వ్యాసావళి/విన్నపము
౪
విన్నపము.*
ఎందుకీ కొత్తతెలుగు పత్రిక మరిఒకటి? దేశములో కావలసినన్ని ఉన్నవే పత్రికలు,అనేక విధములయినవి వాటివల్ల నెరవేరనిదీ, దీనివల్లనే కాదగ్గదీ ఏమున్నది విశేష ప్రయోజనము? ఈ ప్రశ్నకు ప్రత్త్యుత్తరము వివరించి మనవి చేస్తున్నాము. చదువరులు సావధానముగా పక్షపాతము లేక చిత్తగింతురుగాక!
నిజమే; అనేక పత్రికలున్నవి; పత్రికాధిపతులుగా సంపాదకులూ చాలా కష్టపడి, ధనము కర్చుపెట్టి జనులకు అనేకవిధాల ఉపకారము చేయడానికి ప్రయత్నము చేస్తున్నారు. వారి ఉద్దేశము దొడ్డదే, వారి ఉద్యమము కొనియాడదగినదే; గాని, వారి ఉద్దేశము చక్కగా నెరవేరలేదనిన్నీ, వారి ఉద్యమము పూర్ణముగా ఫలించకుండా కొంతమట్టుకయినా వ్యర్దమవుతున్న దనిన్నీ మాకు తోస్తున్నది. ఇట్లే పుస్తకములు వ్రాస్తూఉన్నవారి ఉద్యమమున్ను సార్దకము కావడములెదు. వ్యర్దముగా ధనము వెచ్చించడమే కూడని వ్యసనమంటారే; ధనముకన్నా ఎక్కువ విలువ గల దేహబలము వ్యర్ధముగా వెచ్చించడము ఎంతకీడోగదా! కాశీకి వెళ్లదలచుకొన్న వారు పొగబండి -- అందులోనూ మేల్ బండి--ఎక్కి ఫోక ఎడ్లబండిలోనో కాక ఎక్కువ పుణ్యమని కాలినడకనో ప్రయాణముచేస్తే, ఏమంటారు లోకులు! అర్ధణా కవర్లలోపెట్టి పంపించవలసిన శుభలేఖలు కూలి మనుష్యుల చేతనో బ్రాహ్మణుల చేతనో పంపించి ఎక్కువ
_____________________________
*ఈవ్యాసము మేము సనాతన సత్సంప్రదాయాను పాఠముగా వాడుకలోనున్న తెలుగు భాషలో వ్రాసినాము. ఈ సంప్రదాయము అనేకగ్రంధములలో కనబడుచున్నది. ఈ సంచిక లోనే మూడో వ్యాసములొ దానికి ప్రమాణములు చూడనగును. ఇందులో మేము వాడిన శబ్దములు నూరేండ్లకు పైగా తెలుగువారిలో పెద్దలు వాడుతూ ఉన్నదే. (ప.సం) వ్యాసావళి
కర్చుపెట్టితే ఎక్కువ గౌవరము చేసినట్లా? కాగితము మీద ఊట కలముతో వ్రాసిన మంత్రముకన్న గంటముతో తాటాకుమీద వ్రాసినది శ్రేష్టమంటారా? లోక వ్యవహారములో తేటతెలుగున నలుగురూ వాడుకొనే మటలతో చెప్పితే స్పష్టముగా బోధపడే విషయము వాడుకలో లేమిమాటలతో చెప్పితే వృధా ప్రయాసము కాదా? దానివల్ల ఏమయినా లాభమున్నదా? లేదనితెలిసినా చాలామంది వ్యర్ధముగా తాము ఆయాసపడి చదివేవారిని ఆయాసపెట్టుతున్నారు. ప్రతి మనిషి తనమనస్సులో తాను ఏవిషయమును గురించి అయినా ఆలోచించు కొన్నప్పుడు ఏదో ఒక విధముగా తనలోతానే మాట్లాడుకోక తప్పదు— తనమాటలు పైకి వినపడకుండా గొణగవచ్చును;ఒకప్పుడు విషయమందు మనస్సు లగ్నమై ఉంటే, తానుమాట్లాడు కొంటూ ఉన్నట్టు తనకు తోచకనే పోవచ్చును—అనగా భాషద్వారానేకాని పరామర్శ అసాధ్యము* ఆలోచించేటప్పుడు ఏమాటలు వాడుకొంటారో ఇంచుమించుగా ఆమాటలతోనే ఆ ఆలోచనపైకి తెలియచేయడము అందరికీ స్వభావము—సహజధర్మమువంటిది. మాటకూ మనోభావమునకూ గల సంబంధము చిన్నతనమునందే కలిగి అంతకంతకు దేడపడుతుంది. ఈ ప్రకారము అలవాటయిన మాటలు మానుకొని వేరేమాటలతో భావమును చెప్ఫడము, ఎంతో కొంత ప్రయత్నము చేస్తేనేకాని, సాధ్యముకాదు. ప్రయత్నపూర్వకముగా మాట్లాడే మారుభాష స్వభాష అనిపించుకోదు. ఇంగ్లీషుగానీ, సంస్కృతముగానీ మనము మాట్లాడగలిగినా అవి మన స్వభాషలు కానేరవు. వేదములలోని __________________________________________________
- It (language) is essential to analytical thought. It is the material basis of classification; and classification is the formal basis of knowledge,” Payne. History of America Vol.II.
87
విన్నపము
భాష పాణిని కాలములో లౌకిజ భాషకాదు. అట్లే నన్నయ తిక్కనాచి కవులు వాడినకావ్యభాష ఇప్పటి దేశభాషకాదు. అది పుస్తకములు చదువుకొంటేనేగానిరాదు. దేశస్తులతో సహవాసము చేయడము చేతనే అలనాటయేది దేశభాధ. దేశభాషలో ఆలోచించిన విషయము వేరే మరిఒక భాషలో చెప్పడము భాషాంతరీకరణము. అన్యభాషలో విన్నది దేశభాషలోనికి మార్చుకొని భావమును తెలుసుకో వలెను. ఇట్లు చెప్పేవాడున్ను వినేవాడున్ను(వ్రాసేవాడున్ను చదివేవాడున్ను) ఉభయులూ భాషాంతరీకరణము చేసుకొంటేనే కాని ఒకరిభజ్వములు ఒకరికి తెలియకుండా ఉండేటట్లు ప్రాచీనభాష వాడడమువల్ల లాభములేదు సరేకదాశ్రమ ద్విగుణమవుతున్నది. కావ్యములలో కవులు ఔచితినిబట్టి ఎట్టి శబ్దములు వాడుకచేసినా చెల్లునుగాని లోక వ్యవహారములోను, జనసామాన్యమునకు వ్రాసేగ్రంధములలోను చెల్లకూడదు.
ఈ పత్రికలో మొట్టమొదట చర్చించే విషయము వ్యావహారికభాష, దానిప్రవృత్తి, దాని ఉపయోగములు, దానిగౌరవము, దానిని ఉపేక్షించడమువల్ల దేశమునకు కలుగుతూవున్న నష్టములు.
మే ము ఉ ద్దే శిం చి న ప్ర యో జ న ము:- ఇంగ్లండులో ఇంగ్లీషు, ఫ్రాంసులోంఫ్రెంచి ఎట్లున్నదో—అట్లే తెలుగుదేశములో పెద్దలు నోటను వాడే నేటి తెలుగుభాషకు సాధ్యమయినంత దగ్గరగా తెలుగువ్రాత తెచ్చి నోటిమాటా, చేతివ్రాత ఒకదానికొకటి పోషకములుగాచేసి, రెండింటికి సమముగా ప్రవృత్తికలిగించి, వ్రాత సార్ధకముగాను సులభముగాను చేసి, తెలుగువారు వ్రాసేదేకాక మాట్లాడేదికూడా సభ్యభాషే, అనే గౌరవము దేశమునకు సంపాదించడము.
వ్యాసావళి
మాదృష్టిలో ఇదే వాస్తవమైన భాషాభిమానము* మా ఉద్దేశము కొనసాగితే, పెద్దమనుష్యులు వ్రాసే సభ్యభాష దేశమంతా క్రమకమముగా వ్యాపించి విద్యాబోధనకు కావలసిన సులభసాధన మేర్పడుతుండి. పామరులకు సులభమైన వాజ్మయము పుట్టుంది. వక్తలకూ వాచకులకూ తగినభాష కుదురుతుంది. మనము ఇంగ్లీషు నేర్చుకొని వ్రాస్తూన్నట్టే మనదేశమందు కాపురమున్న ఇంగ్లీషువారున్ను ఇతరులున్ను మనభాష నేర్చుకొని మనభాషలోనే వ్రాసిగాని నోటకు చెప్పిగాని మనకు హితోపదేశము చేయవచ్చును. భాషలో ఐక్యమువల్ల దేశమునకు రాష్ట్రమునము ఎంతబలము కలుగునో చరిత్ర చదివినవారికీ రాష్ట్రము ఏలేవారికి తెలుసును. వాడుకలో ఉన్న భాషపట్ల కలిగే ఇన్ని లాబములు విడిచి, వాడుకలో లెనిదీ, కొద్దిమంది పండితులకు మాత్రమే సాధ్యమయినదీ, ప్రాచీనభాష వ్రాతలలో వాడడము వ్యర్దప్రయాసము కాదా? ఈ ఆచారము ఏదేశములోనూ లేదు; మనదేశమందయినా పూర్వము లేదు. మన తాతల నాడు లేదు. మనతండ్రులనాడు లేదు. ఈ ఒక్కతరములోనే ఈవైపరీత్యము, ఈ ఉత్పాతము పుట్టినది. ఈ విషయము ముందు ముందు మేము విపులముగా చర్చించ దలచుకొన్నదే; గాని ఇక్కడ సూచనగా మాత్రము చెప్పినాను.
పత్రికలుగాని, పుస్తకములు గానీ, వ్రాసేవారి ముఖ్యొద్దేశ మేమి? నోట మాట్లాడే వారి ఉద్దేశమే: తమ అభిప్రాయములు ఇతరులకు తెలియ జేయుదము. మాట్లాడుపదము తమ ఎదుటనున్న వారికోసము. వ్రాయడము దూరముగానున్న వారి కోసము. ఎవరి మట్టుకు వారు జ్ఞాపకముగా వ్రాసి
__________________________________
*వాడుకలోనున్న భాషను తృణీకరించి ప్రాచీనభాషను బ్రతికియున్నవారికి తిండిపెట్ట: చచ్చిన వారికోసము సంతర్పణ చేసినట్టుగాదా? ఆదికవులకు అట్టి దురభిమానముంటే తెలుగులో గ్రంధములే లేక పోవునుగదా? మనపూర్వుల యెడల యెట్టిగౌరవ ముండవలెనో అట్టి గౌరచమే ప్రాచీనాంధ్రము సారస్వతముపట్ల ఉండవలెను. మాకు వాటియెడల చాలా భక్తికలదని వాటికి మేము చేసే ఉపకారమును బట్టి లోకులు తెలుసుకోగలరు.
89
విన్నపము
పెట్టుకోవడము కూడా గలదు. నోటి మాటకన్న చేతి వ్రాత మేలయినది. నోటిమాట ఒక్కమారే వినబడును గాని చేతివ్రాత చాలామార్లు చూచి చదువవచ్చును. వ్రాత అనగా కాగితముమీద మాట్లాడడము. వ్రాసిన కాగినము ఒక విధమైన గ్రామోఫోన్ పలక, వ్రాసేవారు తమ నోటను పలికిన పలుకులే చదివేవారు తిరిగి తమనోటను పలుకుతారు. ఇదే నోటిమాటకూ చేతివ్రాతకూ గల సంబంధము, నోటపలికినగానె, చేత వ్రాసినదిగానీ, ఏ మాటయినా భావమును బోధించుటకు సాధనమాత్రము. అది పాత్రవంటిది అన్నా అనవచ్చును. ఏదో పాత్రలోపోయక నీరు నిలవ నట్లు, మనోభావముల్నకు ఆధారముగాను సంజ్ఞగాను ఉన్న ఈధ్వనికే గదా భాష అని పేరు. ఈ ధ్వ్లనికి గురుతులు గదా వ్రాసిన అక్షరములు! ఇతరులకు ఏ జ్ఞానేంద్రియము ద్వారా నయినా తెలియరాక నిగూడముగా ఉన్న ఒకరి మనోభావముపైకి వినబడే ధ్వనులవల్ల తెలుపుడు కావడము చాలా విచిత్రమయిన విషయము. అట్లే చెవికి వినబెడే ధ్వనులవల్ల తెలుపుడు కావడము చాలా విచిత్రమయిన విషయము. అట్లే చెవికి వినబడే ధ్వనులకు కంటికి కనబడే గురుతులు వాడడము కూడా అద్భుతమైనదే. వాటి రహస్యము తత్త్వ వేత్తలు ఎరుగుదురు. దానిని గురించి మరొక్కప్పుడు విచారించము గాని ఇప్పుడు అది అట్లుజ్ండనీయండి.
నాగరికత గల ప్రతిదేశములొను ఎక్కువ నాగరికత గలిగి పెద్దలు పేరుపొందినవారు నిత్యమూ వాడుకొనే భాష సభ్య మయినదనిన్నీ ఇతరులు వాడుకొనేది అసభ్యమైన దనిన్నీ ఎన్నిక చేయడము కద్దు. దేశములో నాగరికత వ్యాపించిన కొలదీ సభ్య భాషకూడా వ్యాపించి అదే సామాన్య భాష అవుతున్నది. ఇంగ్లీషువారీ గురించి, అంతో ఇంతో వారి భాషను గురించీ మన వారికి చాలా మందికి ఎంతో కొంత తెలుసును. ఫ్రెంచివారు, జర్మనులు మొదలయిన వారి భాషలను గురించి కూడా కొంద
వ్యాసావళి
రెరుగుదురు. వీరిలో పద్దలయిన వారి వ్యావహారిక భాష వారి దేశములో సామాన్యభాష; దేశభాష. అట్టిభాష మాట్లాడే వారందరూ అది వ్రాయగలరు. వ్రాసే భాషకున్ను మాట్లాడే భాషకున్ను వ్యత్యాసము అట్టే ఉండదు. స్వీట్ పండితుడు చెప్పినట్లు 'వచనములోని భాష మాట్లాడే భాషకు దగ్గరగా ఉంటుంది ' * ఔచిత్యము, పదములలోని కూర్పు, సొంపూ ఇవన్నీ రసికుల భాషలోవ్రాసినప్పుడే కాక మాట్లాడి నప్పుడు కూడా---కనపడక మానవు. సామాన్యులు నేర్పులేక ఏదో ఒక విధముగా తమ అభిప్రాయములు చెప్పినా వినకులు, ఆదేశములు, ఆగమములు, అనుబంధములు, శబ్దార్దములు, మొదలయిన వన్నీ పండితులు మాట్లాడే భాషకూ పామరులు మాట్లాడే భాషకూ సామాన్యమే.
లోకవ్యవహారములో పండిత పామర సామాన్యముగా అందరినోటను పలుగుడు పడుతూ ఉన్న భాష ఎంతో కొంత మార్పు పొందడము భాషకు సహజధర్మమే. ప్రాచీన పుస్తకములు చూచిన వారందరూ ఇది లెస్సగా ఎరుగుదురు. భాషా తత్వ మెరిగిన వారికి భాష మారడము వింతగా కనబడనే కనబడదు. మారకపోవడమే అసంభవము. ఇంగ్లీషుభాషకు వ్రాసినట్లె ఫ్రెంచి మొదలయిన భాషలకున్ను పండితులు భాషా చరిత్రములు వ్రాసి ఉన్నారు. భాషాచరిత్రమనగా భాషలో కలిగిన మార్పుల వృత్తాంతమే కదా. ఎప్పుడూ ఒక్కలాగున ఉండే భాషకు చరిత్రమేలేదు. వాడుకలో లేక గ్రంధములందు మాత్రమే నిలిచి ఉన్న భాషకు మరి మార్పు ఉండదు; మరి చరిత్రమూ ఉండదు. నిఘంటువులున్ను, వ్యాకరణములున్ను, వాడుకలో ఉన్న వ్యావహారిక భాషలకూ కావలెను; వాడుకలో లెని ప్రాచీన
________________________________
- "The language of prose often approaches very closely to that of ordinary conversation." Sweet's English Grammar Vol.I
91
విన్నపము
భాషలకూ కావలెను. మొదటి నాటిక లక్షణము భాషతో కూడా మారుతూ ఉండవలెను; తక్కిన వాటికి లక్షనము స్దిరముగా నిల్చి ఉండవలెను. లాటిన్, సంస్కృతము మొదలయిన వాటి లక్షణము స్దిరమైనదే. ఇంగ్లీష్ భాషకు 1775 లో జాన్సను పండితుడు వ్రాసిన నిఘంటువు ఇప్పుడు పనికిరాదు. వెబ్ స్టర్ పండితుడు సుమారు నూరేండ్లకిందట వ్రాసిన ఇంగ్లీషు నిఘంటువు ఎన్నొసార్లు పునర్ముద్రితమైనది; అయినప్పుడెల్లా గ్రంధము సవరణముకూడా అవుతూనే వచ్చింది. బెన్ జాన్సను (1500) మొదలయిన పండితులు వ్రాసిన ఇంగ్లీషు వ్యాకరణములలోని లక్షణము ఇప్పటి ఇంగీషుకు పట్టదు. ఎందుచేత? భాష మారినది గనక. *వైల్డు అనే పండితుదు చెప్పినట్లు వ్యాకరణము భాషకు అధారము కాదు; భాషె ఆధారము వ్యాకరణమునకు. 'పూర్వకాలమందు జనులు ఈ ప్రకారము మాట్లాడే వారు. గనుక ఇప్పుడు కూడా జనులు అట్లే మాట్లాడవలెను ' అని నియమించేవాడు మంచిశాస్త్రకారుడు కాడు. ఎందుచేత నంటే భాష ఎల్లకాలమూ ఒకటేతీరున ఉండదు; మారుతూ ఉంటుంది; మార్పువల్ల కీదుకానీ, మేలుకానీ, మారినదేమో మారినదే; అనివార్యము. ఆ మార్పు గ్రహించి, యధాశక్తి, తన కాలమందు వాడుకలో ఉన్న సభ్య భాష ఎట్లుంటే అట్లే పాటించవలెను. శాస్త్రకారుడు. __________________________________
*"Grammarian do not lead speech, they follow it. If a grammarian said, "This is the way people used to speak in times past, therefore this is the way people ought to speak now, he would not be a wise or good grammarian, because a language is not the same at all times, and if it has changed well it has changed, for better or for worse, and all that the grammarian has to do is to accept the fact and describe the best usage of his time to the best of his ability" Wyld.
వ్యాసావళి
ఇట్లు అన్నిదేశములలోనూ తాత్కాలికముగా పెద్దలు వాడుకొనే భాషకే లోకమందు ప్రవృత్తి కనపడు చున్నది. కాని ప్రాచీనగ్రంధములందే నిల్చి వాడుకలో లేని భాషకు గాని శబ్దములకు గాని విభక్తులకు గాని ప్రవృత్తికానరాదు. నేడు ఇంగ్లీషు వారిలో తగు మనుష్యులు సభలో సంవాదము చేస్తూ ఉన్నప్పుడు గాని న్యాయసభలో న్యాయవాదులు ధర్మోపధర్మములు చేస్తూ ఉన్నప్పుడు గాని, వారి నోటను వచ్చే వాక్య్తములు కాగితముపైని వ్రాస్తే వాటిలోని భాషకున్న గ్రంధములలోని భాష కున్న వ్యత్యాస ముండదు; ఉన్నా అత్యల్పము. అంతమాత్రాన అవి వేరు భాషలు కావు; మొత్తముమీద రెండూ ఒకటే భాష.
ఇంగ్లండులో ఉన్నట్లే ఇతర దేశములలోను వ్రాయదమనుకొన్న మాట్లాడదమనుకొన్న ఒకటే భాష ఉన్నందున అనేక తరముల నుండి సభ్యముకాని ఉప భాషలు * మాట్లుడడమునకు అలవాటు పడ్డవారు సయితము యిప్పుడు పెద్దల సహకారము వల్లను, చదువు వల్లను, సభలకు వెళ్ళుటవల్లను, క్రమక్రమముగా పెద్దలభాష నేరుకోవ డమునము వీలు కలుగుతున్నది. అందుచేత పూర్వకాలమునందు ఉపభాషలకున్న అల్ప ప్రవృత్తి కూడా రానురాను తగ్గిపోయినది; వాటిలోనివి కొన్ని అంతరించినవి. ఇప్పుడు పెద్దల భాషే దేశమంతా అల్లుకొంటున్నది. భాషవల్ల జనులలో పరస్పర సంబంధము ధృఢపడుతున్నది. భాష సామాన్యమై నప్పుడు పుస్తకములు సామాన్యముకావా? అందువల్ల జ్ఞానము సామాన్యము. భావములు సామాన్యము. అందుల ఫలము సంఘమునకు ఐకమత్యము.
ఇంతేకాదు, నోటిమాటకు చేతి వ్రాతకు సామ్య మున్నందువల్ల లాబము, ఒక దేశమువారు మరి ఒక దేశభాషను నేర్చుకొనుట చాల
_________________________________
- Provincial dialects.
98
విన్నపము
సులభముగా ఉంటుంది. మాటకు, ఇంగ్లీషు వారిలో అనెకులు ఫ్రెంచి, జర్మన్, ఇటాలియన్, పోర్తుగీసు, స్పానిష్ మొదలయిన యూరోపియన్ భాషలు అన్నీ గాని కొన్నిగాని అవకాశముకొలదీ నెర్చుకొన్న వారున్నారు. మన చక్రవర్తిగారికి ఎన్నో భాషలు వచ్చును. స్వదేశ భాషవలెనే స్వెచ్చగా తడువుకోకుండా వారు ఇతరదేశభాషలు మటాడగలరు; వ్రాయగలరు. ఇతరులతో సహవాసము ఛేయుడము చేతను, ఆభాషే గ్రంధములలోను వార్తాపత్రికలలోను కంటితో చూచి చదవడము చేతను--- ఇట్లు చెవికి, నాలుకకు, కంటికి, చేతికి కూడా అలవాటయి వ్యత్యాసము లేకుండా ఏకరూపమయిన భాష మనస్సులో నాటుకొంటున్నది. లోకవ్యహారమందు ప్రవృత్తి లేక గ్రంధలందే ఉన్న బాషను దాని లక్షణమంతా వల్లించినా వాడుక చేయడము సులభము కాదని అందరికీ తెలిసిన విషయమే. సంస్కృత వ్యాకరణమంతా కంఠపాఠము చేసిన వారందరూ స్వీచ్చగా లౌకిక వ్యవహారమును గురించి సంస్కృతమున మాట్లాడలేరు. వ్యాయనూలేరని చెప్పవచ్చును. మనదేశమందు వేలకొలది హిందువులు హిందూస్తాని భాష మాట్లాడగలరు. అనేకమంది అరవలు తెనుగున్న, అనేకమంది తెనుగులు అరవమున్ను స్వేచ్చగా మాట్లడ గలరు. తడువుకోకుండా అన్యభాషలు మాటాడగలిగిన స్త్రీలను చూచివారు ఎంతో మందిని--ఒక్క అక్షరమైనా వ్రాయలేని వారని నేడువేరు భాషలు రెండు మాట్లాడే జనులు ఎక్కడ కలిసి ఉంటే అక్కడ రెండు భాషలకూ ప్రవృత్తి కలిగి చాలా మందికి రెండు భాషలూ ఆలవాటు కాగవు.
ఇది మనయందరమూ ఎరిగిన విషయమే. వాడుకలో ఉన్మ భాష వ్రాతలో కూడా పెట్టితే, అక్షరములు మాత్రము నేర్చుకొంటే చాలును. ఎవరయినా ఆ భాష చదువవచ్చు; వ్రాయవచ్చును. యూరపుగాని
వ్యాసావళి
భాసలు అలాగు ఉండబట్టే కదా ఇప్పుడు వేయిమందికి ఒకడయినా అక్కడే జనులలో చదువు రానివాడు లేడు. స్త్రీలలో గానీ; పురుషులలో గానీ మనదేశమందు తెలుగుభాష గతి ఎట్టులున్నదో చూడండి. లోక వ్యవహారమందు పెద్దలు అందరూ నోటకు మాట్లాడేది ఇంచుమించుగా ఒకరి భాష అయినా, ఉత్తర ప్రత్యుత్తరములలో ఆ భాష అందరూ--పంటితులు కూడా--వాడుతూ ఉన్నా 'గ్రంధము ' అన్న వాటిలోను, వార్తాపత్రికలలోనూ, ఆభాష బుద్ధిపూర్వకముగా మానుకొని ఏదొ కృత్రిమ భాష, లోకములో ఎక్కడా ప్రవృత్తి లేనిది, (కొన్ని నేటినీ, కొన్ని మొన్నటినీ, కొన్ని కొత్తవీ, కొన్ని పాతవీ, కొన్ని ఎన్నడూలేక విశ్వామిత్ర సృష్టిలో పొడచూపినవీ--అన్నీచేరిన 'బాస ') ఎవరికి తోచినట్లు వారు కల్పించి వ్రాస్తున్నారు. ఇటుపయిని ప్రకటించే పత్రికలలో ఈకృత్రిమ గ్రాందిక భాష విమర్శించడమునకు ఉద్దేశించి ఉన్నాము. గనుక ఇక్కడ దానిని గురించి విస్తరించి చెప్పము. తెలుగువారి లో నాగరికులు స్వదేశభాష వ్రాయలేరన్నమాట యూరపులో వింతగా ఉంటుంది. నాగరికులు స్వదేశభాష మాట్లాడలేరంటే యూరపులో నవ్వుతారు పిచ్చిమాటని. మనతెలుగువారిలో తగు మనుష్యులే సిగ్గుపడకుండా అంటారు; "మేము తెలుగు మాటాడలెము. మరో పండితుడైనా మాటాడలేడు" అని. వాస్తవముగా వారు వ్రాయలేనిదీ, మాటాడలెనిదీ ప్రాచీనబాషగని ఇప్పటి భాషకాదు. నాగరికులైన ఇంగ్లీషు పండితులుగాని ఫ్రెంచి పండితులుగాని తమ దేశపు ప్రాచీనభాషలు ఆటాడనూలేరు. వ్రాయనూలేరు.
కొంతకాలము క్రిందట మనదేశములో సంస్కృతము వలెనే యూరపులో లాటిన్ గ్రీక్ భాషలు ఎవరో కొందరు యావజ్జీవము వేరేపని లేకుండా అభ్యసించి పండితులయి చాలా గౌరవము పొంది, ఆ భాషలో ఉన్నప్రాచీనగ్రంధరాజములు చదివి వాటి అర్దమును దేశభాషలలో అను
95
విన్నపము
లకు బొధించేవారు. సాధారణముగా 'గ్రంధము ' అనేది వ్రాయడమునకు ఆప్రాచీన భాషలే యోగ్యమయినవని అనుకొనేవారు. కొందరు బుద్దిమంతులు మాత్రము అప్పుడప్పుడు అక్కడక్కడ లేచి వాడుకలో ఉన్న దేశ భాషలలో కొన్ని గ్రంధములు వ్రాసి గురు శుష్రూష చేసిన జనులకు కొన్ని విద్యలు చెప్పుతూ వచ్చినారు. ప్రాచీన భాషా పండితులు ఇట్టివారిని చూచి ద్వేషించేవారు. మతగ్రంధములు--బైబిలు--దేశభాషలలో వ్రాయనిచ్చేవారు కాదు. అట్లు వ్రాయడానికి ప్రయత్నించిన వారిని వెలి వేసి కఠినముగా దండించేవారు. తర్కశాస్త్రము, జ్యోతిశ్శాస్త్రము మొదలయిన శాస్త్రము లేవిన్నీ దేశభాషలలో వ్రాసేవారుకాదు. అట్లు వ్రాస్తే తమ మహత్మ్యము, తమశాస్త్రముల మహత్మ్యము పోవునని భయపడేవారో ఏమో! మొత్తానకు దేశభాషలు దిక్కు మాలినవిగా ఉండేవి. యూరపు దేశస్దులు ఇప్పుడు తమ దేశభాషలే ఎక్కువగా అభ్యసించి ఆదరిస్తున్నారు. అట్లే మన తెలుగుబాషకూడా సంస్కృత పండితుల దృష్టికి నీచభాషగా ఉండేది. ఇప్పటికి ఉన్నదని చెప్ప వచ్చును. సంస్కృతము ముందర ఇట్టి దేశబాషలు అపభ్రంశములు, గ్రామ్యాలు* వీటిలో గ్రంధము వ్రాస్తే నరకములో పడతారట! ఇట్టి భావములు గల పండితుల మాట తిరస్కరించి కొందరు దేశ భాషాభి మానులు, రసికులయిన వారు తమ వేష తమ వేష దేశభాషలయందు అభిమానముగలవారై నైకృతి భాషలలో వ్రాసిన గ్రంధములను మెచ్చుకొంటారని తెనుగునకు గౌరవము సంపాదించినారు.$ అట్టివారు ఎంత ఉదారవంతులో కదా!
వారి ఉద్దేశ మేమి? సాంసాన్యజనులు సంస్కృత భాష పూర్ణముగా అభ్యసింపలేరు. ఆ భాషలో సంపూర్ణ పాండిత్యము కలిగితేనే కాని
_____________________________
- "అపభ్రంకవి ప్రయంబావా నరకం యాంతిమాననా--
$ "స్వస్ధాన etc., ఆంధ్రశబ్ద చింతామణి-
వ్యాసావళి
అందులో ఉన్న గ్రంధములు చదువుకొని అర్ధంచేసుకోవడ మసాధ్యము. జ్ఞాన ఉ వల్లగాని మనుష్యులు వృద్ధి పొందలేరు. జ్ఞానము కలగడానకు ఏ భాష అయుతేనేమి? పరిచయముగల భాషలో బోధించినది తెలుసుకోవడము సులభము గనుక అపబ్రంశ నున్నాసరే * గ్రామ్యమన్నా సరే, వైకృత మన్నా సరే @ లౌకికభాషలోనే కావ్యములుకూడా వ్రాయవచ్చును. కావ్యమనగా రసవంతమైన వాక్యము. రసమునకు ప్రధానమైనది శబ్దము కాదు; శబ్దార్ధము. మాట అనీ అనడముతోనే రసము స్ఫురించితేనే కాని ఆనందముకలుగదు; శృంగారరసము కానీ, భక్తిరసము కానీ, అట్టి స్ఫురణ వాడుకలో ఉన్న మాటలవల్లనే కలుగుతుంది—ఇదీ ఆ మహాత్ముల ఉడ్దేశము. ఈ ఉదారభావమే కర్పూర మంజరిలో రాజశేఖర కవి తెలియజెప్పినాడు. నాటకమంతా(ఉత్తమ పాత్రల వాక్యములుకూడా) ప్రాకృతములోనే రచించి, అట్లు రచించింసందుకు, సంస్కృతభాష మగవానివలె మోటుగా ఉంటుంది; ప్రాకృతమైతే సుందరివలె సుకుమారమైనది. స్త్రీ పురుషుల కెంత భేదమున్నదో అంత భేదమున్నది ప్రాకృతమునకున్ను సంస్కృతమునకున్ను; ఉక్తి విశేషము కావ్యము; వట్టి శబ్దములుకావు; భాష ఏదైతే అదే కావచ్చును. అని సమాధానము చెప్పినాడు.
ఇట్లే తన ఆంధ్రభాషార్ణవములో కోటి వెంగనార్యుడు “దేవతల భాషగావున దెలుగుకన్న! సంస్కృతము మిన్నయాయుక్తి సరియె ఆతెలిసి! రసికుడగువాడు తనదుజాఱుసికలో న ! దులసినే యుడుకొనునొ జాదుల నెయిడునొ?” అని ‘సంస్కృతము తులసివంటిది; తెలుగు జాజిపువ్వుల వంటిది ‘
————————————————————————————————————————————————
- ”అప్పకవెర్యము” (బొబ్బిలి బాల్య భాష)
@ క్షితిమ్లేచ్చ...వ్యవహారహాని నంధిలుతనన్—-నిడువగూడదు.
అప్పకవీయము1-169.
97
విన్నపము
అన్నిభాధలు తెల్పినాడు. తెలుగువారికి తెలిసిన తెలుగుమాటలచేతనే రసస్పూర్తికలుగునని ఒప్పుకిన్నాడు; “కాననీ యాంధ్రకృతులందు గలుగు నట్టి పనులకు నెల్ల నర్దమేర్పడెరీతి!నద్బుతంబుగ గృతిని జేయంగ వలయు! నర్దమైన రసస్పూర్తి యగుట యరుదె“
జనులందరూ ఏక కుటుంబములోని వారని ఎన్నుకొని జజ్తిభేదములు పాటించకుండా ప్రవర్తించే ఉదార చరితుల వలెనే, భాషలన్నిటికీ ప్రయోజనము ఒకటే అని తెలుసుకొని, ఏ భాష ఎవరికి సుపరిచితమో వారికి ఆ భాషే జ్ఞాననసంపాదనమునకు యోగ్యమైనదనిన్నీ తెలియని భాష ఎంతప్రాచీనమైనా నిరర్దక మనిన్నీ దూరదృష్టిగల లోకజ్ఞలు అంగక్రిస్తారు. తాతగారు తవ్వించిన నూయి అని ఉప్పు నీళ్ళైనా తాగేవారు కాపురషుంటగదా! ఎవరైతే నేమి? తనకుహితమైనదే లోకానకంతా హితవుకాక తప్పదనుకోవడము వివేకము కాదు.
‘కొన్ని జీవులు చిరసి ఱాల్ కొఱికి బ్రతుస!కొన్ని నునుసోగ నెన్నెలల్ గ్రోలి పొదలు !భిన్నరుచులైన వానికి బ్రీతి సరియ! తగవుగారిందులో ననేకతరగర్హ ‘* అని దమయంతి తనకు ఇష్టుడు నలుడేకాని సురపతి అయినా ఇంద్రుడు కాడని చెప్పినట్లు తెలుగువారు తమభాషయందభిమానము కలిగి ఉండడము తప్పుకాదు. పూర్వకవులు వాడిన దైనా ప్రచీనాంద్రముకన్న వర్తమానాంధ్రభాషే సుపరిచితమైనది గనుక దానియెడల ఎక్కువ ఆదరము చూపడము దోషముకాకూడదు; మెచ్చదగినదే కావలెను. ‘దప్పి గొన్నట్టి వారికా దప్పినీఱ! సలిలపూరంబు హితవో? యాజ్యంబు హితవో?’ అన్నకవిహృదయము స్పష్టము. తిక్కన కవికూడా తనకస్లమందు వాడుకలో ఉన్న తెలుగును ఆఅదరించి పాత తెలుగును ఎట్లు నిరసించినాడో చూడండి.
———————————————————————————————————————————————
- శ్రీ వే వేంకటరాయశాస్త్రి గారు పరిష్కరించిన పాఠము లోని నాల్గవ చరణములో యతిభంగము మావద్దనున్న తాటాకుపుస్తకములోని పాఠము:- ‘తగవుగా దిందులో నేకతరవిగర్హ ‘ 98
వ్యాసావళి
చ॥ పలుకుల పొందులేక రసభంగము సేయుచు బ్రాత వడ్డ మా
టల దమనేర్పుజూపి యొక్కటన్ హృదయం బలరింఫ లేకయే
పొలమును గాని యట్టి క్రమముం దమ మెచ్చుగ లోకమెల్ల న
వ్వుల బొరయం జరించు కుకవుల్ ధర దుర్విటు లట్ల చూడగన్
పాతమాటలలోనే మహత్మ్యమున్న దనుకొన్న వారు. అనన్యసామాన్య భాషావైదుష్య గరిష్టులు, 'ఆంధ్ర భాషామయం కావ్య మయోమయ విభూషణం గీర్వాణా రణ్య సంచార విద్వన్మత్తేభ శృంఖల ' మ్మని చెప్పదగిన కావ్యములు రచించుకొని, తమమాటలు పండితుల కయినా తెలియకుండా చదువుకొని కావ్యరసము జుఱ్ఱు కొందురు గాక! రసజ్ఞలయిన కవులు మాత్రము అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ కూడా యధోచితముగా సరికొత్తమాటలతో పొందించి వివిధములయిన్ కావ్యములు వ్రాస్తూనే ఉన్నారు. రామభద్రుడు సకలకధాసారసంగ్రహమందు;
ఉ॥ నన్నయ తిక్కనాది కవినాధులు చెప్పిన యట్ల
చెప్పలే
దన్నా దదుత్త రాంధ్రకవులూరక యుండిరె? తోచినట్లు ని
త్యోన్నత బుద్ధి గబ్బములు యోజ రచింపక యందు జ్ఞాన సం
పన్నుల కావ్యములో హరి సమర్పణమై చెఱనొందు నెందునున్॥
అని ఉత్తరాంధ్రకవుల కావ్యములకు గౌరచము లేదన్న వారికి ప్రత్యుత్తరముగా చెప్పినాడు. ఈతని తాత వాడుకమాటలతో చెప్పిన ఒంటిమెట్ట రఘువీర శతకమును ఆకాలమువారు మెచ్చుకొన్నారట! భాషలో అపశబ్దము లున్నా, సువ్యక్తమై భావము మంచిదైతే చాలును. 'చెరకునకు వంకబోతేమె చెడునె తీపు ' అని కేమప్ప అన్నట్లె
మ॥ అపశబ్దంబులగూడియున్ హరిచరిత్రాలాపముల్ సర్వపా
ప పరిత్యాగము సేయుగావున హరిన్ భావించు చున్, బాదుచున్,
జపముల్ సేయుచు, వీనులన్ వినుచు నశ్రాంతంబు గీర్తించుచున్,
దపసుల్, సాదులు ధన్యులౌదురు గదా తత్వజ్ఙ చింతింపుమా.
అని భాగవతోత్తముడైన బమ్మెర పోతరాజు చెప్పిఉన్నాడు.
99
విన్నపము
రసవంతమైన కావ్యములు రచించిన వారందరిని లాక్షణీకులు ఎందుకో ఒకందుకు నిందించడము అరుదుకాదు. కుకవుల నింద మామూలేకదా. రసికుల యినవారు పిచ్చలచ్చనాలు పాటించలేదు. వాస్తావ ముగా కవులు స్వేచ్చావిహారులు. వారి రుచే వారికి ప్రమాణము. వారికి శబ్ద సిద్ధి లోకమువల్లనే తెలుస్తుంది. వారి ప్రయోగములే లక్షణమునకు లక్ష్యములు. అన్ని దేశములలో కవులకు ఈ అధికారము, ఈస్వేచ్చ ఉచిత మైనదని అంగీకరించినవే. ఏ కవి ఇతరులు చెప్పిన లక్షణమునకు భయపడి తన మతము మార్చుకొంటాడో ఆకవి అస్వతంత్రుడు; ఆతని కవిత్వము అతనిది కాదు; అతని వన్నీ ఎరువే; పంజరములో రెక్కలు కత్తిరించి పెట్టిన చిలక లాగున 'కృష్ణతాతా-తోటకూరా ' అని పలక వలసినవాడే కాని యెధేష్టముగా వనమందు విహరిస్తూ కూజించే కోకిల వలె పాడలేడు. అందుచేతనే, సహజమైన రీతిని పదములు కూర్చితే కవిత సొంపుగా ఉంటుందిగాని మాసికలువేస్తే ఉండదు.
మ॥ చరుగుల్ పూర్వ కవీంద్రు లన్నిటకు; నేస్వల్ప జ్ఞాడన్ స్వాకిమిన్
హితమో కాదో మదీయ కావ్యమని వారెలా విచారింప; న
గ్రతమాలల్ వ్యవహారభర్తలయినంగానీ, కడుం బాలుడౌ
సుకు నవక్తపు మాట తండ్రి కొనవించున్ గాన యానందమున్॥
అని అబ్బయామాత్యుడు సెప్పినాడు. అతడే లాక్షిణికులను పరిహసించి సరస్వతి తనకు నేర్పిన మాటలనే వాడుతానని:--
ఉ॥ చెల్లునటంచు నొక్క కవి చేసిన లక్షణ మొక్క రివ్వలన్,
జెల్లమిజేసి తా నొకటి చెప్పగ చాందసవిస్తగంబు సం
ధిల్లుట గావ్యశంక అననిం దఱుచయ్యె రసజ్ఞలారా! నా
యుల్లపు సౌధనీధి గొలువున్న సరస్వతి సత్యవాణి నా
తల్లి యొసంగు సంస్కృతిని తప్పులు చేయక చిత్తగింపుడీ॥
వ్యాసావళి
అని కవిరాజ మనోరంజనములో వ్రాసినాడు. ప్రాచీనలక్ష్ణమే పరమ ప్రమాణముగాను ప్రాచీనభాషే శిష్ట భాషగాను ఎన్నుకొని, పాతకంపే తమకింపుగా వ్రాయడము ఎంతప్రచురముగా ఉన్నా, సరస కవులు కొందరువాడుక మాటలకు కావ్యములందు ప్రవృత్తి కలిపిస్తున్నారు. ఇతరులు ఆపేక్స్జిస్తే వారుభయపడరు. చూడండి ఏమంటున్నారో నేటికవులు కొందరు.
ఉ॥కాలముబట్టి దేశమును గాంచి ప్రభుత్వము నెంచి దేశ భా
షాలలితాంగి మాఱుటఫి సత్కవి సమ్మతమౌట, నన్య దే
శ్యాలును నాంధ్రభాష గలనౌటను, నౌచితిబట్టి మేము క
బ్బాలను వాడుచుంటి మని పండితు లేగతి నొప్పుకుందురో!
సెభాష్! తిరుపతివేంకటేశ్వరకవులు ! మీరునిజమైన ఆత్మగౌరవము గలకవులు!’కాలము, దేశము, ప్రభుత్వము, భాష—మారక తప్పదు; అన్యదేశములతో సంబంధమున్నప్పుడు అన్యదేశాలు భాషలోచేరక మానవు. ఔచిత్యము, ఏర్పరించడములో కవి హంసవంటివాడు, తన అంత:కరణ ప్రవృత్తే కవికిప్రమాణము.’ ఎంతచక్కగా చెప్పినారు!
ఈకవుల కావ్యములను విమర్శించినవారు;శబ్ద రత్నాకరమునుబట్టీ, చిన్నయసూరి వ్యాకరణమునుబట్టీ, తప్పులెన్నినప్పుడు,పంచాంగములో చెప్పకపోతే ఆకాశముమీద నక్షత్రాలుండరదాఅనీ, ప్రయోగమూలం వ్యాకరణము గనుక ప్రయోగమే ప్రమాణమనీ, సిద్ధిర్లోకాద్దృశ్యా అని, నిరంకుశా:కవయ: అనీ, సమాధానము చెప్పినదే కాక,
‘క. వ్యాకరణ మొక్కత్రోవ, మహాకవులొకత్రోవ, కోశమఖిలమ్మొక
త్రోవై కనుపట్టెడి నీ భాషా కావ్యమ్ములను దఱచు చదివిన కొలదిన్.’
101
విన్నపము
'క. తొలిబాసయందు వలె నీ తెలుగుంబాస వెలయించు
దీపములేమిన్
నిలువగల కవుల లక్ష్యమ్ములె తా మీ భారమెల్ల
మోయగవలయున్.'
అని తమ గ్రంధములలో స్పష్టముగా తమప్రమాణము విశదపర్చినారు.
మాకు వీరే మార్గదర్శకులు, కావ్యభాషలో శబ్దముల సాధుత్వాసాధుత్వములు నిర్నయించడానకు కవుల ప్రయోగములే ప్రమాణము* ఈ ప్రయోగములు లక్ష్యముగా చేసుకొని వాటికి విరొధము రాకుండా దాక్షణికులు లక్షణము చెప్పవలెను. ఈ లక్షణశాస్త్రము భాషావిషయములో కవికి సంకెళ్ళు వేయడమునకు అధికారము కలది కాదు; పూర్వకవుల వాడుకకు జ్ఞాపకమాత్రము; ఆ విషయములో కవికి లోకమే ప్రమాణము. జౌచితిని బట్టి ప్రాచీన శబ్దముగా, నవీనశబ్దముగా, దేశ్యాలూ, అన్యదేశాలూ యధేష్టముగా వాడవచ్చును కవి. ఈ ప్రకారముగానే ఏకాలములందున్న కవులు ఆ కాలమందు లోకములో ఉన్న భాషారూపములు వాడి ఉన్నారు. కావలసినన్ని శబ్దము లట్టివి ఉదాహరించవచ్చును. ఇట్టి శబ్దములు అనేకములు కవిప్రయోగరూఢములని ఎరుగక కేవలగ్రామ్యము లనుకొని వ్యావహారిక భాష అపభ్రంశమనిన్ని, గ్రంధములందు ప్రవృత్తి లేనిదనిన్ని బాలురు, బాలికలు, భ్రమపడేటట్టుగా డాంబికులు తాము వాడ డము మానివేసి, ఇతరులు వాడితే ఆక్షేపిస్తూ ఇప్పు డేదో గ్రాంధికభాషట వ్రాస్తున్నారు. ఈ పత్రికలో వచ్చే నెలనుండి ఇట్టి శబ్దములు విమర్శించి, వాటి ప్రయోగములు మాకు చిక్కినన్ని చూపించి, వాటి సాధుత్వము సిద్ధాంతము చేయ నుద్దేసించినాము. అనేకగ్రంధములు చదివిన పండితులు సయాయము లేనిదీ ఈ ఉద్యమము బాగుగా నెరవేరదు గనుక అట్టి వారు మాకు తోడ్పడుదురుగాక.
_______________________________
- చూ. కొవ్వూరి సారస్వత మహాకవివారి తీర్పు (మూడవ వ్యాసము) 102
వ్యాసావళి
గ్రాంధిక భాష అనెది కొత్తపేరు. అది ఏదయినా గ్రంధములలోనిది గదా కావలెను. తెలుగు గ్రంధములు అనేక విధములుగా ఉన్నవి. వీటిలొని బాష ఒక్కలాగుండదు. కొన్ని (క) చందోబధ్ధములు; కొన్ని (గ) కేవల వచనములు. చందొబద్దలయినవాటిలో కొన్ని (1)ప్రబంధములు, పురానములు, ఇతిహాసములు, మొదలయినవి; కొన్ని (2) శతకములు, కొన్ని (3)ద్విపదలు, రగడలు; కొన్ని (4)కళికలు, ఉత్కళికలు; కొన్ని (5)పాటలు, పదములు, కృతులు, కీర్తనలు, జావిళీలు మొదలయి నవి; మరికొన్ని (6)దండకములు మొదలయినవి-- ఇట్లు వివిధముగా ఉన్నవి. వచనములు కూడా నానా రూపములుగాఉన్నవి. కొన్ని (1)చంపూ కావ్యములలో మధ్య మధ్యను ఉన్నవి; కొన్ని (2)అప్పకవీయము, బాలసరసతీయము మొదలయిన లక్షణ గ్రంధములలోని 'అవరాతిక ' 'తెలివిడి ' 'వివరణము ' 'టీక ' అనే పేళ్ళు గలిగి ఉన్నవి; కొన్ని (3)సంస్కృతాంధ్ర కావ్యములకు నిఘంటువులకున్ను తెలుగుటీకలుగా ఉన్నవి; కొన్ని (4)వైద్యము; జ్యొతిషము, గణితము; సంగీతము, అభినయము, మొదలయిన శాస్త్రముల వివరనము; కొన్ని (5)వేదాంత విషయ కోపన్యాసములు; కొన్ని (6)స్తోత్రములు; కొన్ని (7)రాజశాసనములు; కొన్ని (8)కధలు, అభ్యాయికలు, క్షేత్ర మహాత్మ్యములు.
ఇవి అన్నీ గ్రంధములెగదా! వీటిలోని భాషగదా గ్రాంధిక భాష అనవలెను. ఇవి అన్నీ వివేచనతో పరీక్షించి చూచినయెడల ప్రబంధములందు మాత్రమే వ్యావహారిక భాషకు భిన్నరూపముగా ఉన్న ప్రాచీన భాష ప్రచురముగా కనబడును; వీటిలో అయినా ఆయా కవులు తమతమ ఇష్టానుసారము ఉత్తరాంధ్ర భాషా రూపములు, విరళముగా కొందరు, ప్రచురముగా కొందరు, వాడిఉన్నారు. చందోబద్ధము లయిన తక్కినగ్రంధములలో, సుమాట--కవులు నిరాటంకముగా వ్యావహారికభాష ఆదరించినారు
103
విన్నపము
ప్రబంధమువలెనే శతకములు వ్రాసినవారు కొందరున్నా, పాటలు మొదలయినవి మాత్రము పూర్వులందరూ సరసముగా వాడుకమాటలతోనే కూర్చినారు. ఈ పాటలు చందోబద్ధములు కావా? ఆ పాటలు రచించినవారు కవులుకారా? త్యాగరాయలను వారి కృతులను తలచుకోండి. ఇక వచనముల మాట చెప్పుతాము. చంపూకావ్యములలో అక్కడక్కడ ఉన్న ' వచనములు ' మాత్రము వాటిలోని పద్యములవలెనే ప్రాచీన భాషామయమయిన కావ్యభాషలో వ్రాసిఉన్నవి. తదితరములైన వచనగ్రంధమేది చూచినా వ్యావహారిక భాషలోనే రచించిన వచనగ్రంధము నిజమయిన తెలుగు దేశములో మాకు ఎక్కడనూ కనబడలెదు. తంతావూరు మొదలుకొని గంజాం జిల్లా లోని చత్రపురము వరకూ ఏయేచోట్ల తాటాకు పుస్తకములున్నవని మాకు తెలిసినచో ఆయాచోట్లకు పోయి అవి చూచినాము. ఆంధ్రసాహిత్యపరిషత్తువారు సంపాదించిన తాటాకు పుస్తకములలో నాలుగయిదు కాబోలు ఉన్నవి. అంతే, కావ్యభాషలో రచించిన వచనగ్రందములు. వాటిలో జైమిని భారతము మాత్రము నిరుడు పరిషత్తువారు అచ్చువేయించినారు.కొన్నిటికి ప్రతులు చన్నపట్టణము గవర్నమెంటువారి గ్రంధాలయమం దున్న, తంజావూరు గ్రంధాలయమందున్ను ఉన్నవి; మరియెక్కడనూ మాకు కానరాలేదు. ఈ అద్భుత వచన గ్రంధములు రచించిన వారెవరో తెలుసుకొంటే, ఎందుచేత అట్టి అద్భుతవచనము వారు రచించినారో ఊహించవచ్చును. మ.రా.రా.జయంతి రామయ్య పంతులుగారే ఒకపుస్తకములో *"తంజావూరు, తిరుచునాపల్లి,మధుర--ఈ రాజ్యములు పాలించిన 'నాయక ' రాజుల కాలములో ఇవి పుట్టినవి. ఇవి మొన్న మొన్న దొరికినవి. ఇంతవరకూ ఈ గ్రంధము లున్నవని ఎవరూ ఎరుగరు. ఇప్పటి గ్రాం _________________________________
- Defence of Literary Telugu. P.2. 104
వ్యాసావళి
ధిక వచనమునకు చెన్నపట్టణములో ఉండిన చిన్నయ సూరి గారేబ్రహ్మ." అని వ్రాసినారు. బాగా ఆలోచించండి. తంజావూరు, తిరుచునాపల్లి,మదుర, చన్నపట్టణము--ఇవి అరవ దేశములోనివి. అక్కడ కాపురముండిన తెలుగులు ఎట్టి తెలుగున సంభాషింతు రో వారితో మాట్లాడిన వారికి గాని తెలియదు. చన్నపట్నము మొదలుకొని రామేశ్వరము వరకూ ఉన్న పెద్దపట్టణములలోఉన్న తెలుగువారిని కొందరిని చూచి వారితో సంభాషించి యున్నందువల్ల మాకాసంగతి బాగా తెలుసును. పాతతెలుగు మాటలు కొన్ని, కొత్తవికొన్ని అరవమాటలు కొన్నికలిపి చిత్రమైన ఏసతోను, స్వరముతోను వారు మాట్లాడుతారు. *కొంత పరిచయము కుదిరేవరకూ వారిమనోబావము స్పష్టముకాదు. ఇట్టి తెలుగు వ్యావహారిక బాషగా గలవారు తెలుగు పండితులుగా ఉంటే వారు రచించే గ్రంధములు ప్రాచీన కావ్యముల శైలిని కాక మరియేలా గున వ్రాయగలరు? వేగినాడు, వెలనాడు, పాకనాడు, కమ్మనాడు, పల్నాడు మొదలయిన వాళ్ళు నిజమయిన తెలుగుదేశములోనిది. ఇక్కడి వారు వందలు వందలు వ్రాసిపెట్టినారు. గ్రంధాలు నానావిధములయినవిన్నీ, అందులో మీదను చెప్పినట్లు ప్రబంధాలన్నీ కావ్యభాషలొనున్ను, వచన గ్రంధాలన్నీ వ్యావహారిక భాషలో నున్ను ఉన్నవి.
ఇదీ తెలుగుదేశములో మొన్న మొన్నటివరకూ సంప్రదాయము. పెద్దనగారు మనుచరిత్ర వ్రాసినట్టు కావ్యభాషలో వ్రాయించక వ్యావహారిక భాషలో వ్రాయించినారు. తమ దానశాసనములు. కృష్ణదేవరాయలవారి ధర్మశాసనములు వాడుక భాషలోఉన్నవి. గాని ఆముక్తమాల్యద వలె కావ్యభాషలో లేవు. శ్రీ సకల కవితా స్వతంత్రభట్టారక యెలకూచి బాల
________________________________
- తంజావూరి గ్రంధాలయములో అరవైకంటే అధికముగా తెలుగు నాటకాలున్నవి. వాటిలో స్పష్ట ముగా కనబడుతుంది అరవతెలుగు ఎట్టిదో
105
విన్నపము
సరస్వతీ మహా మహోపాధ్యాయులవారే తమ ప్రబంధములు కావ్యభాషలో వ్రాసి, ఆంధ్రశబ్ధ చింతామణికి టీక వ్యావహారిక భాషలో వ్రాసినారు. అప్ప కవివంటి లాక్షణికుడు తన లక్షణ గ్రంధములలో పద్యాలన్నీ కావ్యభాషలో వ్రాసినా అవతారికలు, వ్యాఖ్యలు, టీకలు మొదలయిన వచనములన్నీ,-- ఒకటీ రెండూ కాదు, వందలున్నవి -- వ్యవహారిక భాషలో వ్రాసినవాడు. అచ్చుపడ్డ అప్పకవీయమందు 1859 వ సం॥ లో పరిష్కర్తలు ఈ వచనములోని వాడుకభాష కావ్యభాషగామార్చివేసినారు. *ఇట్లే భారతము కక్ష్మీపతిగారు భారతమునకున్నా ముద్దరాజు రామన్న రఘవ పాండవీయమునకున్ను, చిత్రకవి అనంతుడు హరిశ్చంద్ర నళీయమున కున్ను, సోమనాధ పండితుడు, జూలూరు అప్పయపంతులు. శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి మొదలయినవారు వసుచరిత్రకున్ను వ్యావహారికభాషలో టీకలు వ్రాసినారు. అనేక వ్రాతపుస్తకములు దేశమందున్నవి. వందలకొలదిగా పండితులు, కవులు, రాజులు, మంత్రులు, సేనాపతులు మొదలయినవారు వాడుక మాటలలో వ్రాసిన వ్రాతలు ప్రచురముగా మాకంటికి కనబడడముచేత ఈ విషయమందు మాకుధృడమైన విశ్వాసము కలిగి, వాస్తవమయిన సంప్రదాయము లోకములో బహిరంగముగా ప్రకటించడము మంచిది అని తోచి ఈ పత్రికాముఖమున విజ్ఞప్తి చేయుడమునకు సాహసించినాము.
ఇంకొక్కమాట, తెలుగువారివిద్య, వారిభాష, వారిసారస్వతము-- వీటిని గురించేకాని యితర విషయములలోనికి మేము పోము. తెలుగువారి విద్య్తకు ఆటంకములు కాకుండా ఉంటే రాచకార్యములతో గాని, మతముతోగాని, జాతితోగాని, మరి దేనితోగాని, మాకు పనిలేదు. భాషా
_________________________________
- అప్పకవీయము వ్రాతప్రతులు ఇరువై చూచి ఉన్నాము. అన్నిటిలోనూ మేము చెప్పినట్లే వచన మున్నది. ఆంధ్రవిజ్ఞాన సర్వస్వములో మ॥కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావు గారు చెప్పినవి చూడవచ్చును. 106
వ్యాసావళి
సారస్వతముల విచారణలోనైనా సత్యమందే మాకు పట్టుదల గస్ని, నాదులయెడలను ప్రతివాదులయెడలను ద్వేష ముండదు; అందరున్ను మిత్రులే. ఇదిమాసంకల్పము.
రాబోయేసంచికలలో మేము విచారించదలచుకొన్న విషయములు:— (1) తెలుగుమాటల సాధుత్వాసాధుత్వముల నిర్ణయము. అసాధువులనుకొన్న అనేక శబ్దములు సాధువు లనుకొనుటకు ప్రమాణములు (2) నన్నయ భారతములోని పదములపట్టిక. (3)తెలుగు పదముల రూపాంతరములు. (4) సంస్కృతపదముల రూపాంతరములు. (5) అంత్యవర్ణనములనుబట్టి (అకారాంతాదిగా) ఏర్పరచిన తెలుగుమాటల పట్టిక. (6) గ్రంధములలో పాఠాంతరములు (7) తెలుభషాచరిత్రమునకు కావలసిన సామగ్రి. (8)నేటితెలుగుభాషకు లక్షణము ఏర్పరచుటకు కావలసిన సామగ్రి. (9) మనపూర్వులువ్రాసిన వచనరచనకు ఉదాహరణములు. (10) తెలుగులో చేరిన అన్యదేశ్యములు. (11) తెలుగుమాటల వ్యుత్పత్తి. (12) తెలుగునిఘంటువులలోని లోపములు (13) తెలుగు యాకరణములలోని లోపములు. (14) తెలుగుచందస్సు. (15) దేశము, జజ్తి, వృత్తి మొదలయిన వాటిలో భేధమునుబట్టి తెలుగుభాషలో కలిగినభేదములు.(16) సర్వజన సామాన్యమైన విషయములు బోధించే పుస్తకములు. (17) నేడు తెలుగుగ్రంధములలో వాడుతూఉన్న భాష. (18) సారస్వత విమర్శ. (19) భాషాతత్వము. (20) అన్యదేశముల సారస్వతము. (21) విధ్యాభివృద్ది.
బ్రహ్మాండమంత పనిఏమిటి! చిన్నచీమలవంటి మేమేమిటి! ఎంతసాహసము ! అనిభయపడి, విముఖులమైఉంటే, మా మిత్రులు ‘మీరు పనిమొదలుపెట్టితే, సాయంచేసేవారు లేకపోతారా? మీవలెనే ఈ విషయములు విచారిస్తున్నవారు కొందరున్నారు. ఒకరికొకరు తోడ
107
విన్నపము
యితే పని సాగకపోదు“ అని పురిగొల్పినారు. సదుద్దేశముతో చేయ బూనుకొన్న ఈ పని నెరవేరేటట్టుగా తెలుగువారున్ను తెలుగువారి అభివృద్ధిని కోరే యితరులున్ను మాకు యధాశక్తి సాయము చేయుదురుగాక అని మిక్కిలి వినయముతో ప్రార్ధిస్తున్నాము.
—-+—-