వృక్షశాస్త్రము/బెండ కుటుంబము

వికీసోర్స్ నుండి

కర్పూరతైలములో గలిపిన మంచి వార్నీషు అగును. దీనినే కొబ్బరి నూనెలో గలిపి క్రొవ్వువత్తులు కూడ చేయవచ్చును. తెల్లడామర గింజలనుండి వచ్చు చమురుకూడ క్రొవ్వు వత్తులు చేయుటకు బనికి వచ్చును. ఈ చమురు నొక కప్పుడు నేతిలో కలిపి దగా చేయుచుందురు. దీని బెరడు వగరుగా నుండును. కల్లు పులియకుండ కొన్ని చోట్ల దీనిని వేయు చుందురు. కలప గుగ్గిలపు చెట్టు కలపంత మంచిది కాదు.

నల్లడామర:.... ఆకులు కొంచెము హృదయాకారముగ నుండును. దీని నుండియు గుగ్గిలము వచ్చును. ఈ చెట్టు నుండి మంచి కలపయు వచ్చును.


బెండ కుటుంబము.


బెండ మొక్క మంచి నేలలం దారడుగులవరకు బెరుగును; లేత భాగములందు గ్రుచ్చుకొను నూగును గొంచము నీలముగా నున్న మచ్చలును గలవు.

ఆకులు:.... ఒంటరి చేరిక, లఘు పత్రములు, కొంచము పైగానున్న యాకులు చీలియున్నవి. చివర వానికి బెద్ద తమ్మెలు గలవు; తాళపత్ర వైఖరి. అంచున రంపపుపండ్లున్నవి. కరుకుగానున్న రోమములును గలవు. తొడిమ పొడుగు. కొమ్మ ఆకుకంటె నెర్రగానుండును. రెండుకణుపు పుచ్ఛములు గలవు. పుష్పమంజరి:- కౌణుపు సందుల నొక్కొక్క పుష్పము గలదు. పువ్వు పెద్దది. లేత పశుపు రంగు, అడుగున కొంచెము ఊదారంగుగ నుండును. వృంతము పొట్టిది. చేటికలు మరియొక పుష్ప కోశము వలె నేర్పడు చున్నవి.

పుష్పకోశము:.... సంయుక్తము, ఒకప్రక్కన చీలును. మృదువుగా నున్నది. నీచము.

దళవలయము:.... అసంయుక్తము. అడుగున కొంచము మాత్రము కలసి యుండును. 5 ఆకర్షణ పత్రములు, మెలిపెట్టియుండును.

కింజల్కములు: అన్నియుగలసి కీలముచుట్టును గొట్తమువలె నేర్పడు చున్నవి. పుప్పొడి తిత్తులు చాల గలవు. కాని ఒక్కొక్క దాని యందొక్కొక్క గది మాత్రమున్నది.

అండకోశము:.... అండాశయము ఉచ్చము, సాధరణముగ నైదుగదు లుండును. ఒక్కొక్క గదిలో నొక్కొక్క వరుస గింజలు గలవు. కాయ ఎండి పగులును. కీలము గుండ్రముగాను, బొడుగుగాను నుండును. ఎన్ని గదులున్నవో అన్ని కీలాగ్రములు గలవు.

తుత్తురుబెండ పలు చోట్ల బెరుగును గుల్మము.

ఆకులు:.... ఒంటరి చేరిక, లఘుపత్రములు, హృదయాకారము, ఇంచు మించు సమాంచలము. వాలము గలదు. ఈనెలు తాళపత్ర వైఖరినున్నవి.

పుష్పమంజరి:.... కణుపు సందుల నొక్కొక పుష్పముండును. ఆ తొడిమ కంటె వృతము పొడుగు. పుష్పము సరాళము సాయంత్రము వికసించును. వృంతము చివర నతుకుగలదు.

తుత్తురుబెండ

పుష్పకోశము:.... అయిదు రక్షక పత్రములున్నవి. అండాకారము కొన సన్నము ఇవి యల్లుకొని యుండును. క్రింద కొంచము కలిసి యున్నవి.

దళవలయము:- అయిదు ఆకర్షణ పత్రములు. అడుగున నొక దాని నొకటి కలిసి కింజల్కపు గొట్టము నంటి యున్నవి. పసుపురంగు. కింజల్కములు:- అన్నియు గలసి గొట్టమువలె నేర్పడి చివర మాత్రము విడివిడిగా నున్నవి. పుప్పొడి తిత్తులందు నొకగది మాత్రమే గలదు.

అండకోశము: .. అండాశయముచ్చము. పలు గదులు కాయకానడు స్త్రీ పత్రములు 15-20 ఫలము విచ్చెడు కాయలవలె నుండును గాని స్త్రీపత్రములు బ్రద్దలై గింజలు బైటకు వచ్చును.

ఈ కుటుంబములో గుల్మములు, గుబురు మొక్కలు చెట్లును గలవు. ఆకులు ఒంటరి చేరిక, లఘు పత్రములో తాళ పత్ర వైఖరి నున్నమిశ్రమ పత్రములో గలవు. కణువు పుచ్ఛములున్నవి. లేత కొమ్మలపై మెత్తని రోమములును గలుగు చుండును. పుష్పములు పెద్దవి. ఒంటరిగా నుండును. రక్షక పత్రములు ఆకర్షణ పత్రము లైదేసి గలవు. కింజల్కములన్నియు గలిసి యుండును లేదా కొన్ని కొన్నియైన గలసియుండును. అడుగున దశవలయము నంటియుండును. పుప్పొడి తిత్తులోక్కొకగది. అండాశయములో జాలగదులున్నవి . కాయ పగులును. లేదా, విచ్చును.

బెండ:.... మొక్కలకు నెరువు ఎక్కువగ కావలయును. కొన్నిచోట్ల గింజలనొక మడిలో జల్లి లేత మొక్కలను దీసి దూర దూరముగ బాతుదురు. ఒకరకము గింజలు చల్లి న నాలుగు నెలలకే కాయలు గాచును. ఒక రకము చాల నెలలకు గాని కాయదు. ఎకరము నేల మొక్కలు వేయుటకు సుమారు అయిదు రూపాయలగును. లాభము ఎకరమునకు దొమ్మిది పది రూపాయలు మాత్రము వచ్చును. ఇవి ఒక చోటనే సంవత్సరమునకు రెండు పంటలు కూడ బండును. లేత బెండ కాయలను గూరవండుకొనుదుము. బెండ మొక్కనుండి మంచి నారయు వచ్చును. కాని దానిని దీసి ప్రత్యేకముగ నమ్ముటలేదు. కొన్ని చోట్ల మాత్రము కొంచమో, గొప్పయో దీసి గోగు నారలోను జనుప నారలోను గలుపుచున్నారు. బెండ కాయలోను గింజలందును నున్న జిగురును ఔషదములలో వాడుదురు.

కస్తూరి బెండ:.... గింజలు సువాసన వేయును. వీనిని పరిమళముగా నుండు నూనెలు చేయుటలోను ఔషధములలోను వాడుదురు. ఈ మొక్క నుండియు మంచి నార వచ్చును.

ప్రత్తి:... మొక్కలు పెంచుటయు నూలు దీసి బట్టలు నేయుటయు మన దేశములో జిరకాలమునుండి కలదు గాని ఐరోపియనులు మూడు వందల సంవత్సరముల క్రిందట దాని యుపయోగము లంతగానెరుగరు. అమెరికా దేశములో బండించుటకు పూర్వ మింగ్లాండునకు నూలు మనదేశ మునుండియే బోవుచుండెను. అమెరికా ప్రత్తి మేలు రకమగుటచే నిప్పుడు దాని కెక్కువ ఖరీదుగలదు. ఈ ప్రత్తి పోగులు పొడుగుగా నుండును. ఈ రకము మనదేశము లోను నాటిరి గాని యచ్చట వలె బెరుగ లేదు. ఇదివరకే ప్రత్తిలో బెక్కు తెగలును బలురకములును గలవు. ఏరకము మంచిది, ఏది సులభముగా బెరుగును అని చర్చలిదివరకే చాల జరిగెను. ఇప్పుడనేక రకములు పెరుగు చున్నవి. మన దేశపు ప్రత్తి కనుగుణముగా నుండెడు మరలను చేసిరి, మన ప్రత్తికి ఇంగ్లండు నందు తక్కువ ధర యుండుటయు, తక్కువ ధరయగుటచే మంచి ప్రత్తిని బెంచుటకుపేక్షజేయుటయు, అన్ని రకములను కలగలపుటయు దటస్థించుచు వచ్చెను గాని యిప్పుడు, మంచి రకములకు వేరు వేరుగా దగిన తావులందు పైరు చేయు చున్నారు. దీనిని సాగు చేయుట నేలను బట్టియు, అచ్చటి శీతోష్ణస్థితులను బట్టియు బ్రత్తి రకమును బట్టియు నుండును. కొన్ని చోట్ల దీనిని కందులు, జొన్నలు, నువ్వులు, మొదలగు వానితో గలిపి చల్లుదురు. కొన్ని రకముల గింజలను జల్లునపుడు వాని నంటుకొని పూర్తిగ నూడక యున్న పోగులు మూలమున గింజలొకదానికొకటంటుకొనకుండు నట్లు పేడ, ఇసుక మొదలగు వానిలో వాని బొర్లించెదరు. కొన్ని చోట్ల నెండిన కాయల నెల్ల గోయుదురు; మరి కొన్ని చోట్ల పొలములో నున్న చెట్లన్నియు ఫలించిన గాని కోయుట కారంభించరు.

గింజల నుండి ప్రత్తి విడదీయుటకు సాధనములు చిరకాలము క్రిందటనే మనదేశమున గలవు. అలెగ్జాండరు మన దేసముపై దడెత్త వచ్చినపుడు అతనితో వచ్చిన శాస్త్రజ్ఞలు కొందరు వీని యుపయోగములను దెలిసికొని వారి దేశములో వింతగ జెప్పిరి. ఇప్పటి యంత్రములను పూర్వపు వాని వలెనే యుండును గాని వీనితో ఆవిరి సాయమున బని చేయ వచ్చును. అందుచే నివి లాభకారులు. ఆవిరి యంత్రములు వచ్చినప్పటి నుండియు నూలు బట్టలు నేయుట సులభమయ్యెను. యంత్రశాలలు పెక్కు తావుల స్థాపించబడెను. బట్టల ధరయు దగ్గెను. అయినను నేత బట్టల వాడుక పోలేదు. సాలీలు ఇప్పటికిని బట్టలు నేయుచు అమ్ముచున్నారు. దీనికి నేత బట్టలను కట్టుకొన నిచ్చగలిగియుండుటయు, మరలతో నేసిన వాని మాన గోరుటయు ముఖ్య కారణములు గాని మరలతో నేసినవి తక్కువ రకములని గాదు. పగ్గములతో నేసిన వానికంటె సన్నని మెత్తని బట్టలను యంత్రశాలలందు నేయుచున్నారు. కాని వీనితో జిత్ర విచిత్రముగ బొమ్మలు తీగెలు గళ్ళు నేయుట పగ్గములతో నేయుట కంటె గష్టమైన దన్నది నిజమే. డక్కా పట్టణమందిది వరకు నేసెడు మిక్కిలి మృధు వగు బట్టలవంటి వానిని నేయుటయు గష్టమనియే కనుపట్టు చున్నది. ఈ బట్టలను నేసిన సాలీలనే అమెరికా దేశపు నూలుతో నేయమనిన వస్త్రములు నేయజాలకపోయిరి. ఈ ప్రత్తి చలువ చేయుట వలన నుబ్బి బిరుసగును కాని మన దేశపు ప్రత్తి వలె సన్నము గాదని జెప్పుదురు. ఇప్పుడు మన దేశములో నూలు బట్టలు యంత్ర శాలలు చాలనె గలవు కాని ఉండవలసినన్ని లేవు. ఈ సంగతి, మన దేశమును గొన్ని యితర దేశాలతో బోల్చిచూచిన తెల్లము కాగలదు. 1901 సంవత్సరములో ఇంగ్లాండు నందు 2077 మరలును, అమెరికాలో 1123 మరలును, జర్మినీ 390 మరలును మన దేశమున 203 ను జపాను నందు 64 గలవు. ఇప్పుడు మ్న దేశమందు 258 మరలు గలవు. అయిన నిచ్చట నేయునవి చాలక వీనికి మూడు రెట్లన్య దేశముల నుండి దిగుమతి చేసుకొను చున్నాము. మొట్టమొదట మన దేశమునకు వచ్చెడు నూలు సరకుల మీద బన్ను గలదు. కొంత కాలమైన పిదప దానిని గొట్టి వేసిరి. కొట్టి వేసిన యెడల మన దేశపు యంత్రములకును జేతి పనులకును అభివృద్ధి గలుగదని గట్టిగా పట్టు బట్టగా సన్న రకముల బట్టల మీద మాత్రము పన్ను గట్టుచు వచ్చిరి. ఈ సన్న రకపు బట్టలకంతగా అమ్మకము లేదు. ముతక బట్టలు మన దేశములోనే చౌకగ వచ్చు చుండెను. ఎక్కువ అమ్మక ముగల మధ్యరకము బట్టలు మన దేశములోను నేయుచుండిరి; కావున దిగుమతి అయ్యెడు వానిపై బన్నుగట్టిన నవి ప్రియమై వాని ఖర్చు తగ్గును. అందుచే నితర దేశములలో నేయు వాని యమ్మకము దగ్గును. అందుచే నితర దేశములలో నేయు వాని యమ్మకమును దగ్గును. ఈ హానినివారించుటకు నిరువది నెంబరు పై నున్న బట్టల కెల్ల మన దేశములో నేసినను, పైనుండి వచ్చినను సమముగానే పన్ను వేయుచు వచ్చిరి. చేతి మగ్గముల మీద మాత్రము పన్ను లేదు.

ప్రత్తి గింజల నుండి మంచి నూనె వచ్చును గాని మన దేశములో దీయుట లేదనియే చెప్పవచ్చును. కొన్ని దేశముల వారీ నూనెను వంటలందును వాడు కొనెదరు. గింజలు పశువులకు బెట్టెదరు. నూని తీసిన పిదప దెలక పిండిని గూడ పశువులకు బెట్టవచ్చును.

ప్రత్తి గింజలను, లేత చిగుళ్ళను కాయలను ఔషధములలో వాడుదురు. గింజలు, జీలకర్ర ---- సోపు కలిపి నూరి, రసము దీసి దినమునకు నాలుగైదు సార్లు బుచ్చుకొనిన యెడల కొన్ని సుఖ వ్యాధులు తగ్గునందురు.

ప్రత్తి మిగుల నుపయోగమైన పదార్థము. మన బట్టలు, పరుపులు, దీపము వత్తులు అన్నియు ప్రత్తి మూలముననే వచ్చుచున్నవి. ముండ్లబూరుగ:... చెట్టు మిగుల పెద్ద చెట్టు. దీని పువ్వులెర్రగా నుండును. దీని దూది అతి మృదువుగను పోగులు మిక్కిలి పొట్టిగను నుండుటచే నేతకు బనికి వచ్చుటలేదు. దీనితో తలగడలు, పరుపులను గుట్టుదురు. దీని లేత పువ్వుల మొగ్గలను గొందరు తిందురు. దీని జిగురు, గింజలు, దూది, బెరడు చిన్న మొక్కల వేరులును ఔషధములలో వాడు చున్నారు.

జిగురు ఇతర మొక్కలందు వలె నాటులు బెట్టి తీయ లేము. నాటు పెట్టినను రాదు. కొన్ని చోట్ల బెరుడులో బురుగులు దొలుచుట వలన గాని, మరే కారణము వల్ల నైనను అచ్చటి భాగము పాడుగా నున్నప్పుడు జిగురు వచ్చు చున్నది. ఈ జిగురును బొడుము చేసి గాని, నల్లమందు మొదలగువానితో గలిపి కాని విరేచనములు మొదలగు జబ్బులకును కవిరి యుపయోగపడు ప్రతి దానికిని వాడుదురు. దీని గింజలును బ్రత్తి గింజలు చేయు పని చేయును. దీని దూదిని ఆసుపత్రులందు వాడుదురు. ఎండిన లేత కాయలను మూత్ర వ్యాధులందును జన నేంద్రియముల నీరసమును బోగొట్టుటకును వాడుదురు.

బూరుగ.

బెరడు వేరుల కషాయమును కాయలు పని జేసినట్లే పని చేయును. అంగళ్ళ యందు మరాటిమొగ్గు అని అమ్మునది ఎక్కువగా దీని కాయలే కాని, బూరుగ కాయలను (ఇది మరియొక చెట్టు, ఈ కుటుంబము లోనిదె కాని వేరొక జాతి) సంపెంగ కాయలను గూడ అమ్ముచున్నారు.

ఈ చెట్టు కలప మెత్తగ నుండును. గష్ట పనులకు మంచిది గాదు. కొన్ని చోట్ల అగ్గిపుల్లలు చేయుటకు మాత్రముపయోగించు చున్నారు.

బూరుగుచెట్టు:....(బురుసన్న చెట్టు) దీని దూది కాయ, గింజలును పైదాని వలెనే నుపయోగ పడుచున్నవి. కాయలంత గుణము నీయవు. ఈ కాయల తొడిమలు కాయల కంటె రెండు మూడు రెట్లు పొడుగుగా నుండును. ముండ్లు బూరగ కాయల తొడిమలు, కాయలంతయే యుండును. ఇవి వాని కంటె జిన్నవి. ఈ బేధముల వలన వానినిగుర్తింప వచ్చును.

కడిమిచెట్టు:.... ముండ్ల బూరుగు చెట్టువ్బలే నుండును. పువ్వులు తెలుపు.

నల్ల బెండ.

నల్లబెండ:- మొక్క చిన్నది. ఆకులు హృదయాకారము, కొంచము గుండ్రముగా నుండును. రోమములు గలవు కాయ విచ్చెడుకాయ.

తిరునల్ల బెండ:.... చిన్నమొక్క దీనియాకులు కొంచము అండాకారముగను గుండ్రముగను నుండును. కింజల్కము లు. కొన్నికొన్ని కలిసి ఏర్పడినకట్టలు మూడు మొదలు ఆరు వరకు నుండును. వర్షకాలమునందే పుష్పించును.

తూటిబెండ:.... మొక్కయు బలుతావులనే పెరుగు చునది. సంవత్సరము పొడుగున బుష్పించు. కాయ ఇరువదింటిక్రింద విచ్చును.

నూగుబెండ:.... కొంచము పెద్దమొక్కయె. పువ్వుల రేకులు వంకరగాను, త్రిభుజాకారముగను నుండును. ఈ నాలుగు బెండలను బెండ జాతిలోనివి గావు. బెండ కాయ ఎండి పగులును. గింజలు బైటికి వచ్చును. వీని కాయలు నెండి విచ్చును గాని గింజలు పైకి వచ్చు నట్లు పగలవు. కాయలో నున్న గదులు మాత్రము విడిపోవును. ఇవి పగులవు వీని లోపలనే గింజ గలదు.

గోంగూర:.... మనదేశములో జాల చోటుల బెంచు చున్నారు గాని, ఆకులనుపయోగించుటకే గాదు, దాని నుండి మంచి నార వచ్చును. ఈ నారకై పైరు చేయు చున్నారు. దీనిని పెంచుటయు గష్టము లేదు. ఇతర పైరుల తోడనే గోగు గింజలను చల్లెదరు. నార దీయుటకైనచో పుష్పించి కాయలుగా నైన పిదప జెట్లను గోయవలెను. పుష్పించు చుండగా గోసి నయెడల నంత మంచి నారరాదు. మొక్కలను గోసి కట్టలుగట్టి నీళ్ళలో నూర వేసి జనుపనార దీయుదురు. ఈ నారయు జనుపనార వలెనే నుండును గాని కొంచెము ముతక గా నుండును. అయినను జాల వస్తువులు చేయుటకే నుపయోగించు చున్నారు. వలలకు జనుప నారకంటే నిదియే మంచిది.

దీని యాకులు పుల్లగానుండును. వీనితో బచ్చడి పులుసును జేసికొందుము. ఒక రకము ఆకులెక్కువ పుట్లగా నుండును.

మందారము:.... (దాసాని) మొక్క ఎర్రని పెద్ద పువ్వులను బూయుటచే దోటలందు బెంచుచున్నారు. పువ్వుల నౌషధములలో వాడుదురు. వాని నుండి ఒక విధమగు నెర్రని రంగును వచ్చును. ఈ మొక్కలనుండి కూడ నార వచ్చును.

జూకామందారము:... పై దానివలెనే నుండును గాని పువ్వుల రేకులు చీలి చీలి యున్నవి. కింజల్కముల గొట్టము పొడుగుగానుండును, పువ్వులకాడ పొడుగుగానుండుటచే వంగి యుండును. బాల:... చిన్న మొక్క. మ్రానువంకరలుగా నుండును. ఆకుల యడుగున మెత్తని రోమములు చాల గలవు. పువ్వులు పచ్చగానుండును. దీని నుండియు నార వచ్చును.

ఎర్రసాలబర్త:... గుబురు చెట్టు. ఒక్కొక్కచో నొక్కొక్క పుష్పముండును. కాయలు గుండ్రముగా నుండును. తెల్లని పువ్వులు పూసెడు రకమును గలదు.

సాలబర్త:... గుబురుమొక్క. ఏదైన ఆధారముండినగాని యెత్తుగా బెరుగలేదు.

కొండపట్టి:... కొండలమీద బెరుగును. ఆకులకు మూడు తమ్మెలు గలవు. వర్షాకాలములో పుష్పించును.

కొండగంగ:... కొండల మీద బెరుగుచిన్న చెట్టు. పువ్వులు పెద్దవిగా, గులాబి రంగుగాను నుండును. దీని నారయు బాగుండుడును.

పద్మచారిణి:... చెట్టు తోటలందు బెంచుదురు. దీనికి పువ్వులు ముద్దపువ్వులు కూడ గలవు. వువ్వులు ప్రాతః కాలము నందు వికసించి తెల్లగా నుండును. కాని క్రమక్రమముగ సాయంత్రమున కెర్రబడును. గంగరావి:... పెద్ద చెట్టు. మనదేశములో జాల చోట్ల మొలచు చున్నది. దీని కాయలలో బచ్చని రసముగలదు. చీడ మొదలగు చర్మ వ్యాథులు కొన్ని ఈ రసము రాసినచో దగ్గును. బెరడు కషాయము గూడ నుపయోగింతురు.

మునిగంగరావి:... చెట్టును పై దానివలెనే యుండును. దీని ఆకులకు వాలము గలదు.

పల్లెమంకెన:... గుబురు మొక్క. ఆకులకు తాళ పత్ర వైఖరిని తమ్మె లున్నవి. దీని నుండియు మంచినారవచ్చును.

చిట్టిమూతి:... మొక్క తేమ నేలలందు మొలచును. దీని వేరు కషాయమును అజీర్ణమునకును, నీరసము బోగొట్టుటకు నిత్తురు. తరచుగా నల్లము రసముతో గలిసి కొంచెమిత్తురు గాని కొంచెము కొంచెమిచ్చుట వలన లాభమంతగా లేదు.

ఎర్రగోంగూర:... గింజలను నూరి నీళ్ళలో గలిపి వడకట్టి నీరసమునకును, మూత్ర విసర్జన మప్పుడు నొప్పులకు నిత్తురు.

అతిబల:... మొక్క చిన్నది. దీని యాకులు వంకరగా నుండును. దీని నుండి మంచి నార వచ్చును. ఈ నారను బరీక్షిం చి బాగున్నదని దెలిసి కొని ఇప్పుడుప్పుడే పైరు చేయు జూచుచున్నారు.

తుత్తురుబెండ:.. ఆకులను నీళ్ళలో గాచిన జిగురు వంటి పదార్థము వచ్చును. ఈ కషాయముతో నొప్పులకు బట్లు వేయుదురు. గింజల పొడుము శగ మొదలగు వానికి వాడుదురు.


గుఱ్ఱపుబాదము కుటుంబము.


గుర్రపు బాదము చెట్టు:- పొడుగుగా బెరుగును. బెరడు పెచ్చులు పెచ్చులుగా వచ్చును. లేత కొమ్మల మీదను ఆకుల మీదను దట్టముగా రోమములు గలవు.

ఆకులు:- ఒంటరి చేరిక. మిశ్రమ పత్రములు. తాళ పత్ర వైఖరి. కణుపు పుచ్చములు గలవు. విషమ రేఖ పత్రము.

పుష్పమంజరి:- కొమ్మల చివరనుండి గుత్తులు గుత్తులుగా మధ్యారంభ మంజరులు గలవు. పుష్పములు చిన్నవి., సరాళము, ఆకు పచ్చ రంగు.

పుష్పకోశము:- ఈ రక్షక పత్రములు 5. వానిమీద దట్టముగ రోమములు గలవు. మొగ్గలో నొక దాని నొకటి తాకు చుండును.

దళవలయము:- లేదు.

కింజల్కములు: అన్నియు గలసి యొక గొట్టము వలె నైనవి. గొట్టము పైన గిన్ని వలె వెడల్పుగానున్నది. దీని మీదరెండు గదులుగల్గిన 12 పుప్పొడి తిత్తులుగలవు.