శశికళ/మార్గము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

మార్గము

అడుగడుగునకీ ప్రపంచపు
చెడుగు హృదయము లెన్నొ చుట్టీ

                 కడుపునకు ఇసుమంత దొరకని
                 బడుగు బ్రతుకుల తూలునడకలొ

మధురమెక్కడ మంజులత లేవీ ! - దేవీ !
మార్గమెక్కడ స్వర్గ మెక్కడనే !

ప్రేమ లెరుగని నీమమెంచని
తామసులతో దట్టమీ మహి

                 కోటి రూకల గుణములెంచే
                 కూళలెందరొ ఏలునీ భువి

మధురమెక్కడ మంజులత లేవీ ! - దేవీ !
మార్గమెక్కడ స్వర్గ మెక్కడనే !

క్రోధవహ్నులు కుములు నాడులు
సాధకమ్ములు మృత్యు కీలలు

                 సాధు దేశము శాంతమేగతి
                 సత్యశీలాఽ హింసలేపధి

మధురమక్కడ మంజులత లవియే ! - దేవీ !
మార్గమదియే స్వర్గ మదియేనే !