వికీసోర్స్:ప్రదర్శన గ్రంథాలు/సత్యశోధన
సత్యశోధన (1999), మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ, అనువాదం వేమూరి రాధాకృష్ణమూర్తి
పీఠిక లో మహాత్మా గాంధీ: "నేను ఆత్మ చరిత్ర వ్రాయాలని అనుకోలేదు. అయితే అనేక సమయాల్లో ఎన్నో సత్య ప్రయోగాలు చేశాను. ఆ ప్రయోగాల్ని ఆత్మచరిత్రగా రూపొందించాలని మాత్రం అనుకున్నాను. నా జీవితం అట్టి ప్రయోగాలతో నిండివుంది. వాటన్నింటిని లిపిబద్ధం చేస్తే అది ఒక జీవన చరిత్ర అవుతుంది. అందలి ప్రతి పుట సత్యప్రయోగాలతో నిండి వుంటే నా యీ చరిత్ర నిర్దుష్టమైనదని భావించవచ్చు. నేను చేసిన సత్యప్రయోగాలు అన్నింటిని ప్రజల ముందుంచగలిగితే ఎంతో ప్రయోజనం చేకూరుతుంది." పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ న్యాయ నిర్ణేతలు ఈ పుస్తకాన్ని 1995 వ సంవత్సరం ఉత్తమ తెలుగు అనువాదంగా నిర్ణయించారు.
“ |
రైలు నేటాలు ముఖ్య పట్టణం మారిట్జుబర్గుకు రాత్రి తొమ్మిది గంటలకు చేరింది. పడుకునే వాళ్ళకు యిక్కడే పరుపులిస్తారు. రైలు జవాను వచ్చి పరుపు కావాలా అని అడిగాడు. నాదగ్గర వుంది. పరుపు అక్కర్లేదని చెప్పాను. అతడు వెళ్లిపోయాడు. ఇంతలో ఒక ప్రయాణీకుడు లోనికి వచ్చి నన్ను ఎగాదిగా చూచాడు. నేను నల్లవాణ్ణి. అతడు సహించలేక పోయాడు. పెట్టెదిగి వెళ్లి ఒకరిద్దరు ఉద్యోగుల్ని తీసుకువచ్చాడు. వారు వెటకారంగా నిలబడ్డారు. ఇంతలో మరో ఉద్యోగి వచ్చి “లేవయ్యా, లే, నీవు వెనుక పెట్టెలో కూర్చోవాలి. లే” అని గద్దించాడు. “నా దగ్గర మొదటి తరగతి టిక్కెట్టు ఉన్నది. నా మాట మీరు వినండి. దర్బనులో నన్ను యిక్కడ కూర్చోనిచ్చారు. నేనిక్కడే వుంటాను.” “అయితే పోవా? నీవు వెళ్లకపోతే పోలీసును పిలిచి నెట్టించి వేస్తాను.” |
” |