శశికళ/ధ్యేయము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ధ్యేయము

నా బ్రతుకొక పరిమళార్ద్ర
నందనోద్యాన వనము
నందనాన విహరించే సుందరివే ప్రేమరాణి !

నాప్రజ్ఞే నీ లోకము
నవ నవోన్మేషణమ్ము
నవ్యతలో నిత్యోదయ కల్యబాలవే నీవూ !

నీ ఒదిగిన నా స్వప్నము
నింగివరకు స్పందించును
నిద్రాస్వాప్నిక పులకిత నిరుపమరూపవె సఖియా !

నా ప్రణయమె నీ రూపము
నా ఆత్మే నీ ప్రాణము
నీకునాకు విడుటేది విరహమేది !

మన ప్రణయమె మన ధ్యానము
మన యోగమె మన ధ్యేయము
మనమే మన థ్యాతలమై
మనుదుమే అనంతమందు.

పిలుపులు

"బాపిరాజా !" అన్న ఏపిలుపు నేవిన్న
ఊపుదును మూర్థమ్ము ఊకొట్టి మాటాడి.

"బాపిబావా !" యంద్రు పలుకరింతురు హితులు
పారిజాతసుమమ్ము పట్టుదును అంజలిలొ.

"బాబు !" యని మానాన్న పరమప్రేమను పిలువ
ప్రత్యక్షమయ్యెడిది పాలసంద్రము నాకు.

"నాన్న" యని మాఅమ్మ నన్ను దివ్యయైపిలుచు
నాకు పులకలుకలిగి నాకమ్ము అంటుదును

"హో శశికళా ప్రియ భావుకా " అనుహూతి
ఉజ్వల రసానంద దివ్యానుభూతియే, ఓ దేవి !