వృక్షశాస్త్రము/సంపాదకీయ ప్రస్తావన

వికీసోర్స్ నుండి

సంపాదకీయ ప్రస్తావన


ఇది విజ్ఞాన చంద్రికా గ్రంధ మాలయందలి 30 వ పుష్పము. 29 వ పుష్పము ప్రకటింపబడి నేటికి సవత్సరము దాటినది. ఇంత కాలము వరకు ఏ గ్రంధమును బ్రకటింపక యుండుటకు గారణము లేక పోలేదు. కొందరు గ్రంథకారులు గ్రంధములు వ్రాసి యిచ్చెదమని వగ్దానము చేసి, మాయొద్ద నుండి కొంత ధనము తీసికొని 'గ్రందమిదుగో పంపెదము, అదుగో పంపెదము ' అని చెప్పుచు కాలము గడిపి, చివరకు గ్రంధము వ్రాసి మాకు తెలియ కుండ ఇతరులకి9చ్చి ప్రకటించిరి. న్యాయ సాశ్త్రము ననుసరించి, మేమాగ్రంథ కర్తల గ్రంధములు ఇతరు లెవరును అమ్మకుండ జేయవచ్చును. గ్రంధ కర్త ప్రకాశకుల యెద్దనుండి నష్టమును రాబట్టు కొన వచ్చును. కాని, మండలి వారికి ఎంత నష్టము వచ్చినను గ్రంధ కర్తలకు ఏ విధమైన బాధయు కలిగించుట వారి ఉద్దేశము కాదు గనుక మేమందున గురించి వ్వవహారము జరుపక పోవుటయే గాక, ఈ గ్రంధకర్త మమ్మిట్లు మోస పుచ్చెనని లోకమునకు తెలుపను కూడ లేదు. కాని యోకానొక గ్రంథ కర్త, మగని గొట్టి మొర బెట్టుకొన్నట్లు తాను మండలి వారి డబ్బు తిని వారితో జేసిన కరారునామాకు భంగము కలిగించియు, మండలి వారి హక్కగు గ్రంధమింకొకరికిచ్చి మండలి వారి వలన బొందిన ధన viii

మింకను వారి కీయకయు, మండలి వారే తనకేమో నష్టము గల్గించిరని లోకులకు దోచునట్లు తాను వ్రాసి మండలి గౌరవమునకు భంగము కల్గించుటకు యత్నించి నందున, ఆగ్రంధ కర్త నామము దాచి ఈ మాత్రము వ్రాయవలసి వచ్చినది. ఇందునకు మేమెంతయు చింతిల్లు చున్నాము.

గ్రంధము వచ్చునని యెదురు చూచు చుండగా గ్రంధమింకొకరిచే నపహృతముగాగా, మరల గ్రొత్త గ్రంధమును వ్రాయించి ప్రకటించుటకు నెంత శ్రమ పట్టునో యెంత కాలము పట్టునో గ్రంధములు వ్రాయు వారికిని వ్రాయించుకొను వారికినీ చక్కగ దెలియును. మేము వేరుగ జెప్పక్కర లేదు.

ఎట్టి సత్కార్యమునకైనను నిష్కారణమున వైరులుండక మానరు. అందు నీ యేడు బహుమతికై వచ్చిన నవలలో దేనికిని బహుమతి యీయనందున నవలలు పంపిన వారిలో గొందరికిని వారి మిత్రులకును మామీద గోపము వచ్చుట స్వాభావికము. కాని యందునకు మేమేమి చేయ గలము? నిరుడు బహుమతి యిచ్చితిమని కొందరికి గోపము వచ్చెను. ఈఏడు భుహుమతి ఈయలేదని కొందరికి గోపమువచ్చెను..... అందరికి మెప్పింప బ్రహ్మదేవునికైనను తరమా?

ఇట్టి నిష్కారణ వైరులసూయా పరువశులై యప్పుడప్పుడి మండలికి నష్టము కలిగింప వలయునని అసత్య విషయములను బ్రకటించు చుందురు. పత్రికామూలమున వారితో వాద వివాదములు సల్పుచు కాలము వ్వర్థ పుచ్చుటకు మండలి వారికి వ్వవధి, నిచ్ఛయు లేదు. ఇట్టి వాదముల వలన నేమియు బ్రయోజనము లేదని మానమ్మకము. కావున మొదటినుండియు మండలవారిట్టి పత్రికావ్యర్థవాదములలో దిగగూడదని నియమము చేసికొనిరి. కావున మా చందాదారులను, వాజ్మయాభివృద్ధి గోరుసజ్జనులను మమ్మునుగుఱించి యితరులు వ్రాయునట్టి వ్రాతలను నిజమని నమ్మగూడదనియు, వారికి మమ్ముగూర్చి యేమియైనను తెలిసికొనవలసియున్న యెడల మాకు నుత్తరములు వ్రాసి తెలిసికొనవచ్చుననియుందెల్పుచున్నాము.

ఇది యిట్లుండగాకితముకఱవు గ్రంథ ప్రకటనకు మిక్కిలి చిక్కుకలిగించుచున్నది. కాగితము వెల పూర్వము కంటె మూడురెట్లు హెచ్చినది. ఆ వెల యిచ్చినను వలయునట్టియు, వలయునంతయు గాగితము దొరకుటలేదు. అందుచే బలువిధములైన కాగితములమీద నచ్చుచేయవలసివచ్చుచున్నది. ఇదియుగాక, మాచందాదారులకు మేమిచ్చుచున్న వెలలు పూర్వపు ధరలనుబట్టి యేర్పఱపబడినవి. ఆ ధరలకైనను పూర్వకాలమందు మండలి వారుతప్ప మఱియెవరును గ్రంథముల నిచ్చినవారుకారు. ఇప్పుడు మేమిచ్చుట మిగుల సాహసమనియే చెప్పవలెను. కాని గ్రంథములవెలలు హెచ్చించిన సామాన్య జనములకవి సులభ్యములు కావని మేము నష్టమునకైననోర్చి యెప్పటివెలకే యిచ్చుచున్నాము. ఇట్టి యిబ్బందులవలన బూర్వమువలె త్వత్వరగ గ్రంథములను ఈయలేనందులకు ఆంధ్రసోదరులు మన్నింతురు గాక.

ఇప్పుడు ప్రకటింపబడిన గ్రంథము వృక్షశాస్త్రసంబంధమైన యుద్గ్రంథము. గ్రంథకర్త వృక్షశాస్త్రమును బి.ఏ పరీక్షకై అభిమాన శాస్త్రముగా నభ్యసించినవారు. ఇదివఱకు దెనుగున నీశాస్త్రముపై వ్రాయబడినవి ప్రాధమిక గ్రంథములు. మేమిదివఱకు బ్రకటించిన భౌతిక శాస్త్రములు గూడ వీలయినంతవఱకు బ్రాధమిక తరగతులుకు బనికి వచ్చునట్లే వ్రాయించితిమి. అట్టి గ్రంథములిప్పుడు తెనుగు దేశమునందు బెక్కులు బయులుదేరుచున్నవి. కావున నా మార్గమున మేమంతగ బనిచేయవలసిన యావశ్యకత తీరినది. ఇంతటనుండి బ్రాధమికములగ బ్రకటితములైన శాస్త్రములనుగుఱించిన యుద్గ్రంథములు వ్రాయించి ప్రకటింపదలచినారము. జ్యోతిషశాస్త్రము, శారీరశాస్త్రము, పదార్థ విజ్ఞానశాస్త్రమందలి వేఱువేఱు విషయములు, రసాయనశాస్త్రము మొదలయిన శాస్త్రములకు సంబంధించిన పెద్దగ్రంథములు వ్రాయించి ప్రకటింపదలచినారము. అందువలన మండలి వారికి వ్యయమెక్కువయి, ఆదాయము తక్కువయు నుండుననుటకు సందేహము లేదు. కాని భాషాభివృద్ధియే దీక్షగా నవలంబించిన మండలివారు నష్టమునకు వెనుకదీయరు.

సంపాదకుడు