శశికళ/దీపావళి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

దీపావళి

దీపావళీ ! విశ్వ
రూపావళీ ! నిత్య
జ్యోత్స్నావళీ ! వృక్ష
శోభావళీ ! దేవి

             నా లక్ష్మి నా వాణి,
             నా శక్తి నా ప్రతిభయే !
                       దీపావళీ...!

దీపావళీ ! ప్రణయ
ధూపావళీ ! రాస
గంధావళీ ! తోష
బంధావళీ ! దేవి

            నా బ్రతుకు నా చదువు
            నా యత్న కార్యార్థమే !
                        దీపావళీ...!

దీపావళీ ! వర్ణ
లేపావళీ ! దివ్య
చిత్రావళీ ! పరమ
శిల్పావళీ ! దేవి

              నా ప్రజ్ఞ నా దీక్ష
              విన్యాస వై చిత్రియే !
                           దీపావళీ...!

దీపావళీ ! రాగ
వ్యాప్తావళీ ! గతుల
తాళావళీ ! కరణ
చారావళీ ! దేవీ
  
             నా నృత్య గీతాభి
             నయ నృత్త వృత్తావళీ !
                         దీపావళీ....!

దీపావళీ ! రధ్య
దేవ్యావళీ ! మధ్య
శ్రుత్యావళీ ! మూర్తి
స్మృత్యావళీ ! దేవి

             నా ఆశ ఆశయము
             నా అవధి ఆనందమే...!
                         దీపావళీ...!

అసతోమా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతంగమయ.