వికీసోర్స్:ప్రదర్శన గ్రంథాలు/గణపతి
గణపతి (1966),చిలకమర్తి లక్ష్మీనరసింహం,
చిలకమర్తి లక్ష్మీనరసింహం ( సెప్టెంబరు 26, 1867 - జూన్ 17, 1946) ప్రముఖ కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన మహామహులలో చిలకమర్తి ఒకడు.
ఆంధ్రదేశములో గోదావరీతీరస్థమైన కోనసీమ యీ హాస్య నవలకు ప్రధానరంగము. కోనసీమ బ్రాహ్మణులు విద్యావిజ్ఞానములకు సుప్రసిద్ధులు. కాని యీ గ్రంధములో వర్ణించబడిన గణపతివంశచరిత్ర ఏమాత్రమున్నూ ప్రతిష్టాకరమైనది కాదు. బ్రాహ్మణులలోని అతినికృష్టమైనవిగా దీనిలోని పాత్రలను మనము తీసికోవచ్చును. సాంఘిక పునరుజ్జీవనమునే చిలకమర్తివారు దృష్టియందిడుకొని, గణపతిపాత్రను సృష్టించిరని తోచును. పాతసమాజములోని విలువలు, యోగ్యతలు మారినప్పుడు కాలానుగుణ్యమైన నూతనమార్పులు సాధించిన వ్యక్తుల, సంఘముల సాంఘికోపయుక్తత నిలచునే గాని లేనిచో క్షీణత సర్వదా తప్పదని వ్యంగముద్వారా యీ నవల సూచించుచున్నదని విజ్ఞుల అభిప్రాయము.
“ |
తల్లిదండ్రులు బిడ్డల కొకప్పుడు తమ యిష్టదైవతముల పేర్లు పెట్టవచ్చును. ఆ దైవతముల యుందున్న గుణములు బిడ్డలయందు పొడగట్టవచ్చును. పొడగట్టక పోవచ్చును. రాముని నామము ధరించిన వారందఱు బితృవాక్య పరిపాలకులై యేకపత్నీ వ్రతస్థులైరా? తలిదండ్రులను నిరంతరము గొట్టి తిట్టునట్టి కష్టచరిత్రుఁడుగూడ రాముఁ డను పేరం బఱగుచుండును. అట్టి మూర్ఖుఁడు సాపాటు రాముడగును గాని గుణములలో దశరథరాముఁ డగునా? నోరుఁ విప్పునపు డెల్ల నబద్ధములే చెప్పువాఁడు హరిశ్చంద్రు డనుపేరఁ బరగవచ్చును. లక్ష్మీప్రసాదుఁడను నామధేయము గలవాఁడు నిరుపేద గావచ్చును. తలిదండ్రులు వెఱ్ఱెయ్య యని పేరు పెట్టుకొన్న బాలుడు మేథావంతుడై తన ప్రతిభాప్రభావముచేత జగంబును వెలయింపవచ్చును. తలిదండ్రు లొక యుద్దేశముతో బేరుపెట్టవచ్చును, కుమారుని యుత్తరచరిత్ర మా యుద్దేశమునకు వైరుధ్యమును జూపవచ్చును. |
” |