Jump to content

శారద లేఖలు (మొదటి సంపుటము)/ప్రథమ లేఖ

వికీసోర్స్ నుండి

 సౌభాగ్యవతియగు కల్పలతకు:—

నెచ్చెలీ! నేడు చాల పుణ్యదినము. బహుకాలమునకు నీకు మరల నుత్తరమువ్రాయు భాగ్యము గల్గినది. అంతియేగాక స్త్రీజనాభ్యుదయమునకై నూతనముగా వెలువడిన మాసపత్రికయగు గృహలక్ష్మి మనయుత్తర ప్రత్యుత్తరముల నడిపెడు భారమును వహించినది. నిజముగా నిది మనకు మంచి సుదినము కాదా? సోదరీ, మన జాబు లిక నిరంతరాయముగ నడువ గలవని తలంచినపుడు నాకు మిక్కిలి సంతసము గలుగుచున్నది. మరియు నేటి మన యీలేఖల ప్రారంభకాలము గూడ మిక్కి_లి శుభావహముగనున్నది.

పూర్వము మనము జాబులు వ్రాసికొనెడు కాలమున కంటె నేడు మనస్త్రీలయం దున్నతి యత్యధికముగ గాన్పింపుచున్నది. మన భారతనారీమణు లంతర్జాతీయ సమావేశములకు ఖండాంతరముల కేగివచ్చుటయు, శాసన సభలలో సభ్యురాండ్రుగజేరుటయు, అంతియగాక డిప్యూటీ ప్రెసిడెంటు మొదలగు ఉన్నతపదవుల వహించుటయు, స్థానిక సంఘముల యందును, విద్యా సంఘముల యందును సభ్యురాండ్రగుటయు, ఆనరరీ మేజస్ట్రీటు పదవులనందుటయు, దేశీయసభలలో దేశ స్వాతంత్ర్యమునకును, సంఘసంస్కరణ సభలలో సాంఘిక స్వాతంత్ర్యమునకును, ప్రభుత్వ సభలలో స్త్రీలహక్కులకును ఆందోళనమును గావించుటయు స్త్రీలయందు గలిగిన తీవ్ర ప్రబోధమునకు దార్కాణములని చెప్పవచ్చును.

ఈసంవత్సరము మద్రాసునందు జరిగిన సంఘసంస్కార సభ కేవలము స్త్రీజనాభ్యుదయచింతనమునకై యేర్పడిన సభయనియే చెప్పిన చెప్పవచ్చును. దాని కధ్యక్షుడు సుప్రసిద్ధ సంఘ సంస్కర్తయగు నటరాజనుగారు. ఇక నాహ్వాన సంఘాధ్యక్షత నెవరు వహించి రను కొంటివి? చెన్నపురి శాసనసభోపాధ్యక్షురాలును, నిరంతరము స్త్రీజనాభ్యుదయకరములగు తీర్మానములు సభయం దుపపాదించి ప్రజలను ప్రభుత్వమును గూడ తొందరించుచున్న విదుషీమణియు పవిత్ర భారత వర్షమునకు కళంకదాయకమును భారతస్త్రీల సద్యశస్సును మలిన పఱచుచున్నట్టియు మిస్‌మేయో మున్నగు రంధ్రాన్వే షకురాండ్రయాక్షేపణల కాస్పదమిచ్చుచున్నట్టియు కళావంతుల సంఘము, నుద్ధరింప కంకణము గట్టుకొనిన సాధ్వీమణియు అహర్నిశలు స్వజాత్యభివృద్ధికై కృషిచేయుచున్న పరోపకార పారీణయునైన శ్రీ డాక్టరు ముత్తులక్ష్మిరెడ్డిగారు. స్త్రీలయున్నతి మనః పూర్వకముగ నాశించు మహనీయుడు అధ్యక్షుడుగను, నిరంతరము స్వజాత్యభివృద్ధికే పాటుపడెడు నారీరత్నమాహ్వాన సంఘాధ్యక్షురాలుగను నేర్పడినప్పు డిక మన యభివృద్ధిని గూర్చిన విషయములే యందధికముగఁ జర్చకువచ్చెననిన అందాశ్చర్యమేమి? అందు స్త్రీవిద్యను గూర్చియు, ప్రౌఢ వివాహములను గూర్చియు, పునస్సంధాన వయోనిర్ణయమును గూర్చియు, స్త్రీల వారసత్వపు హక్కులను గూర్చియు, బాల వితంవులను గూర్చియు, వేశ్యా సంఘమును గూర్చియు ముత్తులక్ష్మమ్మగారు చెప్పిన విషయము లెంతయు నొప్పిదములై యున్నవి. అధ్యక్షుఁడు గూడ స్త్రీల యున్నతిని గూర్చియే బహు దూరము చర్చించెను. మహోత్సాహముతో శంకరనాయరుగారు గావించిన హెచ్చరిక యెంతయు సంస్తవనీయమై స్త్రీల కర్తవ్యము నుద్బోధింపుచున్నది. పెక్కుతీర్మానములలో స్త్రీలు పాల్గొని నిపుణముగ మాట్లాడిరి. ఆవిషయముల నెల్ల వివరింప నొక గ్రంథమగును. ఈచిన్న లేఖయందు వానినెల్ల వివరింప సాధ్యముగాదు. కాన ఆసభా విషయములఁ బ్రచురించిన వార్తాపత్రికలను దెప్పించి చదువుము. నీవు చదువుటయే గాదు - నీకు పరిచయముగల స్త్రీలకుఁగూడ చదివి వినిపించుము.

నెచ్చెలీ! నీ వదృష్టవంతురాలవు. నీపెనిమిటి న్యాయవాది యగుటచే నూరూరు దిరిగెడి యవస్థ నీకు లేదు. కడుపులో చల్ల కదలకుండ నుండవచ్చును. మా యుద్యోగమో అట్టిదికాదు. ఈ చెన్నరాజధాని యెల్లమాదే. క్రొత్తక్రొత్త ప్రాంతముల కేగుటయు అచ్చటి జనుల నడవడులను, ఆచారములను, వేష భాషలను ఆరయు చుండుటయు సంతోషకరముగనేయుండును. కాని మాటి మాటికి సామానులు సర్దుకొనుట — విప్పుకొనుట మాత్రము మిక్కిలి విసువును గలిగించుచుండును. అయినను నే నిప్పుడా పనికి చాల యలవాటుపడితిని. నెల కొక యూరు వెళ్లవలసివచ్చినను తదనుగుణ్యముగ బ్రయాణమగుట నేర్చుకొంటిని.

తఱుచు మార్పులు గలుగు చుండెడి యుద్యోగికి యిల్లాలైన స్త్రీ కొద్ది యుపకరణములతో గృహకృత్యములను పచనకార్యములను నెరవేర్చెడి నేర్పును గలిగియుండవలెనని నే నిప్పుడు నా యనుభవమువలన తెలిసికొన గలిగితిని. మన యాంధ్ర స్త్రీలు అందు ముఖ్యముగ నుత్తర సర్కారులకుఁ జెందిన మన మీ విషయమున అసమర్థలమని యొప్పుకొనక తప్పదు. ఊరగాయ జాడీలకు, పచ్చడి బానలకు మాత్రమే రైలులో నొకపెట్టెయు యింటియందొక గదియు మనకుఁ గావలయును. కావుననే "తమిళ స్త్రీలవలె మీకు క్లుప్తత చేతగాదు. ప్రయాణమునకు మీరు పనికి రా"రని మగవారనుట మనకు పరిపాటియైనది. ఈ మధ్య మన ప్రాంతమునుండి యొక రీగ్రామమున కుద్యోగసందర్భమున నేతెంచిరి. వారి సామాను నాలుగైదు బండ్లనిండ యుండెను. అయిదాఱు మంచములను గూడ దెచ్చిరి. ఈ ప్రాంతమున మంచముల వాడుకొను అభ్యాసములేదు. శిశువులు, వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, నిండుచూలింతలు, పచ్చి బాలెంతలుగూడ క్రిందనే పడుకొందురు. కాన పైఁజెప్పిన వారి సామానులను ముఖ్యముగా మంచములను బండ్లనుండి దింపుచుండగా నిచ్చటి వారాబాలవృద్ధు లతిచోద్యముతో సర్కసు కంపినీవారి సామానును చూచినట్లు మూగిమూగి చూడసాగిరి. నా కూరక నవ్వువచ్చెను. ఇది తెలుఁగు దేశమే యైనను నీదత్తమండలములకును మన ప్రాంతమునకును ఎంతయో వ్యత్యాసము కలదు. ఇచ్చటి దేశ్యపదము లన్యభాషాపదములవలెనే అబోధకములై ప్రయత్నపూర్వకముగా నేర్చుకొనవలసివచ్చినది. ఆ విషయములనెల్ల మరియొక కమ్మయందు లిఖించెదను.


భావపురి

నీప్రియచెలి,

1928 సం॥ మార్చి

శారద.