శశికళ/శశికళ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శశికళ

దివ్య భాసిత రూప శశికళ
నవ్య సుందరమూర్తి శశికళ
నిత్య యౌవన స్నిగ్ధ శశికళ
ప్రత్యయిత నాదేవి శశికళయే !

చిత్ర రూపము రంగు శశికళ
శిల్పకౌశల్యమ్ము శశికళ
చిత్రకారుని కుంచె శశికళ
శిల్పి చేతులు ఉలియె శశికళయే !

కావ్య నాయిక నాకు శశికళ
కావ్య రసమున స్థాయి శశికళ
కావ్య వ్యంగ్యము రీతి శశికళ
కావ్యమే నాగీతి శశికళయే !

వీణ తీగల మెట్లు శశికళ
గాన మాధుర్యాలు శశికళ
రాగములు తాళాలు శశికళ
వేగమగు కీర్తనము శశికళయే!