వృక్షశాస్త్రము/పీఠిక
పీఠిక
నేబ్రారంభించి నపు డీపుస్తక మీరూపము దాల్చునని యనుకొనలేదు. ఉపయోగించు మొలకలను గూర్చియే వానియానవాళ్లు, ఉపయోగములు మొదలగు విషయములను గూర్చియే - వ్రాయమొదలుపెట్టి విజ్ఞానచంద్రికా మండలి వారికి అది చూపితిని. శాస్త్రగ్రంథ ప్రకటనము వారికి ముఖ్యముగావున దత్సంబంధమగు నితర విషయముల నందు జేర్పుమనిరి. మరియు వారొకటియు, రంగాచార్యులు గారొకటియు వృక్షశాస్త్రములను ప్రకటించుయుండుటచే దిరిగి యట్టిదానినేవ్రాయ సమంజసము కాదనిరి. కాని, యందలి ప్రాథమికాంశముల నిందును విడనాడకుండుట వాంచనీయము. 'కుటుంబముల ' నిప్పటియట్లు శాస్త్రీయముగగాక, అకారాది యక్షరక్రమమున మొదట ముద్రింపించ దలచుకొనిరి. ఇట్లు గ్రంథోద్దేశము క్రమక్రమముగ బేధించుటచే నిందు సమతలేని దోషంబొకటి కాన్పించునేమో. దానిని మన్నింతురుగాక !
ఇందలి పరిభాషను క్లుప్తముగా నుదాహరణములతో నుపోధాతమందు విశదపరచితిని. గ్రంథమందు జిన్నయక్షర ములలో ముద్రించియున్న వర్ణనలను సుబోధకము చేసికొన గోరువారు దానిని అవశ్యము చదువవలయును.
పరిభాషలో మ.రా.రా. ఆచంట లక్ష్మీపతిగారి జీవశాస్త్రమును, రంగాచార్యులుగారి ఔషధిశాస్త్రమును, దోడ్పడినవిగాని కొన్ని కారణములచే నందలి పేరులను కొన్నిటిని మార్పవలసి వచ్చెను.
నేజెప్పదలచుకొనిన దితరులకు సులభముగ దెలియుటయే ప్రధానముగ నెన్నుకొంటినిగాని వ్యాకరణ యుక్తముగ నుండవలెననియే కాదు. అదిగాక, అచ్చొకచోటను, నేనొకచోటను నుండుటచేతను, అచ్చుపని త్వరగ ముగించు భారము నాపైబడుటచేతను నేననుకొనని దోషములుకూడ నిందుగొన్ని జొచ్చినవి.
ఇందలి బొమ్మలు చాలభాగ మితర పుస్తకములనుండి గైకొనబడినవే. చూడ గుతూహలమయ్యెడు వ్ర్క్షముల బొమ్మలును, శాస్త్రపఠనమున కవశ్యములైన బొమ్మలును గైకొనబడినవి. వీనిదిమ్మలు రెండు మూడు సారులు స్థలము మారుటచే కొన్ని కనుబడకుండ బోయినవి. అయిన నవిలేని నష్టమంతగ నుండదనియే తలచెదను.
ఈపుస్తకమును, ముఖ్యముగ నిందలి వర్ణనలను, చదువునపు డాయామొక్కలను దగ్గరనుంచుకొని బరీక్షించు చుండవలెనుగాని, దేశచరిత్రలను నవలలను చదివినట్లు చదివిన లాభముండదు.
ఈపుస్తకము వ్రాయుటలో నాకీక్రింది గ్రంథములు తోడ్పడినవిగాన దద్గ్రంథకర్తలకు గృతజ్ఞఉడనై యుందును.
BIOLOGY. Dr. A. Lakshmipathy, B.A., M.B.. & C.M.
TELUGU BOTANY. Mr. K, Seetaramiah, B.A., L.T.
TELUGU BOTANY. Mr. K. Rangachary, M.A., L.T.
BOTANY. Mr. P. F. Fyson, B.A., L.T.
BOTANY. Oliver.
SOME MADRAS TREES. Mr. Butterworth, I.C.S.
INDIAN TREES. Brandis.
LIST OF PLANTS OBTAINABLE NEAR MADRAS. Dr. Bourne
USEFUL PLANTS OF INDIA. Drury.
MATERIA MEDIA OF MADRAS. Dr. Mohidder Sherif
ILLUSTRATED PLANTS OF INDIA. Wight
FLORA ANDHRICA. Elliot
FLORA INDICA. Rorburgh.
FLORA OF BRITISH INDIA. Hooker
COMMERCIAL PRODUCTS OF INDIA. Watt.
DICTIONARY OF ECONOMIC PRODUCTS. Watt.
ఇట్లు,
వి. శ్రీనివాసరావు
గ్రంథకర్త.