Jump to content

విక్రమార్కచరిత్రము/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

విక్రమార్క చరిత్రము

తృతీయాశ్వాసము

శ్రీకంఠకంఠనీల
ప్రాకామ్య ప్రశమన ప్రభాసితకీర్తీ!
శ్రీకాంతాధిప, విద్యా
సాకల్యవివేకనిపుణ జన్నయసిద్ధా!

1


ఆ.

మథురనుండి వచ్చి మదనరేఖాసూనుఁ
డన్నరేంద్రుఁ గాంచె నర్హభంగి
నిరుపమాన యైననిజలతాంగి యనంగ
సేనతోడ నాత్మ సేనతోడ.

2


క.

ఆభర్తృహరి నపారకృ
పాభావన విక్రమార్కపతి పాలింపం
బ్రాభవమునఁ గార్యరమా
వైభవుఁడై ప్రతిదినప్రవర్ధన మొందెన్.

3


క.

తద్రాజ్యమ్మున నధికద
రిద్రుం డగువిప్రుఁ డొకఁడు, శ్రీకాంక్ష మహేం
ద్రాద్రిపయిఁ దపము సేయఁగ
రుద్రుఁడు ప్రత్యక్షమయ్యె రుచిరాకృతియై.

4


తే.

ఇట్లు ప్రత్యక్షమై నీయభీష్ట మెద్ది
వేఁడు మిచ్చెద ననిన, నవ్విప్రవరుఁడు
సచ్చిదానందనిశ్చలస్వాంతుఁడై, ని
జాయురభివృద్ధి యగు వర మడుగుటయును.

5

ఉ.

ఒక్కఫలంబు చేత నిడి, యుత్తమ మీఫల మేకభక్ష్యమై
మిక్కిలి యాయు విచ్చు, నిది మృత్యుహరం బటుగాక తక్కినన్
ఒక్కఫలంబునుం గలుగకుండుఁ జుమీ యని యానతిచ్చి తా
గ్రక్కున రాజతాద్రిమణికందరమందిరసీమ కేగినన్.

6


ఉ.

భూసురవర్యుఁడున్ ఫలముఁ బొంది మహాప్రమదంబు నొంది, యా
వాసముఁ గూర్చి వచ్చి, నిజవల్లభ కత్తెఱఁ గెల్లఁ జెప్పినన్
గాసిలి భర్తవంకఁ గొఱగాములు పల్కి 'యి దేమి సిద్ధి' యా
భానున కేల చొప్పడుఁ దపఃఫలసంచితభాగ్యసంపదల్!

7


ఉ.

లేమిఁ దొలంగఁ ద్రోవఁగ నిలింపశిఖామణి నార్తలోకర
క్షామణిఁ గోరి ఘోరతరకాననభూమిఁ దపం బొనర్చి, నీ
వేమిఫలంబు వేఁడితి? వభీష్టఫలం బిది నిష్ఫలంబు, ని
న్నేమనుదాన! నింక నెటు లే మను దాన మహాదరిద్రతన్.

8


వ.

అని యత్యంతచింతాక్రాంత యైననిజకాంతం జూచి, యమ్మహీసురోత్తముఁడు దనచిత్తంబున.

9


ఉ.

నిక్కమ యట్ల లేమి, గడు నివ్వెఱ నివ్వర మేల వేఁడితిం
దక్కక యేను శంకరు, నతం డివి యేటికి నిచ్చె, నాతలం
పెక్కడ వమ్మునం గలసె, నేమిటికై తపమాచరించితిం,
బెక్కుదలంపు లేల నిఱుపేదల కబ్బునె యిష్టసంపదల్?

10


చ.

ఇది గొనిపోయి భర్తృహరి కిచ్చెద, నిచ్చిన నాతఁ డాయుర
భ్యుదయముఁ బొంది యుండు నది యొప్పదె, దాతలు వృద్ధిఁబొందఁగా
మదిఁ దలపోయునాశ్రితసమాజము నొందవె యిష్టసంపదల్,
హృదయ మెలర్ప నిట్టిఫల మిచ్చిన, నిచ్చునతం డభీష్టముల్.

11


చ.

అని తలపోసి, భర్తృహరి నంచితకీర్తినిధానుఁ గాంచి, యా
వినుతఫలప్రభావము సవిస్తరతం దగ విన్నవించి యి
చ్చిన, నతఁ డిచ్చె విప్రున కచింత్యము లైన ధనంబు లిమ్ములం,
[1]దనపురి కేగి యాతఁడు ముదంబున నుండె రమాసనుగ్రతన్.

12

వ.

అమ్మదనరేఖానందనుండును దనవమీపంబున సమాసీనయైన యనంగసేనం గనుంగొని.

13


క.

కూరిమి మీఱఁగఁ జేరం
జేరిచి, సర్వజ్ఞుకరుణఁ జేరె నటంచున్
ధారుణిసుపర్వుఁ డొసఁగె, న
పారతపోలబ్ద మైనఫల మిది మనకున్.

14


క.

[2]నరుఁ డొకఁ డిది సేవించిన
మరణ జరాదులు దొఱంగి మను సంపదలన్
అరు దిట్టిఫలము, గన నీ
పరిపక్వఫలంబు భాగ్యఫలము లతాంగీ!

15


క.

కావున నాకుఁ బ్రియంబుగ
నీ వీ ఫల మనుభవింపు, మిదె కొమ్మని సం
భావన నిచ్చినఁ గొని చని
యావనితయు నిచ్చెఁ గూర్చుహయపాలునికిన్.

18


క.

అమ్మందురకుఁడుఁ దద్గృహ
సమ్మార్జన కిచ్చె, సంతసంబున నదియున్
గ్రమ్మన గోపున కిచ్చెఁ, బ్రి
యమ్మున వాఁడును గరీషహారిణి కిచ్చెన్.

17


ఆ.

ఆలమందనుండి యది మఱునాఁడు ప్ర
త్యూషవేళఁ దాఁ గరీషపూర్ణ
వేణుపాత్రమీఁద వెలయఁ బం డిడుకొని
యాత్మగేహమునకు నరుగునపుడు.

18

వ.

సకలసైన్యసమేతుండై వాహ్యాళివిహారంబున కరుగుచున్నభర్తృహరికిం దత్ఫలంబు దృష్టిగోచరం బగుటయు.

19


ఆ.

దానిఁ జేరఁ బిలిచి, తత్పాత్రలోనున్న
పండు పుచ్చుకొని యతండు నగుచు,
వెండి యొక్కపండు విప్రుఁ డెప్పుడొ తెచ్చి
తనకు నీక, యమ్మికొనియె ననుచు.

20


ఉ.

అప్పుడు విప్రు రాఁ బనిచి యవ్విభుఁ డిట్లను, రెండుపండ్లు నీ
వప్పరమేశుచేఁ బడసి యందొకఁ డిచ్చి యొకండు దాఁచుకో
నిప్పుడ కానవచ్చెఁ, జనునే యిటు వంచన సేయ? నన్న వా
[3]తప్పక యాఫలంబె, వసుధావర దీనికి నెట్లు చేరెనో!

21


వ.

అనిన విని యన్నరేంద్రుండు.

22


క.

గోమయహారిణిఁ గనుఁగొని
యేమిగతిన్ దొరకె నీకు నీఫల? మనుడున్
ఆమగువ దెలుపఁ క్రమమున
నామర్మము దెలిసెఁ దత్తదంతరసరణిన్.

23


వ.

అత్తెఱం గంతయుఁ గరతలామలకంబుగా నెఱింగి.

24


క.

తనప్రియకాంత యొనర్చిన
యనుచితకర్మశిఖి, యంతరంగము నంగం
బునఁ బరితాపము సేయఁగ
వనజాతేక్షణల రోసి, వసుధేశుఁ డనున్.

25


మ.

[4]హరిణీలోలవిలోచనామధురలీలాలాపరీతుల్, మనో
హరకేళీనవరూపయౌవనమదవ్యాపారముల్, రాగసా
గరనిర్మగ్నులఁ జేయవే మగలఁ! దత్కౌతూహలంబు న్మదో
ద్ధురదంతిశ్రవణానిలం, బని తలంతు ర్గాదె మేధానిధుల్.

26

క.

గురుపాతకముల గురువులు
పురుషులు నరకములు చేరఁబోయెడు తెరువుల్
పరిభవము ననుఁగుఁబొరువులు
తరుణుల మైసిరులయురులు తగునచ్చెరువుల్.

27


క.

జాతులు నాతుల కెందున్
నీతము లేనిక్కుఁ 'గామినీలోకానాం
జాతిః ప్రకల్పితా' యను
నీతి పురాతనమె కాక! నేఁటిదె యరయన్.

28


ఉ.

మక్కువ తీపులుట్టిపడుమాటలుఁ, జొక్కుల తేలగింపులుం
ద్రెక్కొనుచూపు, లాసతరితీపులు, కోరిక లార్తియీరికల్
మ్రొక్కులు కూర్మిచిక్కు, లతిమోహ మపోహము, రూపశీలముల్
తక్కులయాలవాలములు, దాయుదురే తరుణీజనంబులన్?

29


ఆ.

అని తలంచి, భర్తృహరి విరక్తి వహించి
యోగమార్గసంప్రయోగమునకు
ధరణివిభునిచేతఁ దగ ననుజ్ఞాతుఁడై
యేగుచుండి, యతని కిట్టు లనియె.

30


భర్తృహరి విక్రమార్కునకు బహుశ్రుతుఁడను మంత్రివృత్తాంతము చెప్పుట

క.

కృతయుగకలియుగములలో
మతిఁ దలఁపఁగఁ గలియుగంబ మానితధర్మ
స్థితి నెక్కుడు, భవదవన
వ్యతికరమున సాహసాంక వసుధాధీశా!

31


క.

తనబుద్ది యొక్కకన్నును
నొనరినహితమంత్రిబుద్ది యొకకన్నునుగా
గని సంచరింపనేరని
జననాథుని జగము దెగడు జాత్యంధునిగాన్.

32


తే.

మహితమతి బహుశ్రుతుఁ డనుమంత్రి యొకఁడు
తనవిభుఁడు నందుఁ డనఁబడుధరణిపతికి

బ్రహ్మహత్య వచ్చిన నది పరిహరించె
బతికిఁ గడుమంత్రికంటెను హితుఁడు గలఁడె?

33


క.

నావుడు నందమహీపతి
కేవెరవున బ్రహ్మహత్య యేతెంచెఁ? దుదిన్
శ్రీవిలసితుఁడు బహుశ్రుతుఁ
డేవెరవునఁ బరిహరించె నెఱఁగింపు తగన్.

34


వ.

అనిన నతం డతని కిట్లనియె.

35


క.

లాలితమణిమయగోపుర
సాలప్రాసాదసదనసంశోభితమై
భూలోకనాక మనఁగ, వి
శాలాపుర మొప్పు విబుధసంభావితమై.

36


క.

ఆ నగర మేలు నందుఁడు
భానుమతీదేవి తనకుఁ బ్రాణేశ్వరీగా
ధీనిధి బహుశ్రుతుండు ప్ర
ధానుఁడుగా, గురుఁడు శారదానందుఁడుగన్.

37


క.

ఆనందమహీవల్లభుఁ
డానందరసార్ద్రహృదయుఁ డై, యేప్రొద్దుం
దానగరు వెడల కుండును
భానుమతీమోహపాశబద్ధుం డగుటన్.

38


క.

జక్కువకవ పెక్కువయగు
మక్కువతో, రేయుఁ బగలు మనుజాధీశుం
డక్కాంత దక్క నోర్వక
దక్కటికార్యంబు లెల్లఁ దక్కి చరించున్.

39


శా.

ఆరామామణితోడఁ గూరిమి నతం డత్యాస్థఁ గ్రీడించు సం
సారస్ఫారసుభైకసారసురతేచ్ఛాపూరనిర్మగ్నుడై,

యారామాంతరకేళివర్వతగుహాహర్మ్యాంతరాళంబులం
గీరాలాపమదాలిగీతవిలసత్క్రీడానివాసంబులన్.

40


సీ.

ఆత్మావనీమండలాసక్తిఁ బెడఁబాసి
        లలనానితంబమండలముఁ బొదువు
భద్రేభకుంభసంస్ఫాలనం బొల్లక
        భామవక్షోజకుంభములఁ బుణుకు
బాణప్రయోగపారీణత యొల్లక
        నారీకటాక్షబాణముల సొగయు
నిజరాజ్యతంత్రైకనిష్పత్తి యొల్లక
        భామినీరతితంత్రవరతఁ బొరలు


తే.

శిష్టజనసూక్తు లవి పెడచెవులఁ బెట్టి
తెరవసురతప్రియోక్తుల తీపి గోరు
నఖలభూభారవహనకృత్యములఁ దొఱఁగి
నందుఁ డంగనాధీనమనస్కుఁ డగుచు.

41


వ.

అంత బహుశ్రుతుఁడు తనమనంబున.

42


ఉ.

మేదినిఁ దొంటిరాజులు రమింపరె యింతులయందు సక్తులై,
యీదశ రాజ్యతంత్రరహితేచ్ఛ రమింపరుగాక; యట్లె కా
యేదెసనిల్చిన న్నిలిచె నేదెసఁ బాఱినఁ బాఱెఁ గాక, యౌఁ
గాదని వంకలొత్తఁ దిలకంబులె రాజులచిత్తవృత్తముల్.

43


చ.

అని తనయిచ్చలో వగచి, యన్నరపాలునితో వినీతిగో
పనమతి మంత్రి యిట్లనియె, భానుమతీరతిమోహపాశబం
ధనములఁ జిక్కి యిట్లునికి ధర్మమె? కొల్వున కేగుదెంచి మ
న్ననఁ బ్రజవిన్నపంబులు వినంగదవయ్య నృపాల వేఁ డెదన్.

44


చ.

అమలసమస్తవస్తునిచయాస్పద మైనధరిత్రి, రాణివా
సమును, సుతుల్, సురత్నములు, సాధుజనస్తుతుఁ డైనభూవరో
త్తమునకు నాదిరాజచరితల్ జవరాలు వరాలుఁ గూడ నా
ల్గుమణులటంట సిద్ధ, మిది లోకవిరుద్ధము గాదె యియ్యెడన్?

45

ఉ.

నావుఁడు మంత్రివర్యునకు నందమహీపతి ప్రీతి నిట్లనున్
దేవిఁ దొఱంగి యొంటిఁ జనుదెంచి వెలిం గొలువుండ నోప, నా
దేవియు నేను గూడఁ జను దెంచుట యుక్తము గాదె, పాసినన్
జీవముఁ బాయువాఁడఁ, గట చిత్తజుబారికి నోర్వవచ్చునే!

46


క.

ఒకరే యొక్కమహాయుగ
మొకదిన మొకబ్రహ్మకల్ప, మొకగడె యొకయేఁ
డొకనిమిషం బొకదిన మ
వ్వికచాబ్జముఖీవియోగవేదన నాకున్.

47


సీ.

కైసేసి చెలువ నాకడ నల్ల నిలిచిన
        నంగజశ్రీఁ జూఱలాడఁ జూతు
నలవోక నువిద న న్నరగంటఁ జూచిన
        నీరేడుజగముల నేలఁ జూతు
నింతికౌఁగిట నున్న నిందిరావల్లభు
        సౌభాగ్య మలఁతిగా సంస్మరింతు
కొమ్మ లేఁజిగురాకుఁ గెమ్మోవి చవిగొని
        యమృతంబు నీరస మని తలంతు


తే.

జలజనేత్రపైఁ గూర్మి సంసారఫలము
చంద్రముఖతోడికూటమి జన్మఫలము
లలనరతిరాజసామ్రాజ్యలక్ష్మితోడ
రాజ్యలక్ష్మీవిలాసగౌరవము సరియె?

48


ఉ.

కన్నులు గండుమీలుఁ దొలుకారుమెఱుంగులుఁ గాముబాణముల్
చన్నులు కుంభికుంభములు సంపెఁగబంతులు జక్రవాకముల్
ప్రన్ననిమేను పుష్పలత పై ఁడిసలాక ప్రసూనసాయకం
బన్నలినాక్షిఁ బాసి విరహవ్యథ నొంటిఁ జరింపవచ్చునే!

49


క.

ఏనొక నిమిషంబైనను
భానుమతీదేవిఁ బాసి ప్రాణముఁ బట్టం
గానోప, నీవిచారము
మాను, మనిన మంత్రి యనియె మనుజేశ్వరుతోన్.

50

ఉ.

విన్నప మాదరింపు పృథివీవర! దేవిఁ దొఱంగ నోపవే
నన్నలినాయతాక్షిరుచిరాకృతి చిత్రపటంబునం గడుం
జెన్నెసలార వ్రాసి యది చేరువ నుంచినఁ దద్విలాసరే
ఖోన్నతిఁ జూచుచున్ దినము నొక్కముహూర్తము నిల్వుకొల్వునన్.

51


చ.

అని నరనాథుసమ్మతి మహామతి మంత్రి బహుశ్రుశుండు స
య్యన నొకచిత్రకారుని మహాలఘుహస్తునిఁ బిల్చి, వ్రాయఁగాఁ
బనిచిన వ్రాసె నత్తరుణిభావము కర్వునఁబోసినట్లు వే
ర్కొనఁదగురూపమైన యనురూపమనోహరచిత్రరూపమున్.

52


తే.

ఇట్లు చిత్రకారుఁడు రచియించినట్టి
చిత్రరూప మాలోకించి, చిత్రరూప
విభ్రమాసక్తచిత్తుఁడై వెఱఁగునొంది
తాను జిత్రరూపాకృతిఁ దాల్చె విభుఁడు.

53


ఉ.

ఇమ్మెయి విస్మయాకులితహృత్కమలుం డయి, చిత్రరూపముం
గ్రమ్మఱఁ జూచి చూచి పులకంబులు దాల్చి చెమర్చి, కన్నుల
న్సమ్మద వారి గ్రమ్మ, వదనంబున లేనగ వంకురింపఁగా
నెమ్మిఁ దదీయరూపరమణీయత వెండియుఁ జూచు నాదటన్.

54


వ.

ఇట్లు చిత్రరూపావలోకనవినోదంబు సలిపి, యందుఁ దనడెందంబు పరమానందంబు నొందఁ, దన కౌతూహలంబు గురున కెఱింగింపఁ దలంచి తత్పటంబుఁ బంచిన, నాచిత్రసౌందర్యంబుఁ గనుంగొని శారదానందుండు.

55


క.

ఈ చిత్రరూపరేఖా
వైచిత్రి ప్రశంస సేయ వశమే? దీనిం
జూచినను భానుమతినిం
జూచినయట్లయ్యె, నిట్టిచోద్యము గలదే!

56


చ.

అని కొనియాడి, దేవిరుచిరాకృతియం దొకమచ్చ పెందొడం
గనుఁగొన నొప్పు నీలమణికాంతి బెడంగయి, చిత్రకార! యీ

యనుపమచిత్రరూపమున యందు లిఖింపుము దాని నొప్పుగా,
ననవుడు నట్ల చేసి లఘుహస్తుఁడు కస్తురితోడఁ దూలికన్.

57


తే.

శారదానందగురుఁడు సుజ్ఞానపరుఁడు
వీడుకొలుపఁగఁ జని, నందవిభునిఁ గాంచి
చిత్రకారుఁడా తెఱఁ గెల్లఁ జెప్ప, విభుఁడు
వెలఁదితొడమచ్చ యేకాంతవేళఁ జూచి.

58


రాజు గురుని అంతఃపురద్రోహిగా శంకించి చంపఁ బనుచుట

క.

నందమహీపతి డెందం
బాందోళము నొంద, శారదానందుఁడు మ
చ్చం దగ నిలిపెం గదె, మ
త్సుందరితొడ నున్కి యెట్లు చొప్పడ నెఱిగెన్?

59


ఆ.

అంతిపురములోని కన్యులపేరిటి
పోతుటీఁగనైనఁ బొలయకుండ
నాజ్ఞ వెట్టి, శారదానందగురునాజ్ఞ
పెట్ట నేరనైతి బేలనైతి.

60


క.

ఎంతజితేంద్రియు లైనను
నెంతసదాచారు లైన, నేకాంతమునం
గాంతలసంగతి నుండినఁ
గంతునికొంతాలపాలు గాకుండుదురే!

61


క.

ఏకాంతంబునం గదిసిన
యాకాంతుం డల వసిష్ఠుఁడైనం గానీ
యాకాంత సీత గానీ
వేఁకరుగరె యగ్గిపొంత వెన్నయుఁ బోలెన.

62


చ.

అని తలపోసి నందవిభుఁ డప్డ బహుశ్రుతుఁ బిల్వఁ బంచి, య
య్యనఘచరిత్రుతోడ హృదయవ్యథ యెల్ల నెఱుంగఁ జెప్పి, చ
య్యనఁ గొనిపోయి యీ యఘమయాత్ముని ఘోరవిధిం వధించి ర
మ్మనవుడుఁ బూరుషార్థముగ నవ్విభుతోడ బహుశ్రుతుం డనున్.

63

తే.

ఎంతపాపాత్ముఁడైన మహీసురుండు
హింస కర్హుండు గాఁడని యెఱిఁగి యెఱిఁగి
మహితచారిత్రు గురుఁ బరామరిక లేక
చంపుమని పంపఁ దగునయ్య సదయహృదయ!

64


తే.

అనిన నెయ్యివోసినయగ్గియట్ల మండి
యవుడుకఱచి కోపారుణితాక్షుఁ డగుచు
నుగ్రదృష్టిఁ జూచిన, నాబహుశ్రుతుండు
వెఱచి వేగమ గురుఁ బట్టి విఱచికట్టి.

65


క.

పురజను లెల్లఁ గనుంగొని
పురపురఁ బొక్కంగ, వధ్యభూమీస్థలికిం
ద్వరితగతిం గొనిచని, య
గ్గురుహింస యొనర్ప మనసు గొలుపమిఁ దనలోన్.

66


తే.

దేవితొడమచ్చ నిజదివ్యదృష్టి జూచి
చిత్రరూపమునం దది చెలువు మిగుల
వ్రాయఁ బంచిన, నీచేటు వచ్చెఁగాక
యితని సుచరిత్ర మెవ్వరు నెఱుఁగ రెట్లు.

67


ఉ.

రా జవివేకియై, నిరపరాధు మహీసురవర్యునిన్ జగ
త్పూజితుఁ బుణ్యవర్తను విధూతనమజ్జనకల్మషున్ వధూ
వ్యాజమున వృథా కుపితుఁడై వధియింపఁగఁ బంపె, దీని నే
యోజఁ దొలంగఁ ద్రోతు గురు నుత్తము నెమ్మెయిఁ గాతు దైవమా.

68


క.

ఏమియుఁ గానఁడు పతి కాం
తామగ్నుఁడు గానఁ. గార్యతతి యెట్టిదియో
[5]‘కామాంధోహి నపశ్యతి’
నా మును వినఁబడినపలుకు నైజమ కాదే!

69

చ.

పతి మతిమాలి, కానిపనిఁ బంచినఁ జేయఁగ నుత్సహించినన్,
హితమతియై యమాత్యుఁడు సహింపఁ గుదించియు నడ్డగించియుం
బతియపకీర్తిదోషములు పాపి చరించుట నీతి గాన; నే
నితని నిగూఢవృత్తి భరియించెదఁ గాకని నిశ్చితాత్ముఁడై.

70


మంత్రి గురువును దాచియుంచి రాజుతో జంపితినని చెప్పుట

ఉ.

కట్టనకట్టు లూడ్చి, యనుకంప దలిర్పఁగ భూగృహంబునం
బెట్టి, ప్రియోక్తులన్ గురు నభీతమనస్కునిఁ జేసి, పాపమే
పట్టన లేమిఁ దేటపడ బల్కి మనోవ్యథఁ బాపి, సర్వముం
గట్టడచేసి పెట్టి, నృపకౌశికుఁ డున్నెడ కేగి యిట్లనున్.

71


క.

దేవరయానతి జగతీ
దేవనిధానంబు వసుమతీనాథ! కృతాం
తావాసవాసుఁ జేసితి
నావుడు, విని నందవిభుఁడు నందితుఁ డయ్యెన్.

72


రాజపుత్రుఁడు వేఁట కేగుట

క.

ఆలో నొకనాడు, మహీ
పాలునిప్రియసుతుఁడు, విజయపాలుం డను దు
శ్శీలుఁడు, మృగయాలోలత
వ్యాలమృగాభీల మైనవనమున కరిగెన్.

73


తే.

ఏగునెడ దుర్నిమిత్తంబు లెన్ని యేని
గనియు వినియు నిశ్శంకతఁ, జనకు మనుచు
దొరలు నిల్పిన నిల్వక, దుర్నిమిత్త
ఫలము ముందటి కెఱఁగికోవలయు ననుచు.

74


వ.

ఇట్లు నీతిదూరుం డగు నా కుమారుండు దురహంకారుండై, యపారసత్త్వభయంకరసంచారం బగుకాంతారంబు దఱిసి, బహుప్రకారమృగయావిహారంబు లొనరించు చున్నసమయంబున.

75


ఉ.

కొండొకవాలముం, గుఱుచకొమ్ములు, నన్నువ లైనవీనులున్,
నిండిననీలమేఘరుచి, నెక్కొను నున్నతదీర్ఘదేహముం,
జండతరాస్యమండలము పర్వభయంకరలీలఁ గ్రాలఁగాఁ
దొండము లేనిభద్రకరితో నెన యైనవనీవరాహమున్.

76

ఉ.

ముందట దవ్వులం గని, సముద్ధతి నశ్వముఁ దోలుకొంచు నా
పందిపిఱుందఁ బోవ, నది పాఱి లతాగహనంబు చొచ్చినన్,
మందవిచారుఁడై నృవకుమారుఁ డొకండును నేగి దాని నం
టం దఱిమెన , వరాహము కడంకఁ దిరోహిత మయ్యె నయ్యెడన్.

77


ఉ.

పంది మొఱంగిపోయిన, నృపాలతనూజుఁడు చిన్నవోయి, మ
ధ్యందినవేళ నొక్కసలిలాశయముం గని వాజి డిగ్గి, తా
నందుఁ గృతావగాహుఁడయి, యాగళపూరితతోయమందుఁ దృ
ప్తిం దురగంబు తాను వడఁ దేఱి; మహాతపభీతి నయ్యెడన్.

78


ఉ.

కొండొకసేపు నిల్చి చనుకోరిక, రాకొమరుండు పద్మినీ
షండసుగంధమారుతవశస్ఫుటశీకరసిక్తమంజరీ
మండితభూరిభూరుహసమావృతమైన వటంబునీడఁ గూ
ర్చుండె, ఖలీనరజ్జువున నొక్కెడ నశ్వముఁ గట్టి యిమ్ములన్.

79


వ.

అయ్యవసరంబున, సర్వజగదాభిలం బగునొక్కశార్దూలంబు, తత్సమీపతరులతాకుంజపుంజంబుననుండి యమ్మనుష్యగంధం బాఘ్రాణించి, రౌద్రరసోద్రేకంబునం జనుదెంచి, బలువిడి లంఘింప నుంకించుటయు, బిట్టు పొడగని యిట్టు నట్టు నెగసి, వెనకకు నీల్గి కుప్పించి దాఁటిన ఖలీనంబు లూనం బగుటయు, హయంబు రయంబునం దనవచ్చినతెరువునం బడి పరువునం జనియె, నంత నక్కుమారుం డతిభీతుండై పరిసరమహీరుహంబు నారోహణంబు చేసె, నట్టియెడ.

80


సీ.

అమ్మహోగ్రవ్యాఘ్ర మమ్మహీజముక్రింది
        కుద్వృత్తి నేతెంచి, యొడుపు దప్పి
నప్పటిభుజగంబుననువున మ్రోఁగుచు
        వాల మల్లార్పుచు, వాఁడికోఱ
నదరులువాఱ నోరంతయుఁ దెఱచుచుఁ
        గన్నులఁ గోపాగ్నికణము లురల
మీఁదు సూచుచు మ్రానుమీఁదికి నుఱుకంగ
        జంకించు చుగ్రవిస్ఫారఘోర

తే.

వజ్రనిర్జాతపాతరవమ్ము గొలుపఁ
గాలుద్రవ్వుచు నుండెఁ దత్సాలమూల
మున, మొగంబున రౌద్రంబు మునుకొనంగ
విజయపాలుని చిత్తంబు విహ్వలింప.

81


చ.

దిగు లడరంగ నిట్లు, జగతీవరసూతి కుజంబు నెక్కుచోఁ
దగ నొకవృద్ధభల్లుకము తా నటమున్న వసించి యుండ న
య్యగవిపులాగ్రశాఖ: నతఁ డప్పుడు 'ముందట నుయ్యి వెన్క లోఁ
తగుగొయి' యున్నలా గయినఁ, దల్లడ మందె వణంకుమేనితోన్.

82


వ.

ఇట్లు దిగులువడి యున్నయన్నరేంద్రనందనుం గనుంగొని, యతని నుద్దేశించి కారుణ్యబుద్ధి నా వృద్ధభల్లూకంబు మనుష్యభాషణంబున మెల్లన నిట్లనియె.

83


చ.

వెఱవకు రాకుమార, పులి వెన్దగులం బఱతెంచి నన్ను నే
డ్తెఱ శరణంబు చొచ్చి తతిదీనత, నిట్టి మహాభయార్తులం
గుఱుకొని యెంతనిర్దయులుఁ గ్రూరత కోర్చి వధింవ నేర్తురే?
తొఱఁగుము చింత వంత, నను దుష్టుగఁ జూడకు మన్న నెమ్మదిన్.

84


వ.

అని పెక్కుభంగుల నక్కుమారుని భయంబు దీర్చి, తనసమీపంబునకుఁ జేర్చి యుచితోపచారంబు లొనర్చి, సారంబు లగు వన్యఫలాహారంబుల నాఁకలి దీర్చి, యనునయించి యున్నంత.

85


సీ.

పశ్చిమాంభోనిధిప్రాంతదేశంబున
        రంజిల్లు విద్రుమకుంజ మనఁగఁ
జరమాద్రిశిఖరదేశంబునఁ గనుపట్టు
        కమనీయఘనరత్నగండ మనఁగ
నపరదిక్కామిని యమరంగఁ గనుఁగొను
        పద్మరాగంపుదర్పణ మనంగ
పశ్చిమదిక్కుంభిఫాలభాగంబున
        బొలుపొందు జేగురుబొట్టనంగఁ

తే.

బూర్వకంధి వేలావనభూమిఁ బండి
కాలశుకతుండహృతి బిట్టుగదలి యపర
జలధిలోఁ బడుదాడిమీఫల మనంగ
నబ్జినీవనబాంధవుఁ డస్తమించె.

86


క.

తదవసరంబునఁ జుక్కలు
చదలం గలయంగ నొప్పెసఁగి నిగిడెఁ, గడుం
గదిరి నగగనశ్రీమెయి
నొదవిన ఘర్మాంబుకణసముత్కర మనఁగన్.

87


క.

అంతటఁ జీఁకటి యఖలది
గంతంబుల నిండఁ బర్వ, నయ్యెలుఁగు పరి
శ్రాంతుఁ డగునతనిభావం
బంతయు వీక్షించి, మది దయారస మొదవన్.

88


ఆ.

మేను మ్రానువడఁగ, మీలితోన్మీలిత
లోచనాంబుజయుగళుండ వగుచుఁ
దూఁగ నేల నాదుతొడలపై నెమ్మది
నిదురవోదు రమ్ము నృవకుమార!

89


చ.

అని, తనయంకపీఠిపయి నాతనిఁ జేరిచి నిద్ర పుచ్చె, నం
త నది యెఱింగి బెబ్బులి ముదం బెసలారఁగ నెల్గుతోడ ని
ట్లను, మది విశ్వసింపఁ జనునయ్య మనుష్యుల, నందు రాజనం
దనుల నొకింతయేనియు మనంబున నమ్ముదురయ్య యెయ్యెడన్?

90


క.

తన కొకయాపద వచ్చిన
గనికరమున దానిఁ బాసి కాచినయప్పు
ణ్యునకుం దుదిఁ గీ డొనరిం
పనె చూచుఁ గృతజ్ఞుఁ డెన్నిభంగుల నైనన్.

91

ఉ.

కావున, నిన్నరాధమునిఁ గైకొని నా కహితంబు సేయ నే
లా? వనసాహచర్యబహుళంబుగ బాంధవ మెట్లుఁ జూడ వే
లా? వధియించి వీనిపలలంబు సమాంశము నీకు నిచ్చెదం
ద్రోవుము నేలఁ గూల, నతిధూర్తులతోడి సఖత్వ మేటికిన్?

92


చ.

అని విని, వృద్ధభల్లుకము వ్యాఘ్రకులోత్తముతోడ నిట్లనున్
పెనుకొని నీవు చంపఁ దఱి వేచి వడిం జనుదేర, భీతిమై
నను శరణంబు వేఁడిన ననాతనబుద్ధిఁ బరిగ్రహించితిన్
విను, మనఘుండు పట్టి మఱి విడ్వఁగ నేర్చునె యెట్టివారలన్?

93


తే.

మరణభయమున వచ్చి నామఱువు సొచ్చెఁ
జంప నొప్పింపఁ గోపింపఁ జాల వీని
శరణువొందిన రక్షింపజాలియుండి
మనువకుండినకంటెఁ గల్మషము గలదె?

94


మ.

అనినం, బెబ్బులి చిన్నవోయి మఱి యొండాలాపము ల్మాని యుం
డె, నరేంద్రాత్మజుఁ డంత మేలుకొనియెన్; డెందంబునన్ రాజనం
దనుచొ ప్పారయ వేఁడి పేరెలుఁగు 'నిద్రన్ మేను తూఁగాడెడున్
నను నీయంకతలంబున న్నిదుర నూనం జేయవే వేఁడెదన్'?

95


చ.

అనవుడు, నిందు రమ్మని ధరాధిపసూతి నిజాంకపీఠియం
దునిచిన, నిద్ర వోయినటు లుండెఁ జలింపక భల్లుకంబు శౌ
ర్యనిరతి, నంతఁ గ్రోల్బులియు నానృపనందనుతోడ నల్ల ని
ట్లను, నిది యేఁ దొలంగి చనునప్పుడు ని న్వధియించు నెమ్మెయిన్.

96


చ.

హితవరిమాట లాడి తుది నెగ్గొనరింపనె కాఁచియున్న, యీ
కితనపువృద్ధభల్లుకము కృత్రిమమైత్త్రి నిజంబుగాఁ దలం
చితి, నరమాంసభక్షణము జీవికగా మనుకష్టజీవి న
మ్మితి, వనుకూలశత్రు లగు మిత్త్రుల నమ్ముదురయ్య యెయ్యెడన్?

97


తే.

తొడలపై నిద్రవోయెడు దుష్టమృగముఁ
గొంకుకొసరు లే కిటు నేలఁ గూలఁద్రోవు

దీనిరక్తమాంసంబులఁ దృప్తిఁ బొంది
తొలఁగిపోయెద, నీవుఁ బో దొసఁగు మాలి.

98


ఆ.

అనినఁ జపలబుద్ధి యానృపాలకసూతి
పులిదురుక్తు లాత్మఁ గలఁపఁ గలఁగి;
భల్లుకంబుఁ బట్టి పడఁద్రోసె, నదియును
బడక యొక్కశాఖఁ బట్టి నిలిచె.

99


చ.

పరహితకారి కెందు ననపాయశుభంబులు వొందుఁ, జాల ము
ష్కరు లగుక్రూరకర్ము లపకారము సేయఁదలంచిరేని న
ప్పురుషవరేణ్యుఁ గీ డొకటి బొందునె? తేజము దక్కఁ ద క్కిరుల్
పొరయునె లోకబాంధవు నపూర్వమనోభవు సప్తసైంధవున్?

100


ఆ.

అంత విజయపాలుఁ డతిభీతచిత్తుఁడై
వెల్లఁబాఱు టెఱిఁగి, భల్లుకంబు
కరుణ నిన్ను మున్ను గాఁచితి నింక నీ
వెట్టివాఁడవైన నెగ్గు దలఁప.

101


క.

వెఱవకు నెమ్మది నుండుము
పెఱవారలబుద్ధు లాత్మఁ బెట్టునె యనఘుం
డొఱపిఁడిచాడ్పున, నామది
నఱమర లేదొండు నమ్ము మనియె నరేంద్రా!

102


తే.

అంతఁ జీఁకటి బెబ్బులియాసలెల్ల
బాసి పోయినకైవడిఁ బాసి పోవ
విజయపాలుని నెమ్మోము విన్నఁబోయి
తెల్లవాఱనకైవడిఁ దెల్లవాఱె.

103


క.

అప్పట్టు విడిచి యప్పుడ
చప్పుడు గాకుండఁ బులియుఁ జనె వేగమ దా
నెప్పుడు నుండెడు నెలవున
కప్పుడె యానృపతిసుతుఁడు హర్షము నొందెన్.

104

వ.

అంత.

105


సీ.

సకలలోకంబులుఁ జక్రవాకంబులు
        నుల్లాసవారాశి నోలలాడ
నంధకారంబులు నలచకోరంబులు
        సొబగేది గొందులు సొచ్చి డాఁగ
నయనకంజంబులు నలినపుంజంబులు
        సువికాససంపద సొంపుమిగుల
రాయంచదాఁటులు మ్రోయులేఁదేటులు
        గృహసరోవరములఁ గేలిసలుప


ఆ.

విమలతారకములు వివిధకోరకములు
నచ్చటచట నల్లనల్ల విరియ
హల్లకములు బుధులహస్తముల్ మొగుడంగఁ
బూర్వశిఖరిమీఁదఁ బొలిచె నినుఁడు.

106


భల్లుకము శాపమున రాజకుమారునకు మతిభ్రమ కలుగుట

వ.

అట్టియెడ నన్నరేంద్రనందనుఁడు మున్నుగా ఋక్షంబు వృక్షంబు డిగ్గి, వానిచేసిన యపకారంబునకుఁ దగినశాపం బొసంగి, యివ్వనాంతరంబున నిరంతరంబును 'ససేమిరా' రావముఖరముఖుండ పై పరిభ్రమించుచుండునది, యెన్నండే నెవ్వఁడే నేతద్వృత్తాంతంబు బహిర్భావాయత్తంబు గావించు, నప్పుడ విగతశాపుండవై యెప్పటియట్ల సుస్థిరత్వంబున వర్తింపఁగలవాఁడ, వని వరం బిచ్చి భల్లుకంబు చనియె. తదనంతరంబ విపినాంతరంబున నక్కుమారుఁడు ప్రభూతశాపవికారుండై పరిభ్రమించుచుండె; నట రాకుమారుని యశ్వరత్నంబు పల్యాణంబుతోడన పఱతెంచినం జూచి పౌరజనం బచ్చెరువడి, యేకతంబున నిది యేకతంబున వచ్చెనో? నిన్న విజయపాలుఁడు వేఁట వెడలినప్పు డనేకదుర్నిమిత్తంబులు దోఁచెఁ, దన్నిమిత్తంబున నిట్లయ్యె నింక నెట్లయ్యెడునో, యని దిగులుమిగులం జని నందభూమీశ్వరనకుం దగుతెఱంగున నత్తెఱం గెఱింగించిన, నతండు ధైర్యంబు వెల్లగిల్ల నుల్లంబు దల్లడిల్లి, గుమారాన్వేషతత్పరుండై వాహనారోహణంబు చేసి, సముత్సాహసన్నాహవాహినీసమేతుండై పురంబు నిర్గమించి, నిసర్గధౌర్త్యమృగవర్గనిరర్గళస్వన

దుర్గమం బగువనదుర్గంబు ప్రవేశించినం, దత్సైనికు లందఱు నన్నిమార్గంబుల నరిగి, యొండొరులం గడవం బాఱియు, నెలుంగెత్తి చేరం జీరియు, నీఱంబులు దూఱియుఁ, జెట్టుచెట్టును ముచ్చుట్టుదిరిగియుఁ, దిరిగినచోటులనె తిరిగియు, నడవియెల్లను దడవితడవి యొక్కయెడ నక్కుమారుండొక్కరుండును దిక్కుమాలి దీనదశం బిశాచంబుచందంబున సతతంబును “ససేమిరా" యనుచుం బరిభ్రమించుచున్నం గని విన్నవించిన, నందభూపాలుండు నిజనందను విజయపాలుం దోడ్కొని సపరివారంబుగా బురంబునకు నేతెంచి; యక్కుమారుని యపస్మారంబునకు దేవభూదేవతాసమారాధంబుల మణిమంత్రతంత్రక్రియాసాధనంబుల నానావిధభూతబలివిధానంబుల మహాదానంబుల నాచరించి, యేమిటను డిందుపాటు లేకుండిన నందభూపాలుండు తనడెందంబునం గొందలం బందుచు, నిక్కుమారుని వికారంబునకుఁ బ్రతీకారం బెవ్వండు సేయసమర్ధుం డతనికి నర్ధరాజ్యం బిచ్చెద నని సర్వదిశల విశదంబుగాఁ జాటంబనిచి, శారదానందగురుం డొక్కరుండునుందక్క నిక్కొఱగామి సక్కఁజేయ నెక్కడివాఁడునుం గొఱగాఁడ. అజ్ఞానంబున నాసుజ్ఞానవిధానంబు గోలుపోయితి, నేమి సేయుదు నని పరితపించుచున్నం గని బహుశ్రుతుండు నేలమాలెనున్న త్రికాలవేదిపాలికిం జనుదెంచి నమస్కరించి, యామూలచూడంబుగాఁ దద్వృత్తాంతం బంతయు నెఱంగించి, యిట్లనియె.

107


తే.

వేల్పులకు మ్రొక్కి, వెజ్జులవెంటఁ దిరిగి
మంత్రవాదుల రప్పించి, మందు లరసి
కొడుకువేఁదు ఱేమిటఁ దీర్పగూడకున్న
బుడుకువేఁదుఱు గొన్నాఁడు పుడమిఱేఁడు.

108


గురువు రాజకుమారుని యపస్మారంబు నివారించుట

సీ.

నావుడు, శారదానందుఁ డూహించి ది
        వ్యజ్ఞానసరణి సర్వంబు నెఱఁగి
యిది యేను జక్కఁజేసెద, నీవు నందభూ
        మీశునికడ కేగి యిట్టులనుము,
మనశారదానందుననుఁగునందన, సప్త
        సంవత్సరప్రాప్తసంవిదగ్ధ

పరపురుషేక్షణపరిహృతవ్రతశీల
        కల దొక ర్తది తిరస్కరణిలోన


తే.

నుండి విజయపాలునితోడ నుచితభంగి
మాటలాడిన వేఁదుఱు మాన నోపు!
నని హితంబుగఁ జెప్పి, నీవా నృపాలు
నట్లు సేయ నియోగింపు మనఘచరిత!

109


చ.

అనిన బహుశ్రుతుండు చని, యత్తెఱఁ గెల్లను విన్నవించి, యా
జనవతి యున్నయాకొలువుసాల వెలిం దెరవాఱి, యగ్గురున్
గొనిచని యుంచె, నందనుఁడు కోరి నిరంతరమున్, “ససేమిరా"
యని పలవించుచుండఁ గొలువై నృపుఁ డుండ నిజాప్తకోటితోన్.

110


వ.

అట్టియెడ శారదానందుం డమందానందకందళితహృదయారవిందుడై నృపనందనునపస్మారంబు దిరస్కారంబు సేయందలంచి, హృద్యంబు లయి పూర్వోక్తచతురక్షరాద్యంబులై తదీయవిపినవృత్తాంతసూచనాద్యంబులైన పద్యంబులు నాల్గు నిట్లని పఠియించె.

111


తే.

[6]సకలలోకోపకారసంచారులైన
సాధుజనుల వంచించుట జాణతనమె?
తొడలపై నమ్మి నిద్రవోయెడువయస్యుఁ
బగతుపాలను ద్రోయఁ బాపంబు గాదె!

112


తే.

అనిన నా "సకారంబు" నుజ్జన మొనర్చి
యక్కుమారుఁడు “సేమిరా" యనుచు నుండె
నందనృపుఁ డాప్తులైనజనంబు లెల్ల
దాన నద్భుతానందచేతస్కు లైరి.

113

వ.

తదనంతరంబ.

114


క.

సేతువు దర్శింప మహా
పాతకములుఁ బాసిపోవుఁ, బ్రాణసఖునకు
ఘాతుకమతి నొనరించిన
పాతక మేతీర్థసేవఁ బాయునె నరునిన్.

115


క.

అన విని "సే"యనునక్షర
మనుగతముగఁ బలుకు టుడిగి, యటమీఁద "మిరా"
యనుచుండె నక్కుమారుఁడు
జనపతి నెమ్మొగము హర్షజలధిం దేలెన్.

116


వ.

శారదానందుండు మఱియును.

117


క.

మిత్త్రద్రోహి, కృతఘ్నుఁడు
ధాత్రీసురహంత, హేమతస్కరుఁడు, సురా
పాత్రీభూతుఁడు, నిందా
పాత్రులు వీరెల్ల నరకభవనావాసుల్.

118


క.

అనిన "మివర్ణము" నుజ్జన
మొనరించి, నరేంద్రసూతి యుడుగక "రా, రా"
యని పలుకఁ జూచి, యప్పుడు
మనుజేశ్వరుఁ డుత్సహించె మంత్రులుఁ దానున్.

118


వ.

మఱియు శారదానందుం డిట్లనియె.

120


క.

[7]రాజేంద్ర విజయపాలుని
రాజితశుభమూర్తి జేయ రతిగలదేనికిన్

బూజార్హుల వీరెల్లర
బూజింపు మనూనదానభోజన విధులన్.

121


ఆ.

అనిన, విజయపాలుఁ డపుడ యీశాపవి
కార మానుపూర్వికముగ విడిచి
స్వస్థుఁడై, యరణ్యవాసవర్తన మెల్ల,
విభున కెల్లవారు వినఁగఁ జెప్పె.

122


ఉ.

చెప్పిన, నందభూవిభుఁడు చిత్తమునం గడుఁ జోద్య మంది, తా
నప్పుడ దిగ్గనన్ యవనికాభిముఖుం డయి, యీరహస్య మీ
చొప్పునఁ జెప్ప నెవ్వరికిఁ జొప్పడు? నొప్పుగ నిట్టి దిమ్మెయిం
జెప్పినచొప్పు నా కెటులు చెప్పితి? చెప్పుము నీవు బాలికా!

123


క.

వాకిలి వెడలి యెఱుంగవు
రాకొమరుని యెలుఁగు పులి యరణ్యాంతరభా
షాకలనం బెట్లొదవెను?
మా కున్ననిజంబుఁ జెప్పుమా గురుపుత్త్రీ!

124


వ.

అనిన శారదానందుం డన్నరేంద్రున కిట్లనియె.

125


తే.

సర్వభూదేవదేవప్రసాదమహిమ
శారదాదేవి వరమున, సకలలోక
వర్తనంబులు గానంగవచ్చు మాకు
భానుమతిమచ్చఁ గన్నట్టు భావవీధి.

126


తే.

అనినఁ బతి శారదానందుఁ డగుట యెఱిఁగి
సరభసము నొంది యత్తిరస్కరిణి దీసి
భయము, భక్తియు సిగ్గు విస్మయముఁ బోవ
లేచి గురునకు వందనం బాచరించె.

127


తే.

అట్లు ప్రణమిల్లి గురుని నత్యాదరమున
గారవించి, బహుశ్రుతుఁ జేరఁ బిలిచి

కరము కరమునఁ గీలించి కరముఁ బ్రీతి
నందుఁ డాతని కనియె నానంద మెసఁగ.

128


ఉ.

నిందకు నోర్చి దోషము గణింపక, రిత్తకు రిత్త శారదా
నందునిఁ జంపు మన్న, నిది న్యాయము గాదని యెంత చెప్పినన్
మందమతిన్ వినం దెఱఁగుమాలిననన్ను మొఱంగి కాఁచి, మ
మ్మిందఱ సత్క్రియానిరతి నిప్పుడు గాఁచితి, చెప్ప నేటికిన్.

129


తే.

దోసమును నపకీర్తియుఁ దొలఁగఁబెట్టి
నాఁడు గురుఁ గాఁచుకొంటిని, నేఁడు నన్ను
సుతునిఁ గాఁచితి త్రిస్థానశుద్ధిగాను
నీఋణం బింక నేమిట నీఁగువాఁడ!

130


క.

నీకతమున నిహపరములు
నా కిట సిద్ధించె, నీ సనాతనబుద్ధి
ప్రాకారముకలిమి నఘా
నీకంబుల గెలచు టరుదె, నృపనయవేదీ!

131


తే.

అని యనేకవిధంబుల నాదరించి
మంత్రి కతిసుస్థిరైశ్వర్యమహిమ యొసంగి
శారదానందగురునకు దారవోసి
యగ్రహారసహస్రంబు నర్థి నిచ్చె.

132


క.

ధృతిమంతుఁడు ధీమంతుఁడు
మతిమంతుఁడు నైనమంత్రి మహి నెత్తఱి నే
నతిసంపద గోరెడుఁబతి
కతఁ డబ్బుట పెన్నిధాన మబ్బుటగాదే!

133


ఆ.

వరరథాశ్వసుభటవర్గమెల్లను గల్గి
చాలినంతభూమి యేలఁగల్గి
తగినమంత్రి లేని ధరణీశురాజ్యంబు
గాలిఁ దూలు దీపకళికఁ బోలు.

134

వ.

కావున.

135


ఆ.

భట్టి నీకు హితుఁడు పరమవిశ్వాసియు
భట్టిబుద్ది మేలుబంతి నీకు
సకలరాజతంత్ర సర్వాంగరక్షకు
భట్టి నీతి వజ్రపంజరంబు.

136


వ.

అ ట్లగుటం జేసి మీ రిరువురుం జేరి చరితార్థులరై వాగర్థంబులుంబొలె నభిన్నప్రభావంబుల వర్తిల్లునది యని హితోపదేశంబు చేసి పరమయోగానందజితేందిరానందనుండై మదనరేఖానందనుండు నిజేచ్ఛం జనుటయు.

137


శా.

శ్రీకర్ణాటమహామహీశ్వర సదాసేవా ప్రథానోత్తమా
నీకస్తుత్య, లిపిక్రియానిపుణపాణిద్వంద్వపంకేరుహా
యాకల్పాంతకనిత్యకీర్తిజలజాస్యాకేళిగేహీభవ
ల్లోకాలోకధరాధరావృతధరాలోకైకరక్షామణీ!

138


క.

రాజప్రసాదసముదిత
తేజఃకీర్తిప్రతావదీపితలక్ష్మీ
రాజితనీతిధురంధర
రాజముఖీపుష్పచాప రసికకలాపా!

139


భుజంగప్రయాతము.

సరోజాననానందసౌందర్యమూర్తీ
సరోజాతసంజాతచాతుర్యపూర్తీ
ధరిక్షేమరాధీనదానానువర్తీ
శరచ్చంద్రికాపూరసారూప్యకీర్తీ!

140


గద్యము.

ఇది శ్రీమదఖిలకవిమిత్త్ర పెద్దయయన్నయామాత్యపుత్త్ర శారదాదయావిధేయ జక్కననామధేయప్రణీతంబైన విక్రమార్కచరిత్రం బనుమహాకావ్యంబునందు దృదీయాశ్వాసము.

  1. దనపురి కేగెఁ గైకొనుచుఁ దద్ధన మంతయు వేడ్క మీఱఁగన్. అని పాఠాంతరము.
  2. క. హరుకృపఁ గలిగినయది యిది
    ధరణీదేవుండు మనకు దయచేసినవాఁ
    డరు దెం దియ్యరుఫల మీ
    పరిపక్వఫలంబు భాగ్యఫలము లతాంగీ. అనీ పా.
  3. తప్పక తత్ఫలం బొకటి తప్పదు లే దితరంబు నావుడున్. అని పా.
  4. మ. కరకాబద్ధసురాలయంబులు, మహాకాండోపరిం జిత్రతా
    స్ఫురణల్, స్వప్నసువస్తులబ్ధనిరతుల్, శుంభత్ఫలాలేపముల్
    కరికుంభస్తనిచిత్తవృత్తములు, దత్కౌతూహలంబు న్మదో
    ద్ధురదంతిశ్రవణానిలం బని తలంతుం బూర్వవాక్పద్ధతిన్. అని పా.
  5. కామాంధో౽పి -వా. 1926.
  6. క. సజ్జనభావము గల్గును
    హృజ్జనులను మోసపుచ్చుటిడి వేరు వెనీ
    పష్టందొడపైఁ గూర్కిన
    యజ్ఞంతువుఁ జంపఁ జూచుటది పౌరుషమె. పా.
  7. క. రాజులు మెచ్చఁగ దిక్కుల
    రాజులను జయించి, ధనము రాజులచేతన్
    ఓఁజగొని, విప్రకోటిం
    బూజింపు మనూనదానభోజనవిధులన్. వా. 1926.