుచున్నవి. ఇవి కూడ లేఖకప్రమాదజనితములే కాఁగూడదా యన్న నట్లు కానేరదని చెప్పవలసియున్నది. వివిధకాలముల వివిధదేశములందుఁ బుట్టిన వివిధశాసనము లన్నింటిలో నొక్కవిధముగా నున్నప్రయోగము లాయాకాలములందు జనసామాన్యసమ్మతము లయినవే గాని యాయాయి లేఖకులు కల్పించినవి కావని చెప్పక తప్పదు. అట్టి ప్రయోగములలో ముఖ్యమైన వీక్రింద వివరింపఁబడుచున్నవి. వీనిలో I. వర్ణక్రమమునకు సంబంధించినవి కొన్ని, II. శబ్దలక్షణమునకు సంబంధించినవి కొన్ని.
I. వర్ణక్రమసంబంధములు
1. అనుస్వారస్వరూపమును గుఱించి ముందుగా విచారింతము. అనుస్వారము తెనుఁగులోఁ బూర్ణ మనియు నర్ధ మనియు రెండువిధములు. నిండుసున్న పూర్ణానుస్వారరేఖ. అఱసున్న యర్ధానుస్వారరేఖ. శాసనములందుఁ గాని పూర్వపువ్రాతపుస్తకములందుఁ గాని యఱసున్న యెచ్చటను గానరాదు. అది యుండవలసినచోటఁగూడ నిండుసున్నయే కనఁబడుచున్నది. ప్రాచీనశాసనములలో నిండుసున్నకు బదులు వర్గాంత్యానునాసికాక్షరములు కనఁబడుచున్నవి. అనగా కట్టిఞ్చి, తమ్ముణ్ఢు, అన్తయేనియు, ఫలమ్బు, ఇత్యాదిరూపంబులు కనఁబడుచున్నవి. దీనిని బట్టి చూడంగాఁ దెలుఁగులో ననుస్వారమని వాడఁబడుచున్నది వర్గాంత్యానునాసికాపరరూప మనియు, అది తొలుత ననునాసికాక్షరముగానే వ్రాయఁబడుచుండి కొంతకాల మైనపిదప సౌకర్యార్థము బిందురూపముగా వ్రాయఁబడెననియు, ఆబిందువు తొలుతం బూర్ణముగానే యుచ్చరింపఁబడి రాను రాను లాఘవార్ధము దీర్ఘముమీఁద నిత్యముగాను హ్రస్వముమీఁద నైకల్పికము గాను దేల్చి పలుకఁబడసాగె ననియు దీనివలననేపూర్ణార్ధానుస్వారభేద మేర్పడియె ననియుఁ దేలుచున్నది.
2. శాసనములలోఁ గొన్నిచోటులు వ్రాఁత యొకవిధముగాను బలుకుబడి యొకవిధముగాను గనఁబడుచున్నది. ఉదాహరణము:-
(క) రెండవశాసనములో "నెగి దీచ్చెన్ మఠంబు” (2 వ పద్యము) "అశ్వమేధంబు ఫలంబు" (3 వ పద్యము) అనుచోటుల మఠము, ఫలము అని చదువవలయును. లేకున్న ఛందోభంగ మగును. మతశబ్దమునకు మఠంబు, మరమ్ము, మరమునని మూఁడురూపము లున్నవి. అందు మఠంబు అనునదియే మొదటి రూప మయినట్లును అది మాఱి మఠమ్ము అయినట్లును, అది తేలిచి పలుకుట చేత మఠము అయినట్లను గనఁబడుచున్నది. పలుకుబడి యీవిధముగా మాఱినను వ్రాఁతమాత్రము మఠంబు అనియే కొంతకాలమువఱకు నుండెను. మఠము అనురూపము గ్రంథములందుఁ గానవచ్చుచున్నది, గాని, శాసనములం దంతగాఁ గనుపడుట లేదు, ప్రాసార్థము కవు లారూపము నంగీకరించియుందురు.
(చ) మూఁడవశాసనములో “బురుడించ్చునట్లు” అనుచోట “బురుడించునట్టుల” అనియు నాలుగవశాసనములో “శ్రీశకునేణ్డ్లు" అనుచో “శ్రీశకునేణ్డులు" అనియుఁ దొమ్మిదవశాసనములో “ఇష్ట్లకు" అనుచోట “ఇష్టులకు" అనియు “గుడ్లకు" అన్నచోట "గుడులకు" అనియు, నిరువదియొకటవశాసనములో “చెఱ్వు" (2 వ పద్యము) అనుచోట "చెఱువు" అనియుఁ జదువవలయును. ఈజంటరూపములం దసంయుక్తరూపములే పూర్వరూపములు. సంయుక్తరూపములు తరువాత వచ్చినవి. అయినను వాని కొకానొకప్పు డసంయుక్తోచ్చారణమే చెప్పవలసియున్నది. సంక్లిష్టములుగా నుండవలసిన యక్షరములు కొన్నితావుల విడిగా వ్రాయబడినవి. ఉదా:- నిలిపె (39వ శాసనము)
(ట) ఋకారమునకు బదులుగా ఇకారసహితరేఫమే ప్రాచీనశాసనములలోఁ గనఁబడుచున్నది. ఉదా:-బ్రింద, వ్రిక్షము, మ్రిగాంక (10 వ శాసనము) సమ్రిద్ది (41-6). ఒకానొకప్పుడు “నృ" అనుదానికి బదులుగా “ంద్రి" అనురూపము కనఁబడుచున్నది. ఉదా:- సూంద్రిత (41-2) సకంద్రి పావనీ పాల (41-13).
(త) పాదాంతములందుఁ గేవలము హల్లుగా నుండవలసిన నకారలకారములు సాధారణముగా అజంతములుగానే కనఁబడుచున్నవి. అచ్చునకుఁ బలుకుబడి లేదు. ఒకానొకచోట నకారము పొల్లురూపమును గలదు. ఉదా:- అర్థిన్ (2-1) హేతిచేన్ (52-2) పదమధ్యమందుఁగూడ హల్లుమాత్రముగానే యుండవలసిన నకారలకారము లచ్చుతోఁ గూడి కనఁబడుచున్నవి. ఉదా:- శకాబ్దములు (55-5) దువ్వెన్వసాయులను(7-4) భంగదులు (12-4).
(ప) ఐ కి మాఱుగా, అయి, అయికి మాఱుగా, ఐ, తఱచుగా వ్రాయబడినవి. (గ) అనుస్వారపూర్వకాక్షరము పెక్కుతావుల ద్విగుణీకరింపఁబడినది. అట్లు కానిచోటులునుం గలవు.
(జ) సంయుక్తాక్షరములలో రేఫపరక మగునక్షరము తఱచుగ ద్విగుణీకరింపఁబడినది. ఉదా:- కర్త్త (58-2) ధర్మ్మంబు (58-3).
(డ) క్రావడి యుండవలసినచో శకటరేఫ ముండుట. ఉదా:- వణ్ఱె(1) చెబ్ఱోలనుణ్డి (2-4).
(ద) ...స్సి, అ... సిన (2-3) ఇత్యాదిశబ్దములందు ... యను వింతయక్కర మొక్కటి కనఁబడుచున్నది. ఇది యఱవములోని ..., కన్నడములోని ... యనునక్షరములకు సజాతీయమైనది. దీనియుచ్చారణ మిప్పుడు డకారోచ్చారణముగా మాఱినది. ఈయక్షరమును గూర్చిన విమర్శన మాంధ్రసాహిత్యపరిషత్పత్రికలోఁ గననగు.
పైనుదాహరింపఁబడిన వర్ణక్రమదోషముల నన్నింటిని సవరించినచో గ్రంథవిస్తర మగునని విడిచిపెట్టినారము. పాఠకులు యథోచితముగ సవరించుకొనవలయును.
II. శబ్దలక్షణమునకు సంబంధించిన ప్రయోగవిశేషములు
1. సంస్కృత శబ్దములు కొన్నింటికి లక్షణవిరుద్ధములైన రూపములు కనఁబడుచున్నవి.
(క) కల్హారగంధి యనుటకు బదులుగా కలుహారగంధి యని (15-3).
(చ) కమలనేత్రి (3-1) వనజనేత్రి (4-1) విశాలనేత్రి (5.5) అంభోరుహనేత్రి (15-3) ఇత్యాదిస్థలములందు నేత్ర యనుటకు నేత్రియని ప్రయోగించుట.
(ట) వల్లభ యనుటకు బదులుగా వల్లభి యనుట (4-1, 5-3)
(త) బాలిక యనుటకు బదులుగా బాలకి యనుట (5-5)
(ప) ఉదయించె ననుటకు బదులుగా ఉదియించెనని తఱచుగాఁ గన్పట్టుచున్నది.
(గ) అకారాంతశబ్దములకు డుప్రత్యయము పరమైనప్పుడు ప్రకృతిరూపమందలి చివరియకారమున కుకారము రాకుండుట - బ్రహ్మదేవండు (40-3,5) శరణండు (46-14) భీమర్ని (48-2) మల్లిదేవండు (58-12,13).
2. డుప్రత్యయంతశబ్దములు కొన్ని డుప్రత్యయము లేకయే కనఁబడుచున్నవి. చోడుఁడు అనుటకు బదులు చోడు (58-7) తమ్ముఁడు అనుటకు బదులు తమ్ము (58-15, 16)
3. నన్నయ భట్టారకుని కవిత్వమందుఁ గల ప్రయోగవిశేషములు కొన్ని యీశాసనములందుఁ గనుపట్టుచున్నవి.
(క) “అందు” నకుఁ బ్రయోగవిశేషము. (16-6)(చ) ప్రథమకు బదులుగా షష్ఠీవిభక్తి ప్రయోగము. నీపడసిన (9) వెలనాంటిచోడనృపునిచ్చిన (42-1)
(ట) అస్వమేధంబున ఫలంబు (1)
4. కళలపై వచ్చు కచటతపలకు గసడదవాదేశము సాంస్కృతికములందు సైతము తఱచుగాఁ గనఁబడుచున్నది. ఈయాదేశము నిత్యమనియే పూర్వులు భావించినట్లుకనుపట్టుచున్నది.
ఛందోవిషయము
1. రెండవ శాసనములోని మధ్యాక్కరలలో యతి ప్రతిపాదమునందు నైదవగణము మొదటఁ గనఁబడుచున్నది. నన్నయభట్టారకుని కవిత్వమందు నిట్లే యున్నది.కవిజనాశ్రయమునందుఁ గూడ నిట్లే విధింపఁబడియున్నది కాని యిటీవలి కవిత్వమందు నాలుగవగణము మొదటఁ గనఁబడుచున్నది. అప్పకవ్యాదులగు లాక్షణికులునిట్లే నిబంధించినారు.
2. మొదటి శాసనములో "గొళల్చి" యనుచోటను, రెండవ శాసనములో“గొరగల్గా కొరు లిందు” అను చోటను లకారము విడిచి యుచ్చరింపవలయును. ఈసంప్రదాయము కన్నడములో నక్కడక్కడఁ గలదు.
ఇంతకంటే ఛందస్సులో విశేషము లగపడవు.
వర్ణక్రమమందుఁ దప్ప నితరవిషయములందు శాసనపద్యభాషకును నేఁటిపద్యభాషకును భేద మంతగాఁ గనఁబడదు. ఆనాఁటికే భాషాలక్షణము చాలవఱకుస్థిరపడి యున్నది.
పద్యసంజ్ఞలును పద్యసంఖ్యయు మేము చేర్చినవి గాని మాతృకలోనివి కావని గ్రహింపవలయును. ఒక్కొక్కచో మాతృకలో కందం, వ్రిత్తం అని యున్నచోటులు చూపింపఁబడినవి.
- జ. రామయ్య