శంకరుడా శంకరుడా ఓ శంభో

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలుగు కీర్తనలు


శంకరుడా శంకరుడా ఓ శంభో 
శివశంభో భవ శంభో హర శంభో

పాల తోటి అభిషేకం నీకు చేతుము
పాలల్లే మా మనసు స్వచ్ఛమౌను
పెరుగు తోటి అభిషేకం నీకు చేతుము
మాలోపలి వెన్న ముద్ద చేతికందును

నేతితోడ అభిషేకం నీకు చేతుము
నిగ్గులీను లోవెల్గులు మాకు దక్కును
తేనెతోడ అభిషేకం నీకు చేతుము
తీపి ప్రేమ విశ్వమెల్ల వ్యాప్తి చెందును

నారికేళ జలముతో స్నానమిత్తుము
తత్వసార మెల్ల మాకు దక్కునింకను
శర్కర తో అభిషేకం నీకు చేతుము
కర్కశత్వమెల్ల మాకు తెలగిపోవును

గంగనీట అభిషేకం నీకు చేతుము
కల్మషంబు లెల్ల మాకు గడచిపోవును
పన్నీరును అభిషేకం నీకు చేతుము
దుర్వాసన లెల్ల మాకు తొలగిపోవును

అభిషేకం బేదైనా గొప్ప కాదయా 
మనసు ధారకట్టి నిలిపి యుంచవలయును
మనసు ధారయగుచు నిన్ను ముంచి యెత్తిన
సచ్చిదానంద సుధల నిచ్చి సాకుచుందువు