వృక్షశాస్త్రము/గసగసాల కుటుంబము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఎర్రకలువగింజలు, అజీర్ణమునకును, వేళ్ళు జిగట విరేచనములు, రక్త విరేచనములకును బని చేయును. వీనినెండ బెట్టి పొడుముగొట్టి పుచ్చుకొనవచ్చును. ఇతర కలువలకును దామరలకును గూడ నీగుణములు గలవు. కాని అన్ని తెగలను గలిపి మందుచేయుట కంటే విడివిడిగా జేయుట మంచిది.


గసగసాల కుటుంబము


గసగసాలమొక్క 2 మొ. 4 అడుగులవరకు బెరుగును. కొమ్మలు విరిచిన తెల్లని పాలుగారును.

ఆకులు:- ఒంటరి చేరిక, లఘుపత్రములు. అండాకారము. తమ్మెలు గలవు కణుపు పుచ్చములులేవు. తొడిమ పొట్టిది. అంచునందురంపపు పండ్లు గలవు.

పుష్పమంజారి:- కణుపు సందులందుండి మధ్యారంభమంజరి. వృంతము పొడుగు పుష్పము పెద్దది. సంపూర్ణము సరాళము.

పుష్పకోశము:- రెండు రక్షక పత్రములు. నీచము. ఆకు పచ్చగా నుండును.

దళవలయము:- ఆకర్షణపత్రములు 4 వరుసకు రెండువంతున రెండు వరుసలు, అంచులు మడతలు మడతలుగానున్నవి. వృంతాశ్రితము. తెలుపు రంగు కొన్ని ఎర్రగా నుండును.

కింజల్కములు:- కాడలు వెడల్పుగానుండును. వృంతాశ్రితము పుప్పొడి తిత్తులు 2 గదులు.

అండకోశము:- ఆండాశయము ఉచ్ఛము. 1 గది అండములు పెక్కులు కుడ్యాశ్రితము కీలము లేదు. కీలాగ్రము గుండ్రము.


బ్రహ్మదండి.

బ్రహ్మదండి సాధరణముగ నన్ని నేలలలోను బెరుగును. ఇదియును చిన్న మొక్కయె. గుల్మము.

ఆకులు:- ఒంటరిచేరిక తొడిమలేదు. పక్షివైఖరి తమ్మెలు గలవు. చ్చేదితము. తెల్లని చారలు గలవు పత్రముల మీద ముండ్లున్నవి.

పుష్పమంజరి:- కణుపు సందుల నుండి బయలు దేరును. పువ్వులు సరళము, సంపూర్ణము, పసుపు పచ్చని రంగు.

పుష్పకోశము:- రక్షక పత్రములు రెండు నీచము ఆకుపచ్చ రంగు.

దళవలయము:- 4 ఆకర్షణ పత్రము వృంతాశ్రితము పసుపు రంగు.

కింజల్కములు:- అసంఖ్యములు వృంతాశ్రితము.

అండకోశము:- అండాశయము ఉచ్చము 1 గది పెక్కుఅండములు. కుడ్య సంయోగము కీలము పొట్టి కీలాగ్రము గుండ్రము.

ఈ కుటుంబము చిన్నకుటుంబము. దీనిలోని మొక్కలన్నియు గుల్మములే. పెద్ద చెట్లు లేవు. ఈ మొక్కలు కూడ మనదేశమందు తక్కువయె. ఆకులు ఒంటరి చేరిక, కణువు పుచ్ఛములుండవు. పుష్పకోశపు తమ్మెలుగాని రక్షక పత్రములు గాని రెండును ఆకర్షణ పత్రములు. కింజల్కములు నాలుగు చొప్పున నుండును. అండాశయము 1 గది.

ఈ కుటుంబములోనికెల్ల గసగసాల మొక్కయె మిక్కిలి యుపయోగమైనది. వీనిపంటవలన జాలలాభము వచ్చును. గసగసాల కాయల నుండియే నల్లమందు చేయుదురు.

దీని పంట ఎక్కువగా హిందూస్థానమునందు గలదు. అచ్చట వరి కోసి కుప్పలు వేసిన తరువాత గసగసాలను జల్లుటకై దున్నుట ఆరంబించుదురు. పది దినములకొక మారు చొప్పున నెలపదునైదు దినముల వరకు దున్నుచుందురు. వరికి బనికి వచ్చు నేలలే దీనికి పనికి వచ్చును. ఇట్లు ఎరువు వేయుచు దున్నిన పిదప ఎనిమిదడుగుల పొడగుగను నాలడుగులు వెడల్పుగను మళ్ళు చేయుదురు. గసగసాలని ఒక రాత్రి నీళ్ళలో నాన బెట్టి ఈ మళ్ళలో జల్లుదురు. అవి వారము దినములకు మెలకెత్తును. 5..... 6 అంగుళములెదిగిన తరువాత నీరసముగా నున్నవని తోచిన వానిని పెరికి వేయుట మంచిది. మరి కొంచమెదిగిన తరువాత మొక్కలు మిక్కిలి దగ్గర దగ్గరగా నున్నవని తోచిన యెడల దీసి దూరముగా పాతెదరు. తరువాత, కాయలు కాచు వరకు అప్పుడప్పుడు నీరు పెట్టుచుండ వలెను. ఈ మొక్కలు మూడు నెలలలోనె ఎదిగి పుపుష్పించును. పుపుష్పించిన మూదవ నాడు పువ్వుల రేకులను గోసి వేయుదురు. తరువాత పది దినములకు కాయలు పెద్దవగును.

ఈ కాయల నుండియే నల్ల మందు జేయుదురు. కాయలు గోసిన నాడో మరునాడో మధ్యాహ్నము వేళ కాయల నొక పనిముట్టుతో మనము అల్చిప్పతో మాడికాయ దీసినట్లు గీయుదురు. ( ఈ పని ముట్టు నాలుగు కత్తులను మిక్కిలి దగ్గరదగ్గరగాచేర్చి నట్లుండును) ఇట్లు గీసిన చారలలో నొక ద్రవము చేరును. ఈ ద్రవమును నొక పాత్రలోనికి చేర్చి నిలువ చేయుదురు. ఇదియే నల్లమందు.

దీనిలో మరియొక రసము గలిపి గాని కాయల పొప్పర వేసి గాని దగాచేయు చుందురు. కాని మరియొక తైలము గలిపినను నల్లమందు నిలువయుంచగ నుంచగ నన్య పదార్థము పోయి మంచిదే యగును.

గసగసాల పంటయు నల్లమందు వ్యాపారమును చిర కాలమునుండి మన దేశమున జరుగు చుండెను. అప్పటి నుండియు చీనా దేశమున కెగుమతి యెక్కువాగా జేయుచున్నాము. బాబరు మొదలగు మొగలాయి చక్రవర్తుల కాలములో నల్ల మందు మీద పన్నున్నట్లు దెలియు వచ్చుట లేదు. డచ్చి, ప్రెంచి, ఇంగ్లీషు వారలు మన దేశమునకు వర్తకమునకు వచ్చిన తరువాత, మన వర్తకుల వద్ద గొనుక్కొనుచు, ఎగుమతి చేసి కొనుచుండిరి. మన వర్తకులు రైతులకు సొమ్ము పెట్టు బడి పెట్టి తామిచ్చిన సొమ్మునకు బదులుగా నల్లమందును గైకొనుచుండిరి. మిగిలిన నల్లమందులో నేవోకలు వుచు రైతులమ్ముకొను చుండిరి. వీరిట్లు కల్తి గల్పుట చేతను ధరలలో హెచ్చు తగ్గులు వచ్చుట చేతను, ఈ యల్లరి పడలేక ఈష్టు ఇండియా కంపెని వారు నల్లమందు వ్యాపారము తామె భరింప వలసిన వారైరి. వారను హేస్టింగును వేలముల పద్ధతి పెట్టెను. దాని మూలమున నొక వర్థకుడొక పొలమును 4 వేలకో 5 వేలకో వేలము పాడి పండించు పండించుమని. రైతులను బాధ పెట్టుచు వచ్చెను. కాని రైతునకు లాభమంతగా నుండమిచే నిర్లక్ష్యముచేయుచు వచ్చె, వ్యాపరము తగ్గెను. ఇట్టి బాధల తగ్గించుటకై ఎట్టకేలకు గవర్నమెంటు వారు నల్ల మందు వ్యాపారమంతయు దాము స్యయముగానే యంగీకరింప వలసిన వారైరి. నల్లమందుకు బ్రమత్తుని జేయు గుణము గలదు. నూనె మొదలగు కొన్ని పదార్థములతో దిన్నచో మరణమును సంభవించును. కనుక, మన శ్రేయస్సును గోరి గవర్నమెంటు వారీ నల్ల మందునందరికంద నీయక దానిపై ఎక్కువ పన్ను విధించిరి. కాని నల్లమందు పై నెట్టి నిభందన లేకున్నను దానినిష్టపడి తినువారు ఇంఘ్లాండు దేశములో మైమరచి త్రాగుచున్న యంత మంది యుండరని గొందరి నమ్మకము. ఏదేశమైనను మన మూలమున మన గవర్నమెంటు వారికి గలిగెడు లాభ నష్టముల నెరుంగుట మంచిది.

సంవత్సరము 1902-1903 1903-1904 1904-1905
నల్లమందు అమ్మకము వలన వచ్చిన సొమ్ము రూ. 54939000 రూ. 70175566 రూ. 76133115
పైరుచేసి, నల్లమందుచేసి ఉండలు చేసినందులకు ఖర్చు రూ. 9915495 రూ. 13070745 11236875


చైనా దేశస్థులిప్పుడు నల్లమందును నిషేధించుటచే మన వర్తకము తగ్గినది. అయినను ధరలెక్కువగనుండుట చే లాభము బాగుగనె వచ్చుచున్నది.


1909-1910 1910-1911 1911-1912
పౌ. 4424528 పౌ. 6275305 పౌ. 5231826


నల్లమందును గడుపునొప్పి విరేచనములు కట్టుటకు దఋచుగా వాడుదురు. దానికి నితర యుపయోగములు కూడ గలవు. కొందరు సదా భోజనమునకు ముండు మాత్రగా వేసికొందురు.

గసగసాలలో నీమత్తును గలుగ జేయు గుణములేదు. వాని యందొక సువాసనయు గలదు. నల్ల మందు తీయ ని కాయలలోని గింజలు మంచివి. ఈ గింజలనుండి నూనెదీయుదురు. దీనిని వంటలో గూడ వాడుదురు. మరియు జిత్రపటములు వ్రాయుట యందును బనికి వచ్చుచున్నది. గసగసాలను కొన్ని పిండి వంటలలోను తాంబూలములోను గూడ వాడుదురు.

బ్రహ్మదండి:- మొక్క ఎక్కడైనను బెరిగిన నూడబెరికిపారవేయు చున్నారుగాని దాని లాభము గమనించుట లేదు. దానివాడుకయు నెందుచేతనో యతగాలేదు. కాని గింజలనుండి తీసిన చమురు, తలుపులకును, బల్లలకును అన్ని చెక్కలకును మెరుపు దెచ్చును. చిత్రపటములు వ్రాయుటలోను బనికి వచ్చును. కొందరు తలనొప్పిని కూడ బోగొట్టు నందురు. ఈ నూనె కడుపు నొప్పులు మొదలగు వానిని బోగొట్టును. దీని యాకుల రసము పుండ్లను మానుపును.

నిజమైన బ్రహ్మదండి మొక్క వేరేయున్నదని కొందరు చెప్పు చున్నారు.