Jump to content

వేదము వేంకటరాయ శాస్త్రులవారి జీవితచరిత్ర సంగ్రహము/ఉపసంహారము

వికీసోర్స్ నుండి

ఉపసంహారము

వేంకటరాయశాస్త్రులవారి సారస్వతమూర్తి

తాతగారి యవతారము సమాప్తియైనది. వారిజీవితము తిన్నగా నడువలేదు. మిట్టపల్లములు, చీకటివెలుగులు, - ఒకటి వెనుక నొకటి వారి జీవితములో ననుగమించుచునే యుండినవి. కొంతకాలము సంతోషము కొంతకాలము దు:ఖము, మరల సంతోషము, మరల విషాదము - ఇట్లొకదాని తర్వాత నొకటి; తుదకు అంతయు సమసిపోయినది. బాల్యములో నెంత యుత్సాహముతోనుండిరి! ఆధునికులలో నవ్యకవులనుమించిన యుత్సాహముతో, తెనుగునుడికారమును ఆంధ్రజాతీయతను ప్రతిబింబింపజేయు జానపదావాఙ్మయరసమును తనివితీర నాస్వాదించిరి. కృష్ణా గోదావరీ పినాకినీ తీరములు వారి బాల్యవిహారభూములు. సంస్కృతాంధ్రములలో నిష్ణాతులైన వెనుక, విధవా వివాహవాదముల దినములలోను, కవిపండితసంఘమును 'మదరాసులో రూపుమాపిన' దినములలోను మేరువును తృణముగా భావించినారు. 'నాకుకూడా ముసలితనంవస్తుందని నేను అనుకోలేదు' అని ఒకానొకప్పుడు నాతో వేడుకగా వచించినారనగా ఎంతటి యారోగ్యవంతులుగా నుండిరో యూహింపవచ్చును. శరీరమందారోగ్యము, తమప్రజ్ఞయందు సంపూర్ణవిశ్వాసము, వాఙ్మయవిషయములలో గట్టిపట్టు, తాము పూనినకార్యమును సాధించుదీక్ష, నిరంతరము సారస్వతపరిశ్రమ. ఏసభలో నైనను ఏవిషయము నందైనను ప్రతివాదినెన్నడును గెలిచి పోనీయలేదు. వారితో నెదురువాదముసల్పి నెగ్గినవారు లేరు. ప్రతిపక్షులు ఎదురుదెబ్బకొట్టలేక డొంకతిరుగుడుగావచ్చి తాకవలసినదే. పండితులెల్ల నొక్కటిగ తమపాత్రోచితభాష నరికట్టుంబూనినప్పుడు అందఱనుఎదిర్చి కేవలము తమ వాగ్‌ఝురిచేతనే తమసిద్ధాంతమును నెలకొల్పినారు. గ్రామ్యమును విశ్వవిద్యాలయమునకు రానీయక అడ్డినారు. పెక్కువిషయములలో పరమసిద్ధాంతములను వచించియున్నారు. వా రేపద్ధతి ననుసరించినను అయ్యది శాస్త్రీయముగను, ఆదర్శప్రాయమగునట్టిదిగా నుండుటయేగాక లోకవ్యవహారమున నెఱవేరదగినదిగా నుండును. గ్రామ్యమునకుగాని వ్యావహారికమునకుగాని వాఙ్మయములో స్థానమున్నదని నిరూపించినారు గాని వాఙ్మయమంతయు వ్యావహారికమయ మగుటకు వారొప్పలేదు. ఆయావిషయములకు తగినశైలియు భాషయు నుండవలయునని వారి యాశయము. వారును, పాత్రోచితభాషయని చెప్పినను, ఒకవిధమున వ్యావహారికమును నాటకములలో వ్రాసియున్నారనియే చెప్పవలయును. రసగ్రహణపారీణులైనందున, పడవవాండ్రు, చాకళ్లు, మంగళ్లు, మొదలైనవారి పాటలును మాటలును రసవంతములై, ఏట్లెట్లు లోకమున నుచ్చరింపబడుచున్నవో ఆయావిధముననుండిన గాని స్వారస్యము లేదనితలంచిరి. అది గదాభావోద్రేకమునకు కారణము. వానినెల్లను గ్రంథస్థములంజేసి వానికి శాస్త్రీయమైన స్థానమును ఆంధ్రవాఙ్మయమున నొసంగుటకై పోరాడినవారు వీరు. జంగాలపాటలను చదివి, విని, ఆనందించి ఆఫక్కికనే తమనాటకములలో నవలంబించినవారు వీరు తప్ప ఇంకొకరు కానరారు. వ్యావహారికమున కథలు వ్రాయవచ్చునా కూడదా యనువిషయమునకు సమాధానముగా, 'గ్రామ్య ముచ్చరింపరానిచో 'పుల్సు' కథ నెట్లుచెప్పగలము' అనివ్రాసినారు. అనగా నట్టికథలు వానికి తగినభాషలోనే వ్రాయవలయునని గాని వీరగ్రాంథికమున వ్రాయవలయునని కాదు. సమయోచితముగా మెలగవలయునని వారి యభిప్రాయము.

ఉద్యోగదశలో తమధర్మమును తాముచక్కగా నిర్వహించినారు. అధికారులు మర్యాదకు వెలితిగా ప్రవర్తించిన విసిరికొట్టినారు. విద్యార్థులను లాలించినారు; వారివారి చిత్తవృత్తుల కనుగుణముగ బోధించినారు; తమయందు విద్యార్థులకు గౌరవప్రపత్తు లేర్పడునట్లు మెలగినారు స్వాతంత్ర్యమునకు భంగకరమైనపనులను తక్షణమే త్యంజించుచుండినారు. ఎచటనైనను తమకుద్యోగము లభించుననియు తమప్రజ్ఞకు అడ్డులేదనియు నెఱింగినారు. ఆదినములట్లేయుండినవి. 'విమతులకు పులి విశ్వాసభాజనులకు చెలి'. వారికి 'నిండుమనంబు నవ్యనవనీత సమానము; పల్కుదారుణాఖండల శస్త్రతుల్యము.' ఈ రహస్యము నెఱింగినవారు గుమాస్తాలుగాను శిష్యులుగానుచేరి పలువ గలద్రోహముచేసి 'ఏదయినా సత్తావుంటేగ్రహించి', పిదప పాదములపైబడగా మన్నించి మరల తమకడ చేర్చుకొనియున్నారు. తమ హితశత్రువులను విశ్వసించి, వారు శత్రువులను విషయము గ్రహింపక, వారుచెప్పునట్టి తియ్యని మాటలను నమ్మి పలువిషయములలో మోసపోయిరి. కావుననే కొందఱు వారి నిజస్వరూపమును తెలిసికొనక వారిని దూషించుటయు తెలిసికొనినవారు చెంతచేరి వారిసర్వస్వమును భక్షించుటయు జరుగుచుండినది. తన్నాశ్రయించిన వారికి ఎన్నడును లేదని చెప్పి యెఱుగరు. వారి హృదయము మైత్రీకోమలము.

ఉద్యోగమును వదలిన తర్వాత విరామములేక భాషావిషయమై పరిశ్రమించిరి. అచ్చాపీసు ప్రారంభించిరి గాని, 1910 సం, ముననే దాదాపు ఇరువదిగ్రంథములను ముద్రింపగల్గినవారు, ఆతర్వాత శృంగారనైషధమునకు వ్యాఖ్య వ్రాయుచుండి నందువలన అన్నిగ్రంథములు ముద్రింపలేకపోయిరి. శృంగారనైషధ వ్యాఖ్యారచనానంతరము వచ్చిన చిక్కులచేతను, నెల్లూరు మదరాసు రాకపోకలచేతను, నిఘంటువుకై పడిన వృథాప్రయాసచేతను, విశేషగ్రంథరచనకును ప్రకటనకును సాధ్యముకాక పోయినది. సంస్కృతాంధ్ర వాఙ్మయములలోని గ్రంథములనెల్ల చక్కని వివరణాదికములతో ముద్రింపవలయునను గొప్పసంకల్పముతోనుండిరి గాని పరిస్థితులు సరిగానేర్పడలేదు. నిరంతరము కుడిచేతకలము, ఎడమచేత పుస్తకమును గ్రహించి తమకుదోచిన యమూల్యవిషయములను గ్రంథ కరండములలో పదిలపరచుచునేయుండిరి. ముద్రణక్రమమున తాతగారు ఆంగ్లపద్ధతులననుకరించిరి. పదములను విడదీయుటలో గాని, సులువుగా నర్థమగునటుల కామాలు, సెమికోలనులు మొదలైనవాని నుంచి పద్యములను ముద్రించుటలోగాని, వారి పద్ధతులను చూచి మనము నేర్చుకొనదగిన విషయములు పెక్కులుగలవు. శృంగారనైషధముద్రణ మొక కళగా నెఱవేర్చిరి.

కూర్చుండినచోటినుండి కదలక గ్రంథావలోకమునందే రేయుంబవలు కాలముగడపువారికి క్రమముగా కొన్ని వాడుక లేర్పడుట సహజము. తాతగారికి దినమునకు లెక్కలేని పర్యాయములు కాఫీత్రాగుట యలవాటైనది. అదిలేనిదే వ్రాత జరుగదు. తాము చదువుకొనుగదిలో నొకమూల కాఫీకై ప్రత్యేక మొకబల్లయు, దానిపై నింగ్లీషుదొరలపద్ధతిని కాఫీ పరికరములన్నియు నుండెడివి. తోచినప్పుడంతయు కాఫీచేసికొని త్రాగుచు చదువుకొనుచు నుండెడువారు. వారి కాఫీరుచి అత్యద్భుతముగా నుండెడిది. కొందఱు మిత్రులు కేవలము ఆకాఫీని రుచిచూచుటకొఱకే వారికడకు ఏదోమిషపెట్టి వచ్చుచుండువారు. వారి యధికమనోవ్యాపారమునకు ఇట్టిదిలేనిచో అంతపని సాధ్యమైయుండెడిదిగాదు. ఆహార విషయములలో ఎంత మాత్రము శరీరమును కృశింప జేసికొనలేదు. బీరువలో ఎప్పుడును బిసకత్తులును, గొల్లభామమార్కు డబ్బాపాలు, 'కాడ్లివరాయిలు' మొదలైన వస్తువులుండెడివి. ఒక్కనిమిషమైనను తమ జీవితమున వ్యర్థపఱుపలేదు. హోటలుకు పోయివచ్చినను, ఇంట ఫలహారము చేయంచుకొని భుజించినను కాలహరణమగునని వారి భయము. విస్తరికడ నాలుగు నిమిషములు కూడ కూర్చుండువారు కారు. తమతో వ్యర్థముగా మాటలాడవచ్చువారిని వెంటనే పంపివేయువారు.

కాలహరణమగుననియే ద్రవ్యవిషయములలో కూడ ఎక్కువపట్టింపు వారికుండినదికాదు. తాతగారిని 'తాము సంపాదించినదానిలో, సరిగాలెక్కలుచూచుకొనుచు జాగ్రత్తగానుండిన, చాలధనము మిగిలియుండునుగదా' అని యొకరనగా తాతగారు 'నాకు ధనము మిగిలియుండును గాని ఆముక్తమాల్యదా శృంగారనైషధములకు వ్యాఖ్యలు వ్రాసియుండలేనుగదా' అనిరి. వారికి కావలసినది కీర్తిగాని ద్రవ్యముగాదు.

ధర్మశాస్త్ర విషయములలోను సాంఘిక విషయముల యందును తాతగారు కేవలము పూర్వాచారపరాయణులుగారు. మత సాంఘిక విషయములలో మార్పుండవలయును నభిప్రాయము కలవారేయైనను ఆమార్పు క్రమముగానేర్పడవలయునే గాని బలాత్కారముగా తటాలున అన్నిటిని తలక్రిందులు చేయునదిగా నుండరాదనువారు. బ్రాహ్మణులలో లెక్కలేని శాఖాభేదము లనవసరములనియు ఆంధ్రులుగాని ద్రావిడులుగాని, నియోగులుగాని వైదికులుగాని పరస్పర సంబంధములు చేయుటలో తప్పులేదని వారియభిప్రాయము. అట్లే పలువురకు సలహానిచ్చియున్నారు.

ఆంధ్రదేశమందలి సమకాలికపండితులలో మహోన్నతస్థానము నందినారు. బాల్యములో తరగతులలో వారి తావు తప్పింప నొరులతరము కానట్లే ఆంధ్రపండితులలో వారితావు తప్పింపగలవారు వారికి ముందును లేరు తర్వాతయు నుండబోరు. ఏవిషయమును గుఱించియైనను వారు వ్రాయబోవుచున్నారనగనే ఇతరు లాయుద్యమమును త్యజింపవలసినదే. వారు కావించినపని ఒక్కొకటియు కొందఱుపండితులు జన్మమంతయుంకూర్చుండి చేయదగినవి కాని ఒకరు చేయగలిగినవికావు. వారి యుపన్యాసములను గొప్పగొప్పపండితులే ఒకరి నోకరు త్రోసికొనివచ్చి వినువారు. వానిలో విషయము సమగ్రము; దుర్బోధమైన వ్యాకరణ విషయమైనను వారి హాస్యధోరణిలో నుపన్యస్తమైన సుబోధమగును. విసంధివివేకముంగూర్చి వారియుపన్యాసమును వినినశ్రోతలు కడుపులు చెక్కలగునట్లు నవ్విరనగా నికవేఱుగా చెప్పనక్కరలేదు. సమకాలికపండితులలో వారికి విమతులై ద్వేషించినయేకొలదిమంది పండితుల దోషములను కొన్నిప్రబలకారణములచే వెల్లడి గావించినారే గాని తదితరులయందు ఆదరాభిమానములు చూపినారు. శ్రీ శ్రీపాదకృష్ణమూర్తిశాస్త్రిగారు (మహామహోపాథ్యాయులు, కళాప్రపూర్ణులు) తాతగారి శిష్యులే. కింకవీంద్రఘటాపంచాననులు శ్రీ చెళ్ళపిళ్ల వేంకటశాస్త్రిగారు తాతగారి ప్రశిష్యులే. ఈవిషయమును శ్రీయుత అల్లాడి కృష్ణస్వామయ్యగారియింట జరిగిన యొక సమావేశమున శ్రీ వేంకటశాస్త్రిగారే తమ యుపన్యాసముననొక్కి చెప్పియున్నారు. ఇరువురయందును తాతగారికి చాల ఆదరముండెడిది. శ్రీ గురుజాడ అప్పారావుగారు, వారితో నభిప్రాయ భేదముండియు, వారియెడ నెట్టి గౌరవ ప్రపత్తులు గలిగియుండిరో వారిజాబుల చేతనే తెలియుచున్నది. శ్రీ వఝుల చినసీతారామశాస్త్రుల వారికి తాతాగారిచ్చిన యభిప్రాయములను వారు ప్రాణప్రదములను గాదలంచి పదిలపరచుకొని యున్నారు. వారి వసుచరిత్ర విమర్శను తాతగారెంతయో కొనియాడి యున్నారు. శ్రీకట్టమంచి రామలింగారెడ్డిగారికి ఆంధ్రవిమర్శకులలో నత్త్యుత్తమ స్థానమీయదగునని తమపుస్తకములో 'మార్జినలు నోట్సు'గా వ్రాసికొని యున్నారు. ఇట్టివారు పలువురుగలరు. గుణమున్నచో పొగడినారు; లేనిచోట నిజమును తెలిపినారు.

1929 సం, జూను 23 తేది వెలువడిన యుగంధరపత్రిక ఇట్లునుడువుచున్నది.

"స్వతంత్రమూర్తి, స్వాధీనుడు. వైలక్షణ్యము సహజము. ఆయన వాక్యరచనయందు, ఆయన ప్రసంగమునందు, ఆయనవ్యాఖ్యానాది టీకలయందు ఆయన బోధయందు, పద్యకవనమునందు - ఒకదానిలో గాదు తత్కృతులలో నొక్కొకదానియందు ఆయన స్వతంత్రత, స్వాధీనత, విలక్షణత ముద్రితములై యుండుట కన్నుగలవారుచూడగలరు. శిష్యవత్సలుడు. చలపట్టెనా ప్రత్యర్థినిపట్టి పల్లార్పవలసినదే. శరణమిచ్చెనా సమర్థించి రక్షింపవలసినదే. నిరంకుశుడు. నీతిపరుడు, భాషాప్రపంచమున సర్వతంత్రస్వతంత్రుడే, సర్వాధికారి. ప్రామాణికుడు పరిపూర్ణుడు. ఆసమయస్ఫూర్తి, ఆసందర్భశుద్ధి, ఆమేధాశక్తి, ఆప్రతిభ, ఆప్రజ్ఞ, ఆప్రయోగకౌశలము, ఆహాస్యవిలాసము, ఆఛలోక్తి, నిరుపమానములు. కనివినినవారిదే భాగ్యము.

"ప్రతివాదినెన్నడు గెలిచిపోనీయలేదు. ఆత్మకుప్రియముగ గ్రంథములరచించెనేగాని అర్థమునకైయాశించి పామరాభిరుచికై ప్రాకులాడలేదు. అడిగినసందేహము తత్క్షణముతీర్పవలసినదే...... "దూరమునుండిచూచువారికి భయంకరుడు. సన్నిధిసేసినవారికభయంకరుడు. ఈయన స్వవిరచితగ్రంథములునట్లే. పైపైజూచువారికి పాషాణ కఠినములు నీరసములు. చొరబడి చదివినవాడు ద్రాక్షాదికదళీపాకములు రుచిగొనగలడు. కవిత్వమునందలి బింకము, శబ్దప్రయోజనము, సందర్భౌచితి అచ్చునబోసినట్లుండును. ఇంతేల రసదృష్ట, శబ్దస్రష్ట.

"ఇక ధార్మికవిషయము లెఱిగినవాడు. పూర్వాచారముల యెడవిశ్వాసములేదు. నవీనాచారములయెడ వ్యామోహములేదు. సమయానుకూలముగ సంచరించునేర్పరి. విస్పృహతతో లాంపట్యము కలదు, కోపము క్షణికము. పంతమధికము. తుష్టి లేనితృష్ణ. కలిమిలేములీయనకు గావడికుండలు. దరిద్ర దేవతతో బోరాడని గడియయుండదు."

తుదకు జీవితము తిన్నగానడువలేదు. తలంచినపనులు సరిగారాలేదు. కుమారుడు లేతవయసులో చనిపోయెను. అచ్చాపీసు విక్రయింప వలసివచ్చెను. ఆంధ్రభాషాభిమాని సమాజము అంతరించెను. శరీరమందనారోగ్యము అధికమాయెను. కుటుంబ భారము ఎక్కువయైనది. చదువుకొనవలసిన వారము మేము నలువురము (మువ్వురము మనుమలమును ఒక్కమనుమరాలును) ఏర్పడితిమి. తలవని తలంపుగానొక ఋణమేర్పడినది. ఆర్జన బొత్తిగాలేక పోయినది. ఈవిధముగా తుదిదినములలో తాతగారు తమవశము కాకపోయిరి. కాని శ్రీ యేనాదిరెడ్డి గారియు వారి రెడ్డిసంఘము వారియొక్కయు సాయముచే ఋణ నివర్తియైన సంతసమునుమాత్ర మనుభవించిరి. ఇక నిన్ని గ్రంథములనురచించి తమరెడ్డిమిత్రు లనామాంకితము గావింపవలయుననెడు ఆసయుండినదిగాని అయ్యది నెఱవేర్చుకొనలేకయే కాలగతింజెందిరి. ఐననేమి. చిరస్థాయియైన కీర్తినిగడించిరి. సంస్కృతాంధ్ర వాఙ్మయములందు కూలంకష ప్రజ్ఞావంతులని ప్రసిద్ధినందిరి. కవి, వ్యాఖ్యాత, ఉపాథ్యాయుడు, మహావక్త, సభారంజకుడు - అన్ని గుణములును వీరయందు మూర్తీభవించియుండినవి. తాతగారిరూపము నేత్రపర్వము. ఐదడుగులయెత్తు, గట్టిశరీరము, ఎక్కువస్థూలముకాకపోయినను మంచిపుష్టి, కొంతపొట్టివారివలెదవ్వునకు కనబడువారు. కాలేజి దినములలో నొక్కొకప్పుడు సూటుధరించువారు. సైకిలుపై నేగుచుండిరి. ఆదినములలో వారిరూపమును శృంగారనైషధమందలి చిత్రముచే నెఱుంగవచ్చును. తర్వాతిరూపము మనమెఱిగినదే. శరీరము లేతయెఱుపుదిరిగిన బంగారువర్ణము. ఆ ఉత్తుంగనాసావంశము, స్ఫుటమైన అవయవసౌందర్యము, ఆతేజోవంతమైన ముఖము విశాలఫాలభాగము ప్రాచీనభారతీయ ఋషిపుంగవుల జ్ఞప్తికిదెచ్చుచుండును. స్నేహితులతోను శిష్యులతోను ఆయావిషయములను మాటలాడునప్పుడు ఆనేత్రములకాంతియు, ఆ దరహాసమును, స్పష్టమును గాంభీర్య మాధుర్య పూరితమైన యాకంఠస్వరమును కనివినినవారిదే భాగ్యము.

ఆంధ్ర వాఙ్మయమున ఆదినుండి నేటివఱకును చూడగా కొందఱు భాషానుశాసకులైరి, కొందఱు కవులైరి. కొందఱు కేవలము అనువాదకులైరి, కొందఱు నాటకరచయితలైరి, కొందఱు నవలలుమాత్రమేవ్రాసిరి, కొందఱు విమర్శకులుగావెలింగిరి. ఇన్ని గుణములును ఒకరియందే పరిపూర్ణతంగాంచుట శ్రీ వేదము వేంకటరాయశాస్త్రులవారి యందే గాంచితిమి. భాషారాధకులలో నిట్లు సర్వతోముఖ పాండిత్యము గలవారరుదు. ఆదర్శప్రాయులగు శ్రీ శాస్త్రులవారే ఆంధ్రవాఙ్మయమున నాధునికయుగకర్త లనంజెల్లుదురు. అన్నిటను నూతన మతావలంబకులు. పరమపదించినను ఆంధ్రసీమయందు గ్రంథములరూపమున నున్నారు. అక్షరరూపము నందినారు. ఆంధ్రులకు చిరస్మరణీయులైనారు. వీరిశిష్యులును ప్రశిష్యులును నేడు ఆంధ్రభాషారాధకులలో మహోన్నతస్థానము నందియున్నారు. ఇట్టి భాషా సమ్రాట్టును పడసిన యాంధ్రమాతదేభాగ్యము.


___________