శశికళ/గ్రీవ గంగోత్తరి
గ్రీవ గంగోత్తరి
గ్రీవ గంగోత్త రీ
పావనోద్భూత మం
దాకినీ స్వచ్ఛ మ
స్తోక సౌందర్యమై !
నీ విమల గాంధర్వ
మావిర్భవించినది
ఆనంద పరవశుడ
అల భగీరధుడనై
నిలువెల్ల పొంగితిని దేవీ !
కలుషరహితము జగము దేవీ !
అమృతకలశము గళము
అమల మధుధారగా
నీగాన మాధుర్య
మాగమించెను
ముల్లోకములు గాన
కల్లోలములు నిండ
అమృ తాప్లావితతనూ
కమనీయ మూర్తి నై
నిత్య విద్యా హృదయ
మృత్యుంజయుడ దేవి !
రాకేందు బింబాస్య
నీకంఠమే జ్యౌత్స్ని
కాపుంజ మంజుల సు
రూపమై దివ్యమై
భవదీయ సంగీత
పరమ శోభాకాంతి
వేలలే ప్రసరించె
మూలాలు పులకించె
వనధి కలశాంబుధై
జనులెల్ల దేవులై
అబ్ర విగ్రహుడ శ
బ్ద బ్రహ్మనై నేను,
నిను పొదివికొంటినో దేవీ !
నీవు ప్రణవస్వరూపవే దేవీ !