Jump to content

వృక్షశాస్త్రము/కలువ కుటుంబము

వికీసోర్స్ నుండి

తీగముషిణి:- తీగెపెద్దది. పువ్వులుచిన్నవి. పచ్చాగానుండును. పక్షులు దీని పండ్లను తినును. దీని వేరు నుండి రసము తీసి పాముకాటునకిత్తురు గాని అంతగా పని చేయునట్లు తోచదు.

కాకిమఱ్ఱితీగె:- ఆకులుపెద్దవి. దీనికాయలను దినరాదు. అవి విషము గింజల నుండి చమురు తీసి కొబ్బరి నూనెలో గలిపి వ్రాసిన తామరమొదలగు చర్మ వ్వాధులు తగ్గును. దీని పండ్లను , గింజలను అన్నముతో కలిపి కాకులను జంపుటకు బెట్టుదురు.

కలువ కుటుంబము.

కలువమొక్కలు మన దేశమందంతటను బెరుగుచున్నవి. వేళ్ళు బురదలో నాటుకొనియుండును.

ప్రకాండము నీళ్ళలోనె పొట్టిగా నుండును.

ఆకులు:- పెద్దవి. గుండ్రము, తొడిమలు మిక్కిలిపొడుగుగాను గుండ్రముగాను నున్నగాను నుండును. ఇవి కడ్డివలెగట్టిగాలేవు. వీని పొడుగునను సొరంగములలో గాలియుండును. కావున ఆకులు నీటి మీద తేలును. కాడలు వంగగల్గుట చేతను సాగగల్గుటచేతను నీరు తగ్గినను హెచ్చిననను ఆకులు నీటి మీదనే తేలుచుండును. కాడ పత్రముతో గలియు చోట నెత్తుగాకణుపు వలెనున్నది. పత్రము రెండు వైపుల సన్నగా నుండును.

పుష్పమంజరి:- నీటి లోపలనుండి దీర్ఘమౌకాడపైకి వచ్చును. కాడ చివర నొక్కటే పుష్పముగలదు. పుష్పము వికసింపక మొగ్గగా నున్నప్పుడు నీళ్ళలోనే యుండును.

పుష్పకోశము:- రక్షక పత్రములు 4. నిడివి చౌకపు నాకారము. అడుగు ఆకు పచ్చగాను పైన తెల్లగా నుండును. నీచము.

దళవలయము:- ఆకర్షణ పత్రములు అసంఖ్యములు వృంతాశ్రితము తెల్లగా నుండును.

కింజల్కములు:- అసంఖ్యములు వెలుపల నున్నవి. వెడల్పుగాను ఆకర్షణ పత్రముల వలెను మాఱియు నుండును. వృంతాశ్రితము.

అండకోశము:- పుష్పపళ్ళెరములో దిగియున్నది. ఉచ్చము. చాల గదులు గలవు. ఒక గదు లో జాలగింజలుగలవు. కుడ్యసంయోగము గింజలకు బీజ పుచ్ఛముగలదు. కాయ కండకాయ.

కలువయు దామరయు నొకకుటుంబము లోనివే. ఈ కుటుంబపు మొక్కలన్నియు నీళ్ళలోనె పెరుగును. ఆకుల యొక్కయు పుష్పముల యొక్కయు గాడలు మిక్కిలి పొడుగుగా నుండును. వీని యందు గాలి యుండుటకు సొరంగములుకలవు. వీనిలో బుష్స్పములు పూచెడు కాడకు నొక్కటే పుష్పముండును. ఇందు నాకర్షణ పత్రమును కింజల్కములును బెక్కులు గలవు. అండాశయములు కూడ జాల యున్నవి. వీని గదులలో సన్నిగోడలనుండియు గింజలు పుట్టుచున్నవి.

కలువమొక్క ప్రతిచెరువులోను దొరువులోను బెరుగగలదుగాని తామరమొక్క పెరుగ జాలదు. ఇవి రెండును అందమునకు బ్రసిద్ధి కెక్కినవి. కలువల లోను, దామరల లోను తెలుపు, ఎరుపు, నలుపు భేదములచే మూడు తెగలు గలవు. కలువ కంటే దామరయే యెక్కువ యందముగా నుండును. తామరపువ్వు విష్ణునాభి యందుండి యుత్పత్తియైన దనియు, లక్ష్మికి వాసయోగ్యమయిన గృహమనియు గాధలుండుట చే దాని యందు భక్తియు గలుగుచున్నది. కలువ సాయంత్ర మందును, దామర ప్రాతఃకాలమందును వికసించుననుట కవి సమయముగాని యదార్థము గాదు. కలువ పువ్వు పెక్కు గదులు కలిగిన నొక కాయనే కాచును. తామర వుప్పులో గదులన్నియు విడిపోయి పెక్కు కాయలు కాచును. వీని రెండింటికి నిదియే ముఖ్యభేదము.

ఎఱ్ఱకలువల వువ్వులరేకులు హృదయరోగములను నరముల నీరసము బోగొట్టును. పువ్వులఱేకులు మరగబెట్టి ఱేకులను నీళ్ళను గలిపి, ఒక గుడ్డలో వేసి పిండవలెను. ఈ వచ్చిన ద్రవములో బంచదార వేసి తిరిగి సగమగువరకును మరుగబెట్టవలెను. ఇప్పుడు దానిని మందుగ బుచ్చుకొనవచ్చును.

ఎర్రకలువగింజలు, అజీర్ణమునకును, వేళ్ళు జిగట విరేచనములు, రక్త విరేచనములకును బని చేయును. వీనినెండ బెట్టి పొడుముగొట్టి పుచ్చుకొనవచ్చును. ఇతర కలువలకును దామరలకును గూడ నీగుణములు గలవు. కాని అన్ని తెగలను గలిపి మందుచేయుట కంటే విడివిడిగా జేయుట మంచిది.


గసగసాల కుటుంబము


గసగసాలమొక్క 2 మొ. 4 అడుగులవరకు బెరుగును. కొమ్మలు విరిచిన తెల్లని పాలుగారును.

ఆకులు:- ఒంటరి చేరిక, లఘుపత్రములు. అండాకారము. తమ్మెలు గలవు కణుపు పుచ్చములులేవు. తొడిమ పొట్టిది. అంచునందురంపపు పండ్లు గలవు.

పుష్పమంజారి:- కణుపు సందులందుండి మధ్యారంభమంజరి. వృంతము పొడుగు పుష్పము పెద్దది. సంపూర్ణము సరాళము.

పుష్పకోశము:- రెండు రక్షక పత్రములు. నీచము. ఆకు పచ్చగా నుండును.

దళవలయము:- ఆకర్షణపత్రములు 4 వరుసకు రెండువంతున రెండు వరుసలు, అంచులు మడతలు మడతలుగానున్నవి. వృంతాశ్రితము. తెలుపు రంగు కొన్ని ఎర్రగా నుండును.

కింజల్కములు:- కాడలు వెడల్పుగానుండును. వృంతాశ్రితము పుప్పొడి తిత్తులు 2 గదులు.

అండకోశము:- ఆండాశయము ఉచ్ఛము. 1 గది అండములు పెక్కులు కుడ్యాశ్రితము కీలము లేదు. కీలాగ్రము గుండ్రము.