Jump to content

వికీసోర్స్:ప్రదర్శన గ్రంథాలు/రాజశేఖర చరిత్రము

వికీసోర్స్ నుండి

రాజశేఖర చరిత్రము(1987)- కందుకూరి వీరేశలింగము

Download this featured text as an EPUB file. Download this featured text as a RTF file. Download this featured text as a PDF. Download this featured text as a Mobi. పుస్తకం దింపుకోండి!

రాజశేఖర చరిత్రము పుస్తకం


"ఈవఱకు మనయాంధ్రభాషలో జనుల యాచార వ్యవహారములను దెలుపుచు నీతిబోధకములుగానుండు వచన ప్రబంధము లేవియు లేకపోవుట యెల్ల వారికిని విశద మయియే యున్నదిగదా! అయినను దేశభాషలలో నెల్లను మధురమైనదని పేర్కొనఁబడిన మన తెనుఁగుభాష కటువంటి లోపమును తొలగింపవలయునని కొంత కాలము క్రిందట నే నీ గ్రంథమును వ్రాసి శ్రీవివేకవర్ధనీ పత్రికా ముఖమునఁ బ్రకటించితిని" అని కందుకూరి వీరేశలింగము 1880 లో ముద్రితమైన నవల పీఠిక లో రాశారు. ఈ పుస్తకం ఆంగ్లం, తమిళం, కన్నడ మొదలగు భాషలకు అనువాదం చేయబడి ప్రజాదరణ పొందినది. తెలుగు నవలలో ఇదే మొదటిది కాకున్నా ఈ పుస్తకం ప్రభావం రీత్యా తెలుగు మొదటి నవలగా పేరుగాంచినదని, తరువాత వ్రాసిన నవల లన్నిటికీ, నవలా రచయిత లందరకూ చాలా కాలం వరకూ, రాజశేఖర చరిత్రమే మార్గదర్శకంగా వున్నది,కనుకనే రాజశేఖర చరిత్రం తొలి తెలుగు నవల ఆయినదని కందుకూరి రచనలపై పరిశోధన చేసిన డా ॥అక్కిరాజు రమాపతిరావు గారు పేర్కొన్నారు. ఈ నవలలో ఆనాడు సంఘంలో ప్రచురంగా కొనసాగుతున్న సర్వ దురాచారాలనూ, పంతులు గారు యీ నవలలో వజ్రాభమైన తమ నిశిత బుద్ధిని చూపి, ఆవేశంతో చెండాడారని రమాపతిరావు గారు తెలిపారు. సుప్రసిద్ద నవలా రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు తమ స్వీయ చరిత్రలో తాము నవలలు వ్రాయటం రాజశేఖర చరిత్రం చదివి, గ్రహించి, నేర్చుకున్నామని వ్రాసుకున్నారు. అంత ప్రఖ్యాతి గాంచిన నవల అందరు తప్పక చదవవలసినదే.

దీనిలో కొంత భాగం....

" అప్పడాయెఱుకత తాను వల్లించిన రీతిగా నిష్టదైవతములఁ దలఁచుకొని వాకీయుఁడని వేడుకొని యామెచేయి పట్టుకొని "భాగ్యముకల చెయ్యి, ప్రతిష్టగల చెయ్యి" యని పలికి, “నీ వొక్కతలఁపు తలఁచినావు: ఒక్క కోరిక కోరినావు; ఒక్క మేలడిగినావు: అది కాయో పండో, కల్లో నిజమో, చేకూఱునో, చేకూఱదో యని త్రొక్కటపడుచున్నావు; అది కాయకాదు పండు: కల్ల కాదు నిజము. శీఘ్రముగానే చేకూఱనున్నది. ఆఁడువారివంక తలఁపా మగవారివంక తలఁపా యందు వేమో__మగవారంటే గడ్డము, ఆడవా రంటే లక్కాకు" అని రుక్మిణి ముఖలక్షణములను చక్కగా కనిపెట్టి "మగ వారివంక తలం'పన్నప్పుడామె మొగ మొకవిదముగా నుండుట చూచి సంగతి నూహించి “నీది మగవారివంక తలంపు శీఘ్రముగానే కార్యము గట్టెక్కనున్నది; నీ రొట్టె నేతఁ బడనున్న" దని చెప్పి తక్కిన ప్రసంగమువలన రుక్మిణి మనసులోని సంగతి నంతనుఁ దెలిసికొని రుక్మిణిఁమగడు దేశాంతరగతుఁ డయినవార్త నా వఱకే వినియున్నదికాన "నీ మగఁడు చెడుసావాసము చేత దేశాలపాలయి తిరుగుచున్నాఁడు; నీ మీది మోహముచేత నెల దినములలో నిన్ను వెదుకుకొనుచు రాగలడు" అని చెప్పి సంచిలోని పేరు నొకదానిని తీసి పసుపుదారముతో జేతికి కట్టి ప్రాఁతబట్టయు రవికయు బుచ్చు కొని, మగనితోఁ గలిసి కాపురము చేయుచున్న తరువాత క్రొత్తచీర పెట్టుమని చెప్పి తనదారిని బోయెను. రుక్మిణియు బరమానంద భరితురాలయి అంత సూటిగాఁ దన మనోగతమును దెలిపినందుకై యెఱుకత యొక్క మహత్త్వమును మెచ్చుకొని యబ్బురపడుచు లోపలికిఁ బోయెను.