వృక్షశాస్త్రము/చిక్కుడు కుటుంబము

వికీసోర్స్ నుండి

చిక్కుడు కుటుంబము.

పైనున్నది పతాక దళము. అడుగున ద్రోణీదళము

చిక్కుడుతీగ.

ప్రకాండము:- తిరుగుడు తీగె. అడుగున గుప్పెడు లావున నుండును. దారువు గలదు. ఏకవార్షికము.

ఆకులు:- ఒంటరి చేరిక. మిశ్రమ పత్రములు. మూడేసి చిట్టి యాకులుండును. చిట్టియాకు, హృదయాకారము, సమాంచలము, విషమ రేఖ పత్రము. రెండు వైపుల ల్నున్నగ నుండును కొనసన్నము.

పుష్పమజరి.- గెల: ఒక్కొక్కప్పుడు దీని మొదట నాకులును గలుగు చుండును. పువ్వులు పెద్దవి. తెల్లగా నయినను నీలపు రంగుగా నయినను నుండును. అంతరాళము. సీతాకోక చిలుక వలె నుండును. చేటికలు, ఉపవృంతము వద్ద నొకటి పుష్పకోశము వద్ద నొకటి గలదు.

పుష్పకోశము:- సంయుక్తము. 5 దంతములు, నీచము.

దళవలయము:- 5 ఆకర్షణ పత్రములు. 1 అన్నిటి కంటే బెద్దదిగా నున్నది. ఇది పతాక దళము. పుష్పములో పొడుగుగా జండావలె నుండుటచే దీనికీ పేరు గలిగెను. దీని ముందు రెండు విడిగా నున్న రేకులు గలవు. ఇవి రెక్కల వలె నుండుటచే బక్షదళములందురు. వీని రెండింటిచే గప్పబడి చుక్కాను వంటి దొకటి గలదు. ఇది రెండు రేకులు గలసి ఏర్పడుచున్నది. దీనిని గ్రోణీదళమందురు. దళ వలయము పుష్ప కోశము నంటి యున్నది. కింజల్కములు:- 10 ఇవియు వంగి ద్రోణీదళములో మరుగుపడి యున్నవి. పదియు మొదట గొట్టము వలె గలిసి యున్నవి. పుప్పొడి తుత్తులు చిన్నవి.

అండకోశము:- అండాశయము ఉచ్చము. 1 గది, కీలము సన్నము. కీలాగ్రము గుండ్రము, మొదట నిది యు ద్రోణీదళములో మరుగున పడి యున్నది. ద్వివిధారుణ ఫలము.

చింతచెట్టు.

చింతచెట్టు:- మొగుల పెద్ద చెట్టు. అది పెక్కు చోట్ల బెరుగు చున్నది.

ఆకులు:- మిశ్రమ పత్రములు. పక్ష వైఖరి. చిట్టి యాకులు మిక్కిలి చిన్నవి. నిడివి చౌకపాకారము. సమాంచలము విషమ రేఖ పత్రము. కొనక్షిపుము.

పుష్పమంజరి:- కొమ్మల చివరల నుండి గెలలు పుట్టును. అదశ్చిర్గయండాకారము గల చేటిక ఒక్కొక్కపుషము వద్ద నొక్కొక్కటి గలదు.

పుష్పకోశము:- 4 రక్షక పత్రములు సన్నముగా నుండును. నీచము. త్వరగా రాలి పోవును.

దళవలయము:- ఆకర్షణ పత్రములు ఐదు. అన్నియు సమముగ లేవు గాని చిక్కుడు పువ్వుల వలె లేదు. ద్రోణీ దళములు సరిగా చుక్కాని వలె లేదు. పుష్ప కోశము నంటి యుండును.

కింజల్కములు:- 3. మరి నాలుగు చిన్న చిన్న కాడలు గలవు. ఇవి గొడ్డులయిపోయిన కింజల్కములు. పుప్పొడి తిత్తులు 2 గదులు.

అండకోశము:- అండాశయము. ఉచ్చము. 1. గది కీలము పొట్టిది. కీలాగ్రము గుండ్రము. ఫలము పై పెంకు కండకాయ.

నల్లతుమ్మ.

1.పుష్పము: 2. పుష్పమంజరి. 3. కాయ.


నల్లతుమ్మ:- చెట్లు పెక్కు చోట్ల బెరుగుచున్నది. ఆకులు:- ఒంటరి చేరిక. ప్రతి యాకు మొదట రెండు తెల్లని ముండ్లుగలవు. మిశ్రమ పత్రములు. పక్ష వైఖరి. మధ్య ఈనె యందు గ్రంధి కోశములు గలవు.

పుష్పమంజరి:- కణుపు సందులనుండి బంతలుగా పుట్టు చున్నవి. చేటికలు గలవు. మనము సాధారణముగా పుష్పమనుకున్నది నిజముగా పుష్ప మంజరి.

పుష్పకోశము:- సంయుక్తము. గొట్టము వలె నుం'డును. 5 దంతములు నీచము.

దళవలయము:- సంయుక్తము, సరాళము. 5 దంతములు గలవు. పుష్ప కోశము నంటి యుండును. పసుపు రంగు.

కింజల్కములు:- అసంఖ్యములు. కాడలు విడివిడిగా నుండును పుష్పకోశాశ్రితము.

అండకోశము:- అండాశయము. ఉచ్చము, 1 గది; కీలము గుండ్రము. కీలాగరము చిన్నది. కాయ ద్వివిదారుణ ఫలము. కొడవలి వలె వంగి యుండును. గింజకు గింజకు మధ్య కాయకు రెండు వైపుల నొక్కులు గలవు.


చిక్కుడు కుటుంబము:- మిగుల పెద్ద కుటుంబములలో నొక్కటి. మన కాహార పదార్థములగు కందులు, పెసలు, మొదలగునవి ఈ కుటుంబములోనివే. ఇందు చిన్న మొక్కలు తీగెలు, పెద్ద చెట్లు కూడ గలవు. ఆకులు మిశ్రమ పత్రములు. కింజల్కములు సాధారణముగా బది యుండును. అంతకు నెక్కువయు తక్కువయు నుండుట కలదు. అండాశయము ఒకగది. కాయ ఎండి రెండు వైపుల బ్రద్దలగును. ఇదియే నీ కుటుంబపు ముఖ్య లక్షణము. కొన్నిటి పువ్వులు చిక్కుడు పువ్వుల వలె కీటాకాకారముగను మరికొన్నింటిలో కసింత చింత పువ్వులలో వలె పువ్వులకు ఇంచు మించు సమముగా తుమ్మ సీమ చింత మొదలగు కొన్నిటి యందు పువ్వులు చిన్నవిగాను బంతులుగాను నుండును. ఈ భేదములను బట్టి నీకుటుంబమును మూడవ కుటుంబములుగా విభజించి యున్నారు.

చిక్కుడు:- పాదును శీతకాలములో బెట్టుదుము. అవి సంక్రమాణము నాటికి సమృద్ధిగ కాయలుకాయుచుండును. నల్ల రాగిడి నేలలోని పాదులు బాగుగ నుండును. చిక్కుడు లలో నల్లచిక్కుడు, తెల్ల చిక్కుడు, పెద్ద చిక్కుడు మొదలగు పెక్కు తెగలు, రకములు గలవు. వీని పుష్పములు కొన్ని పూర్తిగ తెల్లగను, కొన్ని నీలముగను, కొన్ని ఇతర రంగుగను నుండును. చిక్కుడు కాయలు బలము నిచ్చుకూర. ఈకుటుంబములో చేరిన పప్పులన్నియు కూడ బలమునిచ్చును. కొందరు చిక్కుడు గింజలనెండ బెట్టి నిలువ చేసి కొందురు. అనపచిక్కుడు:- గింజలను అనుముల వలె నుండును. కాని అనుములట్లు వాసన వేయవు.

అడవిచిక్కుడు:- పై దాని వలె నుండను కాని మొక్క కొంచ మెర్రగా నుండును.

కంచిచిక్కుడు:- తీగెకు నాకులయడుగున మెరసెడి రోమములు గలవు.

గోరుచిక్కుడు:- కాయలుచిన్నవి. ఆకుల తొడిమలు మూడు పలకలుగా నుండును. పువ్వులు గులాబిరంగు; మొట్టమొదట చిక్కుడుపువ్వులవలె నుండును. కాని దానినేదైన తాకినచి మరింత వికసించును. దాని మూలమున పుప్పొడి ఎగిరి దగ్గర నున్న పువ్వుల మీద గాని ఆ పువ్వుల మీద వాలుటకు వచ్చిన తుమ్మెద మీద గాని పడును. ఈ పువ్వులలో నీరీతిని రజస్పర్శము గలుగు చున్నది.

కందులు:- పప్పులలోనికల్ల మనము విశేషముగా వాడునది కందిపప్పు. అది మనకు ప్రతి దినము నావశ్యకమైన పదార్థము. మన యాహారపదార్థములలో మిక్కిలి బలము నిచ్చునదియు నిదియే. కందులు మెరక పంట. వీనిని మరియొక పైరుతో గలిపి యైనను ప్రత్యేకముగా రెండ పంటగనైనను చల్లుదురు. వీనిలో పెద్ద కందులు, చిన్న కందులు, తెల్ల కందులని రకములు గలవు. తెల్ల వాని కంటె ఎర్రనివి మంచిది. పెద్ద కందుల మొక్కలు కూడ పెద్దవియే. వాని పువ్వుల మీద నూదా చారలుండును. ఒక్కొక్కప్పుడు పురుగు పట్టి లేత కొమ్మలను దినివేయును. మరి యొకప్పుడు భూమిలో నుండి ఊరగాయల మొదలగు వాని మీద బట్టు బూజు వంటిది చెట్టులో ప్రవేశించి, ఆహార పదార్థ మందనీయ చెట్టును చంపి వేయును.

వర్తకులు రంగు బాగుగ నుండుటకు కొంచెము నూనె రాతురు. కంది కంప ఇండ్లపై కప్పులు వేసి కొనుటకును, దడులు కట్టు కొనుటకును వంట చెరుగుకను నుపయోగించుతురు. దీని బొగ్గును తుపాకి మందులో వాడ వచ్చును. కొన్ని దేశములందు లక్క పురుగును పట్టు పురుగును బెంచుటకీ పైరును సేద్యము చేయు చున్నారు.

పెసరమొక్క:- 2 అడుగుల ఎత్తు పెరుగును. ఆకుల తొడిమలు ఆకులంత పొడుగుగా నుండును. పువ్వులలో పెద్దరేకు యొక్క పై యంచులోపలికి మణిగి యుండును. నల్లపెసరమొక్క ఎక్కువగుబురుగానుండును. దానిపై నెక్కువ రోమములు గలవు.

పెసలును మెరక పంటయె. వీనికి మినుములకంటే నెక్కువ నీరు గావలయును. ఇవి వాని కంటెను కొంచము ముందుగా బండును. పెసలకు మినుములంత వాడకము లేదు.

కుంకుమపెసల పంట:- బొంబాయి ఉత్తర హిందూస్థానములందు గలదు. వీని నితర పైరులతో చల్లెదరు. వర్షమంతగా నవసరము లేదు. 4 నెలలకు బంటకు వచ్చును. వీనిని పప్పుగా కంటె బచ్చి కాయలనే కూరగా నెక్కువ వాడెదరు. దీని రొట్ట పశువులకు బలమునిచ్చును.

పిల్లి పెసరగింజలు:- కూడ బాగుగ నుండును కాని, మొక్క అంతగా ఫలింపమిచే సేద్యముచేయరు. వీనికి నీరెక్కువ కావలయును. ఇవి నీటి యొడ్డునను వరి చేలలోని బెరుగును.

మినుము:- మొక్కలు మిక్కిలి గుబురుగా నుండి 3, 4 అడుగుల వరకు గూడ బెరుగును. మినుముల పంటకు నీరంతగా అక్కరలేదు. విత్తనములు జల్లుటకు పూర్వము ఒక వర్షము కురిసిన చాలును. సాధారణముగ పల్లపు నేలలందు వరి పంటయైన తరువాత జల్లుదురు. కొన్ని చోట్ల ప్రత్తి మొదలగు నితర పైరులతో గలిపి చల్లెదరు. ఇవి నల్ల మట్టి నేలలో బాగుగా బండును. కందులతరువాత మినుము లనే ఎక్కువ వాడుచున్నాము. మినుములు చాల బలమైన యాహార పదార్థము. దీనితో జేసిన వాసిన కుడుము కొన్ని జబ్బులు నితర యవుషధము లక్కర లేకయే పోగొట్టు నందురు.

శనగలు:- హిందూస్థానము నందెక్కువ సాగు చున్నవి. మన మిచ్చట నులవలు వాడి నట్లు కూడ వారచ్చట శనగలను ఎడ్లకు, గుర్రములకును బెట్టుదురు. వీని నేపద్యమూ ఉలవల నేపద్యము వలెనే యుండును. వీనికిని నీరంతగ అవసరము లేదు. శనగ పైరు మీద మంచు గురుయు చున్న నొక రాత్రి శుభ్రమైన బట్ట గప్పితిమా శనగ పులుసును దాని నంటుకొనును. ఈ పులుసును బట్ట నుండి పిడచి శుభ్రపరచి మందులో వాడుదురు. కాని శనగపులుసు తీసిన చేను గాగుగ బండదు. శనగలను కందులంత వాడము.

ఉలవలు:- హిందూస్థానమున కంటె మనరాష్ట్రమున ఎక్కువ పండు చున్నవి. వీని కంతగా సార వంతమగు భూములక్కర లేదు. మరియు దున్ని విత్తులు జల్లిన పిదప నొక వర్షము కురుసిన చాలును. ఉలవ మొక్కలు రెండు నెలలో బాగుగ నెదుగును. వీని పంట వలన భూసారముమేమియు దగ్గదు. సరి గదా భూమికి బలము వచ్చును. పొలములో చెత్త మొక్క లను బెరుగ నీయక పోవుటయే కాక, మొక్కలకు ముఖ్యముగ కావలసిన ఆహార పదార్థమందు చేర్చును. ఉలవరొట్ట పశువులకు మిక్కిలి బలము. ఈ రొట్టకొరకై సేద్యము సేయునెడల పుష్పింపకమునుపె కోసి వేయవలెను. మిగిలిన మొండెముల తిరిగి చిగురించును. లేదా తిరిగి విత్తనములు జల్లవచ్చును. కాని విత్తనములు చిర కాలము నిలువ యుండును గాన రొట్ట కంటే నివియే లాభము. కొందరు వీని నుడక బెట్టి చిట్టులో గలిపి పశువులకు బెట్టెదరు. మరి కొందరు నానబోసి రుబ్బి పెట్టెదరు. కొందరు బీదలు కూడ నులవ గుగ్గిళ్ళను తిందురు. వీనితో పిండి వంటలను చేసి కొందురు. కొన్ని చోట్ల స్త్రీలు జబ్బులకు వీనినుప యోగింతురు.

బొబ్బరలు:- మంచి నేలందెత్తుగా బెరిగి తీగెలవలె నల్లుకొనును. ఒక్కొక్క పువ్వుల కాడ మీద నీలపు రంగు పువ్వులు కొంచము చొంచెముగా నున్నవి. వీని వాడుక మన దేశము నందు తక్కువ గాన సేద్యమును తక్కువయే. బొబ్బర పప్పును అంత రుచిగా నుండదు. కొందరు పచ్చి బొబ్బర కాయలను చిక్కుడు కాయల వలె కూర వండు కొందురు. వీని యాకుల తోడను రొట్టతోడ ఒక విధమగు నాకు పచ్చ రంగు చేయుదురు.

అనప:- తీగెలు ప్రాకుట కాధారమేమైన గావలయు గావున సాధారణముగ, గోగు, ఆముదము మొదలగు వానితో గలిపి చల్లుదురు. అనుములకు అంతగా నుపయోగము లేదు. వీని యందొక విధమగు వాసన గలదు. అదియును గాక తినినచో నివి సులభముగా నరగవు. వీనిని సాధారణముగ బీదలు మాత్రము తిందురు. పచ్చి అనపకాయలను కొందరు చిక్కుడు కాయల వలెనే కూర వండుకొందురు. వీనిని గూడ ఉలవలె పశువులకును కొన్ని చోట్ల బెట్టు చున్నారు.

బఠాణి పుష్పము... చీలిక, 1, 2, 3, 4, పుష్పకోశాది భాగములు.


బఠాణీలను పూర్వమంతగా బండించెడి వారు కారు. గాని ఈ మధ్య వాని సేద్యమెక్కువ యయ్యెను. ఇవియు రెండవ పంటయె గాని నీరెక్కువ కావలెను. ఎకరమునకు నురువది బండ్లు పేడ వేసి, మూడు నాలుగు సారులు దున్ని మళ్ళు చేసి విత్తనములు చల్లెదరు. మొక్కమొలచు వరకు ననుద నము తడి పెట్టుచుండవలెను గాని, అటుపైన బదునైదుదినముల కొకసారి నీరు పెట్టిన జాలును. మొక్క లెదుగుచున్నప్పుడవి ప్రాకుటకై వాని ప్రక్కన వెదురు కర్రలను బాతవలెను. నాలుగయిదు నెలలకు బఠాణీలు పంటకు వచ్చును. కొందరు పచ్చి కాయలనే కూర వండుకొని తిందురు. కాని వానిని వేయించి తినుట వాడుక. మినప పప్పుకంటె నివి బలమిచ్చునని గాని అరగవు గాన నందు వలన సార్థకము లేదు. బఠాణీల రొట్ట పశువులకు బలమునిచ్చును.

వేరుశనగలు:- మనదేశములో విరివిగానే పండుచున్నవి. చిట్టి యాకులు అండాకారము; తొడిమలు పొడుగు. వీని మొదటి భాగము వెడల్పుగానుండి కొమ్మ నావరించు కొనును. పువ్వులు సీతాకోక చిలుక వలె నుండును. గర్భధారణమైన పిదప రేకులు వడలి పోవును. తర్వాత రాలి పోవును. కాని పిందెకున్న కాడ పొడగుగా నెదుగుటచే భూమిలోనికి జొచ్చి యచ్చట కాయ పెద్దగ పెరుగు చున్నది. కాయలు చిక్కుడు గిరివింతకాయలవలె బ్రద్దలుకావు.

వేరుశనగలు మొదట మన దేశపుపంటకాదు. ఇతరదేశములనుండి కొని తేబడినను మన దేశములో మెండుగా బండుటచేతను, ఎగుమతి చేయుట వలన లాభము వచ్చుట చేత ను ఇప్పుడెల్ల చోట్లను సేద్యముసేయుచున్నారు. వీనికి రాగిడి నేలలంతగా మంచివి గావు. ఇసుక నేలలలో నీటి ప్రదేశములదు బాగుగా పండును. పొలము దున్ని వర్షాకాలము ముందర విత్తులు చల్లెదరు. మొక్కలు మొలచిన తరువాత నీరంతగా నక్కర లేదు గాని రెండు నెలలకు బంటకు వచ్చుననగా వారమునకు రెండు సార్లు నీరు పెట్టు చుండ వలయును. మొక్కల కొమ్మలు నలు మూలల భూమితో గలయుటకై వానిని ద్రొక్కుదురు. సాధారణముగ 5 నెలలకు బంటకు వచ్చును. అప్పుడు పారలతో దవ్వి కాయలను జేచుల తోడనే రాచెదరు. ఎడ్లచేత తొక్కించిన యెడల కాయలు పగిలి పోవును గాన నీపద్దతి పనికిరాదు. వేరు శనగ పొలము బలమును లాగి వైచును గనుక సదా వానినే పండించుట మంచిది కాదు. అధమ పక్షమున నాలుగైదు సంవత్సరముల కొక మారైనను వానిని మాని రాగుల నైనను మరి ఏనినైనను బండించుట మంచిది. ఈ పంట యైన తరువాత సాధారణముగా జెరువుబెడ్డ నెరువుగా వేసెదరు.

వేరుశనక పైరుల కొకప్పుడు తెగుళ్ళు పట్టుచుండును. కొన్ని పురుగులా పొలములో నుండి యాకులను దినుసు నాకుల మీదనే గ్రుడ్లును పెట్టును. చిన్న పురుగు లాకులో ప్రవవేసించగానె ఆకులన్నియు కుళ్ళిపోవును.

వేరుశనగపప్పునంతగా వాడము. వానియందు పైత్యగుణమెక్కువగా గలదు. వేరుశనగ నూనెను వాడము కాని, అది మిక్కిలి చౌక యగుట చేత నువ్వుల నూనెలో గలిపి దగా చేయు చున్నారు. గింజలను వెచ్చ బెట్టి నూని దీసిన యెడల జాల వచ్చను కాని ఈ నూనె అంత బాగుందు. యంత్రముల మూలమున నూని యాడుచు వచ్చిరి గాని ఈ తెలక పిండికి గాను గాడిన పిండి కున్నంత యమ్మకము లేక నష్టము వచ్చుట చేత, ఆ పద్ధతి మానినారు. సబ్బు చేయుటకును, త్రుప్పు పట్టకుండ యంత్రములకు రాయుటకూ ఈ నూని పనికి వచ్చుచున్నది. దీని నౌషధములలో కూడ వాడేదరు. మన దేశములో బండు పంట ఇంచు మించుగ నంతయు జెర్మనీ మొదలగు పై దేశములకే ఎగుమతి యగు చున్నది.

మెంతిమొక్కలు:- కాయలుగాయ గానే ఎండి పోవును. వాని పువ్వుల రేకులు మూడేసి యున్నట్లు నగపడును గాని అయిదు గలవు. కాయలకు దొడిమ లేదు

ఇవి నీటిప్రదేశములందు బాగుగ మొలచును. సాధారణముగ రెండవ పంటగ, ప్రత్తితో గలిపి పందింతురు. మెంతి కూరను తోట కూర వండుకొని నట్లు వండుకొనెదము. కొందరీయాకును ఎండబెట్టి పొడుము చేసి నిలువ యుంచు కొం దురు. మెంతులను సదా పోపులో వాడుచున్నాము. వీని కింకేయుపయోగము నంతగా లేదు. వీనిలో నుండి యక విధగు పచ్చనిరంగును చేయుదురు. కొన్ని ఔషములందు గూడ వీనిని వాడుదురు.

నీలి.


నీలిమందు:- ముఖ్యమైన రంగ్దులలో నొకటి. దీనిని చిరకాలమునుండి మన దేశములో జేయుచున్నాము. కాని ఇప్పుడు చౌకగ రంగులు చేయ నేర్చిరి గాన దీని సేద్యము తగ్గినది. దీని వ్వవసాయము ఆయాప్రదేశముల శీతోష్ణ స్థితులను బట్టి పలు విధములగ నున్నది. నీలిమొక్కలలో తక్కువ రకములు గలవు. అది గాక నీలిరంగు యొక మొక్కనుండియే గాక ఇతర మొక్కల నుండి కూడ దీయు చున్నారు. కొన్ని చోట్ల నీలి విత్తనములు కందులు పెసలతో గలిపి చల్లెదరు. మరి కొన్ని చోట్ల బ్రత్యేకముగనే చల్లెదరు.

పొలమును గలియదున్ని గాబుదీసి ఎరువు వేసెదరు. అప్పుడు వర్షముండిన సరియే గాని, లేకున్నచో నీరు పెట్టి తిరిగి దున్ని సమము జేసి విత్తనములు చల్లుదురు. చల్లిన వారము దినములకు మొక్కలు మొలచును. మొలచినప్పటి నుండియు వారమునకో పదునైదు దినములకోతగినట్లు నీరు పెట్టుదురు. మొక్కలు మొలచి కొలది దినములలోనే విస్తారముగ వర్షము కురిచినను పూర్తిగ లేకుండినను చచ్చిపోవును. కొంచెమెదిగిన పిదప వీనికి పురుగు పట్టుటయు గలదు. అవి ఆకుల నన్నిటిని దినివేయును. వీనిని దొలగించుట కష్టము. కాన నామొక్కలను బెరికి వైచి క్రొత్తగా విత్తనములు చల్లవలెను. మొక్కలు పూర్తిగ నెదిగిన తరువాత వానిని గోసి బండిపై వేసి యంత్రశాలకు గొనిపోయెదరు. కోయగా మిగిలిన దుబ్బలు చిగిరించును. ఇట్లు రెండుమూడు మారులు కోసిన పిదప విత్తనములకై, ఆమొఒక్కల ను పుష్పించి కాయలుగాయనిచ్చెదరు. ఒక పొలములో సదా వీనినే పండించుట కంటె మరి యొక పైరు చేయుట మంచిది. దానికి ముందుగా బొలమును నీలి రొట్ట తోడనే దమ్ము చేసిన యెడల సార వంతమగును.

నీలిరొట్టను యంత్రశాలకు గొనిపోగానే వానికొరకు కట్ట బడిననూతులలో వేసెదరు. ఈనూతురులు 20 అడుగులు చతురముగను 4.... 5 అడుగులు లోతు గాను నుండును. వీని పైననీరు నిలువ చేయుటకు సీసపు రేకులతో జెరువులవలె కట్టుదురు. ఈ చెరువులలో నుండి నూతి లోనికి గొట్టముల ద్వార నీరు వచ్చును. ఆ నూతులలో నీలి రొట్టను వేసి, నీరు రానిచ్చి 10 ...15 గంటల వరకు నాననిచ్చెదరు. అప్పటికి నీరునకొక విధమగు పచ్చని రంగు వచ్చును. ఈ నీరును ఆ నూతుల క్రింద నున్న చిన్న నూతులలోనికి బోనిచ్చెదరు. ఇవియు పైవాని వలెనే యుండును గాని అంత లోతుండవు. రసమంతయు వీనిలో ప్రవేశించిన పిదప పదిమంది కూలి వారు దిమ్మిసాలాతో గంటన్నర వరకు మోదెదరు. కొన్నిచోట్ల గూలివారు బాదుటకు బదులుగా ఆవిరి సహాయమున నందులో గొన్నిచక్రములను ద్రిప్పుదురు. మరికొన్నిచోట్లదిమ్మిసాలతో గొట్టుట మాని యెడ తెగకుండనా విరిని గాలిని ప్రసరింప చేయుదురు. పిదప ద్రవమును తేలనీయ నీలి రంగడుగునకు బోయి పైన నెర్రని నీరు మిగులును. ఈ నీరంతయు బార పోసి మడ్డివలె నున్న రంగును దీసి పరిశుభ్రమగు నీళ్ళతో గలిపి కాచవలెను. బాగుగ మరిగిన పిమ్మట వెదురు బద్దల మీద బరచి యున్న కేన్వాసు. గుడ్డ మీద నార బోయుట చే నీరంతయు ఇంకి రంగు నిలుచును. దీని నటు పిమ్మట జతురముగా నున్న బెట్టెలలో వేసెదరు. ఆ పెట్టెల మూతలు కొంచెమైన ఎడము లేకుండ సరిగ పట్టును. వాని మీదను కొన్ని రంధ్రములు మాత్రము గలవు. అయిదారు గంటలకొక మాటు చొప్పున మూతలను నొక్కెదరు. నీరేమైన నున్న యెడల ఆ రంద్రములలో నుండి పోయి రంగు గట్టిపడును. గట్టి పడిన దానిని మూడేసి యంగుళముల ముక్కలుగా గోసి ఒక గదిలో నారబెట్టెదరు. గాలి విస్తారముగా జొచ్చుచున్నయెడల ముక్కలు పగిలి పోవును గాన తగినంతయే గది లోనికి వచ్చు నట్లు జూచుచుండ వలెను.

యంత్రములు లేని చోట్ల రొట్టనెండ బెట్టి కర్రలతో బాది ఆకులను రాల గొట్టెదరు. వీనిని నీళ్ళలో నానవేసి పెద్ద పెనములలో ఆ రసమును కాచెదరు. అడుగున దేలు రంగును శుభ్రమగు నీళ్ళతో కలిపి కాచి కషాయమును వడగట్టి బోగొట్టి రంగు నెండ బెట్టుదురు.

వేరువేరు పదార్థముల నుండి రంగు చేయుచుండి నప్పటి నుండియు మన దేశపు వర్తకము తగ్గి పోయెను. తగ్గినను సంతోషమే కాని, పంట పండించి పై దేశముల కెగుమతి చేసిన మనము గూడ నితర దేశముల నుండి దిగుమతి కూడ చేసి కొనుచున్నాము.

కరినీలి:- మూడడుగులు పెరుగుచున్న మొక్క. ఆకుల మీదను కొమ్మల మీదను తెల్లని రోమములు గలవు. ఆకులు చల్లనినీళ్ళలో వేసి కాచిన తరువాత నీలిరంగు వచ్చును. చిక్క బడిన అరంగును వెడల్పగు కాగులలో వేసి సన్నని మంట మీద కాక బెట్టుచు సున్నము నీళ్ళు జల్లుచున్న యెడల రంగు అడుగునకు దేలును.

వరినీలి:- మెట్టనేలల మీద బెరుగును. ఆకులందు మూడేసి చిట్టియాకులు గలవు. పువ్వులుఎరుపు. కాయలు నాలుగుపలకలుగానున్నవి.

జనుము:- 10 అడుగుల వరకు కూడ పెరుగును. ఆకులు మిశ్రమపత్రములు గావు. వీనితొడిమలు పొట్టివి. ఆ కుల మీద వెండి వలె మెరయు రోమములు గలవు. వీనిగింజలు చిక్కుడుగింజల వలె నుండును.

జనుము పొలములకు మిక్కిలి బలమగు నెరువు గావునను పశువులకు మంచి ఆహారము గావునను దీనిని సేద్యము చేయు చున్నారు. దీని కంతగా సారవంతమైన నేల అక్కరలేదు. ఎరువు కొరకైనచో రెండునెలలు మొలచిన పిదప గోసి దానితో దమ్ము చేయ వచ్చును. మరియు నీ గింజలను ఒత్తుగా చల్లిన మాత్రముననే పొలములో గట్టి మొక్కలను మొలవనీయదు.

మనవైపుల జనుము నంతగా నారకొరకు సేద్యము చేయుట లేదు గాని ఇప్పడి పుడెక్కువయగుచున్నది. నారకు పల్లపు భూములలో మొలచిన జనుము కంటె కొంచెము మెరక నేలలలోనిది మంచిది. కాయలగాచుచుండగనే దానిని గోసి చిన్న చిన్న కట్టలుగట్టుదురు.

ఆకులను రాల్చి చిన్న కట్టలన్నియు బెడ్డవానిగ కట్టి ఎండబెట్టి ఎందినపిదప నీళ్ళలో నూరవేయుదురు. ప్రవహించుచున్న నీళ్ళలో నాన వేసిన మంచి దందురు గాని అట్లయినచొ చాల కాలము గావలయును. నానినదానిని దీసి యొకబండ మీద పెట్టి కర్రలతో గొట్టుదురు. వచ్చిన నారను నీళ్ళమీద కొట్టుట చే నార శుబ్రమగును. ఇక నీళ్ళు బోవుటకు నారను మెలిపెట్టి యెండలో బెట్టుదురు. నార మంచి తనము, చెడ్డతనము, అదెన్ని నాళ్ళు నానునో దానిని బట్టియు, ఎంత చక్కగ శుభ్రము చేయ బడినదో దానిని బట్టియు నుండును. ఈ నారయు నితర నారలవలె బనికి వచ్చును. దీనొతో త్రాళ్ళు, పగ్గములు, కేన్వాసును చేయుదురు. కాని మన దేశములో విస్తారము వలలకే నుప యోగించుచున్నారు. ఇవన్నియు చేయగ మిగిలిన తుక్కు కాగితములు చేయుటకు అనుకూలముగ నుండును

చింతచెట్టు:- మనదేశములో బెరుగు మహా వృక్షములలో నొకటి. ఇది మన కష్టము లేకయే మన్యములలోను, దొడ్లయందును బెరుగు చున్నది. మొక్కలను నాటి పెంప వలెనన్న మూడడుగుల లోతునను మూడడుగుల వెడల్పునను గోతులు దీసి, వాని నిండ ఎరువు వేసి, 3, 4., గింజలను నాట వలెను. మొక్కలు కొంచమెత్తు మొలచిన తరువాత వానిచుట్టు పశువులు తినకుండ కంచ కట్టవలెను. చింత చెట్టు మిక్కిలి యుపయోగ మైన వృక్షము. చింత చిగురు నొక్కొక్కప్పుడు మందులలో గూడ వాడుటకలదు. జమైకాదేశములో చింత పండును పంచదారయు నొక దాని తరువాత నొకటి వేసి, పైన పంచ దార పాకము పోసి పీపాలలో బిగించి ఎగిమతి చేయుచున్నారు. చింత మ్రాను మిక్కిలి బలమైనదైనను సన్నపు పనులకు బనికి రాదు. దీనితో గానుగలు, బండి చక్రములు మొదలగునవి చేయుటకు బాగుగ నుండును. చింత పేడుమంచివంటచెరకు, తుమ్మ పేదు వలెనే మండును.

సీమచింత:- మొక్కలు చిన్నవిగా నున్నప్పుడు తోట చుట్టు కంచెలుగా బాతుదురు. దీని లేత కొమ్మలమీద నెర్రని చారలుండును. ఆకులతొడిమల వద్ద ముండ్లు గలవు (ఖణుపు పుచ్చములే ముండ్లు గా మారినవి) వెల చెట్టులో వలె దీని మీదను నొక్కొక్క చోట నుండి చాల యాకులు వచ్చును. అచ్చట పుట్టవలసిన కొమ్మ పుట్టక కొమ్మ మీద నుండ వలసిన యాకులు మాత్రము పెరిగి వచ్చు చున్నవి. ఈ చెట్లు ఉపయోగము అంతగా లేదు. వీని గింజలపై నుండు నెర్రని పదార్థము కొందరు తిందురు.

నల్లతుమ్మ:- చెట్లు పెక్కుబయళ్ళయందు బెరుగుచున్నవి. వీనికంతగా నీరక్కర లేదు. సాధారణముగ నివి పొట్టిగా నుండునుగాని సారవంతములైన చోట్ల ఎత్తుగా బెరుగును. వానిని గిజలు నాటిగాని, కొమ్మలు నాటి గాని పెంచ వచ్చును. గింజలు మిక్కిలి గట్టిగా నుండుట చే ద్వరగ మొలకెత్తవు గావున వానిని నాటుటకు ముందొక రాత్రి పేడ నీళ్ళలో నాన వేసెదరు. మొక్కలు కొంచెమెత్తెదిగిన పిమ్మట దూర దూరముగ బాతుట మంచిది. అవి మూడవ యేటనే పుష్పించి కాయలు గాయును. కాని దాని బెరడు మాత్ర మైదారు సంవత్సరముల వరకు దోళ్ళు బాగు చేయటకు బనికి రాదు. ముదురు చెట్ల బెరడు బాగుగనే యుండును కాని లేత వాని బెరడుతో జర్మములకు మంచి రంగు వచ్చును. చెట్ల మీద నెచ్చట నైన నాటు పెట్టినచో జిగురు వచ్చును. ఇది ముదురు చెట్టు నుండి చాల వచ్చును గాని లేత వాని జిగురు మంచి దందురు. ఈ జిగురును వెల్లవేయుట యందును, చిత్ర పటములు గీయుట యందును, ఔషధముల యందును కూడ నుపయోగింతురు. లేతతుమ్మ కాయలు ఆకులు, మేకలకును, పశువులకును వేసినచో నవెక్కువపాలిచ్చును. తుమ్మకలప గట్టిగా నుండును గాని ఇండ్లకు శుభ ప్రదము గాదని మానుదురు. కాని కొన్నిచోట్ల వాసములగను, దూలములగను వాడుచున్నారు. ఇది బండ్లు, నాగళ్ళు మొదలగునవి చేయుటకు బాగుండును. మరియు నీళ్ళలో నాననిచ్చిన యెడల చక్కగ వంగుచు సన్నపుపనులకు బనికి వచ్చును. ఇదిమం చి వంటచెరకు. పేళ్ళు నిలిచికాలును. వీనివేడిమి ఎక్కువ. కావున యంత్ర శాలలయందు కూడ నుపయోగించెదరు. వీని నీడ యంతగా నుండదు. అయినను వానిక్రింద గడ్డి తెప్ప ఇతర మొక్కలు మొలవవు. కాని గడ్డి మాత్రము ఏపుగా బెరుగును. అందు చేతనే బీడుల యందును పచ్చిక యళ్ళ యందును నీ చెట్లను నాటుదురు.

తెల్లతమ్మ:- ఇట్లే యుండును. దీనినుండియు జిగురు తీయుదురు. నారయు వలలకు బనికివచ్చును.

కస్తూరితుమ్మ:- పువ్వుల కాడలు పొడుగుగా నుండును. వీని పువ్వులే మిక్కిలి యుపయోగమైనవి. ఇవిపరిమళముగ నుండుట చే సువాసన నూనెలందు వాడుదురు.

ఖదిర వృక్షము కూడ తుమ్మ చెట్లవలెనే యుండును. దీని పువ్వులలో ప్రత్యేకముగ కొన్నిపురుష, పుష్పములే గలవు. ఈ చెట్టు నుండియె మనము తాంబూలములో వేసికొని కవిరి (కాచు) చేయుచున్నారు.

చెట్లను నరికి మ్రాను మధ్య నుండు భాగమూ పలుచని చిన్న చిన్న ముక్కలుగ గోసి పెద్ద కాగులులో వేసి మరగ పెట్టుదురు. మరిగి రసము చిక్కబడిన తరువాత నొక బల్ల మీద నాకులు పరచి వీనిపై రసమును చల్లార బోసెదరు. మరునా డుదయమున కదిగట్టిపడును. దీనినే ముక్కలు ముక్కలుగా కోసి అమ్ముదురు. ఈచెట్టు నుండి జిగురు కూడ వచ్చును. ఈ జిగురు తుమ్మ జిగురు కంటె మంచిది. దీని కలపయు బలమైనదియె. ఇంటి వాసములకును, చక్రములు నాగళ్ళు రోళ్ళు మొదలగు వానికిని బనికి వచ్చును.

షీకాయి చెట్టు:- ముండ్ల పొదవలె బెరుగును. లేత యాకులు పుల్లగా నుండును గాన చింత చిరుగు వలెనే పచ్చళ్ళు చేసి కొందురు. ఈ పచ్చడిని పత్స్యముగ కూడ ఉపయోగించెదరు. కాయలు కుంకుడుకాయల వలెనే రుద్దుకొనుటకు పనికి వచ్చును.

గానుగ చెట్టు:- మన దేశములో చాలచోట్ల పెరుగుచున్నది. దీని చిట్టి ఆకులు పెద్దవిగనే యుండును. పువ్వులు తెల్లగానైనను కొంచము నీలము రంగుగానైననుండును. వికసించిన తరువాత త్వరగా రేకులు రాలి పోవును. కాయ బాదము కాయవలె నుండునుగాని మిక్కిలి పలుచగా నుండును. కాయ లెండినను బ్రద్దలు కావు. గింజలనుండి తీసిన చమురు చర్మవ్యాధులకును, తల నొప్పి కీళ్ళనొప్పులకును పనికి వచ్చును. ఆకులతో దమ్ము చేసిన యెడల పొలములు సారవంత మగును. దిరిశనచెట్టు:- బాటల యందు నీడనిచ్చుకొరకు బాతెదరు. వీని పువ్వులు గుత్తులు గుత్తులుగా నుండును. పువ్వు మంచి వాసనయు గలదు. ఆకులు పక్షవైఖరిగ నున్నవి. చిట్టియాకులు పగలంతయు విప్పారి యుండి సాయంత్రమందు ముణుచుకొనును. ఆకులును కొంచెము క్రిందకు వాలి నిద్ర బోవుచున్నట్లు దోచును. కనుకనే వీనిని నిద్ర గన్నేరు చెట్లని కూడ కొందరందురు. అట్లు ముణుచుకొనుట చేత బగలు నీడయు రాత్రి వెన్నెలయు కూడ ద్రోవపై పడును గాన సాధారణముగ నీనినే పాటెదరు.

నిద్రగన్నేరను పేరుతోడనే మరియొక్క మొక్క గలదు. ఇది మిక్కిలి చిన్నమొక్క. దీని యాకులు చింతాకుల కంటె సన్నంగానుండును. దీని చిట్టి యాకు నొక దానిని తాకితిమా, దగ్గరనున్న వన్నియు ముణుచుకొని పోవును. ఒక యాకునకు దగ్గిరిగా అగ్గి పుల్లను వెలిగించిన యెడల నాకులన్నియును, వేడెక్కువగ సోకిన యెడల కొమ్మ గూడ ముణుచుకొనును. చెట్లకు గూడ మన వలెనె స్పర్శ గ్రహణ శక్తి యు మనవలెనె కష్టసుఖముల నెరుంగుటయు గలవని సూచించుట కిదియే దృష్టాంతము.

గులివింత:- పొద పెక్కుచోట్ల బెరుగుచున్నది. దీని గింజలందముగా నుండును. ఎఱ్ఱని గింజలకొక వైపున నల్లనిచుక్కగలదు. కమసాలివాండ్రీగింజలను పడి కట్టుగ నుపయోగించుదురు. వీని యందు విషమున్నది.


చందనము.


రక్త చందనము:- పెద్దవృక్షము. వీనిగింజలుగులివింత గింజలవలె ఎర్రగ నుండును గాని యంతకంటె కొంచెము పెద్దవిగాను బల్లపరుపు గాను నుండును. మ్రాను యొ క్క చెక్కనెండ బెట్టి పొడుముచేసి దానినుండి ఎర్రని రంగు చేయు చున్నారు. ఆకులను గింజలను కషాయము కాచి యిచ్చిన కొన్ని దగ్గులకు మంచిది. కలప, ఇండ్లకును, కుర్చీలు, బల్లలు మొదలగునవి చేయుటకును ఉపయోగించును. ఈ చెట్టు నుండి జిగిరు కూడ వచ్చును.

చందనము:- చెట్లు వేసవికాలమందు పుష్పించును. వీని పువ్వులు గొట్టము వలెవుండును. పువ్వు మొక రంగు చేయుటకు వీనిని పెంచెడువారు కాని, ఇప్పుడు చౌక రంగులు వచ్చుట వలన మానినారు. దీనినిప్పుడు బొమ్మలకును, ఇంటి స్థంభములకును నాగళ్ళకును ఉపయోగించుచున్నారు.

బాడిత:- చెట్టుబెరడు నున్నగానుండును. మూడు చిట్టి యాకులలోను కొకటి పెద్దది. బాడిత చెటేటు ప్రత్యేకముగ ఉపయోగమైనది గాకున్నను ఉపయోగమైన వాని పంట నెక్కువ చేయును. దీని వేరుల నాశ్రయించు కొనియుండు సూక్ష్మ జీవుల సాయమున మొక్కలకు నావశ్యకమైన వాయువు నెక్కువగా భూమిలోనికి జేర్చును. ఇదియో ఈమొక్కచేయు లాభము. ఈ కుటుంబము మొక్కలన్నిటికిని కొంచెము, గొప్పయె గలదు. పాతిన మొక్కలు ఈ తీరున భూములను సార వంతములుచేయుటకై, ముఖ్యముగా తేయాకు, పోక, కాఫీ, తోటలందు బాతుదురు.

విరుగుడు చేవ:- చెట్టుపెద్దవృక్షము. కొమ్మలు నలుమూలల వ్వాపించి నీడ నిచ్చును. పువ్వులు తెలుపు. కాయ బ్రద్దలవదు. దీని కలపతో కుర్చీలు, బల్లలు మొదలగునవి చేయుదురు.

బాడిదముచెట్టు:- బాడితచెట్టు వలె నుండును. లేతకొమ్మల మీద రోమములును, ఆకులకు తమ్మెలును గలవు. దీనిచెక్క మిక్కిలి నున్నగాను తేలిక గాను నుండును. దీనితో చిన్న చిన్న తెప్పలు, పెట్టెలు కొండపల్లి బొమ్మల వంటి బొమ్మలు చేయుచున్నారు.

అవిసి చెట్టు:- ఇరువది ముప్పది అడుగులెత్తు పెరుగును. పువ్వులు పెద్దవి. ఎర్రగానైనను, తెల్లగనైనను వుండును. ఈ చెట్లెత్తుగా పెరిగి సూర్య రస్మినడ్డు పెట్టకుండుటచే తమలపాకులతోటలలో వీనిని బాతి వానిమీద తీగెలు బ్రాకించెదరు. గొందరు లేత యాకులను కూర వండుకొందురు.

తాళవ వృక్షము:- అందముగానుండును. వీనితెల్లని పువ్వులగుత్తులు మంచి వాసనవేయును. కొన్నిటి పువ్వులెర్రగా నుండును.

వనరాజము:- సాధారణముగ నడవులలో బెరుగును. ఆకులకు రెండు వృత్తములున్నవి. పువ్వులు కొమ్మల చివర నైనను ఆకుల కెదెదురుగా నైనను నుండును.

తంగేడు మొక్క:- ఎనిమిదడుగుల వరకు కూడ పెరుగ గలదు. పువ్వుల గెల లొక్కొక్కప్పుడు గుత్తుల వలెనుండును. ఈ మొక్కలు మన దేశములో విరివిగానే పెరుగు చున్నవి. వెనుక వీని బెరడుకై పెంచుచు వచ్చిరి గాని,తోలు బాగు చేయుట కందుండి వచ్చు పదార్థము కంటె చౌక పదార్థములు వచ్చుటచే మానినారు కాని ఇప్పటికి, పుస్తకములకు అట్టలుకట్టునపుడుపయోగించు తోలు దీని తోడనేబాగు చేయుచున్నారు. ఆకులను బువ్వులను నీళ్ళతోగాచి, పాలు కలిపి, కాఫీ వలె త్రాగను త్రాగ వచ్చును. కరువుకాలమందు పేదలీ యాకులను వండుకొని తిందురు. దీనివేళ్ళసాయమున ఇనుమును ద్వరగా గరుగవచ్చును.


సునాముఖి.

సునాముఖి: ఆకును చిరకాలమునుండి వైద్యమున ఉపయోగించు చున్నారు. అది రాగడి నేలలో ఏపుగా పెరుగును. విత్తులు చల్లుటకు పూర్వము పొలము దున్ని కలుపుదీసి నీరు పెట్టుదురు. మొక్కలన్నిటిని గోసివేయక, ముదురాకులను మాత్రము కోయుచు వానినెండ బెట్టి ఎగుమతి చేయు చున్నారు. ఆకులకు విరేచనుము చేయించు గుణముగలదు. కావునాఔషధములలో వాడుదురు.

అడ్డాకుల:- తీగెపెద్దది. మ్రానులావుగానుండును. ఆకులు పెద్దవి. ఆకులక్రింద నులితీగెలు గలవు. పువ్వులు మొదట తెల్లగా నుండును గాని తరువాత పచ్చగ మారును. ఆకులు పెద్దవి గాన విస్తళ్ళుకుట్టుదురు. అరటిఆకులులేని కాలమందు వీనినే వాడుదుము. దీని కాయలను కూడ కొందరు తిందురు. గింజ లెండిన తరువాత వాని రుచి జీడిగింజలవలె నుండును.

మోదుగ:- మొక్కలు కొండప్రదేశములో పెరుగును. ఆకుల మీదనుకొమ్మల మీదను మెత్తని తెల్లని పదార్థము గలదు. ఆకుల మిశ్రమపత్రములు. దీని పువ్వులు చిక్కుడుపువ్వుల యాకారముగను ఎర్రగను పెద్దవిగను నుండును. వీనిమీద వెండివలె మెరయు రోమములు గలవు.

తీగె మోదుగ:- కొందలమీద పెరుగును. తీగె మాను లావుగా నుండును. ఆకులు, పువ్వులు మోదుగవాని కంటె పెద్దవి.

కసింత మొక్క:- రాతినేలలందు విరివిగా బెరుగును. లేత కొమ్మలు కొంచమెర్రగా నుండును. పువ్వులు పశుపు రంగు. దీనివేళ్ళతో కషాయము దీసి ఔషధములలో వాడుదురు.

నూతికసింత:- మొక్కడొంకదగ్గర రెండు మూడడుగులెత్తు పెరుగును. కరువు కాలములో బీదలీయాకును కూర వండుకొందురు.

రేల మొక్క:- ఆకులు పొడుగుగానుండును. పువ్వుల కాడలు పొట్టివి. దీని పువ్వులకు మంచివాసనకలదు.

తీట కసింత:- హిందూస్థానమునందెక్కువగా బెరుగుచున్నది. దీనికొమ్మలతో తడికలల్లుదురు. పశువులు, ఒంటెలుకూడ దీనిని తినును.

నేలరేను:- చిన్నచెట్లు, పువ్వులుగుత్తులు గుత్తులుగానుండును. గాయలు సన్నముగాను బలుచగాను నుండును.

నీరుజీలుగ:- ఎవరు పెంచుటలేదుకాని వానియంతటయె నీళ్ళలో మొలచు చున్నవి. వరిచేలలో కూడ నీరు నిలిచి యున్న చోట మొలచు చున్నవి గాని వానిని బెరికి వైచుచున్నారు. దీనియుపయోగములు చాల కాలమువరకు దెలియ లేదు. ఇది సీసాలకు బిరడాలుగ నుపయోగించును.

దీని ముఖ్యమైన ప్రయోజనము టోపీలును దలపాగలను చేయుట. జీలుగు బెండులను లావుగ నున్న వాని కోసి ఎండు వరకు నొక గదిలో వేసెదరు. ఎండిన పిమ్మట పైపొర తీసి వేసి పదునగు కత్తితో కాగితములంత పలుసగ కోసెదరు. రాగడి మట్టితో టోపి వలెనో దలపాగ వలెనో జేసి ఆయచ్చును బట్టి జీలుగు రేకులతో టోపీలను, దలపాగలను చేయుదురు. కాని సాధారణముగ, ఒక జీలుగు రేకుపైన మరియొక దానిని వేయక, దగా చేసి, మధ్య కాతిగములను బెట్టుచుందురు. పూర్తిగ బెండుతో చేసిన తలపాగ లెండను తలకు తగుల నీయవు. చిర కాలము నుండి జీలుగు బెండుతో చేయునవి ఉత్సవములందు ఉపయోగించు పువ్వులు కాయలే. తంజావూరు జీలుగు బొమ్మలకు ప్రసిద్ధి కెక్కినది. జీలుగు బెండు మిక్కిలి తేలిక యైనది గాన చేపలుపట్టుకొనుటకు గట్టు చిన్న తెప్పలందును, నీటిమీద తేలు ఉపకరణములందును నుపయోగించుచున్నారు. అది నీరుపీల్చుకొని యుబ్బును గాన శస్త్ర వైధ్యము నందును, దుద్దులు మొదలగు ఆభరణములు పెట్టుకొనుటకు చెవులకుట్లు పెద్దవి చేయుటకు ఉపయోగించు చున్నారు.

ఎర్రజీలుగు:- మొక్కలు చాలాచోట్ల బెరుగు చున్నవి. వీని నుండి నార తీసి వలలు అల్లుటలో ఉపయోగించు చున్నారు. దీని నారను జనపనారవలెనే తీయుదురు.

దీనితో దమ్ము చేసిన పొలమునకు బలమువచ్చును.

నల్లజీలుగ:- యొక తీగె. చిట్టిఆకులు. మిక్కిలు చిన్నవి. ఆకులపై రోమములు గలవు. ఒక్కొక్క పువ్వుల గెలలో రెండో మోడో పువ్వులుండును.

కొండ గిలిగిచ్చ:- ఆకులు బల్లెపాకారము. పచ్చని పువ్వులు పూయును.

నల్ల గిలిగిచ్చ.- అంతగా మొలవదు. ఆకులు అండాకారము. పువ్వుల గెలలు ఆకులు కెదురుగా నుండును. పచ్చని పువ్వులు సాయంత్రము వికసించును. పువ్వులు చిక్కుడు పువ్వులఆకారము. రెండు రేకుల మీద నల్లని చుక్కలు కలవు.

నల్లగిరిగిలిగిచ్చ:- బయళ్ళమీద విరివిగా మొలచును. కొమ్మలు భూమివద్ద నుండియు వ్యాపించి యుండును. పువ్వులు సంవత్సరము పొడుగున వికసించును. కాయలు నలుపు.

పెద్ద గిలిగిచ్చ:- ఆరడుగుల వరకుకూడ పెరుగును. చిట్టిఆకులు మూడేసి కలవు. అధశ్చిరయండాకారము. పువ్వులు కొమ్మల చివర నుండును.

కూనగిలిగిచ్చ
- పువ్వులుచిన్నవి. పువ్వులు కణుపు సందుల నుండి వచ్చును.

నాగ గిలిగిచ్చ:- నేలమీద ప్రాకును. చిట్టిఆకులు. అధశ్చిర హృదయాకారము. తొడిమలు ఆకుల యంత పొడగుగా నుండును.

కాయలు బఠాణీ కాయల వలె నుండును.

నీరు గిలిగిచ్చ:- వరిసేలలో మూడునాలు గడుగులెత్తు పెరిగి వర్షాకాలమందు పుష్పించును. చిట్టియాకులకు దొడిమలేదు.

గచ్చ పొద:- సముద్రతీరముల నిసుక నేలల విస్తారముగ బెరుగును. మనము గచ్చకాయలనునవి నిజముగా గింజలు వీనినుండి తీసినచమురును, పప్పును ఔషధముల యందు ఉపయోగించురు. నూనె దేహమునకు రాసికొనిన లావణ్యము వచ్చు నందురు. కాయలు గాల్చిన బొగ్గు పండ్ల జబ్బులకు మంచిది. ఆకులను వేళ్ళ బెరుడును కాయలకు బదులుగా ఉపయోగింప వచ్చును గాని యంతగా పని చేయవు.

నూనిగచ్చ:- మొక్కలు చిరకాలమునుండి మన దేశములో బెరుగుచున్నవి గాని దాని గుణ విశేషము మొన్న మొన్నటి వరకు దెలియలేదు. దీనిగింజలలో చర్మములు బాగు చేయుటకు పనికి వచ్చు పదార్థము చాలకలదు. దాని నిప్పుడు వాడుచున్నారు.

బుక్కా చెట్టు:- కాయలనుండి ఇదివరకు ఎర్రరంగును చేయు చుండెడి వారు గాని ఇప్పుడు చౌక రంగులు పై దేశములందుండి వచ్చుట చేత మాని నారు.

తురాయి:- చెట్లు పలుచోట్లగలవు. ఆకులు ద్విభిన్న పత్రములు. పువ్వులెర్రగాను, పెద్దవిగాను వుండును. ఆకురాలి యున్నప్పుడు పుష్పించును.

చెమ్మ తీగెలు:- డొంకలమీదప్రాకును. ఒక్కొక్క కాడమీద రెండేసి యూదా పుష్పములున్నవి. పుష్పకో శము విష్టాకారముగనున్నది. గింజలు చిక్కుడుగింజలవలె నుండును గాని అంత కంటె పెద్దవి. చేదుగానుండుట చే దినుటకుపయోగింపవు.

అలచంద మొక్కయు తీగెయె. పువ్వుల కాడలాకులకంటె పొడగు. నీని కాయలు కూర వండుకొందురు. కొన్నిటి గింజలు తెల్లగాను కొన్నిటివి నల్లగా నుండును. తెల్లగింజల కాయలే కూరకు మంచివి.

కరి అల్చంద:- తీగె యొక సంవత్సరములోనే చచ్చి పోవును. పువ్వులు జంట జంటలుగా నుండును.

కసమర్ద:- (చక్ర అర్ద) తగరిస మొక్కలొకతీరుననే యుండును. వీని ఆకుల రసము తామరను పోగొట్టును.

నల్లబెండ:- తీగెనేలమీద ప్రాకుచుండును. ఆకులు హృదయాకారము సీతాకాలములో పచ్చని చిన్న పువ్వులు పూయువు.

తెల్లతీగె:- చెట్లమీద ప్రాకును. వదిజతలచిట్టి ఆకులు గలవు. పువ్వుల్లో నొక రేకునకు పాదముగలదు.

కరకండి తీగె:- చిట్టిఆకులు మూడింటిలోను చివర నున్నది పెద్దది. ఆకులపై దట్టముగా రోమములుగలవు. పువ్వులు పసుపు రంగు.

చరగడము మొక్క కొండలమీద పెరుగును. ఆకుల తొడిమవద్ద గ్రంది కణములు గలవు. కొండలమీద నుండువారు దీని గింజలను తిందురు.

దుద్రుఘ్నము:- శీతాకాలములో పుష్పించును. ఆకుల కాడలకు రెండు వైపుల పచ్చని చారలు గలవు. పచ్చని పువ్వులు పూయును. ఆకులు గింజలు విషపు కాటులకు మంచిదందురు.

కిష్ణ కుమార:- చిన్నచెట్టు. ఆకులు పక్ష వైఖరిగ నుండును. పువ్వుల రేకులన్నియు సమముగా నుండును. వీనికి పాదములు గలవు.

నూనిగిలక:- ఒకతీగె. దీని పై ముండ్లుగలవు. ఆకులు పెద్దవి. పక్ష వైఖరి. పువ్వుల రేకులు గుండ్రముగా నుండును.

పలకదూడ తీగె కంచెలమీద బెరుగును. ప్రతి చిట్టిఆకువద్దను రెండు చిన్న ముండ్లు గలవు. పువ్వులు తెల్లగనో, ఎర్రగనో వుండును.

అమెర మొక్క పచ్చిక బయళ్ళమీద నుండును. వర్షాకాలములో పుష్పించును. ఆకులు గుండ్రము.

నలపర్ని:- సదాపుష్పించుచునే యుండును. ఆకుల యడుగున మెత్తని రోమములు గలవు. కొన్నిటి పువ్వులు ఎర్రగాను, కొన్ని తెల్లగాను వుండును.

నల్లసారకాడ:- కొమ్మలు పది అడుగుల వరకు వ్యాపించును. అడుగాకులు లఘుపత్రములు. చివర నున్నవి రెండు కలిసి యుండును.

నల్ల పాలేరు:- నేల మీద ప్రాకును. ఆకులు లఘు పత్రములు. పువ్వులు ఎరుపు. కాయలు చంద్ర వంక వలె వంగివుండును.

శాయిలికంప:- చిన్నగుబురు మొక్క. మూడేసి చిట్టి ఆకులు కలిసి యుండును. కొన్ని పుప్పొడి తిత్తులు వెడల్పు, కొన్ని సన్నము.

గలుగ:- తీగె కొండమీద నుండును. ఆకులు పక్ష వైఖరి.

జయంతి:- గుబురు చెట్టు. పువ్వులు ఊదారంగు. ఆకులపై పసుపు చుక్కలు గలవు. పువ్వులు పెద్దవి.

దూలగొండ యెక్క పుష్పకోశము సమముగాదు. ఆకులపై రోమములు గలవు.

పెద్ద దూలగొండ:- తీగె దొంకలమీద ప్రాకును.

దీనిఆకులు చిక్కుడాకుల వలె నుండును. వీనిపై మెత్తని రోమములు గలవు. ఆకులు దేహమునకు దగిలినచో దురద పెట్టును. ఈ దురద, రోమముల లోనుండి వచ్చు ద్రవ పదార్థము మన చర్మము పై బడుటచే గలుగు చున్నది. మృగము లేవియు దీనిని తినకుండ సంరక్షించుకొనుటకై ఇది యొక మార్గము.


గులాబి కుటుంబము.


ఈకుటుంబపు మొక్కలు శీతలదేశములలో ఎక్కువగా పెరుగుచున్నవి కాని మన దేశములో అంతగా లేవు. కొన్నిటి ఆకులు లఘు పత్రములు, కొన్నిటివి మిశ్రమ పత్రములు కాని అన్నిటి యందును ఒంటరి చేరిక్యే. ఆకులకు గణుపు పుచ్చములు గలవు. పుష్పములు చిక్కుడు పువ్వు వలె నుండక సరాళముగ నుండును. పుష్ప కోశము నందును దళ వలయము నందును అయిదేసి రేకులున్నవి. ఇవి మొగ్గలో అల్లుకొని యుండును. కింజల్కములు చాల గలవు. ఇవి పుష్ప కోశము నంటి యుండును. అండాశయము లొకటైనను ఎక్కువగా నైనను నుండును. కాయలు కొన్నిటిలో కండ కాయలుగను కొన్నిటిలో ఎండు కాయలుగను వున్నవి. ఈ కుటుంబములో ఉపయుక్త మైన మొక్కలు గలవు.